ఒక అమ్మాయి అందంగా కనిపించాలంటే తల నుంచి అరికాలి వరకూ అందంగా ఉండాలని చెబుతుంటారు. అయితే అందంలో కనిపించాలంటే అందమైన ముఖం.. దానికి తగినట్లుగా ఉండే చక్కటి హెయిర్ స్టైల్ ప్రధాన పాత్ర వహిస్తుంది. ఎంత మంచి దుస్తులు వేసుకున్నా తలకట్టు అందంగా లేకపోతే ఆ లుక్కే అంత బాగుండదు.
Table of Contents
అందుకే వెళ్లే ప్రతి చోట ప్రత్యేకంగా కనిపించేందుకు ప్రత్యేకమైన హెయిర్ స్టైల్స్ (Hairstyles) ప్రయత్నించడం వల్ల కొత్త లుక్ మీ సొంతమవుతుంది. దీనికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్ హెయిర్ స్టైల్స్ తో నే మీ లుక్ ని అద్బుతంగా మార్చుకోవచ్చు. అయితే ప్రతి సందర్భానికి (occasion) తగినట్లుగా.. దుస్తులకు తగినట్లుగా మీ హెయిర్ స్టైల్ వేసుకోవడం వల్ల అందరి ప్రశంసలను సొంతం చేసుకోవచ్చు.
పెళ్లి వేడుకలకు ఇలా. .
పెళ్లిలో ఎన్నో రకాల ఫంక్షన్లుంటాయి. కొన్నింట్లో సంప్రదాయబద్ధంగా మెరిస్తే కొన్నిట్లో పార్టీ వేర్ లుక్ లో మెరిసిపోవచ్చు. మరి సంప్రదాయబద్దంగా సిద్ధమయ్యే పెళ్లి వేడుకలకు ఎలాంటి హెయిర్ స్టైల్ వేసుకోవాలో మీకు తెలుసా? ఇవి ఓసారి ప్రయత్నించి చూడండి.
1. బ్రెయిడెడ్ బన్
ముందుగా మధ్య పాపిట తీసి రెండు వైపులా ముందు నుంచి జడ అల్లుకుంటూ వెనక్కి తీసుకురావాలి. ఇలా వెనక్కి తీసుకొచ్చాక అలా వేసిన జడలను కింద వరకూ పూర్తి చేసి వాటిని కొప్పులాగా చుట్టాలి. ఇలా చేయడం వల్ల సగం జుట్టు కిందకు ఉండి మరో సగం కొప్పులా భాగంగా ఉంటుంది.. ఈ హెయిర్ స్టైల్ ఎవరికైనా అద్భుతంగా కనిపిస్తుంది.
2. బ్రెయిడెడ్ హాలో
ఈ అందమైన హెయిర్ స్టైల్ అమ్మాయిలకు చాలా క్యూట్‌గా కనిపిస్తుంది. దీని కోసం జుట్టును మధ్యలోకి పాపిట తీసి వదిలేసి ఒక్కోవైపు నుంచి ఒక్కో జడను అల్లుకుంటూ వెనక్కి తీసుకురావాలి. ఇలా వెనక్కి వచ్చిన తర్వాత అక్కడ పిన్స్ పెట్టి వదిలేయాలి. ఇది ఎలాంటివారికైనా అందంగా కనిపిస్తుంది.
3. పక్కకి దువ్వండి..
పాపిట కేవలం మధ్యకే తీయాలని ఎవరు చెప్పారు? మీరు ఎప్పుడూ తీసే పాపిటకు భిన్నంగా ప్రయత్నించి కొత్త లుక్‌ని సొంతం చేసుకోండి. మీ జుట్టును మొత్తం ఒక పక్కకి వేసి పక్క పాపిట తీయండి. జుట్టు అలాగే నిలిచి ఉండేలా పిన్స్ పెట్టడం వల్ల కొత్తగా కనిపిస్తారు.
