Lifestyle

79 ఏళ్ల నుంచి కరెంట్ లేకుండా జీవిస్తోన్న ప్రొఫెసర్ .. చాలా గ్రేట్ కదా..!

Lakshmi Sudha  |  May 8, 2019
79  ఏళ్ల నుంచి కరెంట్ లేకుండా జీవిస్తోన్న ప్రొఫెసర్ .. చాలా గ్రేట్ కదా..!

ఐదు నిమిషాలు కరెంట్ పోతే.. ఇంకా పవర్ రాలేదేంటా అనుకొంటాం. ఆ కరెంట్ కోత (power cut) మరో పదినిమిషాలు కొనసాగితే.. విసుగు మొదలవుతుంది. ఇంకా కాసేపు ఆగితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ (electricity department) వాళ్లని నోటికొచ్చినట్టు తిడతాం. అవునా? మరి, ఒక రోజంతా కరెంట్ లేకుండా మనం బ్రతకగలమా? అమ్మో ఇంకేమైనా ఉందా? ఫ్యాన్ తిరగకపోతే ఊపిరి ఆడుతుందా? ఇంత ఎండల్లో ఏసీ పనిచేయకపోతే.. చచ్చిపోమూ..? టీవీ చూడకపోతే టైంపాస్ ఎలా అవుతుంది?

ఒక్క రోజు కరెంటు పోతే ఎలా ఉంటుందో ఊహించుకొంటేనే ఇంత భయంకరంగా అనిపిస్తోంది. కానీ ఈ బామ్మ మాత్రం 79 ఏళ్లుగా కరెంట్ లేకుండానే జీవిస్తోంది. అది కూడా పుణె లాంటి సిటీలో. అయితే ఆవిడ పేదరికం కారణంగా ఇలా కరెంట్ లేకుండా ఉందేమో అనుకొంటే మీరు పొరపడినట్లే. ఆవిడ ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైరయ్యారు మరి. చదువుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా..! పర్యావరణం మీద ఉన్న ప్రేమతోనే ఆవిడ విద్యుత్‌కి దూరంగా ఉంటున్నారు. ఈ ప్రొఫెసర్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకొందాం.

పుణెలోని బుధవార్ పేటలోని ఓ చిన్న ఇంట్లో నివాసముంటున్నారు డా. హేమాసేన్. ఆమె ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఆమెతో పాటుగా ఒక కుక్క, రెండు పిల్లులు, ఓ ముంగిస, బోలెడన్ని పక్షులుంటాయి. ఆమెకు ప్ర‌కృతి అంటే చాలా ప్రేమ. పర్యావరణానికి హాని కలిగించే పని ఏదీ ఆమె చేయరు.

అందుకే ఆమె ఇల్లు కూడా పూరి గుడిసె మాదిరిగానే ఉంటుంది. అత్యంత ఖరీదైన పుణెలోని బుధవార్ పేటలో ఆమెదే అతి చిన్న ఇల్లు. ఇంటి చుట్టూ దట్టంగా పెరిగిన చెట్లు, వాటి మీద ఆశ్రయం పొందే వివిధ రకాల పక్షులతో చాలా అందంగా, కోలాహలంగా ఉంటుంది.

‘ఇంత చిన్న ఇంట్లో ఉంటూ కరెంట్‌కు దూరంగా ఉంటున్నందుకు చుట్టూ ఉన్నవారు నన్ను ఓ ఫూల్ అంటారు. మెంటల్ అని కూడా అంటారు. అయినా నేను దాన్ని ఏమీ పట్టించుకోను. నా చిన్నప్పటి నుంచి నేను కరెంట్ లేకుండానే పెరిగాను. అప్పటికి కరెంట్ లేదు. చాలాకాలం తర్వాతే అది అందరికీ అందుబాటులోకి వచ్చింది. కాబట్టి కరెంట్ లేకపోయినా నేను ఉండగలను.’ అంటారామె.

