Health

ఆలివ్ నూనెతో సౌందర్య, ఆరోగ్యపరమైన ప్రయోజనాలు (Benefits Of Olive Oil In Telugu)

Lakshmi Sudha  |  Jun 20, 2019
ఆలివ్ నూనెతో సౌందర్య, ఆరోగ్యపరమైన ప్రయోజనాలు (Benefits Of Olive Oil In Telugu)

ఈ మధ్య ఆలివ్ నూనె (olive oil) వినియోగం చాలా ఎక్కువ అవుతోంది. మధ్యధరా ప్రాంతంలో విరివిగా పండే ఆలివ్ పండ్ల నుంచి ఈ నూనె తీస్తారు. అంతేకాదు.. మధ్యధరా ప్రాంతపు వంటల్లో సైతం దీన్ని విరివిగా ఉపయోగిస్తారు. దీనిలో ఉన్న పోషకాలు మన ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని పరిరక్షిస్తాయి. ఈ కారణం వల్లే దీని వినియోగం పెరుగుతోంది.

మన దేశంలో కూడా ఆలివ్ నూనె వాడకం నెమ్మదిగా పెరుగుతోంది. ఆహారానికి ఆలివ్ నూనె ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది. అలాగే ప్రత్యేకమైన ఫ్లేవర్‌నూ జోడిస్తుంది. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుండడంతో ఈ నూనెను వినియోగించడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలివ్ నూనె వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూలంకషంగా చర్చించుకుందాం.

ఆలివ్ నూనెలో పోషకాలు (Nutrients In Olive Oil)

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న నూనెలన్నింటి కంటే ఆలివ్ ఆయిల్ ఆరోగ్యకరమైనదని చెబుతున్నారు నిపుణులు. ఆలివ్ పండ్లను గట్టిగా ప్రెస్ చేయడం ద్వారా ఈ నూనెను తీస్తారు. వాస్తవానికి దీన్ని నూనె అనడం కంటే ఫ్యాట్ అని పిలవడం సమంజసం అనిపిస్తుంది. ఎందుకంటే దీనిలో ఇతర పోషకాల కంటే ఆరోగ్యాన్ని కాపాడే కొవ్వులు అధికంగా ఉంటాయి. విటమిన్ ఇ, విటమిన్ కె ఈ నూనె ద్వారా మనకు లభిస్తాయి.

ఆలివ్ నూనెలో సాచ్యురెటెడ్ ఫ్యాట్స్, మోనో సాచ్యురెటెడ్ ఫ్యాట్స్, ఒమెగా 6, ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలుంటాయి. వంద గ్రాముల ఆలివ్ నూనెలో సాచ్యురేటెడ్ ఫ్యాట్ 13.8%, మోనో సాచ్యురెటెడ్ ఫ్యాట్ 73%, ఒమెగా – 6 ఫ్యాటీ ఆమ్లాలు 9.7%, ఒమెగా -3 ఫ్యాటీ ఆమ్లాలు 0.76%, విటమిన్ ఇ 72%, విటమిన్ కె 75 % ఉంటాయి. వీటితో పాటుగా ఒలోయోసెంథాల్, ఒలియోరూపియన్ అనే పదార్థాలు కూడా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్లుగా పనిచేస్తాయి. 

ఆలివ్ నూనెలో రకాలు (Types Of Olive Oil)

సాధారణంగా తెలుగు వారు వంటల్లో ఆలివ్ నూనె అసలు ఉపయోగించరనే చెప్పాలి. కానీ ఇటీవలి కాలంలో ఆరోగ్యం పట్ల  పెరుగుతున్న శ్రద్ద వల్ల ఆలివ్ నూనె వాడకం కూడా పెరిగింది. అయితే సూపర్ మార్కెట్‌కి వెళ్లిన తర్వాత అక్కడ ఎలాంటి నూనె తీసుకోవాలో తెలియక చాలామంది తికమకపడుతుంటారు. అయితే దీని కోసం ఎలాంటి నూనె ఎంచుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. ప్రస్తుతం ఆలివ్ నూనెలో నాలుగు రకాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి.

Shutterstock

వర్జిన్ ఆలివ్ నూనె: ఎక్కువ శాతంమంది ఈ నూనె ఉపయోగించడానికి ఇష్టపడుతుంటారు. దీనిలో ఆమ్లత్వం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే దీని వినియోగం ఎక్కువ. దీన్ని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. సౌందర్యపరమైన ప్రయోజనాలు పొందడానికి సైతం దీన్నే ఎక్కువగా ఉపయోగిస్తారు.

ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ నూనె: కోల్డ్ ప్రెస్డ్ ప్రక్రియ ద్వారా ఈ ఆలివ్ నూనె తీస్తారు. కోల్డ్ ప్రెస్డ్ ప్రక్రియలో నూనె తీయడం వల్ల ఆలివ్ పండ్లలో ఉన్న పోషకాలు కోల్పోకుండా ఉంటాయి. అయితే దీని ధర చాలా ఎక్కువ. దీన్ని కూడా ఆరోగ్య, సౌందర్య పరిరక్షణ ఉత్పత్తులలో ఉపయోగిస్తారు.

ప్యూర్ ఆలివ్ ఆయిల్: రిఫైన్డ్ ఆలివ్ నూనె, వర్జిన్ ఆలివ్ నూనెల మిశ్రమమే ప్యూర్ ఆలివ్ నూనె. దీనిలో ఆమ్లత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని మనం ఆహారంలో ఉపయోగించడానికి, సౌందర్యపరమైన చిట్కాలు పాటించడానికి వినియోగించకూడదు.

లాంపాంట్ ఆయిల్: దీన్ని కూడా ఆలివ్ నూనెతోనే తయారు చేస్తారు. దీన్ని ఇంధనంగా వాడుతుంటారు. ఆహారంగా తీసుకోవడానికి దీన్ని అసలు ఉపయోగించకూడదు.

 

ఆలివ్ నూనె వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Benefits Of Olive Oil For Health)

ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరినీ ఏదో ఒక ఆరోగ్య సమస్య వేధిస్తోంది. అది తగ్గిందనుకొంటే మరో కొత్త సమస్య వస్తోంది. ఇలాంటి సమస్యల నుంచి ఆలివ్ నూనె మనల్ని రక్షిస్తుందా? ఎలాంటి సమస్యలకు ఆలివ్ నూనె చెక్ పెడుతుంది? దీని వల్ల మన ఆరోగ్యం(health) ఏ రకంగా మెరుగుపడుతుంది? తెలుసుకుందాం..

డయాబెటిస్ రాకుండా చూస్తుంది (Prevents Diabetes)

ఆలివ్ నూనెలో హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్‌ను అదుపులో ఉంచుతాయి. ఈ విషయాన్ని అనేక అధ్యయనాలు సైతం నిర్థరిస్తున్నాయి. ఇతర నూనెలతో పోలిస్తే వంటలు చేయడానికి ఆలివ్ నూనె ఉపయోగించేవారిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయట.

బ్రెస్ట్ క్యాన్సర్ నివారిణిగా పనిచేస్తుంది (Reduces The Risk Of Breast Cancer)

ఆలివ్ నూనెను (Olive Oil) ఆహారంగా తీసుకొనే మహిళలలో.. రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయట. ఈ విషయాన్ని సైతం కొన్ని అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. దీనికి కారణం ఆలివ్ నూనెలో ఆలియురోపిన్ అనే మూలకం. దీనికి యాంటీ క్యాన్సర్ గుణాలున్నాయి. దీని కారణంగానే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

ఎముకలు దృఢంగా (Strengthens Bones)

ఆలివ్ నూనెలో ఆస్టియోకాల్సిన్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది ఎముకలు ఆరోగ్యంగా తయారయ్యేలా చేస్తుంది. ఆలివ్ నూనెను ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే ఆస్టియోకాల్సిన్ మనకు అందుతుంది. ఫలితంగా ఎముకలు దృఢంగా మారతాయి.

బరువు తగ్గడానికి (Help In Weigh Loss)

బరువు తగ్గమని చెప్పడం చాలా సులువే. కానీ అధికంగా ఉన్న బరువుని తగ్గించుకోవడం చాలా కష్టం. దానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు డైట్ నియమాలు పాటించడం తప్పనిసరి. అయినా బరువు తగ్గడానికి చాలా సమయమే పడుతుంది. మరి, ఈ ప్రక్రియను వేగవంతం చేసుకోవడమెలా? మీరు తినే ఆహారంలో కొద్దిగా ఆలివ్ నూనెను భాగం చేసుకోండి. వెజిటబుల్, ఫ్రూట్ సలాడ్స్ పై కొద్దిగా ఆలివ్ నూనె చల్లుకొని తినొచ్చు.

