ఒకే ఒక్క కన్నుగీటుతో యావత్ భారతదేశం దృష్టిని తనవైపుకు తిప్పుకున్న అందాల భామ ప్రియ ప్రకాష్ వారియర్ (Priya Prakash Varrier). గతేడాది విడుదలైన ఒరు అదార్ లవ్ (Oru Adaar Love) అనే మలయాళ చిత్రానికి సంబంధించిన ఒక టీజర్ లో అందమైన, అద్భుతమైన అభినయంతో అందరినీ ఆకట్టుకుందీ చిన్నది. ఆ ఒక్క కన్నుగీటు ప్రియను ఎంతగా ఫేమస్ చేసిందో తెలుసా? ఆమె ఒక ప్రముఖ స్టార్ గా మారేంత! ఇక సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా?? ఇప్పటికీ ఆమెకు సంబంధించిన వార్త ఏదైనా వస్తే చాలు.. అది ట్రెండింగ్ టాపిక్స్ లో ఉండి తీరాల్సిందే!
వాస్తవానికి మలయాళంలో ప్రియ నటించిన ఓరు అదార్ లవ్ లో ఆమెది చిన్న పాత్ర మాత్రమే! కానీ ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చిన కారణంగా ఆమె పాత్ర నిడివిని కాస్త పెంచారట! అంతేకాదు.. ప్రియకు ఉన్న క్రేజ్ కారణంగా ఆ సినిమాకు కూడా విపరీతమైన పబ్లిసిటీ లభించింది. అందుకే ఇప్పుడు ఆమె అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో కూడా అనువదించాలని నిర్ణయించుకున్నారు. వచ్చే నెల ప్రేమికుల దినోత్సవం (Valentines Day) సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమాను ఆయా భాషల్లో విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ సినిమాకు లవర్స్ డే అని టైటిల్ పెట్టగా; కన్నడలో క్రేజీ లవ్ స్టోరీ అని పేరు పెట్టారు.
తెలుగులో అనువాదం అయిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం ఈరోజు (జనవరి 23) జరగనుంది. దీనికి ముఖ్యఅతిథిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హాజరు కానున్నారు. ఇప్పటికే ప్రియ ద్వారా విడుదలకు ముందే విపరీతమైన పబ్లిసిటీ సంపాదించుకున్న ఈ చిత్రానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరైతే ఈ చిత్రం దాదాపు తెలుగు ప్రజలందరికీ చేరువవుతుందని భావిస్తోందీ చిత్రబృందం. మరోవైపు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరైన చిత్రాలు సక్సెస్ సాధిస్తుండడంతో ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద తప్పకుండా హిట్ అవుతుందని నమ్ముతున్నారు. గతేడాది ఆయన ముఖ్యఅతిథిగా హాజరైన గీత గోవిందం (Geetha Govindam), ట్యాక్సీవాలా (Taxiwaala) & పడి పడి లేచే మనసు (Padi Padi Leche Manasu).. చిత్రాల్లో ఒకటి యావరేజ్ కాగా మరో రెండు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.
ఇక ఒరు అదార్ లవ్ సినిమా కథ విషయానికొస్తే ఓ హైస్కూల్లో యువ జంటల మధ్య సాగే ప్రేమకథగా దీనిని తెరకెక్కించారు. ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన నటీనటులంతా కొత్తవారే కావడం విశేషం. ప్రియ ప్రకాష్ వారియర్, రోషన్ అబ్దుల్ రహూఫ్, నూరిన్ షెరీఫ్, మిచెల్లీ ఆన్ డేనియల్.. తదితరులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ఒమర్ లులు ఈ సినిమాకు కథను అందించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు షాన్ రెహ్మాన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చగా అవి సంగీతాభిమానులను చక్కగా ఆకట్టుకుంటున్నాయట!
అల్లు అర్జున్ సెంటిమెంట్ ప్రియకు కలిసి వస్తుందా? ఒరు అదార్ లవ్ చిత్రబృందానికి హిట్ అందిస్తుందా?? తెలియాలంటే వచ్చే నెల సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే!
ఇవి కూడా చదవండి
మెగా ఫ్యామిలీ నుంచి వస్తోన్న మరో హీరో.. వైష్ణవ్ తేజ్..!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” హీరోయిన్ యజ్ఞ శెట్టి గురించి.. ఎవరికీ తెలియని విషయాలివే..!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సరసన… బాలీవుడ్ క్వీన్ కత్రినా కైఫ్ నటిస్తోందా..?
Read More From Entertainment
సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పక్కన.. ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ పూజా హెగ్డే
Sandeep Thatla