ఆరు సార్లు ప్రపంచ నెంబర్ 1 బాక్సర్‌గా టైటిల్ సాధించడం మాత్రమే కాదు.. మహిళల బాక్సింగ్‌లో ఆమె పేరిట ఉన్నవన్నీ మేటి రికార్డులే. ప్రపంచ ఉత్తమ మహిళా బాక్సర్లలో ఒకరిగా నిలిచిన మేరీ కోమ్ (Mary Kom).. ఒలింపిక్ క్రీడల్లో కూడా మన దేశానికి పతకం తీసుకువచ్చి.. చరిత్ర పుటలకెక్కిన సంగతి తెలిసిందే. ఆమెకు బాక్సింగ్‌తో పాటు మరో టాలెంట్ కూడా ఉందట. ఆ విషయం నిన్ననే ప్రపంచానికి తెలిసింది.
అయితే ఆ టాలెంట్ గురించి ఎక్కువమందికి తెలియకపోవడంతో.. అందరూ ఒక్కసారి షాక్ అయ్యారనే చెప్పాలి. ఇంతకీ ఆమెలో ఉన్న ఆ సీక్రెట్ టాలెంట్ ఏమిటో తెలుసా – పాటలు పాడడం. ఈ టాలెంట్ బయటపడింది గోవాలో కావడం విశేషం. ఇంతకి ఆమె తన సింగింగ్ టాలెంట్‌ని గోవాలో ఎందుకు ప్రదర్శించాల్సి వచ్చింది? అసలు మేరీ కోమ్ గోవాకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మొదలైన ప్రశ్నలకు మనమూ సమాధానాలు తెలుసుకుందామా..!
ప్రతియేడు మన దేశంలో గోవా ఫెస్ట్ (Goa Fest) పేరిట మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. మన దేశంలోని ప్రముఖ అడ్వర్టైజింగ్ కంపెనీలు అన్ని ఒక చోట చేరి.. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్తలతో చర్చాగోష్టులు నిర్వహిస్తుంటాయి. ఈ ఈవెంట్‌ని ప్రతి సంవత్సరం గోవాలో అడ్వర్టైజింగ్ ఏజెన్సెస్ అసోసియేషన్ అఫ్ ఇండియా నిర్వహిస్తూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ గోవా ఫస్ట్ ఏప్రిల్ 11 నుండి 13 వరకు జరిగింది.
ఈ ఏడాది ఈ ఉత్సవానికి ప్రముఖ క్రీడాకారులైన వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag), మేరీ కోమ్‌లని మాత్రమే కాకుండా.. బాలీవుడ్ ప్రముఖులు కల్కి మరియు పంకజ్ త్రిపాఠీలని కూడా ముఖ్య అతిధులుగా ఆహ్వానించారు. ఆ సందర్భంగా బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కోమ్ తనలో దాగున్న టాలెంట్‌ని ప్రపంచానికి పరిచయం చేశారు.
అమెరికాకి చెందిన రాక్ బ్యాండ్ 4 నాన్ బ్లాండ్స్ (4 Non Blondes) క్లాసిక్ పాట – వాట్స్ అప్‌ని (Whats Up!) ఆమె పాడగా.. ఆహూతులంతా ఆమెతో పాటు గొంతు కలపడం జరిగింది. అయితే ఆమె ఇలా ఒక ఈవెంట్‌లో పాడడం తొలిసారేమి కాదు!
గత ఏడాది కూడా ఒక ఈవెంట్‌లో ప్రముఖ లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ (Latha Mangeshkar) ఆలపించిన “అజీబ్ దాస్తా హై యే” అనే క్లాసిక్ పాటని… మేరీ కోమ్ పాడి శ్రోతలని అలరించారు. ఇటీవలే జరిగిన గోవా ఫెస్ట్‌లో మరోసారి తనలోని గాయనీమణిని బయటకి తీసుకువచ్చిన మేరీ కోమ్.. బాక్సింగ్‌లోనే కాదు.. తాను పాడడంలో కూడా నెంబర్ 1 అని నిరూపించుకోవడం విశేషం.
ఈ గోవా ఫెస్ట్‌లో భాగంగా మేరీ కోమ్ మహిళల కోసం ఓ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం కూడా చేశారు. బాక్సింగ్‌లో మహిళలు రాణించాలంటే ఏమి చేయాలి? అందుకు ఎలా కష్టపడాలి అనే అంశాల పైన సుదీర్ఘంగా మాట్లాడారు. భవిష్యత్తులో ఛాంపియన్స్ రాకపోతే అది ప్రభుత్వం లేదా అసోసియేషన్స్ తప్పు కాదని.. కేవలం అథ్లెట్స్ సరిగ్గా కష్టపడకపోవడమే అని కూడా తేల్చి చెప్పారు.
ఇక తాను బాక్సింగ్ రంగంలోకి రావడానికి ప్రేరణ లెజెండరీ బాక్సర్ మహమ్మద్ అలీ అని మేరీ కోమ్ తెలిపారు. సినిమా నటులైన జాకీ చాన్ & అక్షయ్ కుమార్‌లు చిత్రాల్లో చేసిన యాక్షన్ స్టంట్స్ సైతం తనకు స్ఫూర్తిగా నిలిచాయని మేరీ కోమ్ చెప్పడం గమనార్హం.
ఇవి కూడా చదవండి
#POPxoTeluguExclusive చదరంగం.. నా జీవితంలో అంతర్భాగం: పద్మశ్రీ గ్రహీత హారిక ద్రోణవల్లితో ముఖాముఖి
#POPxoWomenWantMore ఏడాదిలో ఒక్క రోజు కాదు.. రోజూ మహిళలదే: నిఖత్ జరీన్
అమ్మాయిలను మనుషులుగా చూడండి.. మార్పు అదే వస్తుంది: నీలిమ పూదోట