డిప్రెషన్ నుంచి బయటపడటానికి (To Get Out Of Depression)

కొన్ని రకాల ఆహార పదార్థాల్లో యాంటీ డిప్రసెంట్స్ ఉంటాయి. ఇలాంటి ఆహార పదార్థాలను తినడం ద్వారా డిప్రెషన్‌ను తగ్గించుకోవచ్చు. ఆలివ్ నూనెలో సైతం ఇలాంటి యాంటీ డిప్రసెంట్స్ ఉంటాయి. ఇవి మన శరీరంలో సెరెటోనిన్ స్థాయులను పెంచుతాయి. ఇది కుంగుబాటును కూడా తగ్గిస్తుంది. కాబట్టి డిప్రెషన్‌తో బాధపడేవారు దీన్ని ఉపయోగించడం ద్వారా  డిప్రెషన్ తగ్గించుకోవచ్చు.

Shutterstock

కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది (Decreasing Cholesterol)

ఆలివ్ నూనెను మనం తినే ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా చాలా మంచి ప్రయోజనాలు అందుకోవచ్చు. ముఖ్యంగా ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆలివ్ నూనెలో సాచ్యురేటెడ్, పాలీ అన్ సాచ్యురేటెడ్ కొవ్వులు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి బ్లడ్ కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గిస్తాయి. అలాగే మోనోసాచ్యురేటెడ్ ఫ్యాట్ సుమారుగా 70 నుంచి 85 శాతం వరకు ఉంటుంది. ఇది శరీరంలో హెచ్డీఎల్ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

కిడ్నీలో రాళ్లు ఉంటే.. (Good In Case Of Kidney Stones)

కిడ్నీలో రాళ్ల సమస్యలతో బాధపడుతున్నవారు ఆలివ్ నూనె ఉపయోగించడం ద్వారా వాటిని కరిగించుకోవచ్చు. అయితే దీని కోసం ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఉపయోగించాల్సి ఉంటుంది. సమపాళ్లలో నిమ్మరసం, ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ నూనె తీసుకుని రెండింటినీ ఒకదానితో ఒకటి బాగా కలిసేంత వరకు కలపాలి. ఒక రోజు మొత్తం ఈ మిశ్రమాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 50 మి.లీ. నిమ్మరసం, 50 మి.లీ. ఆలివ్ నూనెతో మిశ్రమం తయారుచేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ప్రతి పావుగంట లేదా అరగంటకోసారి ఆరు టేబుల్ స్పూన్ల చొప్పున తీసుకొంటూ ఉండాలి. ఈ మిశ్రమాన్ని ఒకేసారి తాగకూడదు. అలా చేస్తే వాంతులు అవడం, తల తిరగడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే రోజంతా యాపిల్ జ్యూస్, డిస్టిల్డ్ వాటర్ తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువ సార్లు వాష్రూంకి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి కిడ్నీలో రాళ్లు నెమ్మదిగా బయటకు వచ్చేస్తాయి. ఇలా వచ్చేటప్పుడు కాస్త నొప్పిగా అనిపించవచ్చు.

సూచన: కిడ్నీలో రాళ్లు ఉన్నాయని మీకు అనుమానంగా ఉంటే ముందు వైద్యులను సంప్రదించి వారి సూచనలను పాటించడం మంచిది. అలాగే  ఈ చిట్కాను పాటించే విషయంలోనూ మీ డాక్టర్ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ చిట్కా వల్ల కొందరిలో ఇతరత్రా ఆరోగ్యసమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

శృంగార జీవితం అద్భుతం (Improves Blood Circulation)

ఆలివ్ నూనెతో శరీరానికి మర్దన చేసుకోవడం ద్వారా సెక్సువల్ ఆర్గాన్స్‌తో సహా అవయవాలన్నింటికీ రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. అలాగే ఆలివ్ నూనెను ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా కూడా లైంగిక ఆరోగ్యం మెరుగపడుతుంది.

నొప్పి తగ్గిస్తుంది. (Reduces Pain)

ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనెలో ఒలియోసెంథాల్ (oleocanthal) అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. కాబట్టి ఆలివ్ నూనెను ఆహారంలో భాగంగా చేసుకొంటే నొప్పులు తగ్గుముఖం పడతాయి. ఈ విషయం కొన్ని అధ్యయనాల్లో సైతం రుజువైంది.

