Beauty

మహా ఔషధ గుణాలు కలిగిన.. ఆరోగ్య సంజీవని “మెంతులు” – (Benefits Of Fenugreek Seeds (Methi) In Telugu)

Lakshmi Sudha  |  Mar 11, 2019
మహా ఔషధ గుణాలు కలిగిన.. ఆరోగ్య సంజీవని “మెంతులు” – (Benefits Of Fenugreek Seeds (Methi) In Telugu)

ఇంట్లో చారు పెట్టాలంటే తాలింపులో కచ్చితంగా మెంతులు(Fenugreek seeds) ఉండాల్సిందే..! కొన్ని రకాల కూరలు వండినప్పుడు సైతం మెంతులను పోపు పెట్టడానికి ఉపయోగిస్తారు. మెంతులు వంటలకు ప్రత్యేకమైన ఫ్లేవర్, రుచిని అందిస్తాయి. కాస్త చేదుగా ఉండే మెంతుల వల్ల ఆరోగ్యపరంగా, సౌందర్యపరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయి.

వీటిలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలున్నాయి. మెంతులకు ఉన్న వైద్యపరమైన గుణాల వల్ల ఆయుర్వేదంలో వీటికి ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించారు. మెంతుల గురించి తెలుసుకోవాల్సింది ఇంతేనా? కాదు.. ఇంకా ఎంతో ఉంది. ఇంకెందుకాలస్యం.. మెంతుల వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకొందాం..

మెంతులు వల్ల కలిగే ప్రయోజనాలు

మెంతులను ఆహారంలో ఎలా భాగం చేసుకోవాలంటే..

మెంతుల వల్ల కలిగే దుష్ప్రయోజనాలు

 

తరచూ అడిగే ప్రశ్నలు

మెంతులు వల్ల కలిగే ప్రయోజనాలు (Benefits Of Fenugreek Seeds)

పోపుల డబ్బాలో మెంతులది ప్రత్యేకమైన స్థానం. దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. శరీరానికి అవసరమైన ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. అలాగే పీచుపదార్థం, ఐరన్, మాంగనీస్, కాపర్, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ బి6 పుష్కలంగా ఉంటాయి. మధుమేహాన్ని తగ్గించే గుణాలు మెంతుల్లో ఉన్నాయి. అంతేకాదు మెంతులు (fenugreek seed) కాలేయ పనితీరును, జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి. చూశారా? మనకు తెలియకుండానే మెంతుల వల్ల ఎన్ని ప్రయోజనాలు పొందుతున్నామో? మెంతులు మాత్రమే కాదు.. మెంతికూరలో కూడా ఇవే పోషకాలుంటాయి. అందుకే వీటిని కూడా మన ఆహారంలో భాగం చేసుకొంటున్నాం.

సాధారణంగా సౌందర్య ఉత్పత్తులు, సబ్బుల్లో మెంతులు నుంచి తీసిన extracts ఉపయోగిస్తారు. తాజా మెంతికూర, ఎండబెట్టిన మెంతికూరను వైద్యపరమైన అవసరాల కోసం ఉపయోగిస్తారు.  మెంతులను మసాలా దినుసుగా వాడతారు. మెంతులను పొడిగా చేసి నిల్వ పచ్చళ్లు పెట్టడానికి ఉపయోగిస్తారు. కూరలకు ప్రత్యేకమైన రుచి, సువాసన అందించడానికి మెంతులు ఉపయోగిస్తాం. మెంతులు కాస్త చేదుగా ఉంటాయి. ఆ చేదును తగ్గించడానికి వాటిని వేయిస్తారు.

ఆరోగ్యానికి సోంపు (Benefits Of Fennel Seeds For Health)

మెంతుల వల్ల కురులకు కలిగే ప్రయోజనాలు (Benefits Of Fenugreek Seeds For Hair)

1. ఇటీవలి కాలంలో అందరికీ చిన్న వయసులోనే జుట్టుగా తెల్లగా మారిపోతుంది. మెంతులు ఉపయోగించడం వల్ల ఈ సమస్య రాదు.

