Food & Nightlife

హైదరాబాద్ ట్రెండ్స్ : ఈ హోటల్‌ యజమాని నుండి ఉద్యోగుల వరకూ.. అందరూ మహిళలే..!

Sandeep Thatla  |  Sep 10, 2019
హైదరాబాద్ ట్రెండ్స్ : ఈ హోటల్‌ యజమాని నుండి ఉద్యోగుల వరకూ.. అందరూ మహిళలే..!

మీరు హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో మహిళల యజమాన్యంలో నడిచే హోటల్స్ చూసుంటారు. అలాగే పురుషుల యాజమాన్యంలో.. మహిళలు పనిచేసే హోటల్స్‌ని కూడా చూసే ఉంటారు. అయితే ఇప్పుడు మేం చెప్పబోయే హోటల్ చాలా స్పెషల్. ఎందుకంటే ఈ హోటల్ నిర్వహణ బాధ్యతలు చూసే యజమాని నుండి.. ఆ హోటల్‌లో పనిచేసే  క్యాషియర్, సప్లయిర్స్, సర్వర్స్, చెఫ్స్ అందరూ కూడా మహిళలే. ఇటువంటి హోటల్ హైదరాబాద్ మహానగరంలోనే ప్రప్రథమంగా ప్రారంభమవ్వడం విశేషం. 

హైదరాబాద్ ట్రెండ్స్: భాగ్యనగరంలోని.. రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ పాయింట్స్ ఇవే..!

పూర్తి వివరాల్లోకి వెళితే, హిమబిందు అనే ఔత్సాహిక మహిళ.. గత కొద్ది కాలంగా మానసిక వైకల్యంతో బాధపడుతున్న మహిళల కోసం ఏదైనా చేయాలని భావిస్తున్నారు. వారి కోసం పలు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో  వారి చేతనే ఒక హోటల్‌ని ప్రారంభించాలని అనుకున్నారామె. ఆ ఆలోచనే కార్యరూపం దాల్చాక.. ఆనంద్ భవన్ (Anand Bhavan) అనే హోటల్‌కు అంకురార్పణ జరిగింది. హైదరాబాద్‌లోని సైనిక్ పురి (Sainikpuri) ప్రాంతంలో దీన్ని ప్రారంభించారు. అయితే మానసిక ఎదుగుదల లేని వారితో హోటల్‌ని నడిపించడం ఆమెకు సాధ్యపడలేదు. ఆ తరుణంలోనే హిమ బిందుకి మరొక ఆలోచన వచ్చింది.

ఆ ఆలోచనే ఇప్పుడు హైదరాబాద్‌లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. అదే పూర్తిగా మహిళల ఆధ్వర్యంలో నడిచే హోటల్. పేద మహిళలు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ స్వయం ఉపాధి కోసం ఎదురుచూసే మహిళలకు బాసటగా నిలిచేందుకు.. అటువంటి వారినే ఎంపిక చేసి వారి సహాయంతోనే హోటల్‌ని నడపడం మొదలుపెట్టారు.

గత ఏడాది మార్చిలో ఈ హోటల్‌ను ప్రారంభించగా..  మొదట్లో ఇది ఎక్కువ కాలం నడవదని అందరూ భావించారు. పురుషులు నడిపించేంత సమర్థంగా.. స్త్రీలు హోటల్ నడపడం అసాధ్యమని కూడా పలువురు విమర్శించారు. అవే విమర్శలను తిప్పికొడుతూ.. మహిళల సత్తాను చాటి మరీ ఈ హోటల్‌ని సమర్ధవంతంగా నడిపిస్తున్నారు హిమబిందు.

ఇక ఈ హోటల్‌‌కి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషిద్ధం. పార్సిల్ చేయాల్సి వస్తే కూడా పేపర్ బ్యాగ్స్‌లో లేదా కస్టమర్ ఇంటి నుండి తెచ్చుకున్న బాక్స్‌లో ఆహారాన్ని ప్యాక్ చేస్తారు. వంటకాల విషయానికి వస్తే – కడప కారం దోశ, ఉడిపి బెన్న దోస వంటి వివిధ స్పెషల్ ఐటమ్స్ ఇక్కడ మనకు లభిస్తాయి.

రామోజీ ఫిలిం సిటీని సందర్శించాలని భావిస్తున్నారా? అయితే మీకు ఈ వివరాలు తెలియాల్సిందే..!

ఈ హోటల్‌లో పనిచేస్తూనే.. చదువు మధ్యలోనే ఆపేసిన ఒక అమ్మాయి.. తిరిగి చదువుకోవడం ప్రారంభించింది. అలాగే పిల్లల స్కూల్ ఫీజులు కట్టడానికి కూడా ఇబ్బంది పడే ఓ మహిళ.. ఇప్పుడు చక్కగా వారిని చదివించుకుంటోంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే మహిళలకు ఈ హోటల్.. ఓ మంచి ఉపాధి కేంద్రంగా  మారిందనడంలో సందేహం లేదు.

ఇక ఈ హోటల్‌ని ప్రారంభించిన హిమబిందు వ్యక్తిగత జీవితానికి వస్తే..  ఆమె అంతకు క్రితమే ఓలా క్యాబ్స్ సంస్థలో చేరిన తొలి మహిళ డ్రైవర్‌గా రికార్డు సృష్టించారు. ఓలాలో ఒక సంవత్సరం పాటు సేవలందించాక.. మానసిక వైకల్యంతో బాధపడే మహిళలను వివిధ మార్గాల ద్వారా  చైతన్య పరిచే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం మహిళల సమస్యలు తీర్చడం కోసం.. ఓ హోటల్ సైతం ప్రారంభించారు.

హిమబిందుకి చేస్తున్న ఈ పనిలో ఆమె భర్త కూడా చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆమె మహిళలకు కుట్టుపని నేర్పించి.. వారు తయారుచేస్తున్న ఉత్పత్తులను “గ్రే అప్పారెల్’ అనే బట్టల దుకాణాల ద్వారా విక్రయిస్తున్నారు. వాటి ద్వారా కూడా ఎందరికో ఉపాధి కల్పిస్తున్నారు.

తెలుసుకున్నారుగా… మహిళల ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో నడుస్తున్న ‘ఆనంద్ భవన్’ హోటల్ గురించి. మరింకెందుకు ఆలస్యం.. సైనిక్ పురి వైపు వెళితే ఈ హోటల్‌ని సందర్శించడం మరువకండి.

హైదరాబాద్ హుసేన్ సాగర్‌లో.. మనమూ బోటు షికారు చేసేద్దామా..!

Featured Image: Google reviews

Read More From Food & Nightlife