Lifestyle

‘ఓటు’కి మాటలు వస్తే… అది ఇచ్చే సమాధానాలు మీరు ఊహించగలరా??

Sandeep Thatla  |  Apr 9, 2019
‘ఓటు’కి మాటలు వస్తే… అది ఇచ్చే సమాధానాలు మీరు ఊహించగలరా??

మన దేశంలో ఏడాదికోసారి వచ్చే పండగలు చాలానే ఉన్నాయి. కానీ ఐదేళ్లకోసారి వచ్చే పండగలు మరింత ప్రత్యేకమనే చెప్పుకోవాలి. అదేనండీ.. ఓట్ల పండగ (General Elections). ఇప్పుడు ఈ ఎన్నికల పండగ (General Elections 2019) మరోసారి ప్రజల ముందుకు వచ్చేసింది. రానున్న ఐదేళ్ల కాలంలో మన దేశాన్ని పరిపాలించే పాలకులను ఎంపిక చేసుకునేందుకు యావత్ దేశ ప్రజలు.. ఏప్రిల్ 11 నుంచి ప్రారంభమై 7 దశల్లో జరిగే ఎన్నికలలో (Elections) ఓటు ద్వారా తమ తీర్పుని వెల్లడించేందుకు సమాయత్తమవుతున్నారు.

ఈ క్రమంలోనే ఓటర్ల మనోభావాలు ఎలా ఉన్నాయి? ఇప్పటివరకు పాలించిన ప్రభుత్వం ప్రజల అవసరాలను ఎంత వరకు తీర్చింది? ఇప్పుడున్న పార్టీకే ప్రజలు మరోసారి పట్టం కడతారా? లేక మరో కొత్త పార్టీకి అవకాశం ఇస్తారా? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకు సంస్థలు, మీడియా.. తమ వంతుగా పలు సర్వేలు నిర్వహిస్తుంటాయి.

ఎన్నికల ముందు ఇలాంటి సర్వేల ద్వారా ఓటర్ల నాడి పట్టుకునే ప్రయత్నం చేయడం సహజమే. మరి, ఓటర్లు ఐదేళ్లకోసారి దేశ భవిష్యత్తుని నిర్దేశించేందుకు వినియోగించే తమ పదునైన ఆయుధం.. అదేనండీ.. ఓటుకి (Vote)మాటలు వస్తే దాని స్పందన ఎలా ఉంటుంది? ఎన్నికల సమయంలో తలెత్తే అనేక ప్రశ్నలు, సందేహాల గురించి సమాధానాలు చెప్పాల్సి వస్తే ఓటు ఏం చెబుతుంది? అంటూ మాకు వచ్చిన ఒక ఊహకు అక్షరరూపం ఇచ్చే ప్రయత్నం చేశాం. భిన్నమైన పరిస్థితుల్లో ఓటు స్పందించాల్సి వస్తే ఎలా ఉంటుందో మీరూ చదవండి..

1. ఎలక్షన్స్ వస్తున్నాయంటే చాలు.. ఏ గల్లీలో ఎన్ని ఓట్లు, ఏ ఊళ్ళో ఎన్ని ఓట్లు.. ఏ పట్టణంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు.. ఏ నియోజకవర్గంలో ఎంత శాతం ఓటింగ్ (Census) నమోదు అయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కలు మొదలవగానే…

ఓటు స్పందన (Vote’s Response) – ఒరేయ్! సరిగ్గా అయిదేళ్ల ముందు ఇలాగే నా బలం (సంఖ్య) ఎంత? అంటూ దిక్కుమాలిన లెక్కలు కట్టి నాకంటూ ఒక నెంబర్ ఇచ్చి వెళ్లారు. మళ్ళీ అయిదేళ్ళ తర్వాత ముఖం చూపెడుతున్నారు! అసలు ఈ అయిదేళ్లలో నేనంటూ ఒకదాన్ని ఉన్నానన్న ఆలోచన కానీ.. గుర్తు కానీ లేదు కదా మీకు! ఇప్పుడు ఈ ఓట్ల పండగ పూర్తవగానే మళ్లీ నా సంఖ్యని ప్రభుత్వ ఆఫీసులో ఉండే దుమ్ముపట్టిన ఫైల్స్‌లో ఉంచేస్తారు. అయ్యో సారీ.. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదూ !! ఏ పాతబడిన కంప్యూటర్ సిస్టమ్‌లోని డ్రైవ్‌లోనో స్టోర్ చేసి పడేస్తారు. ఇదేగా మీరు చేసేది.. కానీ మీరు చేసేది సరైనదేనా?? ఒక్కసారి మనసున్న మనుషుల్లా ఆలోచించండి..

