మన చుట్టూ ఉన్నవారిలో కొందరు లెక్కలంటే (Maths) తెగ భయపడిపోతుంటే.. ఇంకొందరు మాత్రం ఎంత పెద్ద లెక్కనైనా సునాయాసంగా చేతివేళ్లపైనే చెప్పేయగలరు. మరి, ఇలాంటి గణిత శాస్త్రంలో తనదైన ముద్ర వేయడమే కాకుండా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న శకుంతలా దేవి గురించి మనందరం తెలుసుకోవాల్సిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు మీ కోసం..
* శకుంతలా దేవి (Shakuntala Devi) తండ్రి జన్మతః ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా.. పౌరోహిత్యం చేయకుండా ఒక సర్కస్‌లో పనిచేయడం మొదలుపెట్టారు. ఎవరి ఆసక్తికి తగ్గ పని వారు చేయాలన్నది ఆయన కోరిక. ఆయన సర్కస్‌లో పనిచేస్తున్న సమయంలోనే శకుంతలా దేవి జన్మించారు. చిన్నప్పటి నుండీ గణితం అంటే శకుంతలాదేవికి ఎంతో ఇష్టం. ఎంత క్లిష్టమైన లెక్కనైనా ఆమె క్షణంలో పరిష్కరించేది. ఆమె ఆసక్తిని గమనించిన తండ్రి తనను.. ఆ రంగంలో ప్రోత్సహించాలని భావించారు.
* ఆరేళ్ళ వయసులో తొలిసారిగా శకుంతలా దేవి.. గణితం, అర్థిమెటిక్ అంశాల్లో తనకు ఉన్న అసామాన్య ప్రతిభని యూనివర్సిటీ ఆఫ్ మైసూర్ (University Of Mysore)లో ప్రదర్శించారు.
*టీనేజ్‌లోనే లండన్‌కు తన మకాం మార్చిన శకుంతలా దేవి.. 1950లో యూరోప్‌లో తన ప్రతిభని అందరికి తెలియచేస్తూ ఒక టూర్ చేశారు. ఇదే ఆమె తొలి టూర్‌గా చెబుతారు.
* 1960 ప్రాంతంలో శకుంతలాదేవి వివాహం జరగడం.. అలాగే ఒక దశాబ్దం తరువాత ఆ వైవాహిక జీవితానికి ఆమె స్వస్తి పలికి, తదనంతరం చివరి వరకు తన కూతురు అనుపమ బెనర్జీతో కలిసి జీవించడం విశేషం
* 1977లో ఆమె స్వలింగ సంపర్కం పైన రాసిన పుస్తకం- ది వరల్డ్ ఆఫ్ హోమోసెక్సువల్స్ (The World of Homosexuals) అప్పట్లో ఒక పెను సంచలనాన్నే సృష్టించిందని చెప్పాలి.
* ఇక 1980వ సంవత్సరం ఆమె జీవితంలో ఎంతో ప్రత్యేకమైందని చెప్పాలి. ఎందుకంటే ఆమె పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కడంతో పాటు.. అదే యేడు ఆమె రాజకీయాల్లోకి కూడా వచ్చారు.
* 13 సంఖ్యలు (13 Digit) గల రెండు పెద్ద సంఖ్యలని గుణించి దాని సరైన సమాధానం 28 సెకన్లలో చెప్పడం ద్వారా ఆమె గిన్నిస్ బుక్‌లో స్థానం పొందగలిగారు. అయితే ఆమె 1980లోనే ఈ రికార్డు సాధించినప్పటికీ.. 1982వ సంవత్సరంలో దీనికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కల్పించారు.
* ఆమె అంకెలు గురించిన పుస్తకాలే కాకుండా.. పలు వంటల పుస్తకాలని సైతం రాసారు.
* 1980లో ఇందిరా గాంధీ (Indira Gandhi) పై నేరుగా పార్లమెంట్‌కి పోటీ చేసిన శకుంతలా దేవి.. అప్పటి ఉమ్మడి రాష్ట్రం, ఇప్పటి తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ (Medak) నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
గణితంలో అసామాన్యమైన పట్టు సాధించి, తన పేరిట గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పుస్తకంలో స్థానం సంపాదించుకున్న హ్యూమన్ కంప్యూటర్ (Human Computer) శ్రీమతి శకుంతలా దేవి (Shakuntala Devi) జీవిత కథ ఆధారంగా ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో ఈ అపర గణిత మేధావి పాత్రలో నటించే ఛాన్స్ కొట్టేసింది బాలీవుడ్ నటి విద్యా బాలన్. ఇటీవలే ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో బసవతారకం పాత్రలో మెరిసిన విద్య.. మరో బయోపిక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.
ఎంతో మేధో సంపత్తి కలిగిన శకుంతలా దేవి జీవితాన్ని వెండితెరపై ప్రదర్శించేందుకు సన్నద్ధమవుతోన్న బయోపిక్‌కు అను మీనన్ (Anu Menon) దర్శకత్వం వహిస్తుండగా; రోని స్క్రూవాలా (Ronnie Screwala) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో శకుంతలా దేవి కుమార్తె పాత్రలో దంగల్ ఫేం, యువ కథానాయిక సాన్యా మల్హోత్రా (Sanya Malhotra) నటించనుంది.
ఇవి కూడా చదవండి
ఈ ఏడాది మోస్ట్ గ్లామరస్ స్టార్స్‌గా.. ఎంపికైన షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె..!
రామ్ చరణ్ సరసన “RRR”లో నటించబోయే.. హీరోయిన్ ఈమేనా..?
ఈ పాపులర్ తెలుగు వెబ్ సిరీస్ మీరు చూశారా??