4. లూజ్ ఫ్లోరల్ బ్రెయిడ్
సాధారణంగా పెళ్లిళ్లకు జడ వేసుకోవడం ఎక్కువ మందికి ఇష్టంగా ఉంటుంది. దీనికోసం జుట్టును వదులుగా అల్లి అందులో పూలతో అలంకరించవచ్చు. మామూలు జడతో పాటు ఫ్రెంచ్, డచ్.. ఇలా రకరకాల జడలు అల్లి పూలు పెట్టుకోవచ్చు.
5. హాఫ్ బ్రెయిడ్
సాధారణంగా జుట్టు వదిలేయాలనుకునేవాళ్లు పోనీ వేసుకోవడం, లేదా జుట్టును సగం తీసి క్లిప్ పెట్టి వదిలేయడం తెలిసిందే. కానీ ఈ తరహా జడలో క్లిప్ పెట్టడానికి వీలుగా జుట్టు సగాన్ని తీసి దాన్ని అల్లుకుంటూ రావాలి. ఈ అల్లే తరహాలో సాధారణ జడలా లేదా ఫిష్ టెయిల్ లా అల్లొచ్చు. చివర వరకూ అల్లి చివరన రబ్బర్ బ్యాండ్ పెట్టాలి. జడ మధ్యలో చిన్న బీడ్స్ తో అలంకరించుకుంటే చాలా బాగుంటుంది.
6. బ్రెయిడెడ్ క్రౌన్
పెళ్లిళ్లకు జుట్టు వదులుగా వదిలేసుకోకుండా ముడి వేసుకోవడానికి ఇష్టపడే వారు ఈ తరహా హెయిర్ స్టైల్ ని ఉపయోగించవచ్చు. దీనికోసం మధ్య పాపిడ తీసి జుట్టు ముందు నుంచి జడ వేసుకుంటూ వెనక్కి తీసుకురావాలి. అలా వెనుక కూడా మొత్తం అల్లి ఈ జుట్టును కిరీటంలాగా జుట్టడం వల్ల అందంగా కనిపించస్తుంది. కావాలంటే మంచి టియారా పెట్టుకొని మీ లుక్ ని మరింత పెంచుకోవచ్చు.
పార్టీల కోసం హెయిర్ స్టైల్స్
పెళ్లిళ్లకు కాస్త సంప్రదాయబద్ధమైన దుస్తులు ధరిస్తే కాక్ టెయిల్ పార్టీలు, ఇతర ఫంక్షన్లలో మోడ్రన్ దుస్తుల పైకి సూటయ్యే హెయిర్ స్టైల్స్ వేరుగా ఉంటాయి. అవేంటంటే..
1. సింగిల్ బ్రెయిడ్ లూజ్ హెయిర్
దీనికోసం జుట్టును మధ్యకు పాపిడ తీసి ఒకవైపు జుట్టు ముందు భాగం తీసుకొని జడలా అల్లుకోవాలి. ఆ జడను వెనక్కి పెట్టి పిన్నులు పెట్టి మిగిలిన జుట్టును వదిలేయాలి. ఇది పార్టీలకు చాలా బాగుంటుంది.
2. ఫిష్‌టెయిల్ బ్రెయిడ్
ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు జడ వేసుకోవాలంటే ఫిష్‌టెయిల్ బ్రెయిడ్‌ని వేసుకోవాల్సిందే. కాస్త ఓపిక, సమయం ఉండి.. ఇందులో కాస్త పర్ఫెక్ట్ అయితే చాలు.. దీని కంటే మంచి హెయిర్ స్టైల్ మరొకటి ఉండదు. దీన్ని వేసుకోవడానికి జుట్టును రెండు పాయలుగా విడదీయాలి. ఇప్పుడు ఒక భాగం బయటవైపున్న జుట్టు నుంచి సన్నని పాయను తీసుకొని అవతలి దానిలో కలపాలి. అవతలి పాయను కూడా అలాగే చేసి ఇవతలి పాయలో ఆ జుట్టును కలపాలి. ఇలా చేసుకుంటూ కింద వరకూ రావాలి. ఆపై రబ్బర్ బ్యాండ్ పెడితే ఇది అందంగా కనిపిస్తుంది.