2. పోటీ చేసే అభ్యర్థి సామాజిక వర్గంలో ఎక్కువ ఓటర్లు ఉంటే, అప్పుడు ఆ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికే ఎక్కువ శాతం ఓట్లు పడే అవకాశం ఉంటుంది. కులాభిమానం ఇప్పుడు జరగబోయే ఎన్నికల పైన తీవ్ర ప్రభావం చూపనుంది. (Caste Politics)

ఓటు స్పందన (Vote’s Response) – వెధవల్లారా.. ఒకప్పుడు మన దేశంలో నా రూపం కాగితం రూపంలో ఉండేది… కాలానుగుణంగా ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంలో బటన్‌గా మారింది. అంతే తప్ప నాకు ఎటువంటి కులాభిమానం అంటగట్టకండి. నేను స్వచ్ఛంగా ఉంటే చూడలేక మీ మనస్సులో గూడు కట్టుకున్న కులాభిమానాన్ని నాకు అంటగట్టి దయచేసి నన్ను మీలో ఒకరిని చేయకండి అని వేడుకుంటున్నాను.

3.ఈ సారి జరగబోయే ఎన్నికలు దేశచరిత్రలోనే ఖరీదైన ఎన్నికలని పేర్కొంటున్నాయి కొన్ని పత్రికలు. దీనికి ప్రధాన కారణం – డబ్బు, మద్యం తదితర వస్తువులు రూపంలో ఓటర్లని లోబర్చుకునే యత్నాలు. (Cash Flow in Elections)

ఓటు స్పందన (Vote’s Response) – కనీసం అయిదేళ్లకి ఒకసారైనా నన్ను గుర్తిస్తున్నారు అన్న సంతోషం ఏదో ఒక మూల నాలో ఉంది. కానీ నా ప్రాధాన్యం మీ గెలుపోటముల పై ప్రభావం చూపుతుంది అని చెప్పి నన్ను నడి బజారులో అమ్మకానికి పెట్టడం ఎంతవరకు న్యాయం. ఒక మందు సీసా, ఒక చీర,  2 నుండి 5 వేల వరకు డబ్బు, ఒక క్రికెట్ కిట్టు లేదా మరేదైన వస్తు రూపంలో నాకు వెలకట్టడం అనేది అత్యంత హేయమైన చర్య. అయినా అసలు నాకు విలువ కట్టాలని అనుకునే మీకంటూ ఒక విలువ లేదని నేను గ్రహించడం మంచిది. ఏ రోజైతే నన్ను నన్నుగా చూసి.. సరైన అభ్యర్థిని గెలిపించేందుకు మీరు పూనుకుంటారో అదే నాకు అత్యంత విలువ ఇచ్చే రోజు.

4. నియోజకవర్గంలో ఎక్కువగా ఏ మతస్థులు ఓటర్లుగా ఉంటే, ఆ మతానికి చెందిన వారినే అభ్యర్థిగా నిలబెట్టడం ద్వారా ఆ మతస్తుల మద్దతు పొందవచ్చు అన్నది ఒక ఎన్నికల ఎత్తుగడ. (Religion Impact on Elections)

మతం పైన ఓటు స్పందన (Vote’s Response) – కులానికే నేను వ్యతిరేకం అంటూ గట్టిగా అరిచి చెబుతుంటే మళ్ళీ ఈ మతాభిమానమేంటి? ఇంతకు ముందూ చెప్పాను, ఇప్పుడూ చెబుతున్నాను. నా మనసు స్వచ్ఛమైనది. పోటీ చేసే అభ్యర్థుల మధ్య విలువల్లో తేడాలు పట్టించుకుంటాను. కానీ వారి మతం ఆధారంగా నా అభిమతం మారదు. మీరు కులం, మతం అంటున్నారు కాబట్టే.. ఇంకా మన దేశం అనేక రంగాల్లో వెనుకబడి ఎలా ముందుకెళ్ళాలో తెలియక సతమతమవుతోంది. దయచేసి కులం & మతం అంటూ మీ భవిష్యత్తుని మీరే బలి చేసుకోకండి.

 5. పోలింగ్ రోజు వస్తుందంటే చాలు దానికి ముందు & తరువాత రోజులు సెలవులు పెట్టుకుని హాయిగా కుటుంబంతో షికారు వెళదామని చాలామంది ఇప్పటికే ప్లాన్ చేసుకుని ఉంటారు. అదేంటి! ఓటు వేయరా అని ప్రశ్నిస్తే… “ఆ మేము వేసే ఒక్క ఓటు ఎన్నికల ఫలితాన్ని మార్చేస్తుందా?” లేదా “మేము ఓటు వేసి గెలిపించిన అభ్యర్థి మమ్మల్ని గుర్తుపెట్టుకుని మంచి పనులు చేస్తాడా ఏంటి? అనవసరంగా ఓటు వేసి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు… అంటారు (Low Polling Percentage)

ఇలాంటి చదువుకున్న మూర్ఖులకి ఓటు స్పందన (Vote’s Response) – చదువుకి.. జ్ఞానానికి ఏమాత్రం సంబంధం లేదు అని ఎన్నికల గురించి మీరు చెప్పిన మాటలు వింటే అర్ధమవుతుంది. మేము వేసే ఒక్క ఓటు వల్ల ఈ సమాజం మారుతుందా? లేక మేము ఓటు వేసే అభ్యర్థి మాకు మంచి చేస్తాడా? అనే ప్రశ్నలు వేస్తుంటారు కొందరు. కానీ విలువైన నన్ను (ఓటు) సద్వినియోగం చేసుకోకపోతే సమాజానికి ద్రోహం చేేసినట్లు అవుతుందనే విషయాన్ని మరచిపోతున్నారు. మాకెందుకు ఈ ఎన్నికలు? అనుకునే వారికి.. ఎన్నికల తరువాత గెల్చిన వారిని ప్రశ్నించే హక్కు కూడా ఉండదని గుర్తిస్తే మంచిది.

ఇవి “ఓటు”  గళం నుండి జాలువారిని ఘాటు సమాధానాలు….

వామ్మో!! ఎప్పుడూ మాట్లాడని “ఓటు” ఒక్కసారిగా మాట్లాడి అందరిని ఒక్క ఆట ఆడుకుంది. అంతే కదా.. ఎప్పుడూ మాట్లాడని వారు మాట్లాడితే ఇలానే ఉంటుంది అనేదానికి మన “ఓటు” కూడా ఉదాహరణగా నిలవడం విశేషం.

ఇవన్నీ పక్కన పెడితే, ఓటు అనేది అత్యంత విలువైనది. అందుకే దానిని వినియోగించుకుని మన ప్రాధమిక బాధ్యతని మనలోని ప్రతిఒక్కరూ నిర్వర్తించాలని కోరుకుందాం.

ఇవి కూడా చదవండి

రాజ్యాంగం కల్పించిన హక్కులు.. మహిళ స్వేచ్ఛగా అనుభవించేదెన్నడు?

వార్డెన్ గారూ.. అమ్మాయిలకో రూల్.. అబ్బాయిలకో రూలా? ఇక అలా కుదరదు

దేశభక్తిని ఆవిష్కరించిన.. అద్భుత సినీ ఆణిముత్యాలు ఇవే..!

Read More From Lifestyle