Health

‘పవర్ యోగా’తో.. మనకు కలిగే ప్రయోజనాలెన్నో ..!

Sandeep Thatla  |  Dec 18, 2019
‘పవర్ యోగా’తో.. మనకు కలిగే ప్రయోజనాలెన్నో ..!

(Benefits of Power Yoga & Important Poses)

ఈమధ్యకాలంలో జనంలో వ్యాయామం పట్ల బాగా ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో యోగాపై కూడా ప్రజల దృష్టి మరలుతోంది. ముఖ్యంగా పవర్ యోగా బాగా పాపులర్ అయిన తర్వాత.. తమ రోజువారి వ్యాయామాల్లో దీనికి కూడా చోటు కల్పిస్తున్నారు ఔత్సాహికులు. 

రోజులో గంటల తరబడి కూర్చోవడం వల్ల కలిగే దుష్పరిణామాలు ఇవే

ఈ మధ్యకాలంలో పవర్ యోగాకి పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా.. అసలు ఈ పవర్ యోగా అంటే ఏమిటి? యోగాకి, పవర్ యోగాకి మధ్యనున్న తేడా ఏమిటి? పవర్ యోగాలో కనిపించే వివిధ భంగిమలు ఏంటి? అలాగే ఈ యోగా వల్ల కలిగే ప్రయోజనాలు.. దీనిని చేసే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలైన వాటి గురించి విపులంగా తెలుసుకుందాం.

పవర్ యోగా అంటే ఏమిటి?

పవర్ యోగాకి (Power Yoga) మూలం సంప్రదాయ యోగా. అయితే యోగా చేసే సమయంలో మనం నెమ్మదిగా వేసే ఆసనాలని పవర్ యోగాలో వేగంగా వేస్తుంటారు. ‘అష్టాంగ విన్యాస యోగా’ నుండి పుట్టినదే ఈ పవర్ యోగా. 1948లో మైసూర్‌లో పట్టాభి జోయిస్ అనే వ్యక్తి.. యోగా ద్వారా వ్యాయామం చేసే పద్దతిని కనుగొని దానికి ‘అష్టాంగ విన్యాస యోగా’ అని నామకరణం చేశారు. ఆయన వద్ద బెరిల్ బెండర్ బిర్చ్, బ్రయాన్ కేస్ట్ అనే విదేశీయులు ఈ ‘అష్టాంగ విన్యాస యోగా’ని నేర్చుకున్నారు. 

వారు తరువాత 1990ల్లో ఈ అష్టాంగ విన్యాస యోగాని అమెరికాలో ప్రవేశపెడుతూ… దానికి ‘పవర్ యోగా’ అంటూ కొత్త పేరుని సూచించారు. అయితే ఈ పద్ధతి ‘అష్టాంగ విన్యాస యోగా’ పద్ధతి సృష్టికర్త పట్టాభి జోయి‌స్‌కి అంతగా నచ్చలేదు. దీని పైన ఆయన విమర్శలు కూడా చేశారు.

ఆ తర్వాత.. ఈ పవర్ యోగా 90వ దశకంలో అమెరికాలో మొదలై.. నేడు ప్రపంచమంతటా ఇదే పేరుతో ప్రాచుర్యం పొందడం జరిగింది. అయితే ఈ పవర్ యోగాకి మూలాలు మాత్రం భారతదేశంలోనే ఉండడం గమనార్హం.

యోగా & పవర్ యోగాల మధ్య ఉన్న తేడా ఏమిటి?

యోగా & పవర్ యోగాల మధ్య ఉన్న అతిపెద్ద తేడా – వేగం. ఇది తప్పించి.. మిగిలినవన్ని కూడా చాలా స్వల్పమైన తేడాలే. ఇక యోగాలో మన శరీరాన్ని తేలికగా కదిలిస్తూ.. నెమ్మదిగా వ్యాయామం చేస్తుంటే… పవర్ యోగాలో మాత్రం శరీరాన్ని వేగంగా కదిలిస్తూ.. దాని  ప్రభావాన్ని మన శరీరం పై పూర్తిగా పడేలా చేస్తుంటాం. 

