హైదరాబాద్ హుసేన్ సాగర్‌లో.. మనమూ బోటు షికారు చేసేద్దామా..!

హైదరాబాద్ హుసేన్ సాగర్‌లో.. మనమూ బోటు షికారు చేసేద్దామా..!

హైదరాబాద్ నగరానికి పర్యాటక ప్రాంతంగా మంచి పేరుంది. దానికి తగ్గట్టుగానే ప్రతియేడు దేశ విదేశాల నుండి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగానే పెరుగుతూ వస్తోంది. అలా పెరగడానికి కారణం ఇక్కడున్న వాతావరణ పరిస్థితులతో పాటుగా పదుల సంఖ్యలో ఉన్న పర్యాటక ప్రదేశాలు కూడా కావడం విశేషం.


అయితే ప్రధానంగా హైదరాబాద్‌లో  (Hyderabad)  పర్యాటకులని  ఆకట్టుకునే ప్రదేశాలు ఇవే -


గోల్కొండ కోట, రామోజీ ఫిలిం సిటీ, బిర్లా మందిర్, లుంబిని పార్క్ , నెక్లెస్ రోడ్డు వంటివి అందరూ చూడదగ్గ ప్రదేశాలు. ఇక వీటితో పాటు నగరం నడిబొడ్డులో ఉన్న హుసేన్ సాగర్ (Hussain Sagar) పర్యాటకులనే కాకుండా భాగ్యనగరంలో ఉన్న వారిని కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది.


ఎందుకంటే సెలవు రోజుల్లో ఈ హుసేన్ సాగర్ దగ్గరున్న.. ట్యాంక్ బండ్ వద్దకు వచ్చి చాలామంది ఆహ్లాదంగా గడుపుతుంటారు. అలా గడిపేవారిని ఈ పరిసరాల్లో ప్రత్యేకంగా ఆకర్షించేది  బోటు ప్రయాణం.  దీనిని దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం... పర్యాటక శాఖ సహకారంతో ఒక కొత్త ఆలోచనకి రూపకల్పన చేసింది.


ఆ రూపకల్పనలో భాగంగా హుసేన్ సాగర్‌లో ఒక పెద్ద క్రూజర్ (బోటు) (Cruiser) పై షికారు చేసే సదుపాయాన్ని కల్పించింది. కొంతకాలం వరకు ఇక్కడ చిన్న పడవలు, పెడల్ బోట్స్ & మోటార్ బోట్స్ సదుపాయం ఉండగా..  ఈ పెద్ద క్రూజర్ సదుపాయాన్ని ఇటీవలే ప్రజలకి అందుబాటులోకి తెచ్చారు.


అలా తేవడమే కాకుండా ఈ పెద్ద బోట్లలో చిన్న చిన్న వేడుకలు, పార్టీలు చేసుకునే వీలును కూడా కల్పించారు. ఈ సదుపాయం అందుబాటులోకి రావడంతో, చాలామంది తమ ఫ్యామిలీ ఫంక్షన్లను, ఆఫీస్ పార్టీలను ఇందులో చేసుకునేందుకు మొగ్గు చూపిస్తున్నారు.


cruiser-1


చుట్టూ నీరు.. పైగా నగరం మధ్యలో ఉండడంతో.. హుసేన్ సాగర్‌కు ఒక ప్రత్యేకమైన వ్యూ ఏర్పడింది. అలాగే పర్యాటకులు హుసేన్ సాగర్ మధ్యలో ఉన్న 18 మీటర్ల ఎత్తు గల బుద్ధ విగ్రహం చుట్టూ తిరుగుతూ గొప్ప అనుభూతిని కూడా పొందవచ్చు. 


ఇక్కడ పెద్ద క్రూజర్‌ని బుక్ చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వపు పర్యాటక శాఖ అధికారిక వెబ్ సైట్‌లో వివరాలు ఉంచడం జరిగింది. 


హుసేన్ సాగర్ వద్ద ప్రస్తుతం రెండు పడవలు ప్రజలకి అందుబాటులో ఉన్నాయి.


అందులో ఒకదాని పేరు ఖైర్-ఉన్-నిస్సా (Khair-Un-Nissa). ఈ పడవలో దాదాపు 100 మంది ప్రయాణించే సౌలభ్యం ఉండగా.. దీనిని 2 గంటల సమయం వరకు బుక్ చేసుకోవచ్చు. 


ఈ ఛార్జీలు ఉదయం సమయం అయితే రూ 8000/- వరకూ ఉంటాయి. అలాగే రాత్రి వేళలో అయితే రూ 15000/ చెల్లించాలి. అయితే మనం బుక్ చేసుకున్న సమయం కన్నా ఎక్కువ సేపు.. మనం పడవలో ప్రయాణం చేసినట్లయితే పెనాల్టీ క్రింద మరో రూ 2500/- చెల్లించాల్సి ఉంటుంది.


hyderabad-cruiser


ఇలాంటి మరో పడవ పేరు - భాగమతి (Bhagamathi). దీనిలో 80 మంది వరకు ప్రయాణం చేయవచ్చు. అదే సమయంలో దీనిని రెండు గంటల పాటు బుక్ చేసుకోవడానికి రూ 6000/- చెల్లించాల్సి ఉండగా.. అదే రాత్రి వేళ అయితే రూ 10000/- చెల్లించాలి. అనుకున్న సమయం కన్నా ఎక్కువ సేపు ప్రయాణిస్తే.. రూ 2500/- పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది.


బోటు ప్రయాణం వేళలు- ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు


రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు.


ఇక ఈ రెండు పడవల్లో లోయర్ (క్రింద) డెక్‌లో ఏసీ సదుపాయం ఉండగా.. ఓపెన్ (పైన) డెక్‌లో మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. వారాంతాలతో పాటుగా సెలవు దినాల్లో.. అలాగే వేసవి సెలవుల్లో ఈ బోటు షికారు కోసం వందల సంఖ్యలో ప్రజలు తరలివస్తుంటారు.


మరింకెందుకు ఆలస్యం... మీరు కూడా మీ బంధువులు, స్నేహితులు లేదా ప్రియమైన వారికి హుసేన్ సాగర్ పైకి పడవలో షికారుకి తీసుకెళ్ళి ఒక మంచి అనుభూతినిచ్చే ప్రయత్నం చేయండి.


ఇది మీకు తెలుసా? - హుసేన్ సాగర్ చెరువుకి ఈ పేరు ఎలా వచ్చిందంటే.. 1562లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఈ చెరువుని నిర్మించినప్పటికీ కూడా.. ఆయన బావమరిది హుస్సెన్ షా వలీ ఈ చెరువు నిర్మాణ కార్యక్రమాలని పర్యవేక్షించారట. దాంతో ఆయన పేరిటనే ఈ చెరువు ప్రాచుర్యంలోకి రాగా.. చివరికి ఇది హుసేన్ సాగర్‌గా పేరుగాంచింది. 


Images: telangana.gov.in


ఇవి కూడా చదవండి


హైదరాబాద్ మెట్రో వేదికగా.. మహిళల కోసం "తరుణి ఫెయిర్"..!


హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు పండగే.. హైటెక్ సిటీ మెట్రో లైన్ వచ్చేసింది..!


హైదరాబాద్ కీ షాన్.. సూపర్ టాలెంట్ ఈ క్రీడాకారిణుల సొంతం