2. మెంతుల్లో ఉండే కొన్ని రకాల మినరల్స్, విటమిన్స్, యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రు సమస్యను తగ్గిస్తాయి. మెంతులు స్కాల్ఫ్ ను మాయిశ్చరైజ్ చేస్తాయి. ఈ ఫలితాన్ని పొందాలంటే మెంతులను పొడి చేసి వేణ్నీళ్లలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడపోయాలి. తలస్నానం చేసే ముందు ఈ నీటితో తలను తడుపుకొని మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గుముఖం పడుతుంది.

3. మెంతుల్లో జుట్టు రాలే సమస్యను తగ్గించే నికోటినిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జుట్టును బలంగా మారుస్తుంది. కొబ్బరి నూనెలో మెంతులు వేసి ఆ నూనెను రోజూ తలకు రాసుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది. దీన్నిఉపయోగిస్తే జుట్టు రాలే సమస్య తగ్గుముఖం పడుతుంది. ఇది కుదుళ్లను బలంగా మారుస్తుంది. అయితే ఈ మిశ్రమాన్ని ఎలా తయారుచేసుకోవాలి?

ఒక గ్లాస్ జార్ లో గుప్పెడు మెంతులు, గిన్నెడు కొబ్బరి నూనె వేసి నెల రోజుల పాటు సూర్యరశ్మి తగలకుండా నిల్వ ఉంచాలి. నెల రోజుల తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టి.. ఈ నూనెతో వారానికోసారి తలను మర్దన చేసుకొంటే కుదుళ్లు బలంగా తయారై జుట్టు రాలే సమస్య తగ్గుముఖం పడుతుంది.

4. మెంతులతో తయారుచేసిన హెయిర్ మాస్క్ వేసుకోవడం ద్వారా కురులు పట్టులా అందంగా మెరిసిపోతాయి. దాని కోసం మెంతులను గోరువెచ్చని నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం మెంతులను మెత్తని పేస్ట్ లా తయారుచేసి కుదుళ్ల నుంచి చివరి వరకు అప్లై చేసుకొని 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది.

Also Read: మీ కురులు ప‌ట్టులా మెరిసిపోవాలా?? ఇంట్లోనే హెయిర్ స్పా ట్రీట్మెంట్ చేసుకుంటే స‌రి..!

చర్మానికి మెంతులు చేసే మేలు (Benefits Of Fenugreek Seeds For Skin)

1. మెంతులు (fenugreek seeds) చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడం మాత్రమే కాకుండా.. ఫంగల్ ఇన్ఫెక్షన్లు, మొటిమలు రాకుండా చేస్తాయి. మెంతుల్లో ఉండే యాంటీ ఇనఫ్లమేటీరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మం ఆరోగ్యాన్ని కాపాడతాయి. మెంతులతో వేసే ఫేస్ మాస్క్ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి డ్రైగా మారకుండా కాపాడుతుంది. మెంతులను నీటిలో కలిపి మెత్తటి పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేసుకొని అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్ మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను చర్మంపై పెరగకుండా చేస్తుంది. చర్మాన్ని సైతం మాయిశ్చరైజ్ చేస్తుంది.

2. మెంతులతో తయారుచేసిన టోనర్ ఉపయోగించడం వల్ల చర్మం ఆరోగ్యంగా మారుతుంది. దీని కోసం మరుగుతున్న నీటిలో మెంతులు వేసి పావుగంట సమయం వేడి చేయాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బాటిల్ లో పోసి ఫ్రిజ్ లో స్టోర్ చేయాలి. దీన్ని టోనర్ గా రోజూ ఉపయోగిస్తే.. మంచి ఫలితం కనిపిస్తుంది.

3. పెరుగు, మెంతుల మిశ్రమంతో తయారుచేసిన ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా చర్మం ముడతలు పడకుండా, గీతలు ఏర్పడకుండా ఉంటాయి. మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నానిన మెంతులను చెంచా పెరుగుతో కలిపి మెత్తటి పేస్ట్ లా తయారుచేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసుకొని పావుగంట నుంచి ఇరవై నిమిషాలు ఆరనిచ్చి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు వేసుకోవడం ద్వారా ముఖంపై వచ్చిన సన్నని గీతలు తగ్గుముఖం పడతాయి.

4. ఫేస్ ప్యాక్, హెయిర్ ప్యాక్ కోసం మెంతులు నానబెట్టిన నీటిని టోనర్ గా ఉపయోగించవచ్చు. ఈ నీటిని స్ప్రే బాటిల్లో వేసి టోనర్ గా ఉపయోగించుకోవచ్చు.

5. చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేసుకోవడానికి రసాయనాలతో తయారైన స్క్రబ్స్ కి బదులుగా మెంతులు ఉపయోగించవచ్చు. నానబెట్టిన మెంతులను పేస్ట్ చేసి స్క్రబ్ గా చర్మానికి రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న మృత‌క‌ణాలు తొలగిపోతాయి. 

6. కళ్ల కింద ఏర్పడిన నల్లటి వలయాలను తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ఐక్రీంలు ఉపయోగించి ఉంటాం. అయినా పెద్దగా ప్రయోజనమేమీ కనిపించదు. అయితే దీని కోసం మెంతులు ఉపయోగిస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది. దీనిలో ఉన్న విటమిన్ కె, విటమిన్ సి డార్క్ సర్కిల్స్ తో పాటు మొటిమలను సైతం తగ్గిస్తుంది. దీని కోసం రెండు స్పూన్ల మెంతులు తీసుకొని రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం వాటిని పాలతో కలిపి మెత్తని పేస్ట్ లా తయారుచేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసుకొని ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది.

Also Read: క‌ళ్ల కింది న‌ల్ల‌టి వ‌ల‌యాల‌ను.. రెడ్ లిప్ స్టిక్‌తో క‌వర్ చేసేద్దాం..!

మెంతుల వల్ల కలిగే ఆరోగ్యపరమైన ప్రయోజనాలు (Health Benefits Of Fenugreek Seeds)

1. మెంతులు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. దీనిలో ఉన్న ఫ్లేవనాయిడ్స్ శరీరంలో లిపిడ్ స్థాయిలు తగ్గిస్తాయి.

2. మెంతుల్లో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఆర్థరైటిస్ తో బాధపడుతున్న వారికి కీళ్ల నొప్పులు తగ్గించి ఉపశమనాన్ని అందిస్తాయి.

3. అల్సర్, అజీర్తి సమస్యలతో బాధపడేవారికి మెంతులు చక్కటి పరిష్కారం అందిస్తాయి.

4. మెంతులు శరీరంలో మెటబాలిజం ప్రక్రియను మెరుగు పరుస్తాయి.  ఫలితంగా శరీరంలో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. టీస్పూన్ మెంతులను గ్లాసు వేడి నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే బరువు క్రమంగా తగ్గుతుంది. పైగా ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది.

5. మూత్రపిండాలు, కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే మెంతులను ఆహారంలో భాగంగా చేసుకోవాల్సిందే. ఆల్కహాల్ ప్రభావం వల్ల దెబ్బతిన్న కాలేయం పనితీరును మెంతులు మెరుగుపరుస్తాయి. మూత్రపిండాల్లోని కణాలు క్షీణించకుండా మెంతులు కాపాడతాయి.

6. పీరియడ్స్ సమయంలో వచ్చే తలనొప్పి, వికారం, ఇతర సమస్యలను మెంతులు తగ్గిస్తాయి. దీని కోసం మెంతులను పొడిగా చేసి కొద్దిగా నీటిలో కలిపి తీసుకొంటే సరిపోతుంది.

7. బిడ్డను ప్రసవించిన తర్వాత కొంతమంది బాలింతలు పాలు రాక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారు మెంతులను ఆహారంలో భాగంగా చేసుకొంటే.. పాలు బాగా పడతాయి. దీనిలో ఉన్న ఫైటోఈస్ట్రోజెన్ రొమ్ముపాలు పెంచడంతో పాటు బిడ్డ బరువు పెరిగేలా చేస్తుంది.

8. మెంతుల నుంచి తీసిన నూనెలో క్యాన్సర్ ను తగ్గించే గుణాలుంటాయి.

9. బ్లడ్ షుగర్ తో బాధపడేవారు మెంతులను ఆహారంగా తీసుకొంటే.. రక్తంలో ఇన్సులిన్ స్థాయులు తగ్గుముఖం పడతాయి. ఫలితంగా మధుమేహం అదుపులోకి వస్తుంది.

10. మెంతులు గుండె ఆరోగ్యాన్ని, పనితీరుని మెరుగుపరుస్తాయి.

