అప్పుడే చదువు పూర్తి చేసుకొని ఉద్యోగంలో (job) చేరాలనుకునే గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కావచ్చు లేదా ఇంతకుముందే ఉద్యోగం చేస్తూ మార్పు (change) కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తి కావచ్చు… కెరీర్‌లో ముందుకు వెళ్లాలంటే ఉద్యోగాల కోసం వెతకడం ఎంతో అవసరం. ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు వెతుక్కోవడానికి కారణాలు వేరుగా ఉండొచ్చు. కొందరు ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వడం వల్ల ఉద్యోగం మారాలనుకుంటే.. మరికొందరు కొత్త విషయాలు నేర్చుకోవడం కోసం, ఇంకొందరు తమ జీతం పెరగడం కోసం కొత్త ఉద్యోగాలను అన్వేషిస్తూ ఉంటారు.
అయితే ఉద్యోగాలు మారడానికి ముఖ్యమైన నెలలేంటో మీకు తెలుసా? ముఖ్యమైన నెలలేంటి? అనుకుంటున్నారా? అవును. ఈ నెలల్లో ప్రయత్నిస్తే ఉద్యోగం తప్పకుండా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయట. మరి, ఆ నెలలేంటో.. మిగిలిన నెలల్లో ఉద్యోగాలు అంతగా దొరకకపోవడానికి గల కారణాలేంటో కూడా తెలుసుకుందాం రండి.
జనవరి, ఫిబ్రవరి, మార్చి
సంవత్సరంలో మొదటి మూడు నెలలు ఇవి. ఈ మూడు నెలల్లో ఉద్యోగం వెతుక్కోవడానికి ఎంతో అనువైనవి. డిసెంబరు తర్వాత.. కొత్త సంవత్సరం ప్రారంభమయ్యాక ప్రతి సంస్థ తమ బడ్జెట్ గురించి లెక్కలు కట్టి.. ఖాళీలను బట్టి ఎక్కువ మంది కొత్త ఉద్యోగులను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే చాలా కంపెనీలు ఈ మూడు నెలల్లో ఎక్కువ మందిని ఉద్యోగాలలోకి తీసుకుంటూ ఉంటాయి. మీ ప్రొఫైల్‌కి తగినట్లుగా చక్కటి ఉద్యోగాలు ఈ నెలల్లో లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
2020 లో మీ ఆనందం కోసం.. ఈ 20 మాటలు తప్పక చెప్పుకోండి..
ఏప్రిల్, మే, జూన్
మీరు మీ మొదటి ఉద్యోగం కోసం వేచి చూస్తున్నారా? లేదా మంచి సంస్థ, మంచి జీతం వంటివాటి కోసం ఉద్యోగం మారాలనుకుంటున్నారా? అయితే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మీరు ఉద్యోగం వెతకడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ నెలల్లో చాలామంది ఉద్యోగాలు మారుతూ ఉండడం వల్ల ఖాళీలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో మీకు ఎక్కువ జీతంతో పాటు వివిధ సదుపాయాలు కూడా అందించి.. సంస్థలు మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
జులై, ఆగస్టు, సెప్టెంబర్
ఈ మూడు నెలలు ఉద్యోగం దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయినప్పుడే సంస్థలు ఇంతమంది ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయించుకొని.. దానికి తగినట్లుగా అభ్యర్థులను కూడా ఎంచుకుంటాయి. వీరిలో ఫ్రెషర్లతో పాటు అనుభవం ఉన్నవారు కూడా ఉంటారు. అలాగే ఉద్యోగాల్లో అందరూ అప్పుడప్పుడే చేరి ఉంటారు. కాబట్టి కనీసం మూడు నెలల వరకూ ఎవరూ ఉద్యోగం వదిలేయడానికి ఆసక్తి చూపించరు. ఒకవేళ ఈ నెలల్లో ఎక్కడైనా ఉద్యోగాలు ఉన్నా.. పెద్దగా జీతం ఉండకపోవచ్చు. ఈ నెలల్లో ప్రతి ఒక్కరికీ జీతాలు పెరుగుతాయి కాబట్టి.. ఉద్యోగాలు వదిలేవాళ్లు తక్కువగా ఉంటారు.
