Health
చామంతి పువ్వా… పువ్వా… నీతో నోరూరించే ఛాయ్ పెట్టనా..! (Chamomile Tea Benefits For Skin And Hair)
మన తెలుగు రాష్ట్రాల్లో టీ వినియోగం చాలా ఎక్కువనే చెప్పాలి. రోజు టీ తాగనిదే చాలామందికి రోజు మొదలవ్వదు. తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి, కాస్త రీఫ్రెష్ అవ్వడానికి ఎక్కువ మంది టీనే ఆశ్రయిస్తారు. నేను కూడా అంతే. నిద్ర మత్తులో జోగుతున్న నా మెదడుని మేల్కొల్పడానికి నేను టీ తాగుతాను. అసలు ఈ టీ విశేషాలేంటో తెలుసుకోవాలని ఓ రోజు నేను ఓ చిన్నపాటి పరిశోధనే చేశాను. అప్పుడే టీలో ఎన్ని రకాలున్నాయో తెలిసింది. గ్రీన్ టీ, బ్లాక్ టీ, మసాలా టీ వీటి గురించి మనకు బాగా తెలుసు. కానీ వైట్ టీ, బ్లూ టీ, హెర్బల్ టీ, రోజ్ టీ, గ్రే టీ, డిటాక్స్ టీ, ఫర్మెంటెడ్ టీ.. ఇలా ఎన్నో రకాలైన టీల గురించి తెలుసుకొన్నాను. వీటన్నింటిలోనూ నన్ను చమోమిలే టీ (Chamomile tea) బ ాగా ఆకర్షించింది.
చమోమిలే అంటే చామంతి పువ్వు అని అర్థం. చామంతి పూలతో టీ ఏంటి? అని మొదట ఆశ్చర్యపోయినా.. ఆ తర్వాత దానివల్ల కలిగే ఆరోగ్యఫలితాలను పరిశీలించాక ఇన్ని రోజులు నాకు ఈ చామంతి టీ గురించి ఎందుకు తెలియలేదే అనుకొన్నా. ఆరోగ్యపరంగా మాత్రమే కాదు.. సౌందర్యపరంగానూ దీని వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. సాధారణంగా టీ అంటే ఆకులతో చేస్తారు. కానీ ఈ టీ మాత్రం పూరేకలతో తయారుచేస్తారు. అది కూడా తెల్లటి పూరేకలను కలిగిన గడ్డి లేదా సీమ చామంతితో. ఆసక్తిగా అనిపిస్తోంది కదా.. రండి మరిన్ని విషయాలు తెలుసుకొందాం.
చామంతి టీ వల్ల కలిగే ప్రయోజనాలేంటి?
చామంతి టీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా?
చామంతి టీ కథేంటి? (Chamomile Tea)
చామంతి కఫాన్ని తగ్గిస్తుంది. దీని సువాసన ఒత్తిడిని తగ్గించి మనసుని శాంతిపజేస్తుంది. అందుకే దీనికి ఆయుర్వేదంలో చాలా ప్రాధాన్యాన్ని కల్పించారు. మనకు అందుబాటులో ఎన్నో రకాలు చామంతులు ఉన్నప్పటికీ టీ తయారుచేయడానికి మాత్రం ప్రత్యేకమైన రకాన్ని మాత్రమే వినియోగిస్తారు. తెల్లని పూరేకులు కలిగి చిన్న సైజులో పూచే చామంతి పూలను ఎండబెట్టి టీ తయారుచేయడానికి ఉపయోగిస్తారు. ఇవి సాధారణంగా వేసవిలో పూస్తాయి. ఆసియా, ఆస్ట్రేలియా, ఐరోపా, ఉత్తర అమెరికా ఖండాల్లో ఎక్కువగా ఇవి లభిస్తాయి. ఈ పూలలోని చామాజ్యులెన్ అనే రసాయనం బాధా నివారిణిగా పనిచేస్తుంది. కండర సంకోచాన్ని నివారిస్తుంది. అలాగే దీనిలో ఒత్తిడిని తగ్గించే లక్షణాలున్నాయి. ఒక కప్పు చామంతిటీ తాగడం వల్ల జలుబు తగ్గుతుంది. రోజంతా పనిలో మునిగిపోయి తీవ్రమైన ఒత్తిడికి గురయినప్పుడు ఈ చామంతి టీ తాగితే చక్కటి ఉపశమనం కలుగుతుంది. అంతే కాకుండా చర్మం, కేశ సౌందర్యానికి కూడా మేలు చేస్తుంది. అందుకే ఇటీవలి కాలంలో చాలామంది చామంతి టీ తాగడానికి ఇష్టపడుతున్నారు. అరె.. మీక్కూడా చామంతి టీ తాగాలనిపిస్తోంది కదా.. అయితే మీరు దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే.
