Lifestyle

ఫ్యాన్సీ నెంబర్ల కోసం లక్షలు కుమ్మరిస్తున్న వైనం.. చదివితే అవాక్కవ్వాల్సిందే!

Sandeep Thatla  |  Apr 17, 2019
ఫ్యాన్సీ నెంబర్ల కోసం లక్షలు కుమ్మరిస్తున్న వైనం.. చదివితే అవాక్కవ్వాల్సిందే!

కిషోర్‌కి సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. అందులోనూ న్యూమరాలజీ అంటే ఇంకాస్త ఎక్కువ గురి. అందుకే  లక్ష రూపాయలు పెట్టి కొన్న బైక్‌కి తనకి ఎంతగానో కలిసొచ్చే 9 నెంబర్.. తన రిజిస్ట్రేషన్ నెంబర్‌గా కావాలనుకున్నాడు. అయితే తాను కోరుకున్న నెంబర్ కావాలనుకోగానే సరిపోదు కదా. అందుకే దగ్గరలోని ఆర్.టి.ఓ ఆఫీస్‌కి వెళ్లి ఆన్లైన్‌లో తనకి కావాల్సిన రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం బిడ్డింగ్ వేసాడు.

అయితే రవాణా శాఖ వారు ఇలాంటి ఫ్యాన్సీ నెంబర్స్‌కి (Fancy numbers) ముందుగానే ప్రారంభ ధరని నిర్దేశిస్తారు. ఇక ఆ నెంబర్ కోసం మరింత మంది పోటీ పడడంతో ఆ నెంబర్ కోసం.. వారితో వేలంపాటలో పాల్గొని సుమారు రూ 2.5 లక్షలు చెల్లించి తనకి కావాల్సిన 9 నెంబర్‌ని దక్కించుకున్నాడు కిషోర్.

ఒకసారి మీరు దీనిని గమనిస్తే, తాను ఇష్టపడి కొనుకున్న బైక్ విలువ 1 లక్ష రూపాయలైతే.. దాని రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం వెచ్చించిన సొమ్ము రూ 2.5 లక్షలు. అంటే బండి ఖరీదు కన్నా మరో 1.5 లక్షలు ఎక్కువ.

పైన చెప్పిన ఉదాహరణ ఒక మాదిరిగా ఉంటే.. ఇప్పుడు చెప్పబోయే మరో ఉదాహరణ మిమ్మల్ని ఇంకాస్త ఎక్కువ షాక్‌కి గురిచేయచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేరళ రాష్ట్రానికి చెందిన ఒక వ్యాపారవేత్త కేఎస్ బాలగోపాల్ తాను ఎంతగానో ముచ్చటపడి విదేశాల నుంచి కోటి రూపాయలు పెట్టి మరి పోర్షే కారుని తెప్పించుకున్నాడు.

 

ఆయన వద్ద లగ్జరీ కార్ల కలెక్షన్ ఉందట.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లతో పాటు పేరు పొందిన కార్లు కూడా కొనడం ఆయన గారి హాబీ! అలా కొన్న కార్లకి ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నెంబర్లు కూడా కావాలనుకోవడం ఆ హాబీకి ఉన్న అదనపు ఎట్రాక్షన్. అలా ఆయన ఫిబ్రవరిలో ఎంతో ముచ్చటపడి కొన్న పోర్షే కారుకి ‘1’ నెంబర్ కావాలనుకున్నాడు.

అందుకుగాను తిరువనంతపురంలో ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్‌కి వెళ్లి బిడ్డింగ్‌లో పాల్గొన్నాడు. ఆయనతో పాటు ఇదే నెంబర్ కోసం మరో ఇద్దరు పోటీపడగా.. అందులో ఒక వ్యక్తి అయిదు లక్షల వరకు వచ్చి ఆగిపోగా.. మరొక వ్యక్తి సుమారు రూ 25 లక్షల వరకు వచ్చాడు. చివరకు రూ. 30 లక్షలకి ఈ నెంబర్‌ని బాలగోపాల్ దక్కించుకోగా.. ఆ తరువాత అన్ని ట్యాక్స్‌లు కట్టి రూ. 31 లక్షలకి KL – 01 CK – 1 నెంబర్‌ని సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే మీకు అర్ధమైపోయిండాలి.. ఈ ఫ్యాన్సీ నెంబర్ల పిచ్చి ప్రజల్లో ఎంత బలంగా ఉందో.

