Lifestyle

హైదరాబాద్ కా షాన్.. ఫలక్ నుమా ప్యాలెస్ గురించి మీకు ఈ విశేషాలు మీకు తెలుసా?

Soujanya Gangam  |  Aug 14, 2019
హైదరాబాద్ కా షాన్.. ఫలక్ నుమా ప్యాలెస్ గురించి మీకు ఈ విశేషాలు మీకు తెలుసా?

ఫలక్ నుమా ప్యాలెస్ (falaknuma palace).. హైదరాబాద్ (Hyderabad) కీర్తి కిరీటంలో ఓ కోహినూర్ వజ్రం లాంటిది. దానికంటూ ఒక అరుదైన ప్రత్యేకతను సంపాదించుకుందీ రాజభవనం. 19వ శతాబ్దంలో నిర్మితమైన ఈ ప్యాలెస్‌కి దానికంటూ ఓ ఘన చరిత్రే ఉంది. అంతేకాదు.. ఈ అద్బుత భవనం ఇప్పుడు హైదరాబాద్‌లోని అన్ని చారిత్రక ప్రదేశాల కంటే ఖరీదైనది కూడా. ప్రస్తుతం తాజ్ ఫలక్ నుమాగా పిలవబడుతున్న ఈ ప్యాలెస్ గురించి చాలామందికి తెలియని కొన్ని విశేషాలు మీకోసం..

tripadvisor

1. ఫలక్ నుమా ప్యాలస్‌ని 1893లో నవాబ్ వికార్ ఉల్ ఉమ్రా నిర్మించారు. ఆయన అప్పటి నిజాంకి ప్రధాన మంత్రిగా వ్యవహరించేవారు. నిజాంల పరిపాలన పూర్తయినా.. 2000 సంవత్సరం వరకూ అది నిజాం వారసుల ఆధీనంలోనే ఉండేది. తర్వాత ఈ ప్యాలెస్ ఓ సందర్శనీయ స్థలంగా మారింది. 2010లో తాజ్ గ్రూప్ ఈ భవానాన్ని లీజ్‌కి తీసుకొని దానికి పునర్వైభవాన్ని అందించింది.

2. ఈ ప్యాలెస్ మొత్తం 32 ఎకరాల్లో నిర్మితమైంది. ఇందులో 22 హాళ్లు, 60 గదులు ఉన్నాయి. ఈ ప్యాలస్ చార్మినార్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది.

3. ఫలక్ నుమా అంటే ఉర్దూలో ఆకాశం లాంటిది లేదా ఆకాశానికి అద్దం అని అర్థం. ఈ ప్యాలెస్‌ను ఓ కొండపై..  భూమి నుంచి 2000 అడుగుల ఎత్తులో నిర్మించారట. అందుకే దీనికి ఆ పేరు పెట్టారు. ప్యాలెస్ పై నుంచి చూస్తే హైదరాబాద్ నగరం మొత్తం కనిపిస్తుంది.

ఈ వేసవి సెలవుల్లో.. మీరు తెలంగాణలో చూడదగ్గ ఎకో – టూరిస్ట్ స్పాట్స్ ఇవే..!

Tripadvisor

4. ఈ ప్యాలెస్ ఇప్పుడు తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్‌లో భాగం. అక్కడికి అడుగు పెట్టగానే రాజ ఠీవితో స్వాగతం చెబుతారు. ఈ గ్రాండ్ వెల్‌కంలో భాగంగా.. ముందు గుర్రపు బగ్గీలో మిమ్మల్ని గేట్ నుంచి ప్యాలెస్ వరకూ తీసుకెళ్తారు. అందమైన గార్డెన్స్ అన్నీ చూస్తూ గుర్రపు బగ్గీలో విహరించవచ్చు. ఆ తర్వాత ప్యాలెస్‌లోకి అడుగుపెట్టగానే వెల్‌కం డ్రింక్‌తో పాటు పూలు, అత్తరు చల్లుతూ లోపలికి తీసుకెళ్తారు.

5. ఈ ప్యాలెస్ చరిత్ర గురించి అందరికీ తెలియజేసేందుకు.. భవనంలోనే ఓ హిస్టోరియన్ కూడా ఉండడం విశేషం. ఆయన ఇక్కడున్న శాండ్లియర్లు, వుడెన్ ప్యానెల్స్, మార్బుల్స్, పెయింటింగ్స్ ఏయే దేశాల నుంచి తెప్పించారో మనకు వివరిస్తూ ఉంటారు. ఇందులోని చాలావరకు సామగ్రిని అమెరికా నుంచి తెప్పించగా.. ఫర్నిచర్‌‌లో అధిక భాగం ఇటాలియన్, టుడోర్ నుంచి తెప్పించడం వల్ల అక్కడి శైలి కనిపిస్తుంది. అంతేకాదు.. ప్యాలెస్ పైభాగంలోనూ శిల్పాలు కనిపిస్తాయి. ఇదే ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడి ప్రతి గోడపైనా అందమైన పెయింటింగ్స్ వేలాడుతూ కనిపిస్తాయి.

Tripadvisor

రామోజీ ఫిలిం సిటీని సందర్శించాలని భావిస్తున్నారా? అయితే మీకు ఈ వివరాలు తెలియాల్సిందే..!

6. ఇంగ్లండ్‌కి చెందిన ఓ సంస్థ.. ఒకేలా ఉండే రెండు బిలియర్డ్స్ టేబుళ్ల ప్రీమియం ఎడిషన్‌ని తయారు చేసిందట. అందులో ఒక టేబుల్ ఇంగ్లండ్‌లోని బకింగ్ హమ్ ప్యాలెస్‌లో ఉంటే.. మరొకటి ఇక్కడ ఉండడం విశేషం. ఇక్కడి అతిపెద్ద డైనింగ్ రూమ్‌లో టేబుల్, కుర్చీలు రోజ్ వుడ్‌తో తయారుచేసి ఉంచారట. అంతేకాదు.. ఇక్కడి బాల్ రూంలో రెండు టన్నుల బరువున్న పియానో కూడా ఉందట.

7. టేబుల్ అనగానే అందరికీ గుర్తొచ్చేది.. ఫలక్ నుమా ప్యాలెస్‌లోని 101 మంది కూర్చోగలిగే టేబుల్. ఈ టేబుల్ ప్రపంచ ప్రఖ్యాతి సాధించింది. ఇక్కడి వెండి బంగారు రంగులు కలగలిసిన ప్లేట్లు, బీదరీవేర్ గ్లాసులు ఆకర్షిస్తాయి. ఇంత పెద్ద టేబుల్ ఉన్నా.. గది నిర్మాణం ఎలా ఉంటుందంటే ఈ చివర ఉన్నవారు మామూలుగా మాట్లాడింది కూడా.. ఆ చివర ఉన్నవారికి వినిపిస్తుందట.

Tripadvisor

8. నిజాం రాజులు, వారి కుటుంబ సభ్యులకు చెందిన ఎన్నో పచ్చల హారాలను ఇక్కడ చూసే వీలుంది. అంతేకాదు.. ఇక్కడున్న అతి పెద్ద లైబ్రెరీలో సుమారు ఆరు వేల పుస్తకాలు ఉన్నాయట. వాటన్నింటినీ చూడడమే కాదు.. చదివే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఎన్ సైక్లోపీడియా బ్రిటానికా మొదటి కాపీలు, టైటానిక్ మొదటి ఎడిషన్ వంటి అరుదైన పుస్తకాలన్నీ ఉన్నాయట.

9. ఇక్కడి గోల్ బంగ్లాలో రోజూ ఖవ్వాలీ పాటల కార్యక్రమం జరుగుతుందట. అక్కడికి వచ్చిన అతిథులు ఆ పాటలు వింటూ తమకు నచ్చిన భోజనం తినేలా ఏర్పాటు చేశారు. ఇక్కడ కేవలం పాటలే కాదు.. ఆ పాత కాలం నాటివి, ఇప్పటివి హైదరాబాద్‌కి చెందిన వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయి. ఇక్కడి షాప్ కమ్ మ్యూజియంలో వాటిని కొనుక్కునే వీలు కూడా ఉంది.

Tripadvisor

తెలంగాణలో అందరూ తప్పక చూడాల్సిన.. ప్రముఖ దేవాలయాలు ఇవే..!

10. ఈ ప్యాలెస్ ఏరియల్ వ్యూ.. ఇప్పటివరకూ ఎవరూ ఫోటోల్లో బంధించలేదు. అయితే ఈ ప్యాలెస్ మొత్తం ఓ తేలు షేప్‌లో ఉంటుందట. ఈ ప్యాలెస్ నిర్మించిన ఆర్కిటెక్ట్ విలియం మారియట్. ఆయన రాశి వృశ్చికం. దాని ప్రకారం ఈ భవనాల సముదాయాన్ని తేలు షేపులో నిర్మించాడట. దీన్ని పైనుంచి చూడకపోయినా మధ్య భాగంలో జెనీనా మహల్, మెస్ ఖానా, టెలిఫోన్ ఎక్చేంజ్ వంటివి ఉంటే.. దక్షిణ భాగాన ఉన్న నిర్మాణాలు తేలు కొండిల్లా.. మరో భాగంలో ఉన్న గోల్ బంగ్లా తేలు తోకలా కనిపించేలా చేస్తుందట.

Featured Image: Booking.com

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

Read More From Lifestyle