చామంతి టీ వల్ల కలిగే ప్రయోజనాలేంటి? (Benefits Of Chamomile Tea)
ఔషధపరమైన గుణాలను కలిగి ఉండటం వల్ల చామంతి టీ ఇటీవలి కాలంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందుతోంది. మిగిలిన టీల మాదిరిగా దీనిలో కెఫీన్ ఉండదు. ఈ టీ తాగడం వల్ల నరాలు, కండరాలు రిలాక్సవుతాయి. దీనిలో ఒత్తిడిని తగ్గించే గుణాలున్నాయి. అలాగే థైరాయిడ్, రొమ్ము క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది.
Also Read: తులసి ఆకుల వల్ల చర్మానికి అందే ప్రయోజనాలు (Benefits Of Basil Leaves For Skin)
నిద్ర బాగా పట్టడానికి (Sleep Well)
ఇన్సోమ్నియా.. అంటే నిద్రలేమి. పనిపరమైన ఒత్తిళ్లు, ఆరోగ్యపరమైన సమస్యల కారణంగా ఇటీవలి కాలంలో నిద్రలేమితో బాధపడుతున్నవారి సంఖ్య ఎక్కువ అవుతోంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలామంది మాత్రలను ఆశ్రయిస్తున్నారు. మీకు కూడా ఈ సమస్య ఉన్నట్లయితే నిద్రపోయే ముందు ఓ కప్పు చామంతి టీ తాగండి. ఇది మీ నరాలను, నరమండలంపై ఉన్నఒత్తిడిని తగ్గిస్తుంది. ఫలితంగా చక్కటి నిద్ర మీ సొంతమవుతుంది. మీకు నిద్రలేమి సమస్య లేకపోయినప్పటికీ ఈ టీ తాగడం వల్ల మీ నిద్ర మెరుగవుతుంది.
ఒత్తిడి తగ్గించడానికి (Reduce Stress)
మహిళలు ఇటీవలి కాలంలో ఇంటా బయటా తమ హవా కొనసాగిస్తున్నారు. రెండు చోట్లా చక్కటి పనితీరు కనబరుస్తున్నారు. ఫలితంగా విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు. రోజూ కప్పు చామంతి టీ తాగడం వల్ల ఈ సమస్య నుంచి క్రమంగా బయటపడొచ్చు.
గ్రీన్‌టీ ఆరోగ్య ప్రయోజనాలు (Benefits Of Green Tea)
బరువు తగ్గడానికి (Weight Loss)
నిజమేనండి.. చామంతి టీ తాగడం వల్ల బరువు కచ్చితంగా తగ్గుతుంది. భోజనం చేసేముందు కప్పు చామంతి టీ తాగడం వల్ల ఈ ఫలితం కలుగుతుంది. ఈ టీ జీర్ణ రసాలను ఉత్తేజితం చేసి ఆహారాన్ని పూర్తిగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఫలితంగా శరీరంలో కొవ్వు మెల్లగా కరగడం ప్రారంభమవుతుంది. నిద్రపోయే ముందు తాగడం వల్ల శరీర బరువుని పెంచడానికి తోడ్పడే హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రిస్తుంది. అయితే ఇక్కడ మీరు మరో విషయం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. కేవలం చామంతి టీ తాగడం వల్ల మాత్రమే మీ బరువు అదుపులోకి రాదు. ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారానికి తోడుగా ఈ టీ తీసుకోవడం ద్వారా మీరు కోరుకొన్న ఫలితాలు పొందగలుగుతారు.
