హైదరాబాద్ బిర్యాని (Hyderabad Biryani) అంటే తెలియని భోజన ప్రేమికులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో బిర్యాని లభించే పరిస్థితి ఉన్నప్పటికి.. హైదరాబాద్‌లో దొరికే బిర్యాని రుచే వేరు. అటువంటి బిర్యానికి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆదరణ తగ్గుతుందా? అన్న ప్రశ్న ఇప్పుడు భాగ్యనగర భోజన ప్రేమికుల మదిలో మెదులుతోంది.
అదేంటి! బిర్యాని ప్రాభవం తగ్గిపోవడమేంటి అనే సందేహం మీకు కూడా కలగచ్చు. అయితే ఆ ప్రశ్న ఉత్పన్నం కావడానికి ప్రధమ కారణం – హైదరాబాద్‌లో ఇప్పుడు విరివిగా లభిస్తున్న అరబిక్ వంటకం “మండి”కి (Mandi) రోజురోజుకి ఆదరణ పెరుగుతుండడం. అదే సమయంలో యువత ప్రధానంగా ఈ ‘మండి’ వంటకం వైపు ఆకర్షితులవుతున్న నేపథ్యంలో చాలా చోట్ల ‘అరబిక్’ రెస్టారెంట్స్ (Arabic Restaurents) కూడా వెలుస్తున్నాయి. దాదాపుగా హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లో 50 నుండి 70 వరకు అరబిక్ రెస్టారెంట్స్ ప్రజలకి అందుబాటులోకి వచ్చాయి.
Source: Zomato
అసలు ఈ “మండి” అంటే ఏంటి? ఇది ఎప్పటి నుండో ప్రాచుర్యంలో ఉన్న బిర్యానికి చెక్ పెట్టడమేంటి? అనే ప్రశ్నలకి మనమూ సమాధానం తెలుసుకుందాం
యెమన్ దేశంలో బాగా ప్రాచుర్యం పొందిన ఈ వంటకం.. ఆ తరువాత కాలంలో ప్రపంచంలో పలు ప్రాంతాలకి విస్తరించడం జరిగింది. అలా ఈ వంటకం మన దేశంలో కేరళ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు. మన హైదరాబాద్‌కి కూడా వచ్చి చేరింది. అయితే బిర్యానికి.. ఈ మండికి ఓ ప్రధానమైన తేడా ఉంది. మాంసంతో పాటుగా బియ్యం ఉడకపెట్టడం బిర్యానిలో భాగం అయితే.. ఈ మండి వంటకంలో ముందుగా మాంసాన్ని ఉడకపెట్టడం విశేషం. తద్వారా వచ్చిన ద్రవంలో బియ్యాన్ని ఉడకపెట్టడం జరుగుతుంది. అది అన్నానికి ఒక ప్రత్యేకమైన రుచిని తీసుకొస్తుంది. ఇది ఈ రెండు వంటకాల మధ్య ఉన్న ప్రధాన తేడా!
ఇక మండిలో ఉపయోగించే మాంసాన్ని తందూరి స్టైల్లో ఉడకపెట్టడం కూడా.. దానికి పేరు రావడానికి ప్రధాన కారణం. అయితే బిర్యానిలలో ఎలాగైతే చికెన్, మటన్, ఫిష్ అని వివిధ క్యాటగరీలు ఉంటాయో.. ఇప్పుడు మండి వంటకంలో కూడా అవే క్యాటగరీలు భోజన ప్రియులకి అందుబాటులో ఉన్నాయి. దీనితో ఒకప్పుడు బిర్యాని కోసం ఎలాగైతే ప్రజానీకం ఆసక్తి చూపేవారో.. ఇప్పుడు అదే స్థాయిలో ‘మండి’కి సైతం ఆకర్షితులవుతున్నారు.