బ్రెయన్ స్ట్రోక్ రాకుండా.. (Good For Brain)

వయసు మీద పడిన తర్వాత వచ్చే సమస్యల్లో బ్రెయిన్ స్ట్రోక్ కూడా ఒకటి. అయితే రోజూ వర్జిన్ ఆలివ్ నూనెను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఈ సమస్య వచ్చే అవకాశాలను చాలావరకు తగ్గించుకోవచ్చు.  కొందరు సీనియర్ సిటిజన్లపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఆలివ్ నూనె ఉపయోగించడం వల్ల గడ్డకట్టిన రక్తం కరిగిపోతుంది. తద్వారా గుండె నుంచి మెదడుకు రక్త సరఫరా మెరుగుపడుతుంది.

గుండె జబ్బులు రాకుండా చేస్తుంది (Prevent Heart Diseases)

ఆలివ్ నూనెలో మోనో అన్  సాచ్యురెటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉన్నాయని మనం ముందే తెలుసుకొన్నాం. ఇవి శరీరంలో లోడెన్సిటీలెవెల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి హైడెన్సిటీలెవల్ కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడి.. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

Shutterstock

మలబద్ధకాన్ని తగ్గిస్తుంది (Reduces Constipation)

ఆలివ్ నూనెలో ఉన్న గుణాలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. దీనిలో ఉండే మోనోఅన్సాచ్యురేటెడ్ కొవ్వులు పేగుల్లోని ఆహారం బాగా జీర్ఱమవడానికి దోహదపడతాయి. కాబట్టి మలబద్ధకం సమస్య తగ్గుముఖం పడుతుంది. అయితే దీని కోసం ఓ చిట్కాను పాటించాల్సి ఉంటుంది. ప్రతిరోజూ టేబుల్ స్పూన్ చొప్పున వర్జిన్ ఆలివ్ ఆయిల్‌ను ఉదయం, సాయంత్రం తీసుకోవడం ద్వారా మలబద్ధకం సమస్యను తగ్గించుకోవచ్చు.

ఆలివ్ నూనె వల్ల కలిగే సౌందర్యపరమైన ప్రయోజనాలు (Beauty Benefits Of Olive Oil)

ఆరోగ్యం తర్వాత అందరూ ఎక్కువ ప్రాధాన్యమిచ్చేది సౌందర్యానికే (beauty). ఆలివ్ నూనె చర్మ సంబంధిత సమస్యలను తగ్గించి చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. అలర్జీలు, మొటిమలు, పొడిచర్మం వంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అందిస్తుంది ఆలివ్ నూనె.

చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది (Moisturizes The Skin)

ఆలివ్ నూనెలో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి చర్మానికి అవసరమైన పోషణ అందించడంతో పాటు మాయిశ్చరైజ్ చేస్తుంది. పైగా ఏ రకమైన చర్మతత్వం కలిగినవారైనా సరే దీన్ని ఉపయోగించవచ్చు. దీని కోసం మనకు చెంచా ఆలివ్ నూనె అవసరమవుతుంది. స్నానం చేసిన తర్వాత ఆలివ్ నూనెతో ముఖానికి మర్దన చేసుకోవాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ చిట్కాను రాత్రి నిద్రపోయే ముందు పాటించడం ద్వారా మంచి ప్రయోజనం కలుగుతుంది.

Shutterstock

మేకప్ తొలగించుకోవడానికి (To Remove Makeup)

మేకప్ ఎంత జాగ్రత్తగా వేసుకొంటామో దాన్ని తొలగించేటప్పుడు సైతం అంతే జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అలా జరగకుండా ఉండాలంటే మేకప్ తొలగించుకోవడానికి ఆలివ్ నూనె ఉపయోగించాల్సిందే. దీని కోసం ఆలివ్ నూనెలో దూదిని ముంచి దాన్ని పిండాలి. ఆ తర్వాత దానితో ముఖానికి వేసుకొన్న మేకప్ తొలగించుకుంటే సరిపోతుంది. ఆలివ్ ఆయిల్ తో ఐ మేకప్ సైతం తొలగించుకోవచ్చు.