3. జాస్మిన్ హెయిర్ స్టైల్
ఇలా చాలా అందంగా ఉండడంతో పాటు వేసవిలో మనల్ని అందంగా, సౌకర్యవంతంగా ఉండేలా కూడా చేస్తుంది. దీని కోసం ముందుగా హై పోనీటెయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక సన్నని పాయగా జుట్టును తీసుకొని రబ్బర్‌బ్యాండ్ కనిపించకుండా చుట్టాలి. ఆపై ఓ రెండు అంగుళాల కింద మరో రబ్బర్ బ్యాండ్ పెట్టి మళ్లీ ఇలాగే జుట్టుతో కవర్ చేయాలి. ఇలా రెండు అంగుళాల గ్యాప్ ఇస్తూ కింద వరకూ చేసుకుంటూ వెళ్లాలి.
shutterstock
4. వాటర్ ఫాల్ హెయిర్ స్టైల్
దీనికోసం ముందుగా జుట్టును బాగా దువ్వుకొని ఒక వైపున మూడు పాయలు తీయాలి. దాన్ని జడ అల్లినట్లు ఒకసారి అల్లాలి. ఇప్పుడు మధ్యలో ఉన్న పాయను వదిలేసి పక్కనున్న జుట్టు నుంచి మరో పాయ తీసుకొని మరోసారి అల్లాలి. అలా జుట్టు ఆ చివర నుంచి ఈ చివర వరకూ అల్లుకుంటూ వచ్చి ఆఖరికి సైడ్ పిన్ తో కనిపించకుండా పెట్టాలి.
5. ట్విస్టెడ్ బన్
జుట్టు మధ్యలో పాపిడ తీసి కొంత భాగం మేర రెండు వైపులా తీసి రబ్బర్ బ్యాండ్ పెట్టి మిగిలిన జుట్టును పాపిట లేకుండా వెనక్కి దువ్వేయాలి. ఆ తర్వాత వెనుక ఉన్న జుట్టును బాగా ట్విస్ట్ చేసి కొప్పులా కట్టుకొని పిన్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒకవైపు ఉన్న జుట్టును తీసుకొని ఈ కొప్పు చుట్టూ చుట్టుకొని పిన్ పెట్టుకోవాలి. ఆపై మరోవైపు జుట్టును కూడా ఇలాగే చేయాలి. ఆపై ఫ్లవర్ బీడ్స్ సాయంతో జుట్టును అలంకరించుకుంటే అందంగా కనిపిస్తుంది.
6. సైడ్ ఫ్రెంచ్ బ్రెయిడ్
దీనికోసం జుట్టును పక్క పాపిట తీసుకోవాలి. ఎక్కువ శాతం జుట్టు ఉన్న వైపున పాపిడ నుంచి జడ అల్లుకోవడం ప్రారంభించాలి. ముందు మూడు పాయలు తీసి ఒకసారి అల్లి ఆ తర్వాత మళ్లీ అల్లేటప్పుడు పక్క నుంచి కాస్త జుట్టును పాయతో పాటు కలుపుకోవాలి. ఆ తర్వాత మరో పాయతో పాటు మరికాస్త జుట్టు.. ఇలా రెండు వైపుల ఉన్న జుట్టును కొద్ది కొద్దిగా కలుపుతూ మొత్తం జుట్టును జడలోకి తీసుకోరావాలి. ఇలా పూర్తిగా అల్లాక జడ కూడా అల్లి బీడ్స్ తో అలంకరించుకోవచ్చు.
క్యాజువల్ అవుటింగ్స్ ..
సాధారణంగా స్నేహితులతో సినిమాకో లేక బయట అవుటింగ్ కో వెళ్లినప్పుడు కాస్త ప్రత్యేకంగా కనిపించాలనుకుంటాం. కానీ క్యాజువల్స్ పై వేసుకునే హెయిర్ స్టైల్స్ పెళ్లిళ్లు, పార్టీల లో వేసుకునే వాటికి విభిన్నంగా ఉంటాయి. అవేంటంటే..