యోగాలో ప్రధానంగా ఫోకస్ మన శరీర భంగిమల పై ఉంటుంది. కానీ అదే ఫోకస్ పవర్ యోగాలో శరీర కదలికల పై ఉంటుంది. అలాగే యోగా చేయడం వల్ల మానసిక స్థిరత్వం పెరిగితే.. పవర్ యోగా మాత్రం మన మనసుపై ఎటువంటి ప్రభావం చూపించదు.

పవర్ యోగా చేయడం ద్వారా మనం ఫిట్‌గా ఉండేందుకు ఆస్కారం ఉంటే.. యోగా చేయడం ద్వారా శరీరంలో నూతనోత్తేజంతో పాటుగా మనసు కూడా ప్రశాంతంగా ఉండే పరిస్థితి ఉంటుంది.

యోగా చేసే సమయంలో.. అందులో నిష్ణాతులైన వారి పర్యవేక్షణ లేకుండా కూడా మనం సొంతంగా చేసుకోవచ్చు. అదే పవర్ యోగా విషయానికి వస్తే, ఇది కేవలం నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయడానికి వీలవుతుంది.

ఇవి ప్రధానంగా యోగా, పవర్ యోగాల మధ్య ఉన్న తేడాలు.

పవర్ యోగా భంగిమలు (poses)

పవర్ యోగా అంటేనే వేగంతో కూడినది. అందుకే అది చేసే సమయంలో మన శరీరం ఎంతో వేగంగా కదలడంతో పాటుగా.. ఆ ప్రభావం మన శరీరమంతటా పడుతుంది. ఇప్పుడు ఈ పవర్ యోగాలో సాధారణంగా కనిపించే వివిధ భంగిమల (poses) గురించి తెలుసుకుందాం.

స్క్వాట్స్

ఈ స్క్వాట్స్ అనేవి చేస్తుంటే.. మీ తొడ కండరాలు బలంగా తయారవ్వడమే కాకుండా.. అవి సరైన ఆకారంలోకి కూడా వస్తాయి. అలాగే ఈ స్క్వాట్స్ చేసే సమయంలో తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం – శ్వాస తీసుకోవడం,  వదిలేయడం. మీరు ఆసనంపై కూర్చున్నప్పుడు శ్వాస తీసుకొని.. ఆ తర్వాత పైకి లేచే సమయంలో దానిని వదిలేయడం తప్పనిసరిగా చేయాలి.

Shutterstock

డౌన్ వార్డ్ డాగ్

ఈ భంగిమ మన ఉదర కండరాల పై ప్రభావం చూపుతుంది. దీని వల్ల ఒకరకంగా మన కండరాలు బలపడతాయి. ఇక ఈ డౌన్ వార్డ్ డాగ్ భంగిమలో.. మన శరీరం ఒక శునకం మాదిరిగా తల వంచి నిలబడాలి. ఆ తరువాత మన మోకాళ్ళ పై నుండి కాళ్ళు పైకి లేపాల్సి ఉంటుంది. సరిగ్గా చెప్పాలంటే మన శరీరం ‘V’ ఆకారంలో ఉండాలి. ఇలా చేస్తున్నప్పుడు మనం శ్వాస తీసుకోవడం, విడిచిపెట్టడం మాత్రం మరువకూడదు.

Shutterstock

డౌన్ వార్డ్ డాగ్ టు స్మాల్ డాగ్

డౌన్ వార్డ్ డాగ్ టు స్మాల్ డాగ్ భంగిమ వల్ల.. ఉదర భాగంతో పాటుగా మన కాళ్ళ కండరాలు కూడా బలపడతాయి. దీనికీ.. పైన చెప్పిన భంగిమకు పెద్దగా తేడాలు లేనప్పటికి.. దీని ద్వారా మరో రకమైన లాభం కూడా కలుగుతుంది. అయితే ఈ భంగిమను ప్రదర్శించే సమయంలో.. మన నడుము లేదా ఇతర భాగాల్లో ఎక్కడ కూడా వంకరలు రాకుండా చూసుకోవాలి. 