ముదిమి ఛాయలు రాకుండా.. (Keeps Skin Healthy)

వయసు పెరిగే కొద్దీ చర్మం ముడతలు పడటం, గీతలు పడినట్లుగా కనిపించడం సహజం. ఆలివ్ నూనె ఉపయోగించడం ద్వారా చర్మం ముదిమి ఛాయలు సంతరించుకోకుండా చూసుకోవచ్చు. దీని కోసం మనం ఏం చేయాలంటే.. రెండు చెంచాల ఆలివ్ నూనె, చెంచా నిమ్మరసం, చిటికెడు ఉప్పు తీసుకోవాలి. ముందుగా కొద్దిగా ఆలివ్ నూనెతో ముఖాన్ని మర్దన చేసుకోవాలి. మిగిలిన నూనెలో నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో చర్మం ముడతలు పడినట్లుగా లేదా పొడిగా ఉన్న చోట మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఉప్పు చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. ఆలివ్ నూనె చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది.

బ్లాక్ హెడ్స్ తగ్గిస్తుంది (Reduces Blackheads)

చర్మరంధ్రాల్లో చేరిన మురికి, జిడ్డు కారణంగా బ్లాక్ హెడ్స్ వస్తుంటాయి. వీటిని ఆలివ్ ఆయిల్ ఉపయోగించడం ద్వారా తొలగించవచ్చు. కొద్దిగా ఆలివ్ నూనెను చేతిలో వేసుకొని రెండు చేతులతో బాగా రబ్ చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకొని రెండు నిమిషాల పాటు మర్ధన చేసుకవాలి. ఆ తర్వాత వేడి నీటిలో వాష్ క్లాత్ ముంచాలి. క్లాత్ ను బాగా పిండి ముఖంపై వేసి 15 సెకన్లు ఉంచాలి. ఆ తర్వాత అదే వస్త్రంతో ముఖాన్ని తుడుచుకోవాలి. జిడ్డు వదలకపోతే మరోసారి క్లాత్ ను వేడినీటిలో ముంచి ముఖాన్ని తుడుచుకోవాలి. ఈ చిట్కాను వారానికోసారి పాటించడం ద్వారా ముఖంపై వచ్చిన బ్లాక్ హెడ్స్ తగ్గుముఖం పడతాయి.

Shutterstock

లిప్ స్క్రబ్ (Lip Scrub)

పర్ఫెక్ట్ పౌట్ లిప్స్ కావాలని కోరుకోని అమ్మాయిలు ఎవరైనా ఉంటారా? మరి, అలాంటి అందమైన లిప్స్ కావాలంటే ఆలివ్ నూనెతో పెదవులను స్క్రబ్ చేసుకోవాల్సిందే. ఇంతకీ ఆ లిప్ స్క్రబ్ ఎలా తయారుచేసుకోవాలి? కొద్దిగా బ్రౌన్ షుగర్ ను మెత్తగా చేసుకోవాలి. దీనిలో కొన్ని చుక్కల ఆలివ్ నూనె, కొద్దిగా నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని నిద్రపోయే ముందు పెదవులకు రాసుకొని ఐదు నిమిషాల పాటు మర్దన చేసుకొంటే సరిపోతుంది. ఆలివ్ నూనె పెదవులను మాయిశ్చరైజ్ చేస్తుంది. పంచదార, నిమ్మరసం ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్స్ గా పనిచేస్తాయి. ఫలితంగా పెదవులపై ఉన్న మ్రుతకణాలు తొలగిపోవడంతో పాటు తగినంత తేమ కూడా అందుతుంది.

గోళ్లు ఆరోగ్యంగా (For Nail Beauty)

సౌందర్యానికి సంబంధించిన విషయంలో గోళ్లకు సైతం ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుంది. చక్కగా గోళ్లు పెంచి వాటిపై రకరకాలుగా నెయిల్ ఆర్ట్ వేసి వాటిని అందంగా మలుచుకుంటారు. మరి, అలాంటి గోళ్ల ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా. అందుకే దాని కోసం ఆలివ్ ఆయిల్ ఉపయోగించాల్సిందే. ఆలివ్ నూనెలో ఉండే విటమిన్ ‘ఇ’ గోళ్లకు కావాల్సిన పోషణ అందిస్తుంది. దీని కోసం మనకు కావాల్సింది రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె. దీనిలో దూది ముంచి దాంతో గోళ్లను తుడుచుకోవాలి. ముప్పై నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

పగిలిన మడమలకు.. (For Cracked Heels)

