Entertainment

Childrens Day Special – ఒకప్పటి బాల నటులు… నేడు స్టార్ హీరో హీరోయిన్లు.. వారెవరంటే..?

Sandeep Thatla  |  Nov 14, 2019
Childrens Day Special – ఒకప్పటి బాల నటులు… నేడు స్టార్ హీరో హీరోయిన్లు.. వారెవరంటే..?

‘నేటి బాలలే రేపటి పౌరులు’ అనేది మనం  చిన్నతనం నుండి వింటున్న మాటే. నిజం చెప్పాలంటే..  బాల్యం  ఎక్కువమందికి తియ్యని జ్ఞాపకాలే అందిస్తుంది. సాధారణంగా ఎవరైనా పెద్దయ్యాక.. తమ బాల్య స్మృతులను నెమరువేసుకుంటూ.. ఆ రోజులు ఎంత  బాగుండేవో అని అనుకోవడం సహజమే. అంతలా అందరి జీవితాల్లో చెరిగిపోని జ్ఞాపకాలని మిగిల్చే బాల్యాన్ని గుర్తించేందుకు.. ఆ బాల్యంలో కనిపించే అమాయకత్వపు ఛాయలతో పాటు పసితనాన్ని గుర్తు చేసుకొనేందుకు.. ఒక వేడుకగా ప్రతి సంవత్సరం నవంబర్ 14 తేదిన.. చాచా నెహ్రు జయంతిని పురస్కరించుకొని (childrens day special) బాలల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయతీగా వస్తోంది.

“ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి.. నెలరోజులు చాలు” – నటి ‘రాశి’ ఆసక్తికర లవ్ స్టోరీ ..!

నెహ్రుజీకి చిన్న పిల్లలు అంటే ఉన్న ఇష్టాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఈరోజుని పిల్లలకు అంకితమివ్వాలని నిర్ణయించారట. ఇక ఈ ‘చిల్డ్రన్స్ డే’ని పురస్కరించుకుని.. మన తెలుగు చిత్ర సీమలో తొలుత బాల నటులు (Child Actors) గా ప్రవేశించి..  పెద్దయ్యాక కూడా ఇదే చిత్రసీమలో ప్రముఖ నటులుగా స్థిరపడిన వారి  గురించి తెలుసుకుందాం.

* అలీ (Ali)

అలీ పేరు తెలియని వారుండరంటే నమ్మకతప్పని నిజమనే చెప్పాలి. 1979లో కె. రాఘవేంద్రరావు  దర్శకత్వంలో వచ్చిన ‘నిండు నూరేళ్లు’ అనే చిత్రం ద్వారా నటుడిగా ఆయన తెరంగేట్రం చేయగా.. ఆ తరువాత వచ్చిన ‘సీతాకోక చిలుక’ చిత్రం ద్వారా బాల నటుడిగా అందరి చేత గుర్తింపు తెచ్చుకోగలిగాడు. ప్రస్తుతం ఆయన స్టార్ కమెడియన్‌గా తెలుగు ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఒక టీవీ షోకి కూడా యాంకరింగ్ చేస్తున్నాడు.

* రాశి  (Raasi)

రాశి అనాలో లేక విజయలక్ష్మి అనాలో తెలియదు కాని.. తెలుగుతెరకు మాత్రం ఆమె ‘రాశి’ గానే పరిచయం. అయితే ఆమె బాల నటిగా 1986లోనే తెలుగు తెరకు పరిచయమైంది. పెద్దయ్యాక మాత్రం..  శుభాకాంక్షలు, గోకులంలో సీత చిత్రాల ద్వారా కథానాయికగా తెలుగు చిత్ర పరిశ్రమంలో తెరంగేట్రం చేసింది. 

 

* మహేష్ బాబు (Mahesh Babu)

ఇప్పుటి సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకప్పుడు బాల నటుడు అనేది చాలామందికి తెలిసిన విషయమే. ఇక ఆయన తన నాలుగేళ్ల వయసులోనే దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘నీడ’ అనే చిత్రం ద్వారా.. 1979లో బాల నటుడిగా పరిచయమవ్వగా.. మొత్తంగా 11 ఏళ్లలో 9 చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. ఇక 1999లో ‘రాజకుమారుడు’ చిత్రంతో హీరోగా పరిచయమై.. ఇప్పుడు సూపర్ స్టార్‌గా కొనసాగుతున్నాడు.

 

* శ్రీదేవి (Sridevi)

అతిలోకసుందరి అంటేనే శ్రీదేవి అని అనిపించేలా ఉంటుంది ఆమె అందం. అలాగే ఆమె తిరుగులేని అభినయం, నటనా ప్రతిభ తనను  లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకునేలా చేశాయి. 1963లో జన్మించిన ఆమె సరిగ్గా నాలుగేళ్ళ తరువాత అంటే.. 1967లో తమిళ చిత్రసీమలో బాల నటిగా తెరంగేట్రం చేసింది. ఇక తరువాతి కాలంలో ఆమె తెలుగు, తమిళ & హిందీ చిత్రసీమలో ఎన్నో చిత్రాలు చేసి.. చివర వరకు కూడా ఒక సూపర్ స్టార్‌గానే నిలిచింది.

