Lifestyle

మీకో విషయం తెలుసా? లిప్‌స్టిక్ తయారీకి.. కావాల్సిన సీడ్స్ లభించేది ఆంధ్రాలోనే..!

Lakshmi Sudha  |  Apr 15, 2019
మీకో విషయం తెలుసా? లిప్‌స్టిక్ తయారీకి.. కావాల్సిన సీడ్స్ లభించేది ఆంధ్రాలోనే..!

మోడ్రన్ వనితల జీవనశైలిలో లిప్‌స్టిక్ ఒక భాగం. ఎన్నో రంగులు, భిన్నమైన ఫ్లేవర్స్‌తో కూడిన లిప్‌స్టిక్స్ మనకు ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వాటితో తమ అధరాలకు మరిన్ని సొబగులద్దుకుంటున్నారు నేటి తరం అమ్మాయిలు. మరి, ఆ లిప్‌స్టిక్ తయారు చేయడానికి మూల పదార్థం ఏంటో తెలుసా? అన్నాట్టో గింజలు లేదా లిప్‌స్టిక్ సీడ్స్(lipstick seeds). ఇవి ఎక్కడ పండుతున్నాయో తెలుసా?

మన ఆంధ్రప్రదేశ్‌లోని రంపచోడవరం, చాపరాయి, మారేడుమిల్లి వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఇవి పండుతున్నాయి. విదేశాల్లో అరకు కాఫీ ఎంత ఫేమస్సో.. ఈ లిప్‌స్టిక్ సీడ్స్ కూడా అంతే ఫేమస్. ఆంధ్రప్రదేశ్‌లో ఆదీవాసీల చేతుల మీదుగా పెరుగుతోన్న ఈ లిప్‌స్టిక్ సీడ్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకొందాం.

లిప్‌స్టిక్ సీడ్స్ లేదా అన్నాట్టో సీడ్స్ అని సాధారణంగా పిలిచే ఈ పంటను సాగుచేసే రైతులు మాత్రం జబ్రా పంట అని పిలుస్తారు. ఏడాదికి మూడు సార్లు దిగుబడినిచ్చే ఈ పంట ఏజెన్సీ రైతుల పాలిట కల్పతరువుగా మారింది. ఈ విత్తనాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. విత్తనాలను కొన్నిసార్లు వస్తుమార్పిడి పద్ధతిలో ఉపయోగిస్తారు. జబ్రా విత్తనాలకు బదులుగా బట్టలు, సౌందర్యసాధనాలు వంటి వాటిని తీసుకొంటారు.

లిప్‌స్టిక్ సీడ్స్‌లో ఎన్నో పోషకాలుంటాయి. దీనిలో క్యాల్షియం, ఐరన్, విటమిన్ బీ 2, క్యాల్షియం, పాస్ఫేట్, ఫైటోకెమికల్స్ ఉంటాయి.

1. సహజమైన రంగు కోసం..

జబ్రా విత్తనాలు ఎరుపు రంగులో ఉంటాయి. వీటికున్న సహజసిద్ధమైన రంగు కారణంగా వీటిని కొన్ని రకాల ఆహార పదార్థాల తయారీలో ఎరుపు రంగు కోసం ఉపయోగిస్తారు. ముఖ్యంగా స్వీట్లు, బేకరీ ఉత్పత్తుల్లో వీటిని ఉపయోగిస్తారు. ముఖ్యంగా జమైకా, కరీబియన్, లాటిన్ అమెరికా దేశాల్లో ఆహారపదార్థాలకు ప్రత్యేకమైన రుచి, పరిమళం, రంగు అందించడానికి ఈ గింజలను ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో మాంసం మారినేట్ చేయడానికి జబ్రా గింజలను ఉపయోగిస్తారు.

2. తలనొప్పి తగ్గడానికి..

తలనొప్పి వచ్చినప్పుడు మనం యూకలిప్టస్ ఆయిల్ ఉపయోగిస్తాం. అవి అందుబాటులో లేకపోతే యూకలిప్టస్ ఆకులు వాడతాం. దీని మాదిరిగానే జబ్రా ఆకులు సైతం తలనొప్పిని సమర్థంగా తగ్గిస్తాయి. దీని కోసం జబ్రా ఆకులను మెత్తగా చేసి కొబ్బరి నూనెలో కలిపి నుదుటికి రాసుకొంటే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

3. కాస్మెటిక్స్ తయారీకి..

లిప్‌స్టిక్ సీడ్స్‌లో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇవి చర్మానికి మేలు చేస్తాయి. అందుకే వీటిని కాస్మొటిక్స్‌‌లో ఉపయోగిస్తారు. అయితే దీన్ని సౌందర్య ఉత్పత్తుల్లో మాత్రమే కాదు.. నేరుగానూ చర్మంపై ఉపయోగించవచ్చు. ఈ గింజలు చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడతాయి. లిప్‌స్టిక్ సీడ్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీరాడికల్స్, టాక్సిన్లను తొలగించి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. సూర్యరశ్మి ప్రభావానికి గురైన చర్మానికి తిరిగి జీవం పోస్తాయి.

4. ఎముకలను బలంగా మారుస్తాయి

అన్నాట్టో సీడ్స్‌లో క్యాల్షియం పుష్కలంగా లభిస్తుంది. దీన్ని ఆహారంగా తీసుకోవడం ద్వారా ఎముకలు బలంగా తయారవుతాయి. ఆస్టియోపొరోసిస్, ఆస్టియోమలాసియా వంటి ఎముకలకు సంబంధించిన వ్యాధులతో బాధపడేవారు జబ్రా సీడ్స్ ఆహారంగా తీసుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

5. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది

జబ్రా గింజల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఫలితంగా మలబద్ధకం సమస్య తగ్గుముఖం పడుతుంది. అంతేకాదు.. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది. బ్లడ్ షుగర్ స్థాయిని సమతుల్యం చేస్తుంది. బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు లిప్‌స్టిక్ సీడ్స్‌ను ఆహారంగా తీసుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది. కడుపు నొప్పితో బాధపడేవారు ఈ గింజలతో తయారుచేసిన హెర్బల్ టీ తాగితే.. సమస్య తగ్గుముఖం పడుతుంది. కిడ్నీల ఆరోగ్యాన్ని సైతం ఇవి మెరుగుపరుస్తాయి.

ఇన్ని ప్రయోజనాలున్న లిప్‌స్టిక్ సీడ్స్ వల్ల కొన్ని రకాల అలర్జీలు వచ్చే అవకాశం సైతం ఉంది. ముఖ్యంగా గర్భిణీలు, వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు వీటికి దూరంగా ఉండటం మంచిది.

చూశారా.. మన ఆంధ్రప్రదేశ్‌లో పండుతోన్న జబ్రా గింజల వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతున్నాయో. ఎప్పుడైనా.. ఏజెన్సీ ప్రాంతానికి టూర్‌కి వెళ్లినప్పుడు లేదా ఆ ప్రాంతం మీదుగా వెళుతున్నప్పుడు అక్కడ రైతుల నుంచి వీటిని కొనుగోలు చేయండి. కేజీకి 100 రూపాయల వరకు తీసుకొంటారు. ఇలా చేయడం వల్ల మీరు ఆ రైతులకు సాయం చేసినవారవడంతో పాటు వాటిని ఉపయోగించడం వల్ల మనమూ ప్రయోజనాలను పొందగలుగుతాం.

Images: Shutterstock

ఇవి కూడా చదవండి

సహోద్యోగులా..? శాడిస్టులా..? లైంగిక వేధింపులకు నిండు ప్రాణం బలి

పని కావాలంటే.. గర్భసంచి తొలగించుకోవాల్సిందే: మహారాష్ట్రలో భూస్వాముల ఆకృత్యాలు..!

మహిళలకు కోపం తెప్పించిన మ్యానిఫెస్టో.. వ్యాకరణ దోషాలతో వచ్చిన చిక్కు..!

Read More From Lifestyle