Family

#ToMaaWithLove మీ అమ్మ కూడా.. ఈ డైలాగ్స్ తప్పనిసరిగా చెప్పే ఉంటారు కదా..!

Soujanya Gangam  |  May 8, 2019
#ToMaaWithLove మీ అమ్మ కూడా.. ఈ డైలాగ్స్ తప్పనిసరిగా చెప్పే ఉంటారు కదా..!

తల్లీకూతుళ్ల (mother-daughter) బంధం అంటేనే అదో విభిన్నమైన బంధం. అమ్మ (mom) పై ఎంత ప్రేమ ఉన్నా దాన్ని మనం చేతల్లో చూపలేం. మనమంటే ప్రాణం ఇచ్చేంత ఇష్టం ఉన్నా.. అమ్మ దాన్ని మాటల్లో చెప్పలేదు. అమ్మకు తెలిసిందల్లా మన ఆనందం.. అయితే మనకు కాస్త బాధ కలిగినా మనం బాగుండాలని అమ్మ చేసే పనులు అప్పుడప్పుడూ మనకు చిరాకు పుట్టించొచ్చు.

కానీ ఆ మాటలు కూడా అమ్మ ప్రేమలో భాగమే.. సాధారణంగా చూస్తే అమ్మలందరూ దాదాపు ఒకేలా ఉంటారు. తన ఇల్లు, భర్త, పిల్లలు బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. మరి, మనమూ మిడిల్ క్లాస్ కుటుంబాల్లో పుట్టి, పెరిగి ఉంటే అమ్మ అనే ఈ డైలాగ్స్ (dialogues) ఒక్కసారైనా తప్పనిసరిగా వినే ఉంటాం. మరి, మీ అమ్మ ఇందులో ఎన్ని మాటలు మిమ్మల్ని అంటుందో ఓసారి చెక్ చేసుకొని చూడండి. ఈ మదర్స్ డే సందర్భంగా వీటిని మీ అమ్మకు చూపించి అందరు అమ్మలు ఒకటే అంటూ ఇద్దరూ కలిసి హాయిగా నవ్వుకోండి.

1. మేం వస్తువులు కొనేదే అందుకు కదా..

ఎప్పుడైనా అనుకోకుండా మీ చేతి నుంచి ఏదైనా వస్తువు కింద పడి పగిలిపోయిందంటే చాలు.. అమ్మ నోటి నుంచి వచ్చే మొదటి మాట ఇదే.. “పగులగొట్టేశావా? మంచిది. మేం కష్టపడి సంపాదించి, కొనేది నువ్వు పగులగొట్టడానికే కదా..” అని ఎంతో వ్యంగ్యంగా ఓ మాట తప్పకుండా ఉంటుంది. అమ్మా.. ఎలాగూ కొంటున్నారు కాబట్టి ఈసారి పగలని వస్తువులు కొనండి ప్లీజ్..

2. బుజ్జీ వంట నేర్చుకో. అది తర్వాత చాలా అవసరం..

వంట చేయడం రాకపోతే.. భవిష్యత్తులో ఉద్యోగం కోసం ఒంటరిగా ఉన్నప్పుడు లేక పెళ్లయ్యాక ఇబ్బందవుతుందని తన భావన. సరిగ్గా వంట రాకపోతే పెళ్లి కాదేమోనని తన భయం. కానీ కర్రీ పాయింట్లు, ఫుడ్ డెలివరీ యాప్స్ ఎందుకున్నట్లు మరి..?

3. అవును.. మేం హోటల్ నడుపుతున్నాం మరి..

ఇంట్లో ఏ పనీ చేయకుండా కేవలం కాలేజీ నుంచి ఇంటికి రావడం.. తినడం, పడుకోవడం.. చేస్తుంటే అమ్మ ఇలాగే అంటుంది. కానీ హోటల్లో ఉంటే మన గదికే భోజనం వస్తుంది. అంతేకాదు.. కరెంట్ ఎక్కువైపోతోందనో.. ఉదయాన్నే లేవాలనో ఫ్యాన్ ఆఫ్ చేసేవారు హోటల్లో ఉండరని అమ్మకి తెలీదేమో..

4. ఎండలో బయటకు వెళ్లకు.. నల్లబడితే నీకు పెళ్లి కాదు.

కేవలం రంగు చూసి చేసుకునేవాళ్లకు ఇప్పుడు కాలం చెల్లింది. అమ్మాయిలు కూడా తమకేం కావాలో నిర్ణయించుకుంటున్నారు. అంతేకాదు.. నల్లగా ఉంటే ఇంకా ట్యాన్ అవుతామన్న భయం కూడా ఉండదు మరి..

5. చూస్తున్నా.. చూస్తున్నా.. ఈ మధ్య ఫోన్ ఎక్కువగా వాడుతున్నావు? ఏంటి కథ?

ఫోన్ కాల్స్ లేదా ఛాటింగ్ కాస్త ఎక్కువవగానే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమోనని అమ్మకు భయం పట్టుకుంటుంది. అమ్మా నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటే తప్పకుండా నీకు చెప్పేస్తాలే.. ఇప్పటికైతే ఫ్రెండ్స్‌తోనే చాటింగ్ చేస్తున్నా.

