అల్లు అర్జున్ సినిమాలో.. ఛాన్స్ కొట్టేసిన 'గీత గోవిందం' హీరోయిన్..!

అల్లు అర్జున్ సినిమాలో.. ఛాన్స్ కొట్టేసిన 'గీత గోవిందం' హీరోయిన్..!

సినిమా హీరోలు లేదా హీరోయిన్ల పుట్టినరోజు సందర్భంగా వారికి సంబంధించిన సినిమాల విశేషాలు, ఫస్ట్ లుక్.. వంటి వాటిని ప్రేక్షకులతో పంచుకోవడం ఈ మధ్యకాలంలో మామూలైపోయింది. ఈ క్రమంలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా ఆయన నటిస్తోన్న మూడు సినిమాలకు సంబంధించి కీలక సమాచారాన్ని వెలువరించారు. 


ప్రస్తుతం అల్లు అర్జున్ ఏ చిత్రం చేయబోతున్నాడు? ఎవరి దర్శకత్వంలో చేయబోతున్నాడు? ఏ నిర్మాణ సంస్థలో చేయబోతున్నాడు? ఆయన పక్కన నటించే నటీమణి ఎవరు? లాంటి ప్రశ్నలకు ఆయన ఈ పుట్టినరోజు సందర్భంగా అందరికి ఒక క్లారిటీ ఇచ్చారు.


అల్లు అర్జున్ చేస్తోన్న చిత్రాల్లో ముందువరుసలో ఉంది.. అలాగే మనం ముందుగా చెప్పుకోవాల్సింది.. హారిక హాసిని క్రియేషన్స్  & గీత ఆర్ట్స్ (Geetha Arts) నిర్మాణ సారధ్యంలో రూపొందుతోన్న చిత్రం గురించి. చినబాబు  & అల్లు అరవింద్ (Allu Aravind) నిర్మాతలుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.


దువ్వాడ జగన్నాధం (డీజే) సినిమాలో స్టైలిష్ స్టార్‌తో జత కట్టిన బ్యూటీ పూజా హెగ్డే (Pooja Hegde) ఈ సినిమా కోసం మరోసారి అల్లు అర్జున్‌తో కలిసి నటించనుంది. అయితే  ఈ వార్తను ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. పైగా ఈ సినిమా బాలీవుడ్‌లో విడుదలై విజయం సాధించిన ఒకానొక సినిమా స్ఫూర్తితో రూపొందుతోందట. అయితే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు.. త్వరలోనే టీం అంతా కలిసి వెల్లడిస్తారట.


దీని తర్వాత అల్లు అర్జున్ చేస్తోన్న చిత్రాల జాబితాలో మనం మాట్లాడుకోవాల్సింది దర్శకుడు సుకుమార్ డైరక్షన్‌లో రూపొందనున్న చిత్రం గురించి. సినీ పరిశ్రమలో తమ కాంబో ఎలా ఉంటుందో ఇది వరకే నిరూపించుకున్నారు సుక్కు- బన్నీ. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు ఓ స్థాయిలో ఏర్పడ్డాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే మూడో సినిమా కోసం కూడా ప్రేక్షకులు చాలా సంతోషంగా ఎదురుచూస్తున్నారు. 


ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా ఇందులో హీరోయిన్‌గా సౌత్ సెన్సెషనల్ అయిన రష్మిక మందాన (Rashmika Mandanna)ని ఎంపిక చేసారు. గీత గోవిందం (Geetha Govindam) ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక‌ని పొగడ్తలతో ముంచేసిన అల్లు అర్జున్, ఇప్పుడు ఏకంగా తన పక్కన నటించే ఛాన్స్ కూడా ఇచ్చేయడం విశేషం.


ఈ రెండు చిత్రాల అధికారిక ప్రకటనలు తన అభిమానులకి కావాల్సినంత కిక్ ఇస్తాయో లేదో అని అనుకున్నాడో ఏమో! మరో చిత్రాన్ని కూడా అధికారికంగా ప్రకటించేశాడు బన్నీ. అయితే ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది ఆషామాషీ సంస్థ కాదు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) సొంత బ్యానర్ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (Sri Venkateswara Creations) సారధ్యంలో వేణు శ్రీరామ్ (Venu Sriram) దర్శకుడిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.  ఈ చిత్రానికి ఆసక్తికరంగా "ICON" అనే టైటిల్ పెట్టగా - దీనికి కనబడుట లేదు అనే ఉపశీర్షిక కూడా పెట్టడం జరిగింది. దీనితో ఈ చిత్రం పైన ఒక్కసారిగా అందరి దృష్టి పడింది.


అయితే దర్శకుడిగా పెద్దగా సక్సెస్ లేని వేణు శ్రీరామ్ చెప్పిన కథకి అల్లు అర్జున్ పచ్చ జెండా ఊపడం.. ఇప్పుడు ఫిలింనగర్‌లో పెద్ద చర్చకు దారి తీయగా.. కథకి ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇచ్చే దిల్ రాజు నిర్మాణంలో రాబోతున్న  ఈ చిత్రానికి బలమైన కథ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశముంది.


మొత్తానికి అల్లు అర్జున్ తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆసక్తిగా వేచి చూస్తోన్న అభిమానులకు ట్రిపుల్ ధమాకా రూపంలో భలే ట్రీట్ ఇచ్చాడు బన్నీ. అయితే వీటిలో ఏది హిట్ అవుతుంది? బన్నీకి ఈ చిత్రాలు హ్యట్రిక్ హిట్ అందిస్తాయా?? లేదా??? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే..


ఇవి కూడా చదవండి


#JoinRishi అంటూ 'ఉగాది'ని స్టైలిష్‌గా మార్చేసిన... మహేష్ బాబు 'మహర్షి' టీజర్


ప్రేమ ఉన్న చోట.. బాధ కూడా ఉంటుంది (మజిలీ మూవీ రివ్యూ)


మెగా‌పవర్ స్టార్ రామ్‌చరణ్‌కు గాయాలు.. RRR షూటింగ్ వాయిదా..!