1. హాఫ్ బన్
సాధారణంగా జుట్టును రెండు భాగాలుగా చేసి క్లిప్ పెట్టడం మనకు తెలిసిందే. అలాగే పైన, కింద రెండు భాగాలుగా చేసి పైన ఉన్న భాగాన్ని కొప్పులాగా కట్టి సైడ్ పిన్స్ పెట్టుకోవాలి. కింద భాగాన్ని వదిలేస్తే బాగుంటుంది. మీకు సౌకర్యంగా ఉండడంతో పాటు అందంగా కూడా ఉంటుంది.
2. మధ్యలో జడ అల్లుతూ
అటూ, ఇటూ కొద్దిగా జుట్టు వదులుతూ మధ్యలో ఒక భాగాన్ని జడగా అల్లే స్టైల్ ఇది. దీనికోసం జుట్టును మూడు పాయలు చేసుకోవాలి. మధ్యలో ఉన్న జుట్టును ఒక పాయగా తీసుకొని రెండు వైపులా జుట్టును వదిలేయాలి. ఇప్పుడు మధ్యలో ఉన్న జుట్టును ఫ్రెంచ్ స్టైల్లో అల్లుకుంటూ వెనుక వరకూ తీసుకొచ్చి క్లిప్ పెట్టి వదిలేయాలి. ఇది సౌకర్యం, అందం, రెండూ కలగలిసిన హెయిర్ స్టైల్ అని చెప్పుకోవచ్చు.
3. సైడ్ పోనీ
బయటకు వెళ్లేటప్పుడు పెద్దగా సమయం లేకపోయినా ఈ స్టైల్ ని పాటించవచ్చు. దీనికోసం చేయాల్సిందల్లా జుట్టును బాగా దువ్వుకొని ఒకవైపుకి తీసుకురావాలి. కావాలంటే పాపిట కూడా తీసుకోవచ్చు. లేదా అలాగే ఉంచేయొచ్చు. పక్కకి తీసిన జుట్టును రబ్బర్ బ్యాండ్ తో పోనీలా కట్టుకోవాలి. ఇది సింపుల్ గా నిమిషంలో పూర్తయిపోయే హెయిర్ స్టైల్. సౌకర్యంగా కూడా ఉంటుంది.
4. బీచ్ వేవ్స్
రాత్రి చక్కగా, అందంగా జడలు వేసుకొని పడుకుంటే ఉదయాన్నే అందంగా, ఆకట్టుకునే వేవీ జుట్టుతో నిద్ర లేచే వీలుంటుంది. దీని కోసం జుట్టును ఐదారు పాయలుగా చేసుకొని గట్టిగా జడలు వేసి రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని పడుకోవాలి. ఉదయానికల్లా స్టైలిష్ హెయిర్ స్టైల్ మీ సొంతమవుతుంది. తలస్నానం చేసిన తర్వాత ఇలా చేస్తే మీ వేవ్స్ ఎక్కువకాలం పాటు అలాగే నిలుస్తాయి.
5. మెస్సీ బ్రెయిడ్
ఇది వేసుకోవడం చాలా సింపుల్. ఎప్పుడైనా జుట్టు చాలా చిక్కులుగా అనిపిస్తే దీన్ని ప్రయత్నించండి. దీనికోసం చేయాల్సిందల్లా జుట్టు మధ్యలోకి పాపిట తీసి అటు నుంచి ఇటు నుంచి జడల్లా అల్లుకుంటూ వెనక్కి తీసుకురావాలి. వెనుక ఓ క్లిప్ పెట్టి అల్లిన జడలనుంచి జుట్టును కాస్త లాగినట్లుగా అనడం వల్ల జుట్టు మెస్సీగా మారుతుంది. ఆ తర్వాత వెనుక మిగిలిన జుట్టును కూడా జడ అల్లుకోవాలి. లూజ్ గా అల్లుకొని ఈ జుట్టును కూడా కాస్త బయటకు లాగినట్లుగా చేసి మధ్యలో బీడ్స్ పెట్టి అలంకరించుకోవచ్చు.
