Ayurveda

ఆయుర్వేదం.. మేని అందానికి చక్కటి ఔషధం..! – (Ayurveda Beauty Tips In Telugu)

Soujanya Gangam  |  Apr 25, 2019
ఆయుర్వేదం.. మేని అందానికి చక్కటి ఔషధం..! – (Ayurveda Beauty Tips In Telugu)

అందం (Beauty) ఏ ఒక్కరికీ సొంతం కాదు.. ఏ మ్యాజిక్ పిల్ వేసుకుంటేనో దక్కేది కాదు. ప్రతిఒక్కరూ తమదైన రీతిలో అందంగా ఉంటారు. అయితే సహజమైన రీతిలో పలు ఆయుర్వేద చిట్కాలు (ayurveda) పాటించి మీ చర్మ ఆరోగ్యాన్ని మరింత పెంచుకోవచ్చు. ముఖ్యంగా ముఖ చర్మాన్ని కాపాడేందుకు ఈ ఆయుర్వేద చిట్కాలు బాగా పనిచేస్తాయి. ఇందులో భాగంగా అరుదైన మూలికలతో చికిత్స చేయడం వల్ల.. శరీరంలోని మలినాలు తొలిగిపోతాయి. ఆ మెరుపు ముఖంలో కూడా కనిపిస్తుంది.

ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రిస్క్రిప్షన్ వంటి ఇబ్బందులేవీ లేకుండా.. సమస్యలతో కూడిన సర్జరీలు, చేదు మందులు లేకుండా సులువుగా ఆరోగ్యాన్ని కాపాడుకొనేందుకు ఏకైక మార్గం ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటే జీవితకాలాన్ని పెంచే సమాచారం అని అర్థం. అందుకే శరీర సమస్యలను, చర్మ సమస్యలను తగ్గించేందుకు ఆయుర్వేద చిట్కాలను అనుసరిస్తూ ఉంటారు. ఆయుర్వేదం ప్రతి వ్యక్తిలోని దోషాలను తెలుసుకొని.. దానికి ప్రత్యేకంగా చికిత్సను అందిస్తుంది. అందుకే ఇది వారిపై ప్రభావవంతంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు.

మన శారీరక ఆరోగ్యంతో పాటు.. మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమైనదని.. ఎలాంటి సమస్య ఎదురైనా శారీరక చికిత్సతో పాటు మానసిక చికిత్సపైనా దృష్టి సారించాలని ఆయుర్వేదం చెబుతుంది. ఇదే ఆయుర్వేద చికిత్సను మిగిలిన వైద్య పద్ధతుల నుంచి వేరు చేస్తుంది. అంతేకాదు.. చికిత్స కంటే నివారణ మంచిది అన్నట్లుగా ప్రస్తుతం ఉన్న చిన్న సమస్యలను దూరం చేసే ఆయుర్వేదం.. భవిష్యత్తులో వచ్చే కొత్త ఆరోగ్య, చర్మ సమస్యలు నుండి కూడా కాపాడుతుంది. అందుకే దీన్ని మన సమస్యలకు సంజీవనిగా పేర్కొంటూ ఉంటాం.

చర్మ ఆరోగ్యానికి ఆయుర్వేద చిట్కాలు

 

 

చర్మ ఆరోగ్యానికి ఆయుర్వేద చిట్కాలు

కేశాల ఆరోగ్యానికి చిట్కాలు

ఆయుర్వేద ఫేస్ ప్యాక్స్

ఈ జాగ్రత్తలు పాటించండి..

ఆయుర్వేదానికి సంబంధించి తరచూ అడిగే ప్రశ్నలు వాటికి సమాధానాలు.

చర్మ ఆరోగ్యానికి ఆయుర్వేద చిట్కాలు (Ayurvedic Tips For Skin)

వివిధ రకాల ఆయుర్వేద (ayurveda) దోషాల వల్లే చర్మ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. సాధారణంగా మన శరీరాల్లో మూడు రకాల దోషాలుంటాయి. అవి- వాత, పిత్త, కఫ దోషాలు. వాత దోషం ఉన్నవారి చర్మం పొడిబారిపోయి, ముడతలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.

పిత్త దోషం ఉన్నవారికి రాషెస్, మొటిమలు, రొసేషియా వంటి చర్మ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. కఫ దోషం ఉన్నవారికి చర్మ రంధ్రాలు చాలా వెడల్పుగా మారిపోతాయి. బ్లాక్ హెడ్స్, మొటిమలు, ఎగ్జిమా లాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. 

ఇలా చర్మ తత్వాన్ని బట్టి ఆయుర్వేద చికిత్సలు తీసుకోవడానికి వైద్యులను సంప్రదించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే వైద్యుల వద్దకు వెళ్లే ముం..దు ఇంట్లోనే కొన్ని రకాల ఆహార మార్పులు చేసుకొని.. కొన్ని చిట్కాలు పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనికి ముందు చర్మం డల్‌గా ఉండడానికి కారణాలు తెలుసుకొని వాటిని నివారించుకోవాలి. 

Also read: చర్మానికి ఆముదం అందించే ప్రయోజనాలు (Castor (Amudham) Oil Benefits For Skin)

మలబద్ధకం, జంక్ ఫుడ్ తినడం, సూర్యరశ్మి బారిన పడడం, పిరియడ్స్ క్రమం తప్పడం, ఉప్పు, చక్కెర ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం.. రోజువారీ రొటీన్ ఇర్రెగ్యులర్‌గా ఉండడం వంటివన్నీ మన చర్మాన్ని అనారోగ్యానికి గురయ్యేలా చేస్తుంటాయి. అందుకే మన శరీరం రియాక్షన్లను చర్మ సమస్యల ద్వారా మనకు చూపుతుంది. ఈ సమస్యలను తగ్గించుకుంటే చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా కొన్ని ఆయుర్వేద చిట్కాల ద్వారా చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు.

చర్మం మరియు జుట్టుకు బేకింగ్ సోడా యొక్క ప్రయోజనాలు

వాతదోషం ఉన్నవారు

– చలి ప్రదేశాలకు దూరంగా ఉండాలి. ఈదురు గాలి వీస్తున్నప్పుడు బయటకు వెళ్లకపోవడం మంచిది.
– గోరువెచ్చని నీరు, నిమ్మరసంతో దినచర్యను ప్రారంభించాలి. సున్నితమైన చర్మానికి సరిపడే క్రీములను మాత్రం ఉపయోగించాలి.

పిత్త దోషం ఉన్నవారు

– నూనె, కారం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోకూడదు.
– నీళ్లు ఎక్కువగా తాగాలి. దీంతో పాటు నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, కలబంద రసం తాగాలి.
– సహజ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించాలి.
– పన్నీరును ఎక్కువగా తీసుకోవాలి.
– నేరేడు, కర్బూజా పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.

కఫ దోషం ఉన్నవారు

– ఈ దోషం ఉన్నవారికి చర్మం జిడ్డుపై ఎక్కువగా ఉంటుంది. అందుకే రోజూ నాలుగైదు సార్లు ముఖం కడుక్కోవాలి.
– చర్మం లోపలి నుంచి శుభ్రం చేసే పదార్థాలను ఉపయోగించాలి. వారానికోసారి ఫేషియల్ మాస్క్ వేసుకోవాలి.
– సేంద్రియ కూరగాయలు, కారం, మిరియాలు, అల్లం ఎక్కువగా ఉపయోగించాలి.

కేశాల ఆరోగ్యానికి చిట్కాలు (Ayurvedic Tips For Hair)

కేశాల ఆరోగ్యానికి బయట నుంచి కాకుండా లోపలి నుంచి కూడా చికిత్స చేయాల్సి ఉంటుంది. ఆయుర్వేద (ayurveda) గుణాలుండే కలబంద రసం, ఆముదం తాగుతుండాలి. ఆముదాన్ని తలకు కూడా పట్టించాలి. వీటితో పాటు..పచ్చని కూరగాయలు ఎక్కువగా తింటూ ఉండాలి. తలస్నానం చేయడానికి కేవలం చల్లని నీరు లేదా మన శరీర ఉష్ణోగ్రతకు సమానమైన నీటిని మాత్రమే ఉపయోగించాలి. కురులు ఆరకముందే దువ్వకూడదు.

తలస్నానానికి ముందు అభ్యంగన స్నానం చేయాలి. ఔషధ యుక్త తైలాలను తలకు ఉపయోగిస్తూ ఉండాలి. ఇలాంటి కేశవర్థక ఔషధాలతో జుట్టుకి జీవం పోయవచ్చు. అంతేకాదు.. విరుద్ధ ఆహారాలను కలిపి తీసుకోకూడదు. వీటితో పాటు నీలి భృంగరాజ తైలం, మలత్యాది తైలం, శతావరికల్ప, అస్థిపోషకవటి, ఆరోగ్యవర్ధినివటి, గురూచిఘనవటి వంటి తైలాలు, మందులు ఉపయోగించి జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

ఆయుర్వేద ఫేస్ ప్యాక్స్, హెయిర్ మాస్క్‌లు (Ayurvedic Face Packs)

చందనం ఫేస్ ప్యాక్స్ (Sandalwood Face Pack)

చందనం మన చర్మాన్ని చల్లబరచడమే కాదు.. ఎన్నో ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అందుకే చందనంతో తయారుచేసిన ఫేస్ ప్యాక్‌తో ముఖాన్ని మెరిపించండి. దీనికోసం రెండు టీస్పూన్ల బాదం పప్పుల, పొడి రెండు టేబుల్ స్పూన్ల చందనం పొడి, మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె కలిపి ముఖానికి అప్లై చేయాలి. తొలుత వారానికి రెండు సార్లు రుద్దడంతో ప్రారంభించి.. తర్వాత కావాలంటే రోజూ వేసుకోవచ్చు. చందనంలోని యాంటీ వైరల్ గుణాలు మొటిమలు, ఇన్ఫెక్షన్ల నుంచి మన చర్మాన్ని కాపాడతాయి.

యాంటీ ఏజింగ్ ఫేస్ ప్యాక్స్ (Homemade Anti Aging Face Packs)

పసుపు, బియ్యపు పిండితో.. (Turmeric)

పసుపు మంచి యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. ఇది మన చర్మంపై ఉన్న సమస్యలను తగ్గించి దానికి మెరుపును తీసుకొస్తుంది. దీనికి బియ్యపు పిండిని చేర్చడం వల్ల చర్మంపై ఉన్న మృత కణాలు, దుమ్ముధూళి వంటివన్నీ మాయమైపోతాయి. దీని కోసం మనం చేయాల్సిందల్లా పసుపుతో పాటు, బియ్యపు పిండిని రెండు టేబుల్ స్పూన్ల చొప్పున తీసుకొని.. అందులో 2 టేబుల్ స్పూన్ల టొమాటో జ్యూస్ వేయాలి. దీన్ని బాగా కలిపి మెడ, ముఖానికి అప్లై చేసుకొని అరగంట పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. అప్పుడు అందమైన మెరుపును సొంతం చేసుకునే వీలుంటుంది.

కలబంద, నిమ్మరసంతో.. (Aloe Vera And Lemon Juice)

చర్మ సంరక్షణలో కలబందకు మించిన మరో ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే ఇందులో ఎన్నో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన చర్మంపై ఉన్న హానికరమైన కెమికల్స్‌ని బ్యాక్టీరియా, ఫంగస్ వంటి జీవులను నశింపజేస్తాయి. అలాగే మన చర్మం ముడతలు పడకుండా కాపాడుతాయి. ఈ పద్ధతిలో తొెలుత ఒక టీ స్పూన్ నిమ్మరసం, టేబుల్ స్పూన్ కలబంద గుజ్జు కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. కలబందలోని యాంటీఆక్సిడెంట్లు, నిమ్మలోని పోషకాలు మన చర్మాన్ని అందంగా మార్చి ఛాయను పెంచుతాయి. ఈ ప్యాక్‌ని కావాలంటే గంట పాటు ఉంచుకోవచ్చు. లేదా రాత్రి పడుకునేటప్పుడు అప్లై చేసుకొని ఉదయం లేచేవరకూ ఉంచుకోవచ్చు. ఇలా తరచూ చేస్తే మంచి ఫలితాలుంటాయి.

తులసి, వేపాకులతో (Basil And Peanuts)

తులసి, వేప.. ఈ రెండింటిలోనూ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. వీటిని కూడా మన చర్మం మెరిసేందుకు ఉపయోగించవచ్చు. దీని కోసం కొన్ని తులసి ఆకులు, కొన్ని వేపాకులు తీసుకొని.. ఒక టేబుల్ స్పూన్ పచ్పి పాలతో కలిపి రుబ్బుకోవాలి. ఆ తర్వాత  ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని 20 నిమిషాల పాటు ఉంచుకొని కడిగేస్తే సరి. మీ చర్మ సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. ఇలా కనీసం వారానికోసారి చేయాలి. 

బొప్పాయి ఫేస్ ప్యాక్ (Papaya Face Pack)

బొప్పాయి మన చర్మానికి మెరుపును అందించడంలో ముందుంటుంది. దీని కోసం రెండు కప్పుల బొప్పాయి పేస్ట్ తీసుకోవాలి. దీన్ని ముఖానికి బాగా అప్లై చేసుకోవాలి. ఆపై అరగంట నుంచి నలభై నిమిషాల పాటు ఉంచుకొని ఆ తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇందులోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని మరింత అందంగా మారుస్తాయి. 

నెయ్యితో.. (Ghee)

మన శరీరానికే కాదు.. చర్మానికి కూడా నెయ్యి ఎంతో మంచిది. శుద్ధమైన నెయ్యిని ముఖానికి అప్లై చేసుకొని మసాజ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. దీన్ని ముఖానికి అప్లై చేసి రుద్దడం వల్ల ముఖానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. చర్మం కాంతిమంతంగా మారుతుంది.చర్మంపై ఇరిటేషన్‌ని కూడా ఇది తగ్గిస్తుంది. అయితే సాధారణ నెయ్యికి బదులు ఆవు నెయ్యి ఉపయోగించడం వల్ల మరిన్ని ప్రయోజనాలను అందుకోవచ్చు. 

నారింజ ఫేస్ ప్యాక్ (Orange Face Pack)

నారింజ తొక్కల పొడి రెండు టీస్పూన్లు, పెరుగు టేబుల్ స్పూన్ తీసుకొని రెండింటిని కలిపి ముఖానికి అప్లై చేసి అర గంట పాటు అలాగే ఉంచుకొని తర్వాత ముఖం కడుక్కోవాలి. ముఖానికి అప్లై చేసుకున్న తర్వాత.. రెండు నిమిషాల పాటు సున్నితంగా మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మృత చ‌ర్మం తొలగిపోతుంది. 

జుట్టుకి కూడా..  (Ayurvedic Hair Masks)

ఆయుర్వేదం జుట్టు పెరుగుదలలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. మన కేశాల ఆరోగ్యం కాపాడుకునేందుకు ఈ ఆయుర్వేదిక్ హెయిర్ ప్యాక్స్ ప్రయత్నించి చూడండి.

వేపాకు, షీకా కాయతో.. (Shikhakai)

ముందుగా ఐదు లేదా ఆరు టీస్పూన్ల పెరుగు, టీ స్పూన్ షీకా కాయ పొడి ఒక గిన్నెలోకి తీసుకొని అందులో అర టీస్పూన్ చొప్పున వేపాకు పొడి, తులసి ఆకుల పొడి, గులాబీ రేకుల పొడి, మెంతి పొడి వేసి బాగా కలుపుకోవాలి. పొడిగా, ఎండిపోయినట్లుగా కనిపించే జుట్టు ఉన్నవారు.. ఇందులో టేబుల్ స్పూన్ ఆలివ్ నూనెను కూడా చేర్చుకోవచ్చు. ఇవన్నీ కలిపిన మిశ్రమాన్ని అరగంట పాటు అలా పక్కన పెట్టి ఉంచుకోవాలి.

తర్వాత జుట్టుకు దీన్ని అప్లై చేసుకోవాలి. మీది మరీ పొడుగు జుట్టైతే కాస్త తడిపి కూడా అప్లై చేసుకోవచ్చు. ముందు మాడు భాగంలో అప్లై చేసి మిగిలిన మిశ్రమాన్ని వెంట్రుకల చివర్ల వరకూ పూసి ముడివేసుకొని షవర్ క్యాప్ పెట్టుకోవాలి. అరగంట పాటు అలా ఉంచిన తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికోసారి చేయడం వల్ల జుట్టు అందంగా మెరిసిపోతుంది. జుట్టు రాలే సమస్య తగ్గి ఒత్తైన జుట్టు మీ సొంతమవుతుంది.

బ్రహ్మి, ఉసిరి ప్యాక్ (Brahmi)

విటమిన్ సి జుట్టు పెరుగుదలలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. బ్రహ్మి, ఉసిరిలో ఇది ఎక్కువగా ఉంటుంది. అందుకే మూడు కప్పుల నీటిని తీసుకొని అందులో కొన్ని బ్రహ్మి ఆకులు, ఉసిరికాయ ముక్కలు వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే దీన్ని స్టవ్ పై మరిగించాలి. మూడు కప్పుల నీళ్లు అరకప్పుగా మారేవరకూ దీన్ని అలాగే కొనసాగించాలి. ఆ తర్వాత దీన్ని చల్లార్చి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి పిప్పి పడేసి మిగిలిన రసాన్ని కుదుళ్లకు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత అరగంట నుంచి నలభై నిమిషాల పాటు అలాగే ఉంచి నీటితో కడిగేస్తే సరి. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది.

ఈ జాగ్రత్తలు పాటించండి.. (Ayurveda Beauty Tips In Telugu)
 

చర్మం ఆరోగ్యం కోసం ఎన్ని చిట్కాలు పాటించినా.. కొన్ని రోజువారీ మార్పులు, జాగ్రత్తల వల్లే చర్మం మెరుస్తూ ఉంటుంది.

అభ్యంగస్నానం చేయండి.. (Massage With Ayurvedic Oil)

రోజూ ఆయుర్వేద తైలంతో మీ శరీరాన్ని, జుట్టును మసాజ్ చేసుకోండి. దీని వల్ల మీ చర్మం మెరుస్తుంది. అంతేకాదు.. చర్మ ఆరోగ్యం కోసం తరచూ అభ్యంగస్నానం చేయాల్సి ఉంటుంది. కనీసం నెలలో రెండు సార్లయినా ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఇది రక్తప్రసరణను మెరుగుపరచి చర్మాన్ని మెరిపిస్తుంది.

భోజనం ఇలా.. (Have Meals On Time)

ఆయుర్వేదం ప్రకారం రోజూ మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్యలో భోజనం చేయాలి. ఈ సమయంలో ఆహారం తీసుకుంటే దాన్ని అరిగించుకోవడం శరీరానికి సులువుగా ఉంటుందట. ఇక రాత్రి భోజనం కూడా 9 గంటలకు ముందే చేసేయాలని ఆయుర్వేదం చెబుతుంది. లేదంటే శరీర సమస్యలతో పాటు చర్మ సమస్యలు కూడా వస్తాయి. మధ్యలో డ్రైఫ్రూట్స్ లేదా పండ్లతో తయారు చేసిన స్నాక్ తీసుకోవచ్చు.

ఈ ఆహారం వద్దు.. (Avoid Fast Food)

సాధారణంగా మనం బయటి ఆహారం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. కానీ ఆయుర్వేదం ప్రకారం చైనీస్ ఫుడ్ తినకూడదట. నూడిల్స్, ఫ్రైడ్ రైస్ లాంటివి మన దోషాలను పెంచుతాయని ఆయుర్వేదం చెబుతోంది. అంతేకాదు.. నూనె ఎక్కువగా ఉండే ఆహారాన్ని కూడా తీసుకోకూడదని చెబుతుంటారు ఆయుర్వేద నిపుణులు. అందుకే సమోసాలు, బజ్జీలు, ఇతర వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటితో పాటు చిప్స్, వేఫర్స్, చాక్లెట్ల వంటివి కూడా తినకూడదట. కొందరికి చాక్లెట్ తరచూ తినడం అలవాటు. దీన్ని మానుకుంటే మంచిది.

మెడిటేషన్ చేయండి.. (Meditate Regularly)

రోజూ తెల్లవారుఝామున నిద్ర లేచి మెడిటేషన్ చేయడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అందుకే రోజువారి కార్యక్రమాలతో ఎంత బిజీగా ఉన్నా.. కనీసం పది నిమిషాలైనా యోగా, మెడిటేషన్ చేయడం మర్చిపోవద్దు. ఇది మీ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

తరచూ అడిగే ప్రశ్నలు.. FAQ’s

1. ఆయుర్వేదం చిట్కాలను (ayurveda) పాటించడం వల్ల ఏవైనా దుష్ప్రభావాలు ఉంటాయా?

జ : మనం తీసుకునే ప్రతి మందు లేదా ఆహారం వల్ల మన పై మంచి ప్రభావం ఉన్నట్లే చెడు ప్రభావాలు కూడా ఉంటాయి. బాగా ఉడికిన ఆహారం తింటే పోషకాలు అందుతాయి. అయితే సరిగ్గా ఉడకని ఆహారం తింటే కడుపు నొప్పి వస్తుంది. అలాగే సరైన రీతిలో తీసుకోకపోతే ఆయుర్వేద మందులకు కూడా దుష్ప్రభావాలు ఉంటాయి. అయితే అవి మరీ ఎక్కువ కాదు కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.

2. ఆయుర్వేద మందులు అంత త్వరగా పనిచేయవని అంటారు. నిజమేనా?

జ : సాధారణంగా సమస్యను పూర్తి మూలాల నుండి.. అధ్యయనం చేయడానికి సమయం పడుతుంది. అయితే మిగిలిన వైద్య విధానాల మాదిరిగానే కొన్ని సమస్యలు తగ్గించడానికి ఆయుర్వేదం కూడా వేగంగా పనిచేస్తుంది. ఉదాహరణకు మలబద్దకాన్ని తగ్గించేందుకు ఆయుర్వేద మందులు తీసుకుంటే ఒక్క పూటలోనే మంచి ఫలితం కనిపిస్తుంది. సమస్య తీవ్రతను బట్టి సమయం కూడా పడుతుందని గుర్తుంచుకోవాలి.

3. ఆయుర్వేద మందులు వాడితే ఆహార నియామాలు పాటించాలా?

జ : ఎలాగైతే నీళ్లతో కారు నడపలేమో.. అలాగే మన శరీరాన్ని కూడా జంక్ ఫుడ్‌‌తో ఆరోగ్యంగా ఉంచలేం. అందుకే ఆయుర్వేద మందులు వాడుతున్నప్పుడు పత్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆయుర్వేద మందులు వాడుతున్నప్పుడు మన జీర్ణ వ్యవస్థలో మార్పులు వస్తాయి. జీర్ణ వ్యవస్థ శుద్ధి జరుగుతుంది కాబట్టి పత్యం చేయడం కూడా అవసరమే. అయితే ఇవన్నీ మన శరీరానికి అవసరమైన పోషకాలు అందించే ఆహారపదార్థాలే కాబట్టి ఇబ్బందేమీ ఉండదు.

4. ఆయుర్వేదంతో చర్మ సమస్యలు తగ్గించేందుకు ఎంత సమయం పడుతుంది?

జ : ఆయుర్వేదం లోపలి నుంచి శరీరాన్ని శుద్ధి చేసి చర్మ సమస్యను తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థలోని దోషాలను ముందు శుద్ధి చేసి.. తర్వాత చర్మ సమస్యలను తగ్గిస్తుంది. అందుకే కాస్త సమయం పట్టే అవకాశం ఉన్నా సమస్య పూర్తిగా తగ్గుతుంది. సాధారణంగా సమస్య తీవ్రతను బట్టి.. అది తగ్గేందుకు కొన్ని నెలల నుంచి సంవత్సరాల వరకూ సమయం పడుతుంది.

ఇవి కూడా చదవండి. 

అవిసె గింజ‌ల‌తో ఆరోగ్య‌మే కాదు.. అంద‌మైన మోము కూడా సొంత‌మ‌వుతుంది..!

క‌మ్మ‌ని చాక్లెట్.. మీకు క‌ళ్లు చెదిరే అందాన్ని కూడా అందిస్తుంది..!

బొప్పాయి మీకందించే.. బహుచక్కని ప్రయోజనాలేమిటో తెలుసా..?

Read More From Ayurveda