Source: Zomato
ఇక ఈ మండి వంటకం ప్రజల్లోకి ఇంతగా చొచ్చుకు పోవడానికి కారణం – అరబిక్ పద్దతిలో ఒక పెద్ద ప్లేట్లో కుటుంబసభ్యులంతా కలిసి భోజనం చేసే సౌలభ్యం ఉండడం. హైదరాబాద్‌లో కూడా అదే పద్దతిలో పలు రెస్టారెంట్స్ కస్టమర్లకు ‘మండి’ని సరఫరా చేస్తున్నాయి. ఈ క్రమంలో సామాన్య ప్రజానీకం తమ కుటుంబ సభ్యులందరితో కలిసి వెళ్ళి ఈ ‘మండి’ని రుచి చూసి వస్తున్నారు.
రంజాన్ మాసంలో హైదరాబాద్ అంతటా కూడా.. వివిధ మాంసాహార వంటకాలు ప్రజలకి అందుబాటులోకి వస్తుంటాయి. అటువంటిది గత కొంతకాలంగా ఈ ‘మండి’కి ప్రజాదరణ బాగానే వచ్చిన నేపథ్యంలో, ఈ సీజన్లో మరింత ఫాలోయింగ్ పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
అయితే ఎన్ని వంటకాలు వచ్చినా.. హైదరాబాద్ బిర్యాని ముందు ఎక్కువ కాలం నిలబడలేవని కొందరు భోజన ప్రేమికులు అంటున్నారు!
ఒకప్పుడు హైదరాబాద్ అంటే కేవలం బిర్యానికి మాత్రమే పెట్టింది పేరు. కానీ ఇప్పుడు దానికి తోడుగా ‘మండి’ కూడా చేరింది. ఏదైతేనేం.. కడుపునిండా తినడానికి రెండు ప్రత్యేకమైన వంటకాలు ఉండడం మనకు సంతోషకరమైన వార్తే కదా!
హైదరాబాద్‌లో మండి రైస్‌ను సరఫరా చేస్తున్న ప్రముఖ రెస్టారెంట్స్ మీకోసం
1.అరేబియన్ మండి, నాచారం ఎక్స్ రోడ్స్, హబ్సీగూడా, హైదరాబాద్
2.మండీ కింగ్, అంజయ్య నగర్, కొండాపూర్, హైదరాబాద్
3.మండీ కింగ్ అరబిక్ రెస్టారెంట్, మెహదీపట్నం, హైదరాబాద్
4.అల్ అరేబియన్ మండి, కోఠి, హైదరాబాద్
5.మండీ దర్బార్, మలక్ పేట, హైదరాబాద్
6.మండీ 36, జూబ్లీహిల్స్, హైదరాబాద్
7.జఫ్రన్ మతామ్ అల్ మండీ, ఫలక్ నామా, హైదరాబాద్
8.అల్ సౌత్ బయత్ అల్ మండి, ఎర్రగుంట, చాంద్రాయణగుట్ట, హైదరాబాద్
9.మెహఫిల్ మండీ హౌస్, అత్తాపూర్, హైదరాబాద్
10.షా గౌస్ కేఫ్ అండ్ రెస్టారెంట్, టోలీచౌక్, సాలర్ జంగ్ కాలనీ, హైదరాబాద్
Featured Images: Zomato
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో లభ్యమవుతోంది: ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ మరియు బెంగాలీ
కలర్ ఫుల్‌గా, క్యూట్‌గా ఉండే వస్తువులను మీరూ ఇష్టపడతారా? అయితే సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ ఇంకా మరెన్నో.. వాటికోసం POPxo Shop ని సందర్శించండి !
ఇవి కూడా చదవండి
హైదరాబాద్‌లో బెస్ట్ ‘హలీమ్’ రుచి చూడాలంటే.. ఈ 10 హోటల్స్‌కి వెళ్లాల్సిందే..!
మరో సరికొత్త రికార్డు సాధించిన.. హైదరాబాద్ ప్యారడైజ్ బిర్యానీ