వార్డెన్ గారూ.. అమ్మాయిలకో రూల్.. అబ్బాయిలకో రూలా? ఇక అలా కుదరదు

వార్డెన్ గారూ.. అమ్మాయిలకో రూల్.. అబ్బాయిలకో రూలా? ఇక అలా కుదరదు

‘పొద్దున్న 7 నుంచి 8 వరకు టిఫిన్ పెడతాం. పాలు, టీ, కాఫీ ఉంటాయి. నీకు నచ్చింది తాగొచ్చు. మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 వరకు, రాత్రి 8 నుంచి 9 వరకు భోజనం ఉంటుంది. ఈ టైం దాటితే ఫుడ్ ఉండదు.’ హాస్టల్ వార్డెన్(hostel warden) గబగబా చెప్పుకొంటూ వెళ్లిపోతుంటే.. బిత్తరపోయి చూస్తోంది స్నిగ్ధ.


తాను కోరుకొన్న కాలేజీలో నచ్చిన కోర్సులో సీటు రావడంతో చాలా ఉత్సాహంగా ఉంది. ఇంటి నుంచి కాలేజీకి దూరం ఎక్కువగా ఉండటంతో కాలేజీ హాస్టల్లో చేరాలనుకొంది. తను ఈ ఆలోచనల్లో ఉండగానే వార్డెన్ గొంతులో మరింత కాఠిన్యం వినిపించింది.


‘ఏయ్ అమ్మాయ్.. నీ రూమ్ నెం. 10. వెళ్లి లగేజ్ సర్దుకో. ఇంకో విషయం. కాలేజ్ టైం పూర్తయిన తర్వాత నేరుగా హాస్టల్‌కి వచ్చేయాలి. అక్కడకీ ఇక్కడకీ తిరగకూడదు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో బయటకు వెళ్లడానికి లేదు. నీకేమైనా కావాలంటే ఆ రోజు వెళ్లి తెచ్చుకో’ గబగబా చెప్పుకొంటూ పోతున్న హాస్టల్ వార్డెన్‌ని చూసి జైలు కంటే దారుణంగా ఉన్నాయి కదా ఈ రూల్స్.. అనుకొంటూ అక్కడి నుంచి తన రూంకి వెళ్లింది స్నిగ్ధ.


రోజూ ఉదయమే నిద్రలేవడం.. తినడం.. అయితే కాలేజీలో ఉండటం లేదంటే హాస్టల్లో ఉండటం. మొదటిసారి జీవితం మరీ ఇంత బోరింగ్‌గా ఉంటుందా? అనిపించింది స్నిగ్ధకు. అమ్మాయిల్లాగా అబ్బాయిలు కూడా హాస్టల్లోనే ఉంటున్నారుగా. మరి వాళ్లకెందుకు మాలాగా ఇన్ని నిబంధనలు లేవు? ఎందుకు అమ్మాయిలకే ఇలా చేస్తున్నారు?


అమ్మాయిలు అబ్బాయిలు సమానమే కదా.. అయినా ఇలా ఎందుకు చేస్తున్నారు? ఎవరైనా ఈ హాస్టల్ రూల్స్‌లో మార్పు తెస్తే బాగుండు. ఇలా అనుకోని రోజు లేదు. ఎప్పటిలాగే ఆరోజు కూడా..  "ఇక్కడే ఇంకో నెలరోజులు ఉంటే పిచ్చెక్కిపోతుందేమో" అనుకొంటూ న్యూస్ పేపర్‌ని చేతులకోకి తీసుకొంది. ఆ రోజు వార్తాపత్రికలో తన ప్రశ్నకు సమాధానం దొరికింది. ఏంటా వార్త? ఆ వార్తతో స్నిగ్ధకు ఎలాంటి ప్రయోజనం కలిగింది?