వ్యాధినిరోధక శక్తి పెరగడానికి (Improves Immune System)
రుతువులు మారే సమయంలో మన వ్యాధి నిరోధక శక్తి తగ్గుముఖం పడుతుంది. ఆ సమయంలో మనకు జలుబు, జ్వరం, ఫ్లూ, గొంతు బొంగురు పోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. వీటిని నివారించడానికి చామంతి టీ బాగా ఉపయోగపడుతుంది.
చర్మం, కురులు సౌందర్యానికి (Improves Skin)
సోరియాసిస్, ఎగ్జిమా వంటి చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనానికి రోమన్లు, గ్రీకులు, ఈజిప్టియన్లు చామంతి టీనే ఉపయోగించేవారట. ఈ టీ వయసు కారణంగా చర్మంపై ఏర్పడే ముడతలను తగ్గిస్తుంది. అలాగే కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలు, మొటిమలు, ట్యాన్ వంటి సమస్యలను చామంతి టీ తగ్గిస్తుంది. అంతేకాదు చుండ్రుని సైతం తగ్గిస్తుంది.
కండరాల నొప్పులు తగ్గడానికి (Reduce Muscle Ache)
నెలసరి సమయంలో నడుం, పొత్తికడుపులో నొప్పి వంటి సమస్యలు మనల్ని బాధిస్తాయి. కాబట్టి ఆ సమయంలో చామంతి టీ తాగడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. ఈ టీలోని ఔషధ గుణాలు గర్భాశయ కండరాలను శాంతింపచేస్తాయి. అలాగే ఆ సమయంలో నొప్పి రావడానికి కారణమైన ప్రొస్టాగ్లాండిన్స్ ఉత్పత్తిని తగ్గిస్తాయి.
ఆహారం జీర్ణమవ్వడానికి (Helps In Digesting Food)
ఎప్పుడైనా కడుపు నొప్పితో బాధపడుతుంటే.. వేడి వేడిగా కప్పు చామంతి టీ తాగి చూడండి. ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు అల్సర్ కారణంగా వచ్చే నొప్పికి సైతం ఉపశమనాన్ని అందిస్తుంది. అలాగే ఆహారం సరిగ్గా జీర్ణమవ్వకపోవడం, డయేరియా, వాంతులు, వికారం, ఆకలి లేకపోవడం వంటి జీర్ణసంబంధమైన సమస్యలను చామంతి టీ తాగడం ద్వారా తగ్గించుకోవచ్చు.
చామంతి టీ ఉపయోగాలను ఆంగ్లంలో చదవండి
చామంతి టీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? (Side Effects Of Chamomile Tea)
చామంతి టీ తాగడం వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో.. అన్నే దుష్పరిణామాలు కలిగే అవకాశం కూడా ఉంది. అవేంటంటే..
