Lifestyle

#POPxoWomenWantMore ఏడాదిలో ఒక్క రోజు కాదు.. రోజూ మహిళలదే: నిఖత్ జరీన్

Lakshmi Sudha  |  Mar 4, 2019
#POPxoWomenWantMore ఏడాదిలో ఒక్క రోజు కాదు.. రోజూ మహిళలదే: నిఖత్ జరీన్

నిజామాబాద్‌లోని మారుమూల ప్రాంతానికి చెందిన అమ్మాయి.. బాక్సింగ్ పై మక్కువ పెంచుకొంది. అప్పటికే తన ఎనలేని సత్తాను ప్రపంచానికి రుచి చూపించిన మేరీకోమ్‌ను ఆదర్శంగా తీసుకొంది. బాక్సింగ్ నేర్చుకోవడానికి సరైన సౌకర్యాలు అందుబాటులో లేకపోయినా.. మెరికలా తయారైంది. తన పంచ్ పవర్‌తో పతకాలు సాధిస్తోంది. తెలంగాణా మేరీకోమ్ అని పేరు తెచ్చుకొంది. తనే నిఖత్ జరీన్(Nikhat Zareen).

ప్రత్యర్ధి ఎవరైనా సరే వారి బలహీనతలనే.. తన బలంగా మార్చుకొని పతకాలు సాధిస్తూ ముందుకు సాగిపోతోంది.  కాస్త ప్రోత్సాహం అందిస్తే చాలు అమ్మాయిలు ఏదైనా సాధించగలరు అని నిరూపిస్తోన్న నిఖత్  ఉమన్ పవర్ గురించి చెబుతోన్న కొన్ని విశేషాలు మీకోసం..

ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టి అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తోన్న నిఖత్ స్త్రీ శక్తిని తక్కువ అంచనా వేయద్దని చెబుతుంది. ‘మహిళలకు సరైన ప్రోత్సాహం అందిస్తే తాము అనుకొన్నది సాధించి చూపిస్తారు. దానికి ఎన్నో ఉదాహరణలు మనకు కనిపిస్తాయి.  అంత వరకూ ఎందుకు.. నా సంగతే తీసుకోండి. ఎక్కడో నిజామాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతానికి చెందిన నన్ను “ఇక్కడ ఏమీ సౌకర్యాలు లేవులే అని,, అలానే వదిలేస్తే నేను ఇంత వరకు వచ్చి ఉండేదాన్ని కాదు”. ఉన్నవాటినే ఉపయోగించుకుంటూ ముందుకెళితే విజయం సొంతం చేసుకోవచ్చు’ అంటుంది.

“ఎవరో ఏదో అనుకొంటారని ఎప్పుడూ మీ ఇష్టాలను నెరవేర్చుకొనే క్రమంలో వెనకడుగు వేయొద్దు. నేను బాక్సింగ్ చేస్తానని చెప్పినప్పుడు మా నాన్న మినహా నన్నెవరూ ఎంకరేజ్ చేయలేదు. ఆయన కూడా స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి ఆటల విలువ ఆయనకు తెలుసు కాబట్టి నన్ను ప్రోత్సహించారు. నాన్న దగ్గరి నుంచి కూడా నాకు ఆ ప్రోత్సాహం లభించకపోయినట్లైతే.. ఇప్పుడు నేను ఈ స్థాయికి చేరుకొని ఉండేదాన్ని కాదు”

“బాక్సింగ్ అంటే మగపిల్లల ఆట.. అది నీకెందుకు? అని నన్ను ఆపడానికి ప్రయత్నించినవారే ఎక్కువ మంది ఉన్నారు. నాకే కాదు ఏ అమ్మాయికైనా ఇలాగే జరుగుతుంది. ఇలాంటి వాటిని మనం పట్టించుకొంటే.. మనం ఎక్కడ ఉన్నవాళ్లం అక్కడే ఉంటాం. ఏం చేయాలి ఏం చేయకూడదనే నిర్ణయం మనదైతేనే ఎందులోనైనా విజయం సాధించగలం.”

ప్రతిభ నిరూపించుకొన్న తర్వాత ఎవరైనా అందలం ఎక్కిస్తారు. కానీ ముందుగానే ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలంటోంది ఈ బాక్సింగ్ స్టార్.

‘మన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ దానికి తగిన ప్రోత్సాహం కూడా దొరికితే ఆ కష్టం కష్టంగా అనిపించదు. అనుకొన్నదానికంటే ముందుగానే లక్ష్యం చేరుకొంటాం. అయితే అలాంటి ప్రోత్సాహం ఎంతమందికి దక్కుతోంది? అది దొరికితే.. మహిళలు సైతం ఆకాశాన్ని అందుకోగలుగుతారు. ఇప్పటికే ఈ విషయంలో సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. ఇంకా మారాల్సిన అవసరం ఉంది. అప్పుడే మహిళలు మరింత మెరుగైన సమాజ నిర్మాణంలో తమ వంతు పాత్రను పోషించగలుగుతారని నా అభిప్రాయం’.

ఆడమగ ఇద్దరూ సమానమే అని ఎంతలా మొరపెట్టుకొన్నా.. సమాజంలో కనిపించే మార్పు ఏమీ లేదు. నిజం చెప్పాలంటే చిన్నతనం నుంచి అమ్మాయలకు ఈ విషయాన్ని నెమ్మదిగా నూరిపోస్తుంటారు. అమ్మాయి ఇలాంటి దుస్తులే వేసుకోవాలి. ఇంటి పనులు నేర్చుకోవాలి. ఎవరో ఒకరిని చూపించి వారిని పెళ్లి చేసుకోమంటే చదువు ఆపేసి మరీ పెళ్లిపీటలెక్కాలి. ఆ తర్వాత పిల్లల్ని కనాలి. ఇలా చేయ‌డం ఏ మాత్రం స‌రికాదంటోంది నిఖ‌త్.

‘పురుషులు ఏదైనా చేయగల సమర్థులనే దురభిప్రాయం మన సమాజంలో ఉంది. వారు మాత్రమే ఉద్యోగాలు చేయగలరనే అభిప్రాయం చాలామందిలో ఉంది. అది చాలా తప్పు. మహిళలు బలహీనులు కాదు. వారు తలచుకొంటే ఏదైనా చేయగలరు. మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. ఈ విషయాన్ని చాలామంది మహిళలు రుజువు చేస్తున్నారు. వారిని చూసైనా సమాజంలో మార్పు వస్తే బాగుంటుంది’ అని చెబుతోంది నిఖత్.

మహిళా దినోత్సవం ఒక్క రోజే జరుపుకొని ఆ తర్వాత మహిళా సాధికారత గురించి పక్కన పడేయడం మంచిది కాదని నిఖత్ జరీన్ చెబుతోంది. ‘ఏడాదిలో ఒక్క రోజు మాత్రమే మహిళలది కాదు. ప్రతి రోజూ మనదే. మన కోసం ప్రత్యేకించి సెలబ్రేట్ చేయాల్సిన అవసరం లేదు. మహిళలను పురుషులతో సమానంగా చూడగలిగితే చాలు. సమాజాన్ని మొత్తం మనం మార్చాల్సిన అవసరం లేదు. మనల్ని మనం మార్చుకోగలిగితే చాలు. ఆ మార్పు అందరిలోనూ రావాలి. అప్పుడే మహిళల పరిస్థితిలో మార్పు వస్తుంది’.

మహిళలు స్వ‌తంత్య్రంగా వ్యవహరించడం మాత్రమే కాదు.. ఎవరైనా ఏడిపిస్తే.. వెంటనే వారి పని పట్టాలని చెబుతోంది. దాని కోసం అమ్మాయిలంతా ఆత్మరక్షణ విద్యలు తప్పనిసరిగా నేర్చుకోవాలని సూచిస్తోంది నిఖత్.

Images: Nikhat Zareen Facebook

ఇవి కూడా చ‌ద‌వండి

#StrengthOfAWoman ప్ర‌తి మ‌హిళ త‌న‌కి తాను విలువ ఇచ్చుకోవాల్సిందే..!

#StrengthOfAWoman మ‌హిళా శ‌క్తిని గుర్తించండి.. సాధికార‌త దిశ‌గా వారిని ప్రోత్స‌హించండి..!

అమ్మాయిలను మనుషులుగా చూడండి.. మార్పు అదే వస్తుంది: నీలిమ పూదోట

Read More From Lifestyle