11. మెదడు పనితీరుని మెంతులు మెరుగుపరుస్తాయి. పార్కిన్సన్, అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి.

12. జీర్ణ సంబంధమైన సమస్యలతో బాధపడేవారు సులభంగా ఆహారం జీర్ణం చేసుకోవడానికి మెంతులు ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.

13. తరచూ దగ్గుతో బాధపడేవారికి మెంతులు చక్కటి పరిష్కారం అందిస్తాయి. 

Also Read: 30 రోజుల పాటు షుగర్‌కి దూరంగా ఉంటే.. ఏం జరుగుతుందో తెలుసా?

మెంతులను ఆహారంలో ఎలా భాగం చేసుకోవాలంటే.. (How To Use Fenugreek Seeds)

1. తెలుగు వంటకాల్లో మెంతులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది వంటకాలకు ప్రత్యేకమైన ఫ్లేవర్ ను జోడిస్తుంది. అందుకే దీన్ని తాలింపుల్లో కచ్చితంగా వేస్తారు. అలాగే మెంతులను రెండు నిమిషాల పాటు నూనె లేకుండా వేయించాలి. ఇలా వేయించిన వాటిని టీస్పూన్ చొప్పున కూరల్లో, సలాడ్స్ లో, వేపుళ్లలో భాగం చేసుకోవచ్చు.

2. గ్లాసు నీళ్లలో రెండు టీస్పూన్ల మెంతులు వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే మెంతులను వేరు చేసి నీటిని తాగాలి. రోజూ ఇలా చేయడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది.

3. ఆరోగ్యకరంగా ఉంటూనే సలాడ్ ను మరింత టేస్టీగా మార్చేస్తాయి మొలకెత్తిన మెంతులు. దీని కోసం గిన్నెలో కొన్ని మెంతులు వేసి నానబెట్టాలి. ఈ గిన్నెపై శుభ్రమైన వస్త్రాన్ని మూతగా వేయాలి. కొన్ని రోజుల తర్వాత ఇవి మొలకలుగా మారతాయి. వీటిని మీ సలాడ్స్ లో భాగంగా చేసుకొంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.

4. గోధుమ పిండిలో మెంతుల పేస్ట్ లేదా మెంతికూర ఆకులను కలిపి చపాతీ, పరోటాగా వేసుకొని తింటే రుచిగా ఉంటాయి.

5. మీకు టీ తాగడం బాగా ఇష్టమైతే.. మీరు కచ్చితంగా మెంతులతో తయారుచేసిన హెర్బల్ టీ తాగాల్సిందే. మెంతులు వేసి మరగబెట్టిన నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే జ్వరం తగ్గుముఖం పడుతుంది.

మెంతుల వల్ల కలిగే దుష్ప్రయోజనాలు (Side Effects Of Fenugreek Seeds)

అంతర్గత రక్తస్రావం: మెంతులను అవసరమైన మోతాదు కంటే అధికంగా ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల హార్మోన్ల విడుదలలో మార్పులు జరిగి అంతర్గత రక్తస్రావం జరిగే అవకాశం ఉంది.

శరీరం నుంచి దుర్వాసన: మెంతులను అతిగా ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ లో ఇది కూడా ఒకటి. శరీరం నుంచి మాత్రమ కాదు.. మూత్రం కూడా దుర్వాసన వస్తుంది.

విరేచనాలు(Diarrhea): మెంతుల కారణంగా కొందరిలో అజీర్తి సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, కడుపులో మంట, పొట్ట బిగపట్టినట్టుగా ఉండటం, గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి. మరికొందరిలో లూజ్ మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది.

అలర్జీలు, దురదలు( Allergies & Irritation): వేరుశెనగలు, బఠాణీలు తిన్నప్పుడు కొందరిలో స్కిన్ అలర్జీలు ఎలా తలెత్తుతాయో.. మెంతులు పడని వారికి సైతం ఇలాంటి సమస్యలే తలెత్తుతాయి. చర్మం దురదలు రావ‌డం, మంట, ఎర్రటి పొక్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎలర్జీలు ఉన్నవారు మెంతులను ఆహారంలో భాగంగా తీసుకోకపోవడమే మంచిది.

తరచూ అడిగే ప్రశ్నలు (FAQ’s)

1. బాలింతలు మెంతులు ఆహారంగా తీసుకోవడం వల్ల నిజంగానే పాలు పడతాయా?

