తొలిసారిగా ఐపీఎల్ లో ఒక మహిళకి కీలక స్థానం కల్పించిన ఆర్సీబీ జట్టు

తొలిసారిగా ఐపీఎల్ లో ఒక మహిళకి కీలక స్థానం కల్పించిన ఆర్సీబీ జట్టు

క్రికెట్ కి మన దేశంలో ఎంత క్రేజ్ ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే ప్రతి ఏడాది క్రికెట్ లోని పొట్టి ఫార్మాట్ అయిన టీ20ని ఆధారం చేసుకుని నిర్వహించే ఇండియన్ ప్రిమియర్ లీగ్.. ఐపీఎల్ (IPL) కి ఉన్న ఫాలోయింగ్ గురించి వివరించాల్సిన అవసరం లేదు.

హైదరాబాద్ లో తొలి స్విగ్గీ డెలివరీ గర్ల్ ఈ అమ్మాయి.. తన గురించి మీకు తెలుసా?

ఈ నేపథ్యంలో మొన్నటి ఐపీఎల్ సీజన్ లో విరాట్ కోహ్లీ (virat kohli) కెప్టెన్ గా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఆర్సీబీ (rcb) ఫ్రాంచైజ్ వారు ఐపీఎల్ లో ఆడవారు కూడా ఆడాలి.. మగ & ఆడ క్రికెటర్లు కలిసిపోయి రెండు జట్లుగా మారి క్రికెట్ ఆడాలంటూ ఒక వినూత్నమైన ప్రచారానికి తెరతీశారు. అది అప్పట్లో ఒక సంచలనంగా మారడమే కాకుండా మహిళా క్రికెటర్లకి కూడా ఒక ఐపీఎల్ టోర్నీపెట్టాలి అంటూ ఒక కొత్త డిమాండ్ కి ప్రాణం పోసినట్టుగా అయింది.

ప్రస్తుతం ఇలాంటి ఒక డిమాండ్ తెర పైకి రావడానికి కారణమైన ఆర్సీబీ ఫ్రాంచైజ్ వారు మరోసారి వచ్చే ఐపీఎల్ సీజన్ కి సంబందించిన ఒక కీలక ప్రకటనని వెల్లడించిండం జరిగింది. ఇప్పుడు ఆ ప్రకటన క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇంతకి ఆ ప్రకటన సారాంశమేమిటంటే - ఆర్సీబీ ఫ్రాంచైజ్ లో ఉండే ఆటగాళ్లకు సహాయంగా ఉండే మసాజ్ థెరపిస్ట్ (massage therapist)  గా నవనీత గౌతమ్ (navnita gautam) అనే మహిళని తీసుకోవడం జరిగింది. ఆర్సీబీ ఫ్రాంచైజ్ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం జట్టు హెడ్ ఫిజియో అయిన ఎవన్ & స్ట్రెంత్ - కండిషనింగ్ కోచ్ బాసు శంకర్ లకి సహాయకురాలిగా జట్టుకి సేవలందించబోతున్నట్టుగా తెలిసింది.

అయితే పురుషుల క్రికెట్ జట్టుకి సంబంధించి మసాజ్ థెరపిస్ట్ గా మన దేశంలో మొట్టమొదటిసారిగా ఒక మహిళకి అవకాశమివ్వడం నిజంగా గొప్ప అని చెప్పుకోవాలి. అదే సమయంలో ఐపీఎల్ చరిత్ర చూసుకున్నా కూడా ఇంతవరకు ఏ ఫ్రాంచైజ్ కూడా ఇలా ఒక మహిళకి తమ జట్టు సహాయక సిబ్బందిలో చోటు కల్పించలేదు.

హైదరాబాద్ ట్రెండ్స్ : ఈ హోటల్‌ యజమాని నుండి ఉద్యోగుల వరకూ.. అందరూ మహిళలే..!

ఇక ఈ వార్త వెలువడగానే క్రికెట్ ప్రేమికులు ఆర్సీబీ ఫ్రాంచైజ్ తీసుకున్న నిర్ణయం పట్ల తమ హర్షాన్ని తెలియచేశారు. అదేవిధంగా క్రికెట్ అభిమానులు, ఆర్సీబీ అభిమానులు సైతం ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు ఆర్సీబీ యాజమాన్యం వారిని అభినందిస్తున్నారు. ఇప్పటికి దాదాపు 12 సీజన్స్ ఐపీఎల్ లో ముగిసినప్పటికి.. ఒక్కసారి కూడా ఆర్సీబీ జట్టు టైటిల్ ని సాధించలేకపోయింది.. ఈ 12 సీజన్స్ లో రెండు సార్లు ఫైనల్ చేరి విజయం ముంగిట ప్రత్యర్థికి తలవంచడం జరిగింది. ఇక దాదాపు 12 ఏళ్లలో సాధించలేని విజయాన్ని ఈ 13వ సంవత్సరంలో ఎలాగైనా సాధించాలి అని జట్టుకి సహాయక సిబ్బందిలో పెద్ద ఎత్తున మార్పులకి శ్రీకారం చుట్టింది.

ఇప్పటికే ఆర్సీబీ ఫ్రాంచైజ్ డైరెక్టర్ గా న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెసన్ ని తీసుకోగా సైమన్ కటిచ్ జట్టు హెడ్ కోచ్ గా కొనసాగనున్నారు. ఇప్పుడు ఆ మార్పుల్లో భాగంగానే నవనీత గౌతమ్ ని మసాజ్ థెరపిస్ట్ గా తీసుకోవడం జరిగింది. ఇంకొక మూడు నెలల్లో అంటే వచ్చే ఏడాది జనవరి నుంచి ఐపీఎల్ జట్లు తమ సీజన్ కి సంబందించిన ప్రాక్టీస్ క్యాంప్స్ ని మొదలుపెడతాయి. అప్పుడే నవనీత గౌతమ్ కూడా ఆర్సీబీ జట్టులో చేరనుంది.

మొత్తానికి ఐపీఎల్ 2020కి సంబంధించి ఇది ఒక కీలక పరిణామంతో పాటుగా ఆసక్తికర వార్తగా కూడా పరిగణించవచ్చు. చూద్దాం.. ఈసారి ఎలాగైనా ట్రోఫీ గెలవాలి అని అనుకుంటున్న ఆర్సీబీ జట్టుకి వారు కొత్తగా నియమించుకున్న నవనీత లక్కీ చార్మ్ గా మారి.. వారికి ట్రోఫీ లభిస్తుందా? లేదా? అని.. ఏదేమైనా.. ఈ ఫ్రాంచైజీ ని చూసి భవిష్యత్తులో మరిన్ని ఫ్రాంచైజీలు మరింతమంది మహిళలకి తమ జట్టులో స్థానం కలిపించాలి అని కోరుకుందాం.

మరో తెలుగు సినిమా రీమేక్ లో నటించనున్న షాహిద్ కపూర్