తాజాగా ఈ ఫ్యాన్సీ నెంబర్ల పిచ్చి హైదరాబాద్‌లో ఇద్దరి మధ్య వివాదానికి కారణమై.. ఒకరిపై మరొకరు దాడికి పాల్పడే వరకు వచ్చింది. వివరాల్లోకి వెళితే.. టీఎస్09 ఎఫ్ఎఫ్ సిరీస్ మొదలవడంతో అందులో వచ్చే మొదటి నెంబర్ 0001పైన అందరి దృష్టి పడింది.

 

అందుకు తగ్గట్టుగానే నలుగురు వ్యక్తులు ఆ నెంబర్‌కి రవాణా శాఖ వారు విధించిన రుసుము పైన.. వారికి నచ్చిన ధరను సీక్రెట్ బిడ్డింగ్ రూపంలో వేసి.. అక్కడ ఉంచిన బాక్స్‌లో నిర్ణీత సమయంలో వేయమని కోరారు. అలా వేసిన వాటిని తీసుకెళ్తుండగా.. మరొక కొత్త బిడ్ వేయాలని ఒకరు ప్రయత్నించగా.. సదరు వ్యక్తిని ఆపడానికి ఆపే క్రమంలో ఇద్దరి మధ్య వివాదం మొదలై.. అది ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్ళింది.

ఇక మొన్న ఒక్క రోజే ఆర్.టి.ఓ కార్యాలయంలో ఈ నెంబర్ల వేలం ద్వారా రూ.30,55,748 లక్షలు సమకూరాయంటే ఆ రోజు అక్కడ జరిగిన హాడావుడి ఎంతలా ఉందో మీ ఊహకే వదిలేస్తున్నాము.

పైన చెప్పిన ఉదాహరణలను బట్టి అదృష్ట సంఖ్యల పైన నమ్మకమొక్కటే కాదు.. సమాజంలో తమ హోదాకి తగ్గట్టుగా వారి వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లు కూడా ఉండాలని కొందరు కోరుకుంటున్నారు. 

ఏదేమైనా జనాలకి ముదురుతున్న ఈ ఫ్యాన్సీ నెంబర్ల పిచ్చి.. రవాణా శాఖ పాలిట మాత్రం కల్పవృక్షంగా మారిందనే చెప్పాలి. 2017 సంవత్సరంలో సుమారు రూ 21 కోట్లు ఈ ఫ్యాన్సీ నెంబర్ల రూపంలో వారికి రాబడి  రూపంలో రాగా.. అంతకముందు అంటే 2016లో రూ 13.50 కోట్లు వచ్చాయట. ఈ లెక్కలతో పోలిస్తే 2018లో కచ్చితంగా రవాణా శాఖకి ఎంతలేదన్నా రూ 31 కోట్ల వరకు ఆదాయం వచ్చే ఉంటుంది.

అంతేలెండి… ఒకరి పిచ్చి మరొకరికి లాభం అంటే బహుశా ఇదేనేమో!!

Featured Image: Shutterstock.com, Pixabay.com

ఇవి కూడా చదవండి

బాక్సింగ్‌లోనే కాదు.. పాట పాడడంలో కూడా మేరీ కోమ్ నెం 1..!

కొడుకు కోసం.. మళ్లీ క్రికెటర్‌గా మారే తండ్రి కథ “జెర్సీ”..!

అల్లు అర్జున్ సినిమాలో.. ఛాన్స్ కొట్టేసిన ‘గీత గోవిందం’ హీరోయిన్..!

Read More From Lifestyle