మనకు నచ్చిన ఫుట్ వేర్ వేసుకోవడానికి కొన్నిసార్లు పగిలిని మడమలు అడ్డుపడుతుంటాయి. మీరు కూడా ఇలాంటి సమస్యతోనే ఇబ్బంది పడుతున్నారా? అయితే దీనికి ఆలివ్ నూనె చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది. వేడినీళ్లలో నిమ్మరసం పిండి అందులో కొంతసేపు కాళ్లను ఉంచాలి. ఆ తర్వాత ఫ్యుమిస్ స్టోన్ తో పాదాలను రుద్దుకొని పొడిగా తుడుచుకోవాలి. ఇప్పుడు పాదాలకు ఆలివ్ నూనె రాసి కాసేపు మర్ధన చేసుకోవాలి. ఆపై పాదాలకు సాక్స్ తొడుక్కోవాలి.

ఎక్స్ఫోలియేటర్ గా (As An Exfoliator)

చర్మం మీద చేరిన మురికి, మ్రుతకణాలను ఎప్పటికప్పుడు తొలగించుకోకపోతే చర్మం కళావిహీనంగా కనిపిస్తుంది. అందుకే చర్మాన్ని ఎప్పటికప్పుడు ఎక్స్ఫోలియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం ఆలివ్ నూనెతో తయారు చేసిన స్క్రబ్ ఉపయోగిస్తే చర్మం శుభ్రపడటంతో పాటు చర్మానికి తగిన పోషణ సైతం అందుతుంది. కొద్దిగా పంచదారలో కొన్ని చుక్కల ఆలివ్ నూనె, కొద్దిగా తేనె వేసి బాగా కలిపితే స్క్రబ్ తయారవుతుంది. ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకొని పొడిగా తుడుచుకోవాలి. ఇప్పుడు స్క్రబ్‌ను ముఖానికి రాసుకొని మ్రుదువుగా, గుండ్రంగా రుద్దుకుంటూ నిమిషం పాటు మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. మార్పు మీకే తెలుస్తుంది. ఈ చిట్కాను వారానికోసారి పాటించడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు.

షేవింగ్ చేసుకోవడానికి ముందు (Can Be Used Before Shaving)

అవాంఛిత రోమాలను షేవింగ్ చేసుకోవడం ద్వారా తొలగించుకోవడం మనకు తెలిసిన ప్రక్రియే. సాధారణంగా అలా చేయడానికి ముందు మనం సబ్బు రాసుకుంటాం. దీని వల్ల చర్మంపై బ్లేడు సున్నితంగా జారడమే కాకుండా వెంట్రుకలను సమర్థంగా తొలగిస్తుంది. సబ్బు, షేవింగ్ క్రీం బదులుగా ఆలివ్ నూనె ఉపయోగించవచ్చు. ఇది శరీరంపై బ్లేడ్ స్మూత్గా గ్లైడ్ అయ్యేలా చేయడంతో పాటు షేవింగ్ తర్వాత వచ్చే దురద, మంట వంటివి రాకుండా చేస్తుంది.

కురుల ఆరోగ్యానికి ఆలివ్ నూనె (Olive Oil Benefits For Hair)

కురులు పొడవుగా, ఒత్తుగా ఉంటేనే చూడడానికి అందంగా ఉంటుంది. అలాంటి కురుల కోసం వివిధ రకాల హెయిర్ కేర్ ఉత్పత్తులు ఉపయోగిస్తాం. వాటన్నింటినీ పక్కన పెట్టి ఓసారి ఆలివ్ నూనె ఉపయోగించండి. కచ్చితంగా మంచి ఫలితం కనిపిస్తుంది. దాని కంటే ముందు ఆలివ్ నూనె వల్ల కురులకు అందించే ప్రయోజనాలు తెలుసుకుందాం.

జుట్టుకు పోషణ ఇస్తుంది (Gives Nourishment To The Hair)

ఆలివ్ నూనె వెంట్రుకల కుదుళ్లను బలంగా మారుస్తుంది. పొడిబారిన జుట్టును మాయశ్చరైజ్ చేసి అందంగా మారుస్తుంది. దీని కోసం ఆలివ్ నూనెతో హెయిర్ ప్యాక్ వేసుకోవాల్సి ఉంటుంది. అర టీస్పూన్ వర్జిన్ ఆలివ్ నూనె, తేనె రెండు టేబుల్ స్పూన్లు, గుడ్డులోని పసుపు సొన తీసుకోవాలి. ఈ మూడింటినీ మిశ్రమంగా చేసి జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో మైల్డ్ షాంపూ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వారానికి రెండు సార్లు వేసుకోవడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు. ఈ ప్యాక్ వేసుకొన్నప్పుడు వేడి నీటితో తలను శుభ్రం చేసుకోకూడదు. అలా చేయడం వల్ల వెంట్రుకల నుంచి నీచు వాసన వస్తుంది.