6. క్రాస్ రోప్ బ్రెయిడ్
దీనికోసం జుట్టును మధ్యలో పాపిట తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒకవైపు పాపిట నుంచి కాస్త జుట్టు తీసుకొని దాన్ని రెండు పాయలుగా చేసుకొని ఒకదానికొకటి చుడుతూ తాడులా చుట్టుకుంటూ వెనక్కి తీసుకురావాలి. వెనక్కి వచ్చాక వెనుక పిన్ పెట్టాలి. వెనుక ఉన్న జుట్టును కూడా అలాగే రెండు పాయలు తీసి ఒకదానికొకటి చుట్టుకుంటూ వచ్చి చివర్లో రబ్బర్ బ్యాండ్ పెడితే సరిపోతుంది.
స్ట్రెయిటెనింగ్, స్మూతెనింగ్‌తో.. జుట్టును స్టైలిష్‌గా మార్చుకుందాం.. (Hair Straightening And Smoothening In Telugu)
కాలేజీకి వెళ్లేవాళ్లకు..
కాలేజీకి వెళ్లేటప్పుడు సింపుల్ గా సిద్ధమైనా కాస్త స్పెషల్ లుక్ ఉండాలనుకుంటారు. ఇలాంటి వారికోసమే ఈ హెయిర్ స్టైల్స్
1. వేవీ నాట్
దీనికోసం ముందుగా జుట్టు మధ్యలో కొంత భాగాన్ని తీసి దాన్ని కొప్పులా కట్టుకోవాలి. ఆ తర్వాత చుట్టూ మిగిలిన జుట్టు సన్నని పాయలుగా చేసి ఈ కొప్పు చుట్టూ చుట్టి చివర్లను పిన్ సాయంతో కనిపించకుండా చేయాలి. ఇలా జుట్టు మొత్తాన్ని నాట్ లా వేసుకోవాలి. ఒకసారి ఒకవైపు నుంచి పాయ తీసుకుంటే ఆ తర్వాత మరోవైపు తీసుకోవడం వల్ల వేవ్స్ ఎఫెక్ట్ వస్తుంది.
2. పఫ్ పోనీ
ఈ హెయిర్ స్టైల్ వేసుకోవడం చాలా సులభం. సమయం కూడా చాలా తక్కువే పడుతుంది. దీనికోసం జుట్టు ముందు భాగంలో కొంత భాగాన్ని తీసుకోవాలి. దాన్ని వెనక్కి దువ్వడం వల్ల వాల్యూమ్ పెరిగినట్లు కనిపిస్తుంది. ఇలా దువ్వాక రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని ఉంచాలి. ఇప్పుడు ఈ రబ్బర్ బ్యాండ్ పెట్టిన భాగం నుంచి కాస్త పైభాగానికి దీన్ని లేపడం వల్ల జుట్టు పఫ్ లా మారి కనిపిస్తుంది. అలా లేపి ఉంచిన తర్వాత జుట్టుకి పిన్స్ పెట్టాలి. మిగిలిన జుట్టును మొత్తం పోనీలా కట్టేసుకుంటే సరిపోతుంది.
3. డచ్ బ్రెయిడ్
చూడడానికి కష్టంగా అనిపించినా ఈ హెయిర్ స్టైల్ వేసుకోవడం చాలా సింపుల్. సాధారణంగా మనం జడ వేసుకునేటప్పుడు ఒక పాయ పై నుంచి మరో పాయ తీస్తాం.. అలా కాకుండా అల్లాల్సిన పాయను కింద నుంచి తీయడం వల్ల డచ్ బ్రెయిడ్ కాస్త ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఒకవేళ ముందు నుంచి వెనక్కి వేయాలంటే ఫ్రెంచ్ బ్రెయిడ్ కి వేసుకున్నట్లుగానే తక్కువ జుట్టుతో ప్రారంభించి ప్రతి పాయకు కొద్దికొద్దిగా జుట్టు కలుపుకుంటూ పోవాలి.
4. మిల్క్‌మెయిడ్ బ్రెయిడ్
దీని కోసం చేయాల్సిందల్లా మీ జుట్టులో ఒకవైపు నుంచి కాస్త జుట్టు తీసి దాన్ని రెండు పాయలుగా విడదీసి ఒకదానికి మరొకటి చుడుతూ చివరి వరకూ తీసుకురావాలి. ఆ తర్వాత ఇలా చుట్టిన దాన్ని జుట్టు కింద నుంచి తీసి ముందు నుంచి పక్కకు తీసుకొని వచ్చి ఒక వృత్తం పూర్తయ్యేలా పిన్ చేయాలి. ఆ తర్వాత మిగిలిన జుట్టును వదిలేయవచ్చు.
5. ఫేక్ బాబ్
ఈ హెయిర్ స్టైల్ కూడా చాలా సులభం. దీనికోసం చేయాల్సిందల్లా జుట్టును పైన కింద రెండు భాగాలు చేసుకోవాలి. కింది భాగాన్ని కొప్పులా కట్టుకోవాలి. ఇది ఏమాత్రం ఎత్తుగా కనిపించకూడదు. కావాలంటే జడ వేసి కొప్పు వేసుకోవచ్చు. ఆ తర్వాత పై భాగాన్ని వదిలేసి బాగా దువ్విన తర్వాత రబ్బర్ బ్యాండ్ పెట్టి ఈ జుట్టు చివర్లను కూడా తీసుకొచ్చి ఇందాక కట్టిన కొప్పుతో కలిపి పిన్నులు పెట్టి కొప్పు కనిపించకుండా జుట్టుతో కవర్ చేయాలి. అంతే చూసేవాళ్లు మీ జుట్టు సగానికి సగం ఎలా తగ్గిందని ఆశ్చర్యపోక మానరు.
6. కార్న్ రోస్
ముందుగా జుట్టును పక్క పాపిట తీసుకొని బాగా దువ్వుకోవాలి. ఆ తర్వాత ఒక పక్క నుంచి జుట్టు అల్లుతూ వెళ్లి వెనుక వరకూ తీసుకెళ్లాలి. వెనుక పిన్ పెట్టి మిగిలిన జుట్టును వదిలేయాలి. ఇలా నచ్చినన్ని జడలు వేసుకొని వెనక్కి పెట్టుకోవచ్చు.
మీ అందమైన మెరిసే జుట్టు కోసం.. చక్కటి షాంపూ బ్రాండ్లివే..! – Best Shampoos For Different Hair Types In India
ఆఫీస్ కి ఇలాంటి హెయిర్ స్టైల్స్
క్యాజువల్ అవుటింగ్స్ కి, కాలేజీకి ఎలాంటి హెయిర్ స్టైల్స్ వేసుకున్నా ఇబ్బంది ఉండదు. కానీ ఆఫీస్ డ్రస్ కోడ్ తో పాటు కలవాలంటే ప్రత్యేకమైన హెయిర్ స్టైల్స్ ఉండాల్సిందే. అవేంటంటే..
1 .లూజ్ కర్ల్స్
రాత్రి పూట పడుకునే ముందే జుట్టును కర్ల్స్ కోసం సిద్ధం చేసుకోవాలి. దీనికోసం జుట్టును కర్లర్స్ లేదా దారం రీల్స్, టిష్యూ పేపర్ వంటివాటికి చుట్టి చివర్లను పిన్స్ పెట్టి ఉంచుకోవాలి. ఉదయానికి ఇవి మంచి కర్ల్స్ గా కనిపిస్తాయి. మీరు ప్రత్యేకంగా దువ్వు కోవాల్సిన పని కూడా ఉండదు. ఆఫీస్ లో ప్రత్యేకంగా గడపాల్సిన రోజున ఇలా ప్రయత్నించి చూడండి.
2. హై పోనీ
ఇది చాలా సింపుల్. ఆఫీస్ కి వెళ్లడానికి సమయం లేకపోతే జుట్టు అలాగే వదిలేయకుండా చాలా ఎత్తులో పోనీ వేసే స్టైలే ఇది. దీనికోసం జుట్టును పైకి పట్టుకొని గట్టిగా రబ్బర్ బ్యాండ్ కట్టేయాలి. సింపుల్ గా నిమిషంలో పూర్తయ్యే ఈ హెయిర్ స్టైల్ ని అద్దం, దువ్వెన లేకున్నా వేసుకోవచ్చు.
Pintrest
3. ఫ్రెంచ్ రోల్
ఇది కార్పొరేట్ మీటింగ్స్ చక్కగా ఉండే హెయిర్ స్టైల్. దీనికోసం ముందుగా జుట్టు ముందు భాగంలో పఫ్ వేసుకొని మిగిలిన జుట్టును వదిలేయాలి. ఈ జుట్టను మరోసారి దువ్వి ఒకవైపు జుట్టు రాకుండా సైడ్ పిన్స్ పెట్టి జుట్టును మరోవైపు దువ్వుకోవాలి. ఇలా దువ్వుకున్న తర్వాత జుట్టును ట్విస్ట్ చేస్తూ పొడవుగా వచ్చేలా కొప్పులా చుట్టాలి. ఇలా పొడవుగా ఉండేలా చుట్టి దాన్ని కొప్పులా వేసి పైన పిన్స్ తో లూజ్ కాకుండా చేసి చివర్లను దాచి పెట్టాలి. చివర్లు కనిపించకుండా ఉండేందుకు కొప్పు కింద భాగాన్ని మంచి బీడ్స్, స్టోన్స్ ఉన్న సైడ్ పిన్స్ తో అలంకరించుకుంటే బాగుంటుంది.
4. హాఫ్ బన్ (రోజ్ స్టైల్)
దీనికోసం జుట్టుును పైన, కింద రెండు భాగాలు గా చేసి పెట్టుకోవాలి. పై భాగానికి ముందు రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని బ్యాండ్ కింద ఉన్న జుట్టును రెండు పాయలుగా చేసి చుట్టి ఒకదానికొకటి చుట్టాలి. ఆఖరులో రబ్బర్ బ్యాండ్ పెట్టాలి. ఆ తర్వాత జుట్టును రబ్బర్ బ్యాండ్ పెట్టిన మొదలు దగ్గర చుట్లు చుట్టి చివర్లు కనిపించకుండా పిన్ పెట్టాలి. ఇది రోజ్ ఆకారంలో వచ్చేలా జుట్టును కాస్త బయటకు లాగి వదులుగా చేస్తే సరిపోతుంది.
Pintrest
5. ట్విస్టెడ్ పోనీ
ఇది పోనీ టెయిల్ కి కాస్త ట్విస్ట్ ఇచ్చిన స్టైల్ అంతే. దీనికోసం పోనీ టెయిల్ ని కాస్త లూజ్ గా వేసుకోవాలి. ఆ లూజ్ గా ఉన్న భాగంలో అంటే రబ్బర్ బ్యాండ్ పైన ఉన్న జుట్టును రెండు పాయలుగా చేసి జుట్టు మధ్యలో రంధ్రంలా చేసుకోవాలి. జుట్టు చివర్లను అందులోంచి పోనిచ్చి మళ్లీ బయటకు తీయాలి. ఇలా చేయడం వల్ల ట్విస్ట్ చేసినట్లుగా వస్తుంది. ఒకసారి సరిపోకపోతే రెండు సార్లు ఇలా చేసి స్పెషల్ లుక్ సొంతం చేసుకోవచ్చు.
Shutterstock
6. ఫ్రంట్ ట్విస్ట్
దీనికోసం జుట్టును మధ్యలో పాపిట తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒకవైపు పాపిట నుంచి కాస్త జుట్టు తీసుకొని దాన్ని ట్విస్ట్ చేస్తూ అందులో కొద్దికొద్దిగా జుట్టు కలుపుతూ వెనుక వరకూ అలాగే తిప్పుకుంటూ వెళ్లి వెనుక పిన్ పెట్టి క్రాస్ షేప్ లో ఉంచుకోవాలి. కావాలంటే కింద మిగిలిన జుట్టు కావాలంటే జడ వేసుకోవచ్చు లేదా అలాగే వదిలేసుకోవచ్చు.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.
ఇవి కూడా చదవండి.
31 రోజులు.. 31 హెయిర్‌స్టైల్స్.. నెలలో ప్రతిరోజూ కొత్తగా కనిపించండిలా..!