Entertainment

మా అమ్మ, నాన్న విడిపోవడం బాధాకరమే: కమల్‌హాసన్ కుమార్తె అక్షర

Babu Koilada  |  May 4, 2019
మా అమ్మ, నాన్న విడిపోవడం బాధాకరమే: కమల్‌హాసన్ కుమార్తె అక్షర

తమిళ అగ్రనటుడు కమల్ హాసన్, సారికల చిన్నకుమార్తె అక్షర హాసన్ (Akshara Haasan) ఇటీవలే అజిత్ సరసన “వివేగం” చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అంతకు ముందే ఆమె అమితాబ్ బచ్చన్, ధనుష్ నటించిన “షమితాబ్” అనే బాలీవుడ్ చిత్రంలో కూడా నటించింది.

ఇటీవలే ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్షర తన మదిలోని మాటలను బయట పెట్టింది. “తమ తల్లి దండ్రులు విడిపోతున్నారంటే ఏ పిల్లలకైనా బాధగానే ఉంటుంది కదా. ఆ సమయంలో నేను కూడా అలాగే ఫీలయ్యాను. ఈ ప్రపంచమే అంతమైపోయిందన్న భావనకలిగింది” అని తెలిపింది.

 

అయితే తమ తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నాక.. తనతో పాటు సోదరి శ్రుతిలో కూడా ఆత్మస్థైర్యం బాగా పెరిగిందని ఆమె పేర్కొంది. “మా అమ్మ, నాన్న విడిపోయాక తొలుత బాధపడ్డా.. ఆ తర్వాత కొన్ని వివాహాలు వర్కవుట్ అవ్వవనే విషయాన్ని తెలుసుకున్నాం. అందుకే ఆ విడాకుల సంఘటన తర్వాత మా జీవితంపై పెద్ద ప్రభావం చూపించలేదు” అని అక్షర అభిప్రాయపడింది.

“ఒక రకంగా చెప్పాలంటే మా అమ్మ, నాన్న విడాకులు తీసుకున్నాక.. వారిద్దరితో కలిసి గడపలేకపోతున్నామనే విషయం బాధ కలిగించింది. కానీ మేము ధైర్యంగా మా కాళ్ల మీద మేము నిలబడడానికి, క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి, జీవితాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకోవడానికి ఆ సంఘటన ఎంతగానో దోహదపడింది. ఒక రకంగా జీవితమంటే ఏంటో మేము తెలుసుకొనేలా చేసింది” అని అక్షర తెలిపింది.

 

1991లో కమల్, సారిక దంపతులకు చెన్నైలో జన్మించిన అక్షర ప్రస్తుతం ముంబయిలో తన తల్లితో కలిసి నివసిస్తోంది. ఆమె చిన్నతనం అంతా కూడా చెన్నైలోనే గడిచింది. లేడీ ఆండాళ్‌ పాఠశాలలో చదువుకున్న ఆమె ఆ తర్వాత.. ముంబయిలో బీకాన్ హైస్కూలులో.. తర్వాత బెంగళూరులోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూలులో చదువుకుంది.

2010లో అసిస్టెంటు డైరెక్టర్‌గా తన కెరీర్ ప్రారంభించిన అక్షర.. పలు పెద్ద సినిమాల్లో ఆఫర్లు వచ్చినా కాదనడం గమనార్హం. మణిరత్నం దర్శకత్వం వహించిన “కాదల్” చిత్రానికి తొలుత అక్షరనే కథానాయికగా అనుకున్నారట.

కానీ ఆమె ఆ ఆఫర్‌ని కావాలనే వదిలేశారట. తన తండ్రి లాగే స్వతహాగా హేతువాదినని చెప్పుకొనే అక్షర.. ఆ తర్వాత బౌద్ధ మతంలోకి మారినట్లు కూడా వార్తలు వచ్చాయి.

 

ప్రస్తుతం రాజేష్ సెల్వ దర్శకత్వం వహిస్తున్న “కడరం కొండన్” అనే తమిళ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది అక్షర. ఈ చిత్రంలో చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తుండగా.. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి స్వయాన కమల్ హాసనే సహ నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. అక్షర కమల్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న “శభాష్ నాయుడు” చిత్రానికి కూడా అసిస్టెంటు డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది.

ఇవి కూడా చదవండి

అంబానీ ఇంట పెళ్ళికి ఎవరెవరు వచ్చారో తెలుసా..?

కమల్ “భారతీయుడు” చిత్రానికి.. వెంకటేష్, రాజశేఖర్‌కి సంబంధమేమిటి..?

కమల్ హాసన్, అక్షయ్ కుమార్ బాటలోనే.. మాధవన్ కూడా..!

 

 

Read More From Entertainment