Shutterstock

జుట్టు పెరగడానికి (Hair Growth)

ఆలివ్ నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది వెంట్రుకలు పెరిగేలా చేస్తుంది.  క్రమం తప్పకుండా ఆలివ్ నూనె ఉపయోగించడం ద్వారా కురులు ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేస్తుంది.

చుండ్రు తగ్గడానికి (Reduce Dandruff)

ఆలివ్ నూనె జుట్టుకు పోషణ ఇవ్వడం మాత్రమే కాదు.. చుండ్రు సమస్యను సైతం తగ్గిస్తుంది. దీని కోసం సరిపడినంత ఆలివ్ నూనె తీసుకొని దాన్ని గోరువెచ్చగా వేడి చేయాలి. ఆ తర్వాత నూనెను మునివేళ్లతో మాడుకి రాసుకుని మ్రుదవుగా మర్దన చేసుకోవాలి. స్కాల్ప్ తో పాటు వెంట్రుకలకు సైతం ఆలివ్ నూనె అప్లై చేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఈ చిట్కాను చుండ్రు తగ్గడానికి మాత్రమే కాదు.. ప్రీషాంపూ ట్రీట్మెంట్ గా కూడా ఫాలో అవ్వచ్చు. అంటే తలస్నానం చేసే ముందు ప్రతిసారి ఈ చిట్కాను పాటించడం ద్వారా కురులు ఆరోగ్యంగా తయారవుతాయి.

వంటల్లో ఆలివ్ నూనె ఎలా ఉపయోగించాలంటే.. (How To Use Olive Oil For Cooking)

Shutterstock

సాధారణంగా వంటల్లో ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ లేదా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఉపయోగిస్తారు. పోషకాలు, రుచి విషయంలో స్వల్పమైన తేడా ఉన్నప్పటికీ ఇవి అందించే ప్రయోజనాల్లో పెద్దగా తేడా ఉండదు. ఈ రెండింటినీ రిఫైన్డ్ చేయరు కాబట్టి.. కొద్దిగా వాసన వస్తుంది. అలాగే ఆలివ్ నూనెను వేపుళ్లు లేదా ఎక్కువ సమయం ఉడికే వంటల్లో ఉపయోగించకూడదు. ఎందుకంటే ఎక్కువ సమయం వేడి చేయడం వల్ల ఆలివ్ నూనెలో పోషకాలన్నీ నశించిపోతాయి. మన భారతీయ వంటలు ఎక్కువ సమయం ఉడికిస్తాం కాబట్టి మనం ఈ నూనెతో కూరలు వండటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి వెజిటబుల్ సలాడ్స్ పై జల్లుకోవచ్చు. బ్రెడ్స్ తయారు చేయడానికి, వాటిని డిప్ చేయడానికి ఉపయోగించవచ్చు. అలాగే రెసిపీ డ్రెస్సింగ్ కోసం ఉపయోగించవచ్చు.

ఆలివ్ నూనె ఉపయోగించడం వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలు (Side Effects Of Olive Oil)

ఆలివ్ నూనె ఉపయోగించడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయి.. ఆ ప్రయోజనాలను పొందడానికి మనమేం చేయాలో కూడా తెలుసుకొన్నాం. వాటితో పాటుగా ఆలివ్ నూనె ఉఫయోగించడం వల్ల ఎదురయ్యే సమస్యలు కూడా తెలుసుకోవాలి.