అక్టోబర్, నవంబర్, డిసెంబర్
ఈ నెలల్లో చాలా ఎక్కువ పండగలు ఉంటాయి. పండగ నెలల్లో ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక స్థిరత్వం గురించి ఆలోచిస్తారు. జీతం రాకుండా ఒక్క నెలైనా గడిపే పరిస్థితి ఈ సందర్భాల్లో ఉండదు. కాబట్టి ఈ నెలల్లో ఉద్యోగం ఎవరూ మారరు. అయితే ఈ నెలల్లో మీడియా, అడ్వర్టైజింగ్ సంస్థలు, అవుట్ సోర్సింగ్ సంస్థలకు పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. వారు కొంతమందిని తీసుకోవడానికి ఆసక్తి చూపించే వీలుంటుంది.
ఇన్‌స్టాగ్రామ్ రెజ్యుమెతో.. ఇంటర్వ్యూ లేకుండా జాబ్ సంపాదించేసింది..!
ఉద్యోగం మారేముందు గుర్తుంచుకోవాల్సిన అంశాలు
1. ఉద్యోగం మారేముందు దానికి సంబంధించిన అన్ని అంశాలు గమనించడం మంచిది. అప్లై చేసే ముందే మీరు ఆ ఉద్యోగం చేయగలరా? లేదా? అన్న విషయం గుర్తించి.. ఒకవేళ చేయగలను అనుకుంటేనే దాన్ని ఒప్పుకోవడం మంచిది.
2. మీ లక్ష్యాలేంటో మీకు తెలిసి ఉండాలి. మీ జీవితంలో మీరు ఆ తర్వాత ఏం కావాలని కోరుకుంటున్నారో దానిపై మీకు స్పష్టత ఉండాలి. దాన్ని బట్టి మీరు మీ తదుపరి అడుగులు వేయాల్సి ఉంటుంది.
3. మీరు కొత్త ఉద్యోగం కావాలని కోరుకుంటున్నప్పుడు.. మీ నెట్ వర్క్ లోని వ్యక్తులతో మాట్లాడుతూ ఉండండి.. వాళ్లతో మాట్లాడడం వల్ల మీకు మంచి అవకాశాలు లభించే వీలుంటుంది.
4. మీ ఉద్యోగం వదిలిపెట్టాలి అనుకుంటున్నప్పుడు లేదా కొత్త ఉద్యోగంలో చేరుతున్నప్పుడు మీ సీనియర్లను కలిసి వారితో మాట్లాడడం మంచిది. మీరు చేయాలనుకుంటున్న విషయం గురించి వారితో చర్చించి వారి సలహాలు తీసుకోండి. ఆ తర్వాత మీకు మీరుగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
5. మీరు మీ కెరీర్‌లో ఎదగాలనుకుంటుంటే ఎప్పుడూ ఒకే ఉద్యోగంలో నిలిచిపోవడం సరికాదు. మీ నెట్ వర్క్‌ని పెంచుకోవడం.. కొత్త స్కిల్స్ నేర్చుకోవడం కూడా చేయాలి.
6. మీ బలాబలాల గురించి తెలుసుకొని వాటికి తగినట్లుగా మీ కెరీర్‌లో ముందుకు వెళ్లండి.
7. మీకు కొత్త ఉద్యోగం వచ్చింది కదా.. అని మీ పాత సంస్థలోని వారితో గొడవలు పెట్టుకోవడం సరికాదు. వారితో ఎప్పుడూ సఖ్యతగా ఉండడం మంచిది. మళ్లీ ఆ సంస్థలోనే మరో పొజిషన్‌లో చేరాల్సి వస్తుందేమో మీరెప్పుడూ చెప్పలేరు కాబట్టి.. వారితో మంచి సంబంధాలు పెంచుకోవడం మంచిది.
మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.