Celebrity gossip

ప్రపంచంలో ఆ ఘనత సాధించిన సినిమా ‘బాహుబలి – ది బిగినింగ్’ ఒక్కటే..

Soujanya Gangam  |  Oct 21, 2019
ప్రపంచంలో ఆ ఘనత సాధించిన సినిమా ‘బాహుబలి – ది బిగినింగ్’ ఒక్కటే..

బాహుబలి (bahubali).. దర్శక ధీరుడు, జక్కన ఎస్ ఎస్ రాజమౌళి (rajamouli) దర్శకత్వంలో రూపొందిన అద్భుత చిత్ర రాజం ఇది. మన భారతీయ సినిమా సత్తాని ప్రపంచానికి చాటిన ఈ చిత్రం మన దేశంలో ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా మారింది. మన దేశంలో రూపొందిన ఈ అత్యద్భుతమైన చిత్రం తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా స్థాయికి చేర్చిందంటే అతిశయోక్తి కాదు. బాహుబలి తర్వాతే చాలామంది హీరోలు పాన్ ఇండియా సినిమాలు ఒప్పుకుంటున్నారు. దర్శకులు తమ చిత్రాలను వివిధ భాషల్లో రూపొందించడం లేదా డబ్బింగ్ చేసి విడుదల చేయడం వంటివి చేస్తున్నారు.

ఇవే కాదు. బాహుబలి ఖాతాలో ఇప్పటికే ఎన్నో రికార్డులు.. మరెన్నో అవార్డులు కూడా ఉన్నాయి. వీటితో పాటు ఇప్పుడు మరో రికార్డును కూడా సాధించిందీ చిత్రం..లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ (royal albert hall) ..1871 లో ప్రారంభమైన ఈ హాల్ లో ఇప్పటివరకూ ఇంగ్లిష్ తప్ప మరే ఇతర భాషలకు చెందిన సినిమాలు ప్రదర్శితం కాలేదు. అయితే ఈ ఆదివారం ఆ హాల్ లో బాహుబలి చిత్రం ప్రదర్శించారు. ఇలా 148 సంవత్సరాల నుంచి ప్రపంచంలోని ఏ భాషకి చెందిన సినిమా కూడా సాధించలేని ఘనతను బాహుబలి సొంతం చేసుకుంది. మొత్తం 5267 మంది కూర్చునే వీలున్న ఈ హాల్ బాహుబలి సినిమా షో జరుగుతున్న సమయంలో కిక్కరిసిపోయింది. వీరంతా సినిమా పూర్తయిన తర్వాత లేచి నిలబడి గౌరవ వందనం (స్టాండింగ్ ఒవేషన్) అందించడం విశేషం.

ఈ సందర్భంగా సినిమా హీరో హీరోయిన్లు ప్రభాస్, అనుష్క, విలన్ రానా దగ్గుబాటి తో పాటు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, శోభు యార్లగడ్డ హాజరయ్యారు. సినిమా ప్రదర్శనకు ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో విలేకరులు, అక్కడికి హాజరైన వారి ప్రశ్నలకు సమాధానమిచ్చిందీ చిత్ర యూనిట్. ఆ తర్వాత సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి నేతృత్వంలో నేపథ్య సంగీత ప్రదర్శనని ఏర్పాటు చేశారు. ఇది కూడా అక్కడున్నవారిని ఎంతగానో ఆకట్టుకుంది. లండన్ వెళ్లిన ఈ సినిమా యూనిట్ కలిసి ఫొటోలు దిగుతూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. తమ ఈ కలయికను రాయల్ రీ యూనియన్ గా అభివర్ణించారు దర్శకుడు రాజమౌళి. సినిమా ప్రదర్శన సందర్భంగా ఆయన పంచెకట్టులో కనిపించడం విశేషం.

ఈ సందర్భంగా బాహుబలి సినిమా అభిమానులతో పాటు తెలుగు సినిమాకి సంబంధించి ఎందరో బాహుబలి సాధించిన ఈ ఘనతను మెచ్చుకుంటూ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సినిమా ప్రదర్శనకు ముందు, ఆ తర్వాత సినిమా యూనిట్ తో ఫొటోలు దిగేందుకు కేవలం భారతీయులు మాత్రమే కాదు.. ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఆసక్తి చూపించడం ఆయనకు ఆయా దేశాల్లో ఉన్న అభిమానాన్ని తెలియజేస్తోంది.

టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో రానా దగ్గుబాటి విలన్ గా కనిపించారు. అనుష్క, తమన్నా ఇందులో కథానాయికలుగా కనిపించగా.. రమ్య క్రిష్ణ, నాజర్, సత్యరాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకి శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు నిర్మాతలుగా వ్యవహరించారు. కీరవాణి సంగీత దర్శకత్వం లో విడుదలైన ఈ చిత్రం సంగీత పరంగా కూడా ఎంతో ఆకట్టుకుంది. 1810 కోట్ల వసూళ్లు సాధించిన బాహుబలి 2 సినిమా మన దేశంలో దంగల్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన 50 సినిమాల్లో ఒకటిగా మారింది. బాహుబలి ద బిగినింగ్ సినిమా కూడా 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

 

Read More From Celebrity gossip