Bollywood

లక్ష్మి నాకు ఒక ప్రేరణ.. ఆమె కథ నా మనసుకు దగ్గరైంది : దీపిక ప‌దుకొణె

Soujanya Gangam  |  Mar 25, 2019
లక్ష్మి నాకు ఒక ప్రేరణ.. ఆమె కథ నా మనసుకు దగ్గరైంది : దీపిక ప‌దుకొణె

ఛాపాక్‌ (Chhapaak).. దీపికా ప‌దుకొణె (Deepika padukone) న‌టిస్తోన్న కొత్త చిత్రం.. మేఘ‌నా గుల్జార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో దీపిక ఓ యాసిడ్ దాడి బాధితురాలిగా క‌నిపించ‌నుంది. దిల్లీకి చెందిన యాసిడ్ దాడి బాధితురాలు.. యాసిడ్ వినియోగాన్ని ఆపేందుకు ఉద్య‌మం నిర్వ‌హించిన ప్ర‌ముఖ సోష‌ల్ వ‌ర్క‌ర్ ల‌క్ష్మీ అగ‌ర్వాల్ నిజ జీవిత గాథ‌ ఆధారంగా ఈ సినిమా రూపొంద‌నుంది. ఇందులో ల‌క్ష్మి పాత్రను దీపిక పోషించ‌నుంది. సినిమాలో ఆమె పాత్ర‌కు మాత్రం పేరు మార్చ‌డం విశేషం.

ఈ సినిమాలో త‌న పాత్ర పేరు మాల‌తి. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా త‌న పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ని సోష‌ల్‌మీడియా ద్వారా పంచుకున్న దీపిక “మాల‌తి.. నేను జీవితాంతం గుర్తుంచుకునే పాత్ర ఇది. దీన్ని నేనెప్ప‌టికీ మ‌ర్చిపోలేను” అంటూ త‌న భావాల‌ను పంచుకుంది. నేటి నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభ‌మైంది. ఈ ఏడాదిలో షూటింగ్ పూర్తి చేసుకొని వ‌చ్చే సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 10న ఈ సినిమాను విడుద‌ల చేయ‌నుందీ చిత్ర బృందం.

ఈ ఫ‌స్ట్‌లుక్‌ని పంచుకుంటూ “అంతులేని బాధ నుంచి పుట్టిన ఘ‌న విజ‌యానికి సంబంధించిన క‌థ ఇది. అంత‌కంటే ఎక్కువ‌గా.. ఎటువంటి ప‌రిస్థితుల్లోనూ త‌గ్గ‌ని మొక్క‌వోని ఆత్మ‌విశ్వాసానికి సంబంధించిన క‌థ ఇది. మాల‌తి ఒక ధైర్యం. మాల‌తి ఒక న‌మ్మ‌కం. మాల‌తి పాత్ర‌లో దీపికా ప‌దుకొణెను చూడండి.. షూటింగ్ ఈ రోజు ప్రారంభం కానుంది. సినిమా 10 జ‌న‌వ‌రి, 2020న విడుద‌ల‌వుతుంది” అంటూ వెల్ల‌డించారు.

ఈ సినిమాలో ల‌క్ష్మి భ‌ర్త ప్ర‌ముఖ సామాజిక కార్య‌క‌ర్త ఆలోక్ దీక్షిత్ పాత్ర‌లో ప్ర‌ముఖ టీవీ న‌టుడు విక్రాంత్ మాసే న‌టిస్తున్నారు. ఇంత‌కుముందే టీంకి సంబంధించిన క‌థ‌న చ‌ర్చ, స్క్రిప్ట్ రీడింగ్‌ స‌మ‌యంలో తీసిన ఫొటోల‌ను త‌మ సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుందీ బృందం. పెళ్లి త‌ర్వాత మొట్ట‌మొద‌ట‌గా దీపిక న‌టిస్తోన్న చిత్రం ఇది. ఈ సినిమాకి ఆమె స‌హ నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం విశేషం. మ‌రో నిర్మాతగా ప్ర‌ముఖ ప్రొడ‌క్ష‌న్ హౌజ్ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ వ్య‌వ‌హ‌రిస్తోంది.

ఈ సినిమా గురించి ల‌క్ష్మి త‌న స్పంద‌న వెల్ల‌డిస్తూ.. “నా పాత్ర‌లో దీపిక క‌నిపిస్తుందంటే నాకెంతో ఆనందంగా అనిపిస్తోంది. త‌ను ఎలా చేస్తుందో అన్న అనుమానం నాకే మాత్రం లేదు. ఎందుకంటే త‌ను ఇప్ప‌టివ‌ర‌కూ ఎన్నో అద్భుత‌మైన పాత్ర‌లు పోషించింది. అయినా నేను చేయ‌లేని పని ఇత‌రులు చేస్తుంటే.. నేను వారిని చూసి ఇది బాగా చేయ‌లేదు అని ఎలా చెప్ప‌గ‌ల‌ను. దీపిక‌, మేఘ‌న గారు మాత్ర‌మే కాదు.. ఈ సినిమా బృందం ప్ర‌తిఒక్క‌రూ అద్భుతంగా ప‌నిచేస్తార‌ని నాకు తెలుసు. కాబ‌ట్టి ఈ సినిమా కోసం అంద‌రి కంటే నేనే ఎక్కువ‌గా వేచి చూస్తుంటా.. అని వెల్ల‌డించింది.

“ఛాపాక్ చిత్రం త‌న మ‌న‌సుకు ఎంతో ద‌గ్గ‌ర‌గా ఉన్న క‌థ అని.. త‌ను ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే వ్య‌క్తి” అంటూ చెప్పిన దీపిక ఆమె గురించి మ‌రింత మందికి తెలియ‌జేసి వారిలో ఆత్మ‌విశ్వాసాన్ని నింపేందుకే తాను ఈ క‌థ‌లో ల‌క్ష్మి పాత్ర‌లో న‌టిస్తున్నాన‌ని వెల్ల‌డించింది. అంతేకాదు.. ఈ క‌థ ఎంతో అద్భుత‌మైన‌ది కాబ‌ట్టే ఈ సినిమాతోనే తాను నిర్మాత‌గా మారాల‌నుకున్నాన‌ని దీపిక గ‌తంలోనే వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

మేఘ‌నా గుల్జార్ “ఛాపాక్” కంటే ముందు రూపొందించిన రాజీ చిత్రం ప్ర‌స్తుతం అవార్డుల పంట పండిస్తోన్న విష‌యం కూడా విదిత‌మే. తాజాగా జ‌రిగిన ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్య‌క్ర‌మంలో ఈ సినిమాకి ఉత్త‌మ చిత్రం, మేఘ‌న‌కి ఉత్త‌మ ద‌ర్శ‌కురాలు, అలియాకి ఉత్త‌మ క‌థానాయిక వంటి పుర‌స్కారాల‌తో పాటు మ‌రో రెండు అవార్డులు కూడా ద‌క్కాయి. అలాంటి మేఘ‌న ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న ఈ ఛాపాక్ చిత్రంపై అంద‌రిలోనూ ఎన్నో అంచ‌నాలున్నాయి.

ఈ “ఛాపాక్” చిత్రం ప్ర‌ముఖ సామాజిక కార్య‌కర్త ల‌క్ష్మీ అగ‌ర్వాల్ జీవిత క‌థ ఆధారంగా రూపొందుతోంది. దిల్లీకి చెందిన లక్ష్మిపై వివాహానికి ఒప్పుకోలేద‌న్న కోపంతో ఓ స‌మీప బంధువే యాసిడ్ దాడి చేశాడు. ఈ దాడికి గురైన‌ప్పుడు ఆమె వ‌య‌సు కేవ‌లం ప‌దిహేనేళ్లే. ఆ త‌ర్వాత ఎన్నో రోజులు ఆస్ప‌త్రిలో.. ఇంట్లో త‌న జీవితం గురించి ఆలోచిస్తూ బాధ‌ప‌డుతూ గ‌డిపింది ల‌క్ష్మి.

అయితే త‌న‌లా మ‌రొక‌రు బ‌లి కాకూడ‌ద‌నే ఆలోచ‌నే ఆమెను ఇంటి నుంచి బ‌య‌ట‌కు తీసుకొచ్చింది. యాసిడ్ అమ్మ‌కాల‌ను ర‌ద్దు చేయాలంటూ.. ఆమె కోర్టులో కేసు వేయ‌డంతో పాటు సామాజిక కార్య‌క‌ర్త‌గా అంద‌రిలోనూ అవ‌గాహ‌న పెంచుతూ యాసిడ్ అమ్మ‌కాల‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మం చేసింది.

దీంతో ప్ర‌యోగ‌శాల‌లో మాత్ర‌మే ఉప‌యోగించే గాఢ‌మైన యాసిడ్ అమ్మ‌కాల‌ను లైసెన్స్ ఉంటేనే అందించేలా కోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఆ త‌ర్వాత త‌న‌లాంటి వాళ్ల‌కు స్పూర్తిని అందించేందుకు ర్యాంప్‌పై న‌డ‌వ‌డం, టీవీ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌డం.. ఇలా సాధార‌ణ వ్య‌క్తులు చేసే ప‌నుల‌న్నీ చేసింది. మన‌సు అందంగా ఉండి, మ‌నపై మ‌న‌కు ఆత్మ‌విశ్వాసం ఉంటే చాలు.. ఏదైనా సాధించ‌వ‌చ్చ‌ని త‌న జీవితం ద్వారా నిరూపించింది.

త‌న తోటి సామాజిక కార్య‌క‌ర్త‌ను వివాహ‌మాడిన ల‌క్ష్మికి ప్ర‌స్తుతం పీహూ అనే కూతురు కూడా ఉంది. ఆమె జీవితం ఎంతోమందికి స్పూర్తిని అందిస్తుంది కాబ‌ట్టే త‌న జీవిత క‌థ‌ను సినిమాగా రూపొందిస్తున్నామ‌ని ద‌ర్శ‌కురాలు మేఘ‌నా గుల్జార్ చెప్ప‌డం విశేషం.

ఇవి కూడా చ‌ద‌వండి.

దీపిక అంద‌మైన‌ మైన‌పుబొమ్మ‌ను చూసి.. ర‌ణ్‌వీర్ ఏమ‌న్నాడో తెలుసా?

#POPxoWomenWantMore ఈ విమెన్ బ‌యోపిక్స్‌ .. చాలా చాలా స్పెషల్ ..!

ఈ ఫీమేల్ ఓరియంటెడ్‌ సినిమాలు నేటి త‌రం అమ్మాయిల‌కు ఆద‌ర్శం..

Read More From Bollywood