Downward Dog To Small Dog Pose

స్మాల్ డాగ్ టు ప్లాంక్

ఈ భంగిమలో మనం మన రెండు మోచేతులతో పాటు.. కాళ్ళ మునివేళ్ళ పై మన బరువును ఉంచాల్సి ఉంటుంది. ఇక మన చేతులని ఆధారం చేసుకుని.. నడుము భాగాన్ని పైకి లేపుతూ & మరలా సాధారణ భంగిమకి మార్చుతూ ఈ ఆసనం వేయాల్సి ఉంటుంది. ఈ భంగిమ ద్వారా బరువు తగ్గాలి అనుకునే వారికి ఎంతో ఉపయోగముంటుంది. 

Small Dog to Plank

స్టాండింగ్ టు లెగ్ రైజ్

ఈ భంగిమలో మనం నిల్చుని మన కుడి కాలుని.. మన ఉదర భాగానికి సమాంతరంగా లేపాల్సి ఉంటుంది. ఆ సమయంలో మన రెండు చేతులు మన నడుము పైన పెట్టాలి. ఇక ఇదే భంగిమలో ఇంకాస్త ముందుకి వెళితే, మన కుడి వైపుకి మన నడుము పై భాగం ద్వారా పైకి లేపాల్సి ఉంటుంది. అలా లేపిన కుడి కాలుని మన కుడి చేతితో పట్టుకోవాలి ఆ సమయంలో మన తల ఎడమవైపునకు తిప్పి ఉంచాలి. ఈ ఆసనం వల్ల బరువు తగ్గడమే కాకుండా మొకాలు, తొడ భాగం, ఉదర భాగం పైన ప్రభావం చూపుతుంది.

Standing To Leg Raise

అబ్డోమినల్ చర్నిగ్

ఈ భంగిమలో కాళ్ళని కాస్త వెడల్పు చేయాలి.  తరువాత కాస్త ముందుకి వంగి.. మన రెండు చేతులను రెండు తొడల పై పెట్టి నిలబడాలి. ఆ తరువాత శ్వాసని బలంగా తీసుకొని.. దానిని విడిచిపెట్టేటప్పుడు మన డయాఫ్రామ్‌ని పైకి నెట్టాలి. ఆ తర్వాత శ్వాస తీసుకోకుండా.. ఉదర భాగంలో ఉన్న కండరాలని ముందుకి, వెనక్కి కదిలించాలి. అయితే ఇది మీ వల్ల కాని సమయంలో.. ఈ ప్రక్రియను ఆపేసి శ్వాస తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా అబ్డోమినల్ చర్నిగ్‌కి మీ శరీరం సిద్ధమవుతుంది.

అలా సిద్ధమయ్యాక మీ కుడి వైపున ఉన్న తొడ పై బలంగా మీ కుడి చేతిని అదిమి పట్టి.. ఉదర భాగంలో ఉన్న కుడి కండరాన్ని ఎడమ వైపుకి నెట్టే ప్రయత్నం చేయాలి. అలాగే ఎడమ వైపు బలం పెట్టి.. ఎడమ కండరాన్ని కుడి వైపుకి నెట్టే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఈ భంగిమ కారణంగా మీ జీర్ణశక్తి మెరుగుపడడమే కాకుండా.. ఉదర భాగంలో ఏర్పడే సమస్యలని సైతం తగ్గే అవకాశం ఉంది.

అయితే ఈ భంగిమను నిపుణుల పర్యవేక్షణలోనే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది అందరికి సాధ్యమయ్యే భంగిమ కాదు.

Abdominal Churning

మర్కటాసనం

పేరులోనే ఉంది కదా మర్కటం అని.. అందుకే దీనిని మంకి పోజ్ అని కూడా పిలుస్తుంటారు. ఈ భంగిమ ద్వారా మనకి ఉన్న వెన్నుముక ఆధారిత సమస్యలు పరిష్కారమవుతాయని అంటారు. 