చాలా మంది డా. హేమాసేన్‌ను కరెంటు లేకుండా ఎలా ఉంటున్నారని అడుగుతారట. బదులుగా వారిని కరెంటుతో ఎలా జీవించగలుగుతున్నారని ప్రశ్నిస్తారట. నిజంగానే ఆమె ఇంట్లో కరెంటు దీపాలుండవు. రాత్రి వేళల్లో నూనె దీపాలు, లాంతరు వీటితో పాటుగా.. ఒకటీ అరా సోలార్ దీపాలుంటాయి.

చాలామంది ఈ ఆస్తిని అమ్మేయమని తనకు సలహా ఇస్తుంటారని అంటున్నారు డా. హేమాసేన్. కానీ తనకు ఆ ఉద్దేశం లేదని చెబుతున్నారు. అంతేకాదు.. తన ఆస్తిపాస్తులన్నీ తనతో పాటు జీవిస్తోన్న కుక్క, పిల్లులు, ముంగిస, పక్షులకే చెందుతాయని అంటున్నారామె. వాస్తవానికి అదంతా వాటికి చెందిన ఆస్తే అని, తాను కేవలం దాన్ని సంరక్షిస్తున్నానని అంటారు. అవన్నీ డా.హేమాసేన్  నేస్తాలే. ఆమె తన ఇంటి పని చేసుకొంటూ ఉంటే.. అవి తన చుట్టూ తిరుగుతూ ఉంటాయని చెబుతారామె.

డా. హేమాసేన్ బోటనీ (వృక్ష‌శాస్త్రం)లో పీహెచ్‌డీ చేశారు. పుణెలోని అబా సాహెబ్ గార్వార్ కాలేజ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. దాదాపు 12 ఏళ్లు హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ గానూ పనిచేశారు. ఎందరో పీహెచ్‌డీ విద్యార్థులకు ఆమె ఆధ్వర్యంలో తమ పరిశోధనను పూర్తి చేశారు. ఆమె బోటనీ, పర్యావరణానికి సంబంధించిన ఎన్నో పుస్తకాలు రాశారు. ఆమె రాసిన పుస్తకాలను యూనివర్సిటీల్లో పాఠ్యపుస్తకాలుగా ఉపయోగిస్తున్నారు. ఇప్పటికీ కాస్త సమయం దొరికినా ఆమె పుస్తకాలు రాస్తూ ఉంటారు.

కాసేపు కరెంట్ లేకపోతేనే ప్రపంచమంతా ఆగిపోయినట్టనిపిస్తుంది మనకు. కానీ డా. హేమాషేన్ మాత్రం గత 79 ఏళ్లుగా కరెంట్ లేకుండా జీవిస్తూ ప్ర‌కృతి సేవలో గడుపుతున్నారు. ఏడాదికోసారో.. రెండు సార్లో లేదా గుర్తొచ్చినప్పడో ఎర్త్ అవర్ పేరిట ఓ గంట సేపు లైట్లు ఆర్నేసి ఏదో గొప్ప పని చేశామని భావించే తరంలో ఉన్న మనం డా. హేమాషేన్ ని చూసి చాలా నేర్చుకోవాలి. ఆవిడ స్థాయిలో మనం చేయలేకపోయినా.. విద్యుత్తు వృథా చేయకుండా ఉంటే ఎంతో కొంత ప్ర‌కృతి వనరులను కాపాడుకొన్నవాళ్లమవుతాం.

ఇవి కూడా చదవండి:

సమాజం గొడ్రాలు అని ఏడిపిస్తే.. మొక్కలు ఆమెను వృక్షమాతను చేశాయి..!

ధోనీ ఫ్యాన్ మూమెంట్: బామ్మా.. ఓ సెల్ఫీ తీసుకొందామా..?

ఈతరం అమ్మాయిలకు ఉప‌క‌రించే.. బామ్మగారి సౌందర్య చిట్కాలు..

Read More From Lifestyle