- చామంతి, బంతి జాతి పువ్వులు మీకు అలర్జీలను కలిగించేవైతే.. మీరు చామంతి టీకి దూరంగా ఉండాల్సిందే. ఎందుకంటే.. ఈ జాతి పుష్పాల కారణంగా అలర్జీకి గురయ్యే వారు ఈ టీని తాగడం వల్ల దురదలు, గొంతు వాచిపోవడం, శ్వాస సరిగ్గా తీసుకోలేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
- గర్బంతో ఉన్న మహిళలు, పాలిచ్చే తల్లులు ఈ టీ తాగాలనుకొంటే.. ముందుగా మీ వైద్యురాలిని సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
- రక్తం గడ్డ కట్టడాన్ని నివారించే హెపారిన్, వార్ఫారిన్ వంటి మందులను మీరు ఉపయోగిస్తున్నట్లయితే చామంతి టీకి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే ఈ టీలో రక్తాన్ని పలుచగా చేసే గుణాలుంటాయి. ఫలితంగా అంతర్గతంగా రక్తస్రావం అయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ మందులు తీసుకొనేవారు వైద్యులను సంప్రదించిన తర్వాతే చామంతి టీ తాగాలా? వద్దా?అని నిర్ణయం తీసుకోండి.
- చామంతి టీ వల్ల ప్రయోజనాలున్నాయి కదా అని ఎక్కువ మొత్తంలో తాగడం వల్ల వాంతులయ్యే అవకాశం ఉంది. అందుకే తక్కువ సార్లు తక్కువ మోతాదులో చామంతి టీ తాాగాల్సి ఉంటుంది.
చామంతి టీని ఎంచుకోవడం, భద్రపరచడం ఎలా? (How To Store Chamomile Tea)
చామంతి టీని మీరు కొనాలనుకొంటే.. నమ్మకమైన కిరాణా దుకాణం నుంచి లేదా హెర్భల్ ఉత్పత్తుల అమ్మకం దారుల వద్ద కొనుగోలు చేయండి. అయితే దీన్ని కొనే ముందు మీరు కొన్ని విషయాలు గమనించాలి. అవేంటంటే ప్యాకెట్లో ఎండబెట్టిన చామంతి పూలు అలాగే ఉన్నాయా లేదా ప్రాసెస్ చేసి పొడిగా మార్చారా? అని తెలుసుకోవాలి. వీలైనంత వరకు ఎండబెట్టిన పూలను ప్యాక్ చేసినవే తీసుకోండి. ఎందుకంటే పొడిగా మార్చిన చామంతి టీ ద్వారా మనకు అన్ని లాభాలు మనకు కలగకపోవచ్చు. కొనుగోలు చేసే విషయంలోనే కాదు.. దాన్ని భద్రపరిచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేదంటే పురుగులు పట్టి వినియోగానికి పనికి రాకవపోవచ్చు. అందుకే పొడిగా ఉన్న గాలి చొరబడని డబ్బాలో వాటిని నిల్వ ఉంచాలి.
చామంతి టీ రెసిపీ (Recipe)
- గిన్నెలో నీరు తీసుకొని దాన్ని బాగా వేడి చేయాలి. నీరు వేడెక్కిన తర్వాత కొద్దిగా బెల్లాన్ని జోడించాలి. లేదంటే.. తీపి కోసం చక్కెర, ఆర్టిఫిషియల్ స్వీట్నర్ వంటి వాటిని ఉపయోగించవచ్చు.
- తర్వాత అందులో కొద్దిగా ఎండబెట్టిన చామంతి పూలను వేయండి.
- గిన్నె పై మూత పెట్టి రెండు నుంచి పది నిమిషాల పాటు తక్కువ సెగపై మరగనివ్వాలి. మీరు ఎంత స్ట్రాంగ్‌గా కావాలంటే అంత సేపు మరగపెట్టాలి.
- మీకు నచ్చిన మోతాదులో రంగు, వాసన వచ్చిన తర్వాత వడపోసి నిమ్మరసం కలిపి టీ తాగాలి. కావాలనుకొంటే.. తీపి కోసం తేనె కూడా కలుపుకోవచ్చు.
