2019లో తమ నటనతో.. ప్రేక్షకులని ఆశ్చర్యపరిచిన కొత్త నటీనటులు ఎవరో తెలుసా?

2019లో తమ నటనతో.. ప్రేక్షకులని ఆశ్చర్యపరిచిన కొత్త నటీనటులు ఎవరో తెలుసా?

ప్రతి సంవత్సరం కొత్తతరం నటులు చిత్రపరిశ్రమకు రావడం సహజమే. అయితే అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల (audience) మన్ననలు పొందగలుగుతారు. వారు అలా ప్రేక్షకుల దృష్టిని తమవైపు మరల్చుకోగలిగారు అంటే.. వారి నటన ఎంత బాగుందో అన్న సంగతి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దీపిక ప‌దుకొణే 'ఛపాక్' చిత్రం ఎందుకు చూడాలంటే ..?

అయితే ఈ మధ్య కాలంలో దాదాపు నటీనటులు అంతా (actors) కూడా తమ శక్తిమేర ప్రయత్నిస్తూ.. ఒక మంచి నటుడు లేదా నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనే భావనతోనే పనిచేస్తున్నారు.   అలాంటి వారిలో కొందరి గురించి ఈ కథనం ప్రత్యేకం. ఈ ముగ్గురు కూడా 2019 సంవత్సరంలో తమ నటన ద్వారా.. ఎక్కువమంది ప్రజానీకం దృష్టిని ఆకర్షించడమే కాకుండా.. వీరు భవిష్యత్తులో ఎలాంటి చిత్రాల్లో నటిస్తారు అనే ఆసక్తితో ప్రేక్షకులు ఎదురుచూసే పరిస్థితిని వీరు కల్పించేలా చేయగలిగారు.

వారే అనన్య నాగళ్ళ, శ్రద్ధ శ్రీనాధ్, నవీన్ పోలిశెట్టి

ముందుగా ఈ జాబితాలో ఉన్న అనన్య నాగళ్ళ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. మల్లేశం చిత్రంలో.. మల్లేశం భార్య పద్మ పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయింది. ఈ పాత్ర కోసం తెలంగాణ యాసని నేర్చుకోవడంతో పాటు.. పద్మ అనే ఒక సహజమైన పాత్రలో అంతే సహజంగా ఆమె లీనమై నటించడంతో.. ఆమె నటనను  చూసిన ప్రతి ఒక్కరు కూడా తనను అభినందించకుండా ఉండలేకపోయారు.

యాక్టింగ్ స్కూల్‌‌లో అభినయ పరంగా ఓనమాలు దిద్దుకుని.. ఒక మంచి నటిగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఆమెకి ఈ 'మల్లేశం' చిత్రంలో అవకాశం రావడం.. దానిని ఆమె నూటికి నూరు శాతం సద్వినియోగం చేసుకోవడంతో.. అటు ప్రేక్షకులతో పాటు.. ఇటు సినీ పరిశ్రమ దృష్టిని ఏకకాలంలో  ఆమె తన వైపుకి తిప్పుకోగలిగింది.

ఇక ఈ జాబితాలోని రెండవ పేరు - శ్రద్ధ శ్రీనాధ్. చదువు రీత్యా లా గ్రాడ్యుయేట్ అయినప్పటికి.. అనూహ్యంగా వచ్చిన సినిమా అవకాశాన్ని వదలకుండా ముందుకి సాగడం వల్ల.. తన తొలి కన్నడ చిత్రం ద్వారానే ఫిలిం ఫేర్ అవార్డుని సైతం తన ఖాతాలో వేసుకుంది ఆమె. అయితే శ్రద్ధ శ్రీనాధ్ తెలుగులో నాని హీరోగా నటించిన 'జెర్సీ' అనే చిత్రం ద్వారానే మంచి పేరు సంపాదించింది. ఇందులో 8 ఏళ్ళ పిల్లవాడికి తల్లి పాత్రలో నటించే సాహసం చేయడం.. అలాగ ఆ పాత్రని చాలా అలవోకగా చేసి అందరి చేత ఆమె కితాబును పొందడం విశేషం.

వివాదాస్పద వెబ్ సిరీస్ "లస్ట్ స్టోరీస్" తెలుగు వెర్షన్‌లో.. అందాల భామ ఈషా రెబ్బా ..!

కెరీర్ తొలి నాళ్ళలో నటీమణులు ఎవరూ కూడా.. పెద్దగా తల్లి పాత్రలు చేయడానికి ఇష్టపడరు. కాని శ్రద్ధ మాత్రం కథ నచ్చడంతో ఎటువంటి లెక్కలు, కొలతలు లేకుండా 'జెర్సీ' చిత్రం చేయడం ద్వారా.. మంచి పేరుతో పాటుగా అవకాశాలు సైతం మూటకట్టుగొగలింది.

ఈ జాబితాలో చివరలో ఉన్నా.. తన పాదరసం లాంటి నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులలోకి చొచ్చుకుపోయిన నటుడు నవీన్ పోలిశెట్టి. సినిమాల్లో నటించాలనే కోరికతో తొలుత 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రంలో ఒక ప్రాముఖ్యం ఉన్న పాత్ర వేయడం .. ఆ తరువాత ముంబైకి మకాం మార్చి అక్కడ 'యు ట్యూబ్' వేదికగా రకరకాల వీడియోస్‌లో నటించి విపరీతమైన క్రేజ్‌ని సంపాదించుకోగలిగాడు నవీన్.

అయితే సినిమాల్లో నటించాలి అనే తన డ్రీమ్‌కి ఒక రూపం ఇవ్వాలనుకునే క్రమంలో 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ఈ సినిమాకి నటన పరంగానే కాకుండా స్క్రిప్ట్ పరంగా కూడా నవీన్ తన వంతు కృషి చేసి.. ఒక మంచి కథని సిద్ధం చేసుకున్నాడు. ఈ చిత్రంలో ప్రయివేట్ డిటెక్టివ్‌‌గా తన నటన ద్వారా ఆ పాత్రకి ప్రాణం పోశాడు నవీన్. పైగా ఈ సినిమా ద్వారా మంచి టాలెంట్ ఉన్న నటుడు మనకీ ఒకడున్నాడనే విషయాన్ని టాలీవుడ్‌కి చెప్పకనే చెప్పాడు నవీన్.

ఇవండీ.. 2019 సంవత్సరంలో తమ నటన ద్వారా ప్రేక్షకులని ఆశ్చర్యపరిచి (surprised) భవిష్యత్తులో చిత్రపరిశ్రమలో నిలబడగలమని నిరూపించుకున్న వారి వివరాలు 

తెలుగు సినిమా హీరోలు బట్ట తలతో కనిపించే సాహసం చేయగలరా?