1-kerala-high-court-strikes-down-sexist-rule


Source: Instagram


‘ప్రతి అమ్మాయికి అబ్బాయితో సమానంగా స్వేచ్ఛను పొందే హక్కు ఉంటుంది’ హాస్టల్లలో అమ్మాయిలపై విధిస్తున్న ఆంక్షలపై స్పందిస్తూ కేరళ హైకోర్టు(High Court) ఇచ్చిన తీర్పుకి సంబంధించిన వార్త అది. అంజితా కే జోష్, రిన్సా తస్నీ అనే ఇద్దరు విద్యార్థినులు హాస్టల్ వార్డెన్ తమపై విధిస్తున్న ఆంక్షలు, నిబంధనలను(rules) ఛాలెంజ్ చేస్తూ కోర్టు తలుపు తట్టారు.


వీటి కారణంగా సామాజిక, రాజకీయ కార్యకలాపాల్లో తాము పాలు పంచుకోలేకపోతున్నామని, సభలు, సమావేశాలకు హాజరు కాలేకపోతున్నామని వారు వివరించారు. తమ పరిధిని కుదించి వేస్తున్న ఈ హాస్టల్ నిబంధనలను సడలించాలని, హాస్టళ్లలో అబ్బాయిలకు ఎలాంటి నిబంధనులున్నాయో వాటినే అమ్మాయిలకూ వర్తింపచేయాలని కోరారు.


అంజితా, రిన్సా ఇద్దరూ శ్రీ కేరళ వర్మ కళాశాలలో చదువుతున్నారు. కాలేజీ యాజమాన్యం నిర్వహిస్తోన్న హాస్టల్లో అమ్మాయిలకు ఒకలా.. అబ్బాయిలకు మరోలా నిబంధనలున్నాయి. గర్ల్స్ హాస్టల్లో ఉండే అమ్మాయిలు సాయంత్రం నాలుగన్నర అయ్యేసరికి హాస్టల్లో ఉండాలి.


మంగళవారం, గురువారం, శనివారం  మాత్రం ఆరు గంటల వరకు బయటకు వెళ్లే అవకాశం ఇచ్చారు. ఆదివారాలు, సెలవు రోజుల్లో మాత్రం హాస్టల్లోనే పడి ఉండాలి. బయటకు వెళ్లే అవకాశమే లేదు. ఈ నిబంధనలన్నీ అమ్మాయిలకే. అబ్బాయిలకు  కాదు. అదే కాలేజీ యాజమాన్యం నిర్వహిస్తోన్న బాయ్స్ హాస్టల్లో ఉండే అబ్బాయిలకు మాత్రం చాలా సడలింపులున్నాయి. వారికి రాత్రి 9.30 వరకు హాస్టల్‌కు రావడానికి అనుమతి ఉంది.


మమ్మల్ని కూడా అబ్బాయిలతో సమానంగా చూడాలని, వారికి ఉన్న నిబంధనలే మాకూ వర్తింపచేయాలని అంజితా, రిన్సా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇలా చేయడానికి.. బయటకు వెళ్లడానికి ఉండటం లేదనే కారణమని అనుకొంటే పొరపాటే. ఎందుకంటే.. కాలేజీలోని లైబ్రరీ, ల్యాబొరేటరీ రెండూ రాత్రి 9 గం. వరకు తెరిచే ఉంటాయి. నాలుగన్నరకే హాస్టల్ కి వెళ్లాల్సి రావడం వల్ల వాటిని ఉపయోగించుకొనే అవకాశం ఉండటం లేదు. అలాంటి నిబంధన లేకపోయి ఉంటే అమ్మాయిలు లైబ్రరీ, లాబ్ వినియోగించుకోవచ్చు.


2-kerala-high-court-strikes-down-sexist-rule


Source: Instagram


ఈ పిటిషన్ విచారించిన కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ముస్తాక్ మహమ్మద్.. అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా నిబంధనలు ఉండటాన్ని గమనించారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఆయన ‘ప్రతి అమ్మాయికి అబ్బాయిలతో సమానంగా స్వేచ్ఛను