చర్మ సౌందర్యం కోసం చామంతి టీ (Chamomile Tea For Skin)
చామంతి టీలో సహజసిద్ధమైన మాయిశ్చరైజింగ్ గుణాలున్నాయి. ఇది మంచి క్లెన్సర్‌గానూ పనిచేస్తుంది. ఒకప్పుడు ఈజిప్టియన్లు, రోమన్లు, గ్రీకులు చర్మంపై ఉన్న గాయాలు, ఇతర మచ్చలను తగ్గించుకోవడానికి చామంతి పూలనే ఉపయోగించేవారట. క్రమం తప్పకుండా రోజూ చామంతి టీ తాగితే మీ చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. చర్మంపై ఏర్పడిన గీతలు.. వయసు కారణంగా ఏర్పడిన ముడతలు తగ్గుముఖం పడతాయి. అలాగే సూర్యకిరణాల ప్రభావం పడకుండా కాపాడుతుంది. ఇది సహజసిద్ధమైన స్క్రబ్‌గా పనిచేస్తుంది. కళ్ల కింద ఏర్పడిన నల్లటి వలయాలను తగ్గిస్తుంది.
బేకింగ్ సోడా వల్ల కలిగే సౌందర్య ప్రయోజనాలు
మొటిమలను తగ్గిస్తుంది (Reduces Acne)
చామంతి టీలోని ఔషధ గుణాలు రక్తంలోని మలినాలను బయటకు పంపిస్తాయి. ఫలితంగా ముఖంపై మొటిమలు తగ్గుముఖం పడతాయి. అందుకే రోజూ చామంతి టీ తాగడాన్ని అలవాటుగా చేసుకోండి. టీ పెట్టిన తర్వాత మిగిలిన పిప్పిని ఫేస్ ప్యాక్‌లో కలిపి ముఖానికి అప్లై చేసుకొన్నా కూడా మంచి ఫలితం కనిపిస్తుంది.
చుండ్రు సమస్య పోగొడుతుంది (Dandruff)
జీవనశైలి మార్పులు, వాతావరణ ప్రభావం కారణంగా నేటి తరం యువతులు జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం చుండ్రు. చామంతి టీ చుండ్రు, దాని కారణంగా వచ్చే దురద సమస్యలకు చెక్ పెడుతుంది. హెన్నఫేస్ మాస్క్ ాలో చామంతి టీ కలిపి దాన్ని తలకు అప్లై చేసుకోవాలి. రెండు గంటల తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య వదిలిపోతుంది.
కురులకు కొత్త కాంతులు.. (Provides Golden Colour To Hair)
జుట్టుకు తమకు నచ్చిన రంగుల హొయలును అద్దుతున్నారు నేటి తరం యువతులు. చామంతి టీతో సహజసిద్ధంగా వాటిని మీ కురులకు అందించవచ్చు. బంగారు వర్ణంలో మీ కురులు మెరిసిపోవాలంటే.. తలస్నానం చేసిన తర్వాత కప్పు చామంతి టీతో జుట్టును కడగాలి. బ్రౌన్ రంగు జుట్టు కావాలనుకొంటే.. చామంతి టీతో హెన్నా కలిపి దాన్ని తలకు అప్లై చేసుకోవాలి. ఆరిన తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది.
చామంతి టీ ఎలా తయారుచేయాలి? (How To Make Chamomile Tea Face Mask)
మీకు టీ తాగడం అలవాటు లేదా? మరి చర్మ సౌందర్యం మెరుగుపరచుకోవడమెలా? అని ఆలోచిస్తున్నారా? మీకోసమే చామంతి టీతో వేసుకోదగిన ఫేస్ ప్యాక్స్ గురించి తెలుసుకొందాం.