 

* రోజా రమణి (Roja Ramani)

ప్రముఖ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా అందరికీ తెలిసిన రోజా రమణి తన 7 ఏళ్ళ వయసులోనే.. తెలుగులో వచ్చిన సూపర్ హిట్ చిత్రం “భక్త ప్రహ్లాద” సినిమాలో ప్రహ్లాదుని పాత్రలో నటించి అందరినీ మెప్పించడం విశేషం. దాదాపు 6 ఏళ్ళ పాటు అంటే.. ఆమె హీరోయిన్‌‌గా కెరీర్ మొదలుపెట్టే వరకు.. 40 చిత్రాల్లో బాల నటిగా నటించడం జరిగింది. ఆ తరువాత కాలంలో 5 భాషల్లో ..ఆమె సుమారు 300 చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుని.. ఆ తరువాత కాలంలో 400 చిత్రాలకు పైగా డబ్బింగ్ చెప్పడం ద్వారా.. ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా పేరు తెచ్చుకుంది. 

 

* కమల్ హాసన్ (Kamal Haasan)

సకల కళా వల్లభుడిగా పేరు పొందిన కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఆయన చేయని పాత్ర లేదు. సినిమాకి సంబంధించిన అన్ని విభాగాల పైన కూడా ఆయనకు మంచి పట్టు ఉంది.  ఈయన కూడా బాల నటుడిగా దాదాపు 6 చిత్రాల్లో నటించారు. ఆ తరువాత హీరో అయ్యాక 200 పైగా చిత్రాల్లో నటించారు. ఈ మధ్యనే ఆయనకి చిత్ర పరిశ్రమలో 60 ఏళ్ళ పూర్తి చేసుకున్న సందర్భంగా.. ప్రముఖులందరూ ఆయన్ని సత్కరించడం జరిగింది.

వివాదాస్పద వెబ్ సిరీస్ “లస్ట్ స్టోరీస్” తెలుగు వెర్షన్‌లో.. అందాల భామ ఈషా రెబ్బా ..!

 

* తరుణ్ (Tarun)

తరుణ్ తన తల్లి రోజా రమణి మాదిరిగానే చిన్న వయసులోనే తెరగేట్రం చేసేశాడు. 7 ఏళ్ళ వయసులోనే బాల నటుడిగా తమిళ, తెలుగు & మలయాళ చిత్రాల్లో నటించి.. నేషనల్ అవార్డుని సైతం సొంతం చేసుకున్నాడు. 2000 సంవత్సరంలో పూర్తిస్థాయి హీరోగా పరిచయమై తెలుగు చిత్రసీమకి పరిచయమయ్యాడు. 

 

* తనీష్ (Tanish)

1998లో వెంకటేష్ నటించిన ‘ప్రేమంటే ఇదేరా’ చిత్రం ద్వారా బాల నటుడిగా పరిచయమైన తనీష్. దాదాపు అయిదు చిత్రాల్లో మంచి పాత్రలు చేసి బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మన్మధుడు, దేవుళ్లు, చాలా బాగుంది చిత్రాలు అందులో ప్రముఖమైనవి. తనీష్ పెద్దయ్యాక.. తనను దర్శకుడు రవిబాబు..  ‘నచ్చావులే ‘ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేయడం జరిగింది. ఆ తరువాత దాదాపు 10కి పైగా చిత్రాల్లో నటించాడు తనీష్.

 

* ఆకాష్ పూరి (Aakash Puri)

దర్శకుడు పూరి జగన్నాధ్ కుమారుడు అయిన ఆకాష్ పూరి తన చిన్నతనంలోనే తెలుగు పరిశ్రమకి బాల నటుడిగా పరిచయమయ్యాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి చిత్రం “చిరుత” చిత్రం ద్వారానే ఆకాష్ పూరి కూడా పరిచయమయ్యాడు. ఆ తరువాత బుజ్జిగాడు, గబ్బర్ సింగ్ వంటి చిత్రాల్లో నటించిన ఆకాష్.. ‘ఆంధ్ర పోరి’ చిత్రంతో హీరోగా మారాడు. ప్రస్తుతం ‘రొమాంటిక్’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

 

వీరే కాకుండా మరికొంతమంది బాల నటులు అయిన బాలాదిత్య , లయ, మంచు మనోజ్ కుమార్, విజయ నిర్మల, తులసి తదితరులు నటులుగా చిత్రసీమలోకి అడుగుపెట్టి.. కెరీర్‌లో ముందుకు సాగిపోయారు.

ఇవండీ.. ఈ  చిల్డ్రన్స్ డే సందర్భంగా బాల నటులుగా.. చిత్రపరిశ్రమకు పరిచయమై.. ఆ తరువాత నటులుగా స్థిరపడిన వారి గురించిన వివరాలు. 

ఆమె తొలి చిత్రమే “స్వలింగ సంపర్కం”పై : హైదరాబాద్ నటి శ్రీదేవి చౌదరి డేరింగ్ నిర్ణయం

Read More From Entertainment