  1. ఆలివ్ నూనె కాస్త జిడ్డుగా ఉంటుంది. కాబట్టి ఆయిలీ స్కిన్ ఉన్నవారు ఆలివ్ నూనె ఉపయోగించడం వల్ల మొటిమల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
  2. ఆలివ్ నూనె కొంతమందిలో ఎలర్జీలు, స్కిన్ ర్యాషెస్ కలిగిస్తుంది. ఈ నూనె చర్మానికి రాసుకొన్న తర్వాత దురద లేదా మంటగా అనిపిస్తే.. ఇకపై దాన్ని ఉపయోగించకపోవడమే మంచిది.
  3. చిన్నపిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఆలివ్ నూనె ఉపయోగించడం అంత మంచిది కాదు. ఎందుకంటే దీని వల్ల పిల్లల్లో ఎలర్జీలు రావచ్చు.
  4. చెంచా ఆలివ్ నూనెలో 14% సాచ్యురేటెడ్ ఫ్యాట్స్, 120 క్యాలరీలుంటాయి. అంటే ఆలివ్ నూనె ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల ఒబెసిటీ, గుండె సంబంధిత సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆలివ్ నూనె అందించే ఆరోగ్యపరమైన ప్రయోజనాలు పొందడానికి వీలైనంత వరకు తక్కువ మొత్తంలో ఆలివ్ నూనె తీసుకోవాల్సి ఉంటుంది.
  5. కొన్నిసార్లు ఆలివ్ నూనె డయేరియా రావడానికి కారణమవుతుంది. ఎక్కువ మొత్తంలో ఆలివ్ నూనె తీసుకొన్నప్పుడు ఇలా జరుగుతుంది.
  6. అధిక మొత్తంలో ఆలివ్ నూనె ఉపయోగించడం వల్ల కొందరిలో చర్మం మంటగా అనిపించవచ్చు.

తరచూ అడిగే ప్రశ్నలు (FAQ’s)

ఆలివ్ నూనెను ముఖానికి అప్లై చేసుకొని అలా వదిలేయచ్చా?

ఆలివ్ నూనెను నిద్రపోయే ముందు అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు. ఆలివ్ నూనె రాసుకొన్న వెంటనే శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదు. దీని వల్ల ఎలాంటి ఇబ్బంది ఎదురవదు. నూనె రాసుకొని అలా రాత్రంతా వదిలేయడం వల్ల చర్మానికి తగిన పోషణ అంది మాయిశ్చరైజ్ అవుతుంది. అలా రాసి వదిలేయడం కాకుండా కాసేపు మర్దన చేసుకోవాలి. ఆలివ్ నూనె మరీ ఎక్కువ రాసుకోకుండా కొన్ని చుక్కలు రాసుకొంటే సరిపోతుంది. చర్మాన్ని శుభ్రం చేసుకోవడానికి మాత్రం వేణ్నీళ్లు ఉపయోగించాల్సి ఉంటుంది. అప్పుడే జిడ్డు పూర్తిగా వదిలిపోతుంది. జిడ్డుచర్మంతో బాధపడేవారు వారానికి ఒకసారి ఆలివ్ నూనె ఉపయోగించడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు. మిగిలిన వారు ప్రతిరోజూ ఉపయోగించవచ్చు.

ఆలివ్ ఆయిల్ రాసుకోవడం వల్ల ముఖంపై అవాంఛిత రోమాలు పెరుగుతాయా?

సాధారణంగా ముఖంపై ఏ నూనె రాసుకున్నా వెంట్రుకలు పెరగవు. ముఖం మీద వెంట్రుకలు పెరగడానికి ప్రధాన కారణం హార్మోన్ల ప్రభావమే. కాబట్టి ఆలివ్ నూనె ఉపయోగించడం వల్ల అవాంఛిత రోమాలు పెరుగుతాయనే అపోహ వద్దు.

రోజులో ఎంత మొత్తం ఆలివ్ నూనె ఉపయోగించవచ్చు?

ఆలివ్ నూనె ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల ఒబెసిటీ, గుండె సంబంధిత సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. దీనికి కారణం దానిలో అధికంగా ఉండే కొవ్వులు, క్యాలరీలే. కాబట్టి ఆలివ్ నూనె అందించే ఆరోగ్యపరమైన ప్రయోజనాలు పొందడానికి వీలైనంత వరకు తక్కువ మొత్తంలో ఆలివ్ నూనె తీసుకోవాల్సి ఉంటుంది. రోజుకి రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే ఆలివ్ నూనెను ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.

ఆలివ్ నూనెను తాగొచ్చా?

ఆలివ్ నూనెను తాగొచ్చు. కాకపోతే అది కూడా చాలా తక్కువ మొత్తంలో తాగాలి. రోజుకి రెండు చెంచాలకు మించి ఆలివ్ నూనెను తీసుకోకూడదు. అంతకు మించి ఎక్కువ తీసుకుంటే.. ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడవచ్చు.

Featured Image: Shutterstock

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది

 

Read More From Health