చామంతి-బాదం ఫేస్ మాస్క్ (Almond Face Mask)
టీ స్పూన్ చామంతి టీ పొడి, టీస్పూన్ ఓట్స్, అర టీస్పూన్ తేనె, మూడు చుక్కల బాదం నూనె తీసుకొని.. వీటన్నింటినీ మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసుకొని గుండ్రంగా కాసేపు రుద్దుకోవాలి. ఆ తర్వాత 10-20 నిమిషాల పాటు ఆరనిచ్చి చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
చామంతి – ఓట్ మీల్ ఫేస్ మాస్క్ (Oatmeal Face Mask)
అరకప్పు ఓట్స్, టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అర చెంచా తేనె, ఒకటిన్నర చెంచా పంచదార తీసుకోవాలి. వీటిని పావు కప్పు చామంతి టీతో కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. దీన్ని ముఖానికి మాస్క్‌లా అప్లై చేసి పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
చామంతి – ఆలివ్ నూనె ఫేస్ మాస్క్ (Olive Oil Face Mask)
పావు కప్పు ఆలివ్ నూనెలో అరకప్పు పంచదార, చెంచా చామంతి టీ పొడి కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసుకొని గుండ్రంగా రుద్దుకోవాలి. 10-20 నిమిషాలు ఆరనిచ్చిన తర్వాత నీటితో కడిగేస్తే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని ఎక్కువ మొత్తంలో తయారుచేసుకొని గాలి చొరబడని గాజు డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు.
చామంతి- కొబ్బరి నూనె ఫేస్ మాస్క్ (Coconut Oil Face Mask)
చామంతి టీ బ్యాగు ఒకటి తీసుకొని దాన్నుంచి టీ పొడిని వేరుచేయాలి. దీనికి రెండు చెంచాల గడ్డ కట్టిన కొబ్బరి నూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని రుద్దుకోవాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకొంటే సరిపోతుంది.
చామంతి టీ బ్యాగుల పునర్వినియోగం ఎలా? (How To Recycle Chamomile Tea Bags)
చామంతి టీ పొడి, పువ్వుల రూపంలోనే కాకుండా టీ బ్యాగుల గానూ లభ్యమవుతుంది. మరి వీటిని పారేయడమేనా.. గ్రీన్ టీ మాదిరిగా పునర్వినియోగించుకోవచ్చా? అంటే కచ్చితంగా వాడుకోవచ్చు. టీ కోసం బ్యాగులను వినియోగించిన తర్వాత వాటిని ఫ్రిజ్ లో దాచి ఉంచండి. వీటిని ఫేస్ మాస్క్‌ల్లో ఉపయోగించవచ్చు. టీ బ్యాగుల్లోని టీ పొడిని నీటిలో కలిపి ఐస్ ట్రేలో వేసి డీప్ ఫ్రీజ్‌లో ఉంచండి. సూర్యతాపానికి గురైన చర్మానికి ఉపశమనం అందించడానికి వీటిని ఉపయోగించవచ్చు. నిద్రలేమి కారణంగా కొన్ని సందర్భాల్లో కళ్లు ఉబ్బినట్టుగా తయారవుతాయి. అలాంటప్పుడు ఫ్రిజ్‌లో ఉంచిన టీ బ్యాగును కళ్లపై ఉంచితే వాపు తగ్గుతుంది. షూ నుంచి వచ్చే దుర్వాసనను పోగొట్టడానికి వాడేసిన చామంతి టీ బ్యాగుని అందులో ఉంచితే సరిపోతుంది.
వావ్..! చామంతి టీ వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా? అని ఆశ్చర్యపోతున్నారా? అయితే మరింకెందుకాలస్యం.. మంచి బ్రాండ్ చమోమిలే టీ ఎంచుకొని.. చక్కగా ఆ టీ రుచిని ఆస్వాదించేద్దాం.
Awesome News! POPxo Shop ఇప్పుడు మీ కోసం తెరుచుకొంది. సూపర్ ఫన్ మగ్స్, బ్యాగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, ల్యాప్ ట్యాప్ స్లీవ్స్ వంటివన్నీ 25% డిస్కౌంట్ తో లభిస్తున్నాయి. POPXOFIRST కూపన్ కోడ్ ఉపయోగించి షాపింగ్ చేయండి.