పూర్వకాలం నుంచి బాలింతలకు పెట్టే ఆహారంలో మెంతులను భాగం చేయడం మన భారతీయ సంప్రదాయంలో భాగంగా వస్తోంది. దీనిలో ఉండే ఫైటో ఈస్ట్రోజెన్స్ పాల ఉత్పత్తిని పెంచుతాయి. పాలిచ్చే తల్లులు రోజుకి ఆరు గ్రాముల వరకు మెంతులు తీసుకోవడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది. కాకపోతే కొందరిలో దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తే అవకాశం ఉంది. శరీరం నుంచి ఒకరకమైన వాసన రావడం, విరేచనాలు అవడం, హైపోగ్లైసీమియా వంటి సమస్యలు ఎదురవడం వంటివి జరుగుతాయి.

2. గర్భంతో ఉన్నవారు మెంతులను ఆహారంగా తీసుకోవచ్చా?

గర్భం దాల్చిన మహిళలు మెంతులను ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. కానీ చాలా తక్కువ మొత్తంలోనే ఉపయోగించాల్సి ఉంటుంది. ఎందుకంటే మెంతులను అధికంగా తీసుకోవడం వల్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గర్భంతో ఉన్నవారు తక్కువ మొత్తంలో వీటిని తీసుకోవాల్సి ఉంటుంది.

3. డయాబెటిస్ తో బాధపడేవారు మెంతులను ఆహారంగా తీసుకోవచ్చా?

నిరభ్యంతరంగా. మధుమేహంతో బాధపడేవారు వీటిని ఆహారంగా తీసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ తగ్గుముఖం పడతాయి. దీనిలో ఉండే గ్లాక్టోమనన్ అనే మూలకం రక్తంలో షుగర్ స్థాయులను తగ్గిస్తుంది. మెంతుల్లో ఉండే అమైనో ఆమ్లాలు ఇన్సులిన్ స్థాయులను క్రమబద్ధీకరిస్తాయి. ఈ ఫలితాన్ని పొందడానికి మెంతుల టీ తాగాల్సి ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలంటే.. ఒకటి లేదా రెండు చెంచాల మెంతులను కప్పు నీటిలో వేసి పది నిమిషాల పాటు మరగనివ్వాలి. ఆ తర్వాత వడపోసి మెంతులను వేరు చేయాలి. వడపోసిన నీటిని తాగాలి. ఇలా రోజుకి రెండు సార్లు చొప్పున రెండు నుంచి మూడు నెలల పాటు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

4. మెంతులు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చా?

మెంతుల్లో పీచుపదార్థం ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్య నుంచి ఉఫశమనం కలిగిస్తుంది. మెంతులు అందించే ఈ ఫలితాన్ని పొందడానికి టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని రెండు కప్పుల నీటిలో వేయాలి. దీన్ని బాగా మరిగించి చల్లారనవివ్వాలి. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. నెల నుంచి రెండు నెలల పాటు ఇలా చేస్తే ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఇవీ మెంతుల వల్ల మనకు కలిగే ఆరోగ్యపరమైన, సౌందర్యపరమైన ప్రయోజనాలు. మెంతులు మనకు ఎంత ప్రయోజనం కలిగిస్తున్నాయో.. ఎక్కువ మోతాదులో తీసుకొంటే అంతకంటే ఎక్కువ నష్టాన్ని కలిగించవచ్చు. కాబట్టి మెంతులను వాడే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏమంటారు?

అద్భుత‌మైన వార్త‌.. ఇప్పుడు POPxo షాప్ ఓపెన్ అయింది. చ‌క్క‌టి మ‌గ్స్, ఫోన్ క‌వ‌ర్స్‌, కుష‌న్స్‌, లాప్‌టాప్‌స్లీవ్స్ ఇంకా మ‌రెన్నో ఇక్క‌డ 25 శాతం డిస్కౌంట్‌తోనే ల‌భిస్తున్నాయి. POPXOFIRST అనే కూప‌న్ కోడ్‌ని ఉప‌యోగించండి. దీంతో మ‌హిళ‌ల‌కు ఆన్‌లైన్ షాపింగ్ ఎంతో సులువైపోతుంది.

Read More From Beauty