Self Help

సమాజంలో అమ్మాయిలు కోరుకొనే.. టాప్ 10 మార్పులు ఇవే

Amrita Paul  |  Dec 7, 2018
సమాజంలో అమ్మాయిలు కోరుకొనే.. టాప్ 10 మార్పులు ఇవే

ఇరవై ఒకటో శతాబ్ధపు అమ్మాయి ప్రతి రోజూ ఏదో ఒక విషయంలో ఎవరితో ఒకరితో గొడవ పడుతూ ఉండాల్సిందే. ఎందుకంటే.. తను ఏం ధరించాలి? ఎక్కడ పనిచేయాలి? ఎవరితో మాట్లాడాలి? ఎవరిని ప్రేమించాలి? ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ఇలా తన ఇష్ట ప్రకారం జరగాల్సిన విషయాలన్నీ.. ఇతరుల నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి. అందుకే ప్రతి అమ్మాయి కొన్ని విషయాలను తనకు అనుకూలంగా ఉండేలా మార్చాలనుకుంటుంది. వాటిలో ఓ పది మార్పుల గురించి తెలుసుకుందాం.

సమాజంలో అమ్మాయిలు కోరుకొనే.. టాప్ 10 మార్పులు ఇవే

1.  అత్తలూ, కొంచెం తగ్గండి ప్లీజ్..

తాను ధరించిన స్కర్ట్ పొడవు గురించి మాత్రమే కాకుండా.. తన శరీరంలో వస్తున్న మార్పుల గురించి .. తనతో మాట్లాడే అబ్బాయిల గురించి.. తన పెళ్లీడు గురించి ఇరుగు పొరుగు అమ్మలక్కలు మాట్లాడితే ఎలాంటి అమ్మాయికైనా కోపం నషాలానికి ఎక్కుతుంది. ‘ఇక చాలు.. మీ పని మీరు చూసుకోండి’ అని చెప్పాలని అనుకుంటుంది. ఆడపిల్లను అబ్బాయితో సమానంగా ఈ సమాజం చూసే రోజు వస్తే బాగుండునని భావిస్తుంది.

 
2. మమ్మల్ని మాలాగే ఉండనివ్వండి

కొందరు అమ్మాయిలు తమ ఆలోచనలు, అభిరుచులకు అనుగుణంగా ఉండే లోకంలో ఉత్సాహంగా గడపాలని అనుకుంటారు. తమకు నచ్చిన హెయిర్ కలర్, లిప్ స్టిక్ వేసుకొని, భుజంపై టాటూతో స్టైలిష్ గా కనిపించాలనుకుంటారు. అలాంటి వాటికి అభ్యంతరం చెప్పేవారికి ‘మేం అమ్మాయిలం. ఎలా ఉండాలో మాక్కూడా తెలుసు. మాకు నచ్చినట్టుగా మమ్మల్ని ఉండనివ్వండి’ అనే సమాధానాన్ని కూడా ఇవ్వాలని భావిస్తారు.

3. కొంచెం ఫ్యాషనబుల్ గా ఉంటే తప్పా?

ఫ్యాషనబుల్ గా ఉండడాన్ని కొందరు అమ్మాయిలు తమ వ్యక్తిత్వానికి కొనసాగింపుగా భావిస్తారు. తమకు నచ్చిన దుస్తులు వేసుకొని స్టయిలిష్ గా కనిపించాలనుకొంటారు. దాన్ని తప్పు పడితే అసలు ఒప్పుకోరు. (ఫ్యాషన్ మాటొచ్చింది కాబట్టి మేం చెప్పేది ఏమిటంటే.. అమ్మాయిలకు బాగా నచ్చే ఫ్యాషన్ బ్రాండ్స్ రిలయన్స్ ట్రెండ్స్ లో అందుబాటులో ఉన్నాయట.. ఓ సారి వెళ్లి కొత్త కలెక్షన్ చూసేయండి)

 

4. సురక్షితమైన వాతావరణం కావాలి

పట్ట పగలు నడిరోడ్డుపై నడవడానికి కూడా భయపడే సమాజంలో ఈ రోజు అమ్మాయిలు ఉన్నారు. ప్రయాణీకులతో కిటకిటలాడే ప్రజారవాణా వ్యవస్థలోనూ వారికి ఇబ్బందులే. తాము వెళ్లే ప్రతి చోటా కొరకొరా చూసే మగవారుంటారు. వారిలో తమ నాన్న, తాత వయసున్నవారు కూడా ఉంటారు. ఈ క్రమంలో ఏ క్షణం ఏమవుతుందోననే దారుణమైన పరిస్థితులలో కాకుండా.. ఏ సమయంలోనైనా.. ఎక్కడైనా నిర్భయంగా విహరించే వాతావరణం కావాలని ఈ రోజు అమ్మాయిలు కోరుకుంటున్నారు.

5. అలాంటి నిబంధనలొద్దు..

అమ్మాయిలు అలా ఉండకూడదు.. ఇలా చేయకూడదు.. అక్కడికి వెళ్లకూడదు.. ఇక్కడికి వెళ్ళకూడదు అంటూ తమ చుట్టూ గిరి గీయాలని చూసేవారి పట్ల నేటి అమ్మాయిలు ఏహ్యభావాన్ని పెంచుకుంటున్నారు. “ఆడపిల్ల గట్టిగా మాట్లాడటంలో తప్పులేదు. వంట అంత బాగా చేయలేకపోయినా.. చీర కట్టుకోవడం రాకపోయినా పెద్దగా వచ్చిన నష్టం ఏమీ లేదు. ఎందుకంటే.. ఇంతకంటే ముఖ్యమైన విషయాలపై మేం శ్రద్ధ పెట్టాల్సి ఉంది.” అన్నదే నేడు అమ్మాయిలు బల్ల గుద్ది మరీ చెబుతున్న మాట.

 
6. జోక్స్ వేయడంలో తప్పు లేదు కదా..

ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరూ ఎంతో దూరం ప్రయాణం సాగిస్తున్నప్పటికీ.. కొందరు అమ్మాయిల విషయంలో తమ దృక్పథాన్ని మాత్రం మార్చుకోలేకపోతున్నారు. ఎవరైనా జోక్ వేసినప్పుడు నవ్వినా లేదంటే తామే జోక్ వేసినా “ఆడపిల్ల అలా నవ్వకూడదమ్మా, అలాంటి మాటలు మాట్లాడకూడదమ్మా” అనేవారే ఈ రోజు ఎక్కువగా ఉంటున్నారు. కానీ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మాయిలు సరదాగా ఉండటంలో తప్పు లేదని.. వారి చిన్న చిన్న ఆనందాలకు కూడా అడ్డు చెప్పి వారి స్వాతంత్య్రానికి భంగం కలిగించ వద్దనేదే వారి భావన.

7. బాడీ షేమింగ్ వద్దు..

సన్నగా ఉంటే.. ‘ఇంత బక్కగా ఉన్నావు. ఏమీ తినవా?’ అంటారు. అదే కాస్త బొద్దుగా ఉంటే ‘ఇంత లావుగా ఉంటే ఎలా? కాస్త తిండి తగ్గించు’ అంటారు. మేం ఎలా ఉంటే ఏంటి? ఆరోగ్యంగా ఉన్నామా? లేదా? అనేదే ముఖ్యం. కానీ ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోరు. మా చర్మం రంగుని కూడా అవహేళన చేస్తుంటారు. కానీ మా శరీరం పట్ల మేం సంతోషంగానే ఉన్నాం. మా తిండి, ఆహార్యం విషయంలో ఇతరుల సందేహాలకు సమాధానమివ్వడం కంటే ముఖ్యమైన పనులు మాకు బోలెడున్నాయి. ఇదే నేటి అమ్మాయిలు నిజాయతీగా చెప్పే మాట. 

 
8. విచక్షణతో వ్యవహరించండి..

రుతుక్రమం గురించి ఇప్పటికీ ప్రజల ఆలోచనల్లో ఎలాంటి మార్పు రాలేదు. పీరియడ్స్ సమయంలో శానిటరీ నాప్కిన్ల కోసం ఫార్మశీకి వెళితే.. అక్కడ ఫార్మాసిస్ట్ వాటిని పేపర్లో చుట్టి ఆ తర్వాత అది కనిపించకుండా నల్లటి కవర్లో పెట్టి ఇస్తాడు. ఏదో పుట్టిన రోజుకో, పెళ్లికో ఇచ్చే బహుమతి మాదిరిగా అలా తీసుకెళ్లడం చాలా మంది అమ్మాయిలకు కామెడీగా అనిపిస్తుంది. ఆ సమయంలో అమ్మాయిలకు నెలనెలా పీరియడ్స్ రావడం సహజం అనే విషయాన్ని అందరూ గుర్తిస్తే బాగుండుననిపిస్తుంది.

9. ఎక్కువ పని తక్కువ మాటలు

మేం అమ్మాయిలం.. మాటల మనుషులం కాదు.. ఏదైనా సరే చేతల్లోనే చూపిస్తాం. పని పట్ల నిబద్ధతతో వ్యవహరిస్తాం. కానీ ఆఫీసులోనూ మమ్మల్ని మాటల తూటాలతో గాయపరిచే ప్రయత్నం చేస్తారు. వివాహం కోసం తన జీతంలో కొంత మొత్తాన్ని దాచుకుంటూ అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటే ఆమెను పిసినారిగా పిలుస్తారు. ఉన్నతాధికారి హోదాలో అందరి పనితీరును పర్యవేక్షిస్తుంటే ఆమెను పొగరుబోతుగా వ్యవహరిస్తారు. అదే స్థానంలో పురుషుడు ఉంటే వారి మాటలు మరో రకంగా ఉంటాయి. ఇలాంటి దృక్ప‌థంలోనే మార్పు రావాలని ప్రతి మహిళ కోరుకొంటుంది. అది కూడా వీలైనంత వేగంగా రావాలని ప్రతి అమ్మాయి కోరుకొంటుంది.

10.  పట్టించుకొనే నాథుడు కావాలి

ఇటీవలి కాలంలో తమ భావోద్వేగాలన్నింటినీ దూరంగా పెట్టి ప్రాపంచిక వ్యవహారాలు అనేవి తమకు ఏ మాత్రం పట్టనట్టుగా వ్యవహరించడం ఫ్యాషన్ గా మారిపోయింది. ఇలాంటి వారిని అమ్మాయిలు పెద్దగా ఇష్టపడరు. తమ మనసుని అర్థం చేసుకొని, కష్టనష్టాల్లో తోడుగా ఉంటూ, సున్నితంగా వ్యవహరించే మగవారినే వారు ఇష్టపడతారు. 

ఇది రిలయన్స్ ట్రెండ్స్ ప్రాయోజిత కథనం (This is a sponsored post for Reliance Trends)

Read More From Self Help