ఈ భంగిమ ఎలా చేయాలంటే – మనం వీపుని భూమికి ఆనిస్తూ పడుకోవాలి. అలా పడుకున్న తరువాత మన రెండు కాళ్ళు జత చేసి ఒక వైపుకి పడుకోవాలి. ఆ తరువాత మన కాళ్ళని ముడుచుకోవాలి. ఇప్పుడు మన పక్కకి పడుకున్న వైపుకి వ్యతిరేకంగా మన తలని తిప్పి.. అటువైపే మన చేతిని ఉంచాలి. ఇలా ఒక వైపు దాదాపు 5 నిముషాలు ఉన్న తరువాత.. మన భంగిమని వేరే వైపుకి మార్చి.. మన తల & చేతులని మాత్రం దానికి వ్యతిరేకంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదే మర్కటాసనం.

ఇవి పవర్ యోగాకి సంబంధించిన రకరకాలైన & భంగిమలు.. వాటి వల్ల కలిగే ప్రయోజనాల వివరాలు.

మధుమేహం అంటే ఎందుకు భయం..? ఈ సలహాలు మీకోసమే ..!

Markatasana

పవర్ యోగా వల్ల ప్రయోజనాలు (benefits)

పవర్ యోగాని అనుసరిస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. దీనికి కారణం దాని వల్ల కలిగే ప్రయోజనాలు (Benefits). మరి ఇప్పుడు ఆ ప్రయోజనాలేమిటో మనం కూడా తెలుసుకుందాం.

* క్యాలరీలు ఖర్చు

పవర్ యోగా అనేది చాలా వేగంతో ముడిపడిన ప్రక్రియ. అందుకనే పవర్ యోగా చేసే సమయంలో చాలా క్యాలరీలు ఖర్చయి పోతుంటాయి. దీని కారణంగా మనం రోజువారీ ఖర్చు చేయాల్సిన క్యాలరీలు.. ఈ పవర్ యోగా చేయడం ద్వారా ఖర్చు అవుతాయన్నది నిజం.

* స్ట్రెంత్, స్టామినా, ఫ్లెక్సిబిలిటి

యోగా చేయడం వల్ల మన శరీరం ఫ్లెక్సిబుల్‌గా తయారైతే.. పవర్ యోగా చేయడం వల్ల  మన శరీరం ఎంతో దృఢంగా తయారవుతుంది.  ముఖ్యంగా  పవర్ యోగా మన శరీరంలోని వివిధ భాగాలను ప్రభావితం చేస్తుంది.

* ఊపిరితిత్తులకి బలం

పవర్ యోగాకి సంబంధించిన కొన్ని భంగిమల్లో వ్యాయామం చేయడం వల్ల.. ఊపిరితిత్తులకి బలం పెరుగుతుందని చెబుతారు.  అందుకు కారణం.. ఈ  ఆసనాలు అన్నీ కూడా శ్వాస తీసుకోవడం లేదా విడిచిపెట్టడం పై కేంద్రీకృతమై ఉండడమే.

* బరువు తగ్గడం

పవర్ యోగా చేయడం ద్వారా బరువు తగ్గవచ్చనే విషయం సాంకేతికంగా నిరూపితమైంది. దీని వల్ల మన  శరీరంలో పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోయే ఆస్కారం ఉంది. కొవ్వు కరగడంతో పాటు.. శరీరంలోని వివిధ భాగాలు సరైన ఆకారంలోకి రావడం వల్ల.. మనం అధిక బరువుని కోల్పోయి ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతాం.

* స్ట్రెస్ తగ్గడం

మనకి రోజువారీ కలిగే స్ట్రెస్‌ను క్రమం తప్పకుండా.. పవర్ యోగా చేయడంతో తగ్గించుకోవచ్చు. దీని ప్రధాన కారణం.. మనం శారీరక శ్రమ చేయడమే. ఒక పద్ధతి ప్రకారం శారీరక శ్రమ చేయడం వల్ల.. స్ట్రెస్ లెవెల్స్ అదుపులోకి వస్తాయట. అందుకనే చాలామంది రోజు వ్యాయామం చేయడం అనేదాన్ని దైనందిన కార్యక్రమాల్లో ఒకటిగా చూస్తారు. అలాగే పవర్ యోగాని చేయడం ద్వారా.. స్ట్రెస్ లెవెల్స్‌ని అదుపులోనూ పెట్టుకోవచ్చు.

* బ్లడ్ ప్రెజర్‌ని కంట్రోల్ చేస్తుంది

పవర్ యోగా చేయడం వల్ల కార్డియోవ్యాస్కులర్ వ్యాధుల నుండి బయట పడవచ్చు. అలాగే దాని ప్రభావం రక్తపోటు పై కూడా ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో పడుతుందని పలువురు తెలపడం గమనార్హం.

 

పవర్ యోగా చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఏదైనా వ్యాయామం చేసే ముందు..  మనం తీసుకోవాల్సిన పలు జాగ్రత్తల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే సరైన జాగ్రత్తలు తీసుకోకుండా.. ఇటువంటి వ్యాయామాలు చేస్తే.. ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. అందుకే మనం కూడా పవర్ యోగా చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

మనకు సౌకర్యంగా ఉండే వస్త్రాలు ధరించాలి

యోగా మ్యాట్ వాడాలి

యోగా చేసేముందు ఆహారం తీసుకోకపోవడం మంచిది

శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి

ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి

 

పవర్ యోగా గురించి తెలుసుకోవాల్సిన ప్రశ్నలు

పవర్ యోగా గురించిన అనేక సందేహాలు జనసామాన్యంలో ఉన్నాయి. వాటిలో ప్రముఖమైన వాటి గురించి ఇక్కడ ప్రస్తావించి వాటికి సమాధానాలు తెలుసుకుందాం…

వారంలో ఎన్ని సార్లు.. పవర్ యోగా చేస్తే మనం అనుకున్న ఫలితాలు పొందవచ్చు?

ఒక వారంలో కనిష్టంగా 2 నుండి 3 సార్లు & గరిష్టంగా 4 నుండి 5 సార్లు పవర్ యోగా చేయడం ద్వారా.. మనం దీని ద్వారా  సత్ఫలితాలను పొందడానికి వీలుంటుంది.

ఒక గంట సేపు పవర్ యోగా చేయడం ద్వారా.. ఎన్ని క్యాలరీలు ఖర్చవుతాయి?

పవర్ యోగా ఒక గంట పాటు చేయడం ద్వారా.. మనం 594 క్యాలరీలు ఖర్చు చేయవచ్చు.

పవర్ యోగా చేయడం ద్వారా.. అధిక బరువు నుండి ఉపశమనం పొందవచ్చా?

పవర్ యోగా చేయడం ద్వారా క్యాలరీలు ఖర్చు చేయవచ్చు. అలాగే శరీరాన్ని వేగంగా కదిలించడం వల్ల.. అనవసరపు కొవ్వు త్వరగా కరిగే అవకాశం ఉంది. అలాగే కార్డియో సమస్యలు తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా అధిక బరువు సమస్యని అధిగమించవచ్చు.

పవర్ యోగా చేయడానికి.. ఎలాంటి ఆరోగ్య పరిస్థితి ఉన్న వారు అర్హులు?

సాధారణ యోగా చేయడానికి అందరూ అర్హులే కాని… పవర్ యోగా చేయడానికి మాత్రం ఆరోగ్యంగా ఉన్నవారే అర్హులు. ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు.. తమ వైద్యుడి సలహా మేరకు మాత్రమే.. ఈ పవర్ యోగా చేయడానికి అర్హులు.

శిక్షకుల పర్యవేక్షణలోనే పవర్ యోగా చేయాల్సి ఉంటుందా?

అవును. పవర్ యోగాని సుక్షితులైన శిక్షకుల పర్యవేక్షణలోనే చేయాల్సి ఉంటుంది.

బెస్ట్ స్లీపింగ్ పొజిషన్స్ & వాటి వల్ల కలిగే ప్రయోజనాలు..!

Precautions while Power Yoga in Hindi

Read More From Health