Family Trips

మీకు “వీసా దేవుడు – చిలుకూరు బాలాజీ” గురించి ఈ విశేషాలు తెలుసా…!

Sandeep Thatla  |  Aug 20, 2019
మీకు “వీసా దేవుడు – చిలుకూరు బాలాజీ” గురించి ఈ విశేషాలు తెలుసా…!

విదేశాలకు వెళ్లాలని భావించే విద్యార్థులు, నిరుద్యోగులు లేదా ప్రొఫెషనల్స్  వీసా కావాలంటే, ఆయా దేశ ఎంబసీకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సిందే. అయితే చాలాకాలం నుండి హైదరాబాద్ నగరవాసుల్లో  కొంతమందికి ఓ నమ్మకం ఏర్పడింది. నగర పరిసరాలలో ఉన్న చిలుకూరు బాలాజీ దేవాలయానికి  వెళ్లి మొక్కుకుంటే.. వీసా తప్పనిసరిగా వస్తుందని ఇక్కడి భక్తులు భావిస్తున్నారు.

అందుకే ఈ దేవస్థానాన్ని ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు కూడా ఎక్కువగా సందర్శిస్తుంటారు. అలాగే పై చదువులకి విదేశాలకి వెళ్ళడానికి వీసా కోసం ప్రయత్నించేవారు సైతం.. ఈ ఆలయాన్ని తప్పక దర్శిస్తుంటారు.

హైదరాబాద్ ట్రెండ్స్: భాగ్యనగరంలోని.. రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ పాయింట్స్ ఇవే..!

ఇక  చిలుకూరు బాలాజీ దేవస్థానం (Chilukur Balaji Temple) గురించి చెప్పుకోవాలంటే.. హైదరాబాద్ నగర సరిహద్దుల్లో గల మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో ఈ గుడి  ప్రసిద్ధి గాంచింది. గండిపేట్ చెరువు‌కి అతి సమీపంలో ఈ గుడి వెలిసింది. ఈ గుడిని చేరుకోవడానికి హైదరాబాద్‌లోని మెహదీపట్నం ప్రాంతంతో పాటు.. ఇతర ప్రాంతాల నుండి కూడా రవాణా సౌకర్యం కలదు. అలాగే ఈ దేవస్థానాన్ని దర్శించుకోవడానికి దేశ నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు. అలాగే ఇటీవలి కాలంలో ప్రపంచం నలుమూలల నుండి కూడా ఇక్కడికి యాత్రికులు రావడం రివాజుగా మారింది.

ఈ క్రమంలో మనం కూడా వీసా దేవుడు (Visa God) అలియాస్ చిలుకూరు బాలాజీ దేవాలయానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం.

* చిలుకూరు దేవాలయంలో హుండీ ఉండదు. ఇక్కడికి వచ్చే భక్తులు ఎటువంటి కానుకలు వేయడానికి వీలు లేదు.

* ఈ చిలుకూరు దేవాలయం ప్రభుత్వ పరిధిలోకి రాదు. ఇది స్వయంప్రతిపత్తి కలిగిన దేవాలయం. ఈ ఆలయాన్ని ప్రభుత్వం పరిధిలోకి తీసుకురావాలని గతంలో  ప్రయత్నాలు జరిగాయి. కానీ దేవస్థానం అర్చకులు, చిలుకూరు ప్రజలు అందుకు వ్యతిరేకంగా పోరాడారు. కోర్టు వరకు వెళ్లి మరీ.. 2004లో ఈ గుడికి స్వయంప్రతిపత్తిని సాధించుకోగలిగారు.

* ఈ గుడికి ఎంతటి ప్రముఖులు దర్శనానికి వచ్చినా పరే, వారు మిగతా సభ్యుల మాదిరిగా దర్శనం చేసుకోవాల్సిందే.. తప్ప ప్రత్యేక దర్శనాలు ఉండవు.

* చిలుకూరు దేవస్థానంలో హుండీలో డబ్బు వేసే పద్ధతి లేదు. అంతగా భక్తులు విరాళాలు ఇవ్వాలని భావిస్తే.. ఆ డబ్బుతో ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో ప్రచురిస్తున్న ‘వాక్’ అనే హైందవ పత్రిక ప్రతులని కొనుగోలు చేసి తమ సన్నిహితులకు లేదా ఇతరులకు పంచడం ఒక్కటే మార్గం.

* చిలుకూరు ఆలయం.. అన్ని రోజుల్లో ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు తెరిచే ఉంటుంది.

 

బిగ్‌బాస్ తెలుగు యాంకర్ నాగార్జున చేతిలో ఉన్న.. పండు (కోతి) బొమ్మ మీకు కావాలా?

* ఇక ఈ చిలుకూరు దేవస్థానం అర్చకుడైన సి.ఎస్. రంగరాజన్.. ఒక దళిత భక్తుడిని తన భుజాల పైన మోసుకుంటూ గుడిలోకి తీసుకువెళ్ళి అప్పట్లో సంచలనం సృష్టించారు.

* సి.ఎస్. రంగరాజన్ వృత్తిరీత్యా బయో-మెడికల్ ఇంజనీర్ అయినప్పటికి, ఆయన తన  వారసత్వంగా వస్తున్న చిలుకూరు బాలాజీ దేవస్థాన అర్చకత్వాన్ని స్వీకరించడం జరిగింది.

* ఈ చిలుకూరులో ఏదైనా కోరిక కోరుకొని.. 11 సార్లు ప్రదిక్షణలు చేసి.. అది నెరవేరిన తరువాత మరల 108 సార్లు ప్రదిక్షణలు చేస్తుంటారు.

* ఇక ఈ గుడిలో ప్రదిక్షణలు చేయడానికి వచ్చే వారు.. అల్పాహారం సేవించి కూడా రావచ్చు అని ఇక్కడి అర్చకులు చెబుతుంటారు. అదే సమయంలో ఇక్కడ గుడిలో వాయిదాల పద్దతిలో కూడా ప్రదిక్షణలు పూర్తి చేసే అవకాశముందని కూడా పూజారులు భక్తులకి సూచిస్తారు.

* చిలుకూరు గుడిలో మనకి కనిపించే మరొక వైవిధ్యమైన విషయం ఏంటంటే – “వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే సమయంలో.. కళ్ళు తెరిచి స్వామి వారిని చూడమని చెబుతుంటారు”. ఎంతో భక్తితో ఇక్కడకు వచ్చే భక్తులు చివరకు భగవంతుడిని దర్శించుకునే సమయంలో.. భక్తిలో కళ్ళు మూసుకోకుండా ఆయనని కళ్లారా చూడమని చెబుతుంటారు.

* చిలుకూరు దేవాలయం చూడటానికి చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ దేవస్థానానికి ఉన్న పేరు ప్రఖ్యాతలకి, ఈ గుడి వ్యాసార్థంలో ఉన్న దానికి పొంతనే ఉండదు.

ఈ 11 అంశాలు… చిలుకూరు బాలాజీ దేవస్థాన విశిష్టత, వైవిధ్యాన్ని తెలియచేస్తాయి.

రామోజీ ఫిలిం సిటీని సందర్శించాలని భావిస్తున్నారా? అయితే మీకు ఈ వివరాలు తెలియాల్సిందే..!

Read More From Family Trips