దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం #RRR. ఈ మధ్య ఈ సినిమాకు సంబంధించి రకరకాల వార్తలు చిత్రసీమలో చక్కర్లు కొట్టడం, వాటిపై దర్శక, నిర్మాతలు స్పష్టత ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఆత్రంగా ఎదురుచూస్తున్న తరుణంలో రాజమౌళి చిత్రబృందం ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు ప్రకటించడంతో ఇదొక హాట్ టాపిక్‌గా మారిపోయింది.
కొద్ది సేపటి క్రితమే ముగిసిన ఈ సమావేశంలో దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్‌లో రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను వెల్లడించగా; రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా ఈ సినిమా గురించి తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ ప్రెస్ మీట్‌లో చిత్ర యూనిట్ వెల్లడించిన ముఖ్యమైన అంశాలు..
* మొదట #RRR అనే దానిని వర్కింగ్ టైటిల్‌గానే పరిగణించినప్పటికీ అనేక మంది నుంచి వచ్చిన సూచనలు- సలహాల మేరకు దీనినే టైటిల్‌గా పెట్టదలచుకున్నారట రాజమౌళి. అయితే ఇది బహుభాషా చిత్రం కావడంతో ఆయా భాషల్లో వీటికి సరైన అర్థం వచ్చేలా #RRR ను విపులీకరించి చెప్పాలని ప్రేక్షకులను కోరారు రాజమౌళి.
* ఇక సినిమా కథ విషయానికి వస్తే 1920లలో ఆంధ్రకు చెందిన అల్లూరి సీతారామ రాజు (Alluri Seetharama Raju), తెలంగాణకు చెందిన కొమరం భీం (Komaram Bheem) స్వాతంత్య్ర సమరయోధులుగా మారక ముందు ఇద్దరూ కొన్ని సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నారు. దేశాటన కావచ్చు.. లేదా మరింకేదైనా కారణం ఉండచ్చు. కానీ ఆ కొద్ది సంవత్సరాలు వారి జీవితాల్లో ఏం జరిగిందన్నది ఎవరికీ తెలీదు. ఇలా చరిత్రలో ఒకరికొకరు సంబంధం లేని వీరిద్దరూ మనకు తెలియకుండా కలుసుకొని ఉంటే; పరస్పరం ప్రేరణ ఇచ్చుకుని ఉంటే.. ఎలా ఉంటుంది అనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన కథే ఇది. ఇద్దరు మహావీరుల జీవితాల్లో ఎవరికీ తెలియని ఆ కథ గురించి చెప్పే ప్రయత్నమే ఈ చిత్రం. అలాగని ఇదేమీ బయోపిక్ తరహా కాదు. ఎందుకంటే ఇది నిజ జీవిత పాత్రలపై రూపొందించిన కల్పిత కథ.
* కథకు తగ్గట్టుగానే పాత్రలు కూడా బలంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయా పాత్రలకు తగిన నటీనటులను ఎంపిక చేశారు రాజమౌళి. అలాగే కథ కూడా కాస్త ఉత్తర భారతంలో జరిగే నేపథ్యంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గణ్‌ను ఇందులో ఒక కీలక పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారట! అలాగే రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజును పోలిన పాత్రలో నటిస్తుండగా.. అతనికి జతగా బాలీవుడ్ క్యూట్ బ్యూటీ అలియా భట్ నటించనుంది. అలాగే ఎన్టీఆర్ కొమరం భీంను పోలిన పాత్రలో నటిస్తుండగా; అతని సరసన హాలీవుడ్ బ్యూటీ డైసీ ఎడ్గర్ జోన్స్ కథానాయికగా నటించనుంది. ఇక, ఈ కథలోని మరొక కీలక పాత్రలో ప్రముఖ తమిళ నటుడు సముద్రఖని కూడా కనిపించనున్నారట!
* ఈ చిత్రాన్ని మొదట తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లోనే రూపొందించాలని అనుకున్నారు. కానీ మిగతా భాషల నుంచి కూడా డిమాండ్స్ రావడంతో భారతదేశంలోని పలు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోందీ చిత్రబృందం. అంటే భారీ బడ్జెట్ పై రూపొందుతోన్న బహుభాషా చిత్రమని చెప్పచ్చు. అలాగే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అంటే 2020లో జూలై 30వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాత డీవీవీ దానయ్య. ఈ ప్రెస్ మీట్ లో ఆర్ ఆర్ ఆర్‌కు సంబంధించిన పోస్టర్‌ను కూడా లాంచ్ చేశారు.
* అసలు ఈ కథను రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు రాజమౌళి ఎలా చెప్పారన్న విషయాన్ని ఈ సమావేశం వేదికగా రామ్ చరణ్ అందరితోనూ పంచుకున్నారు. ఒక రోజు ఈ ఇద్దరు హీరోలను ఒకరికి తెలియకుండా మరొకరిని.. రాజమౌళి ఇంటికి ఆహ్వానించారట! అలా అనుకోకుండా కలుసుకున్న వీరిద్దరూ రాజమౌళి కుటుంబ సభ్యుల సమక్షంలో ఒకరినొకరు చూసుకొని ఆశ్చర్యపోయారట. ఆ తర్వాత వారిరువురినీ లోపలికి తీసుకెళ్లి కథ చెప్పి, మీరిద్దరూ ఇందులో చేయాలన్న వెంటనే.. ఇద్దరూ సంతోషంగా అంగీకరించారమని చెప్పుకొచ్చారు రామ్ చరణ్.
* అయితే ఈ కథ నిజ జీవిత పాత్రలపై రాసుకున్న కల్పిత కథ అవ్వడంతో అందుకోసం చాలా కాలం పరిశోధన చేశామని, ఈ ఇద్దరు మహావీరుల గురించి రాసిన పుస్తకాలన్నీ బాగా చదివామని తెలిపారు రాజమౌళి. అదే సమయంలో ఆయా పాత్రల కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు ప్రత్యేకంగా వర్క్ షాప్స్ కూడా నిర్వహించారట! ముఖ్యంగా పాత్రల ఆహార్యం, మాండలికం, వారు జీవించిన విధానాలపై వీరంతా దృష్టి సారించారట!
* ప్రెస్ మీట్‌లో భాగంగా ఈ చిత్ర బడ్జెట్ ఎంతని ఒక విలేకరి ప్రశ్నించగా- దాదాపు 350 నుంచి 400 కోట్ల రూపాయల వరకు అవుతుందని అంచనా వేసినట్లు నిర్మాత డీవీవీ దానయ్య తెలిపారు. ఈ చిత్రాన్ని వదులుకునేందుకు ఆయనకు 100 కోట్ల రూపాయల డీల్ వచ్చినప్పటికీ రాజమౌళితో కలిసి పని చేయాలన్న ఆశతో దానిని వదులుకున్నమాట వాస్తవమేనని ఆయన తెలిపారు.
* ఇక సినిమాల్లో రాజమౌళి మార్క్‌గా చూపించే ఆయుధాలు, విద్యలు.. వంటి వాటి గురించి ప్రశ్నించగా.. ఈ కథ యువ అల్లూరి సీతారామ రాజు, కొమరం భీంలను పోలిన పాత్రల నేపథ్యంలోనే సాగుతుంది కాబట్టి వారికి తగ్గట్టుగానే ఆయుధాలు కూడా ఉంటాయి.. అవి మీరు తెరపైనే చూడాలని అన్నారు రాజమౌళి. అయితే ఈ కథలో ఉన్న మిగతా అన్ని పాత్రలు ఈ రెండు పాత్రలను మరింత బలంగా మార్చేందుకు దోహదం చేసేవే అని చెప్పుకొచ్చారు.
* ఇక ఈ కథలో ఒకరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన సమర యోధులైతే; మరొకరు తెలంగాణ ప్రాంతానికి చెందినవారు కావడం.. అలాగే 1920లకు చెందిన ఈ కథను 2020లో విడుదల చేయడం.. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగినవే అని అన్నారు.
* ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకుందని, ఈ నెలాఖరున అహ్మదాబాద్, పుణెలలో మరొక 30 రోజుల పాటు మూడో షెడ్యూల్ జరగనుందని డీవీవీ దానయ్య తెలిపారు. అయితే 1920ల కాలం నాటికి చెందిన కథ కాబట్టి ఈ చిత్రానికి కూడా విఎఫ్ఎక్స్ పనులు బాగానే అవసరం అవుతాయని, అందుకు తగిన సమయం కేటాయించి, అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు రాజమౌళి.
ఇవండీ.. #RRR ప్రెస్ మీట్‌కు సంబంధించిన విశేషాలు. మొత్తానికి వచ్చే ఏడాది జూలైలో రాజమౌళి మరోసారి ఒక మెస్మరైజింగ్ స్టోరీతో మనందరినీ మాయ చేసేందుకు రడీ అయిపోతున్నారు. మరి, ఈ మ్యాజిక్‌ని ఆస్వాదించేందుకు మనమూ సిద్ధమైపోదామా..!
ఇవి కూడా చదవండి
రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ & ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ??