తెలుగు సినిమా హీరోలు బట్ట తలతో కనిపించే సాహసం చేయగలరా?

తెలుగు సినిమా హీరోలు బట్ట తలతో కనిపించే సాహసం చేయగలరా?

సాధారణంగా మన తెలుగు సినిమాల్లో హీరోలంటే పదిమందిని కొట్టాలి లేదా పది మందికి ఆదర్శంగా నిలబడే వ్యక్తి అయి ఉండాలి.  మన తెలుగు సినిమాల్లో హీరోగా చెలామణి అవ్వాలంటే కొన్ని లక్షణాలు తప్పనిసరి.. ఈ ఆలోచన ఇప్పుడిప్పుడే మారుతోంది. అయితే హీరో చూడడానికి అందంగా ఉండాలని మాత్రం అటు సినిమా తీసేవారితో పాటు చూసేవారు కూడా కోరుకుంటారు. వీటితో పాటు ఆజానుబాహుడైతే అదొక అదనపు ఆకర్షణ అనే చెప్పాలి.

ఇటువంటి పోకడలు రాజ్యమేలుతున్న ఈ తరుణంలో.. టాలీవుడ్ సినిమాలో హీరో బట్ట తలతో కనిపిస్తాడని ఊహించగలమా? హీరో బట్ట తల సమస్యతో బాధపడే పాత్ర మన కథకులు సిద్ధం చేయగలరా? ఒకవేళ చేసినా సరే.. ఆ పాత్రని చేయడానికి ముందుకి వచ్చే హీరో ఎవరైనా ఉన్నారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

మరో తెలుగు సినిమా రీమేక్ లో నటించనున్న షాహిద్ కపూర్

సినిమా విషయం పక్కకి పెడితే, నిజ జీవితంలో కూడా సగటు మనిషికి బట్ట తల ఒక మానసిక సమస్య! బట్ట తల వచ్చినవారు చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్లడం.. మరికొంతమందైతే బట్ట తల చికిత్స కోసం లక్షల్లో ఖర్చు పెట్టడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ సంఘటనల ఆధారంగా మన తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాలు వచ్చే అవకాశాలు ఇప్పటికైతే లేవనే చెప్పాలి. ఎందుకంటే ఆ సాహసం మనవారెవ్వరు చేయడానికి ముందుకి రారు!

అయితే బట్ట తల దాని వచ్చే సమస్యలు, దాని వల్ల పెళ్లి కాకపోవడం వంటి అంశాల ఆధారంగా సినిమాలు తీశారు హిందీ చిత్రపరిశ్రమలోని కథకులు & హీరోలు.. తాజాగా హీరో బట్ట తల సమస్యతో బాధపడే నేపథ్యాన్ని తీసుకుని కథలు సిద్ధం చేయడం.. ఆ రెండు చిత్రాలు నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడం జరిగిపోయాయి. ఈ రెండు సినిమాలు బాలా, ఉజ్డా చమన్.. ఇవి త్వరలోనే విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. 

ఈ రెండు చిత్రాల కథాంశాలు దాదాపు ఒక్కటే అని చెప్పొచ్చు. యవ్వనంలోనే బట్ట తల రావడంతో పెళ్లి కాకుండా ఇబ్బందులు పడే పాత్రల్లో ఈ రెండు సినిమాల్లో హీరోలు కనిపిస్తారు. అలా ఈ రెండు కథలు కూడా దాదాపు ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా రూపొందినట్టుగా వీటి ట్రైలర్స్ ని చూస్తే అర్ధమవుతోంది. అయితే ఈ రెండు చిత్రాలలో ఒకటైన ఉజ్డా చమన్ చిత్రం 2017లో కన్నడ భాషలో విడుదలైన ఒందు మొట్టేయ కథే చిత్రానికి హిందీ రీమేక్ గా తెరకెక్కింది. కన్నడలో ఆ చిత్రం మంచి విజయంతో పాటుగా ఫిలిం ఫేర్ అవార్డుని సైతం కైవసం చేసుకుంది.

దర్శక ధీరుడు రాజమౌళి - రమా రాజమౌళిల ఆదర్శ ప్రేమకథ మీకు తెలుసా?

ఇక ఈ చిత్రాలలో ప్రధాన పాత్ర పోషిస్తున్న వారు కొత్తవారేం కాదు. ఉజ్డా చమన్ (ujda chaman) చిత్రంలో హీరోగా చేస్తున్న సన్నీ సింగ్ గత ఏడాది సోను కే టీటు కి స్వీటీ చిత్రం ద్వారా ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అలాగే బాలా (bala) చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఆయుష్మాన్ ఖురానా ( ayushmaann khurana )విజయానికొస్తే, మొన్ననే జాతీయ ఉత్తమ నటుడు అవార్డుని సైతం తన ఖాతాలో వేసుకున్న నటుడు. 

అయితే దాదాపు ఒకే కథాంశంతో ఉన్న ఈ రెండు చిత్రాలు ఒకే సమయంలో రావడం కాస్త విచిత్రంగా ఉంది. అలాగే ఈ రెండు చిత్రాలకి సంబందించిన విడుదల తేదీలు సైతం పక్కపక్కనే ఉండడం విశేషం. ఉజ్డా చమన్ చిత్రం నవంబర్ 8న విడుదలకి సిద్ధంగా ఉంది. బాలా చిత్రం నవంబర్ 7న విడుదలవుతుందని ముందు భావించినా తిరిగి నవంబర్ 15 కి వాయిదా పడింది. 

మరి భావసారూప్యత కలిగిన రెండు చిత్రాలు ఒకే వారం తేడాతో విడుదలవుతుండటంతో అటు ప్రేక్షకుల్లోనూ & ఇటు సినీ వర్గాల్లోనూ పెద్ద చర్చనే మొదలైంది. ఇంతకి ఈ రెండు చిత్రాలలో ప్రేక్షకులు ఏ చిత్రానికి ఓటేస్తారో వేచి చూడాలి. ఆఖరుగా హిందీ & కన్నడలో వచ్చిన ఈ చిత్రాలని ప్రేరణగా తీసుకుని ఇటువంటి తరహా చిత్రాలు మన చిత్రపరిశ్రమలో రూపుదిద్దుకోవాలని మనసారా కోరుకుందాం & ఇటువంటి కథాంశాలు మన తెర పైన కనిపిస్తే వాటిని ఆదరించాల్సిన బాధ్యత కూడా మన పైన కూడా ఉంటుంది.

జీవిత - రాజశేఖర్ లవ్ స్టోరీ తెలుసుకుంటే క్రేజీ అనాల్సిందే