6. పక్కింటి ఆంటీ వాళ్ల అబ్బాయికి 98శాతం మార్కులొచ్చాయి. నువ్వెందుకూ పనికిరావు. ఛీ..

మార్కులతోనే కెరీర్ నిలబడదమ్మా.. అకాడమిక్స్‌లోనే మిగిలిపోతే జీవితాన్ని ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం మరి?

7. ఇవన్నీ నీకు ఇప్పుడు అర్థం కావు. రేపు నీక్కూడా పిల్లలు పుడితే అప్పుడు అర్థమవుతుంది నా బాధ..

పిల్లలు పుట్టే వరకూ అర్థం కాని విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకొని కూడా ఏం లాభం చెప్పమ్మా. అందుకే ఇంక ఈ విషయం గురించి మనం మాట్లాడుకోవద్దు.

8. నీ గది నిండా ఎక్కడ చూసినా బట్టలే.. కాస్త క్లీన్ చేసుకోవచ్చు కదా.. కొన్ని పాత బట్టలు తీసి పారేయ్..

ఆ బట్టలన్నింటినీ కుర్చీపై పెట్టింది నేనే.. అయినా నా బట్టలు మరీ నువ్వు అనుకున్నన్ని ఎక్కువేం లేవు. నా కప్ బోర్డ్ ఇంకాస్త పెద్దదైతే అందులో నా బట్టలన్నీ పట్టేవి..

9. నీ వయసులో ఉన్నప్పుడు నాకు మీరిద్దరూ పుట్టేశారు. ఇంకా చిన్నపిల్లనంటావేంటి?

మీ టైంలో బాల్య వివాహాలు చేసేవాళ్లు కదమ్మా.. అందుకే నీకు పెళ్లి వేగంగా జరగడం వల్ల చిన్నపిల్లవి కాదనిపించిందేమో.. కానీ నిజంగా ఇది చిన్నతనమే..

10. నిన్ను ఈ లోకంలోకి తీసుకురావడానికి నేను ఎంత బాధపడ్డానో తెలుసా? కానీ నీకు నా ఫీలింగ్స్ అంటే లెక్కే లేదు..

ఆ తొమ్మిది నెలలు నువ్వు చాలా కష్టపడ్డావు. ఈ కథ నేను చాలా సార్లు విన్నాను కూడా. కానీ నీ మాట విననప్పుడల్లా ఇదే చెప్పడం ఏం బాలేదమ్మా..

11. మళ్లీ కవిత ఇంట్లో పడుకుంటున్నావా? ఒకపని చెయ్.. వాళ్ల అమ్మకి చెప్పి నిన్ను దత్తత తీసుకోమని చెప్పు..

అమ్మా.. నేను వెళ్లేదాన్నే. కానీ నేను లేకపోతే నువ్వు తిట్టడానికి ఎవరూ ఉండరు కదా.. నిన్ను విసిగించడానికి ఓ మనిషి లేకపోతే ఎలా చెప్పు?

12. ఇక నీ పెళ్లి చేసేస్తే మా బాధ్యతలన్నీ తీరిపోతాయి. మేం ప్రశాంతంగా ఉండొచ్చు..

అమ్మా.. పెళ్లి అయినా కాకపోయినా నీ బుర్ర తినడం మాత్రం నేను మర్చిపోను. అందుకే జీవితాంతం నా బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉండు..

13. అంత టెన్షన్ పడకు.. ఇలా రా తలకు నూనె పెడతా.. తలనొప్పి మాయం అయిపోతుంది..

అమ్మా.. మా బాస్ నెలరోజులు పట్టే అసైన్ మెంట్ ని వారంలో పూర్తి చేయమన్నాడు. టెన్షన్ పడకుండా ఎలా ఉండను? తలకు నూనె పెడితే తగ్గే టెన్షన్ కాదిది.

14. ఆదివారం వచ్చిందంటే చాలు.. స్నానం లేదు. ఏమీ లేదు. ఆ టీవీ పెట్టుకొని కూర్చుంటావు. ఎప్పుడు చూసినా టీవీ, టీవీ, టీవీ..

అమ్మా.. కొత్త సినిమాల కంటే స్నానమేమీ అంత ముఖ్యమైన విషయం కాదులే..

15. నేను చెబుతున్నా కదా.. వినవా..

దీనికి నేనేమీ సమాధానం చెప్పలేనమ్మా.. నీకు నచ్చిందే చేద్దాం..

మీ అమ్మ కూడా ఇలాంటి డైలాగ్స్ మాట్లాడుతుందా? అయితే ఈ కథనాన్ని చూపించి  ఇద్దరూ కలిసి నవ్వుకోండి మరి. 

ఇవి కూడా చదవండి.

కూతురితో పోటీ పడి మరీ.. పీహెచ్‌డీ చేసిన ఓ అమ్మ కథ..!

అమ్మ‌నే కానీ నాకూ అన్నీ తెలియ‌వు: మాతృమూర్తులకు సోనాలీ సందేశం

డియర్ మమ్మీ… నా మనసు చెప్పే మాటలు వింటావా ప్లీజ్..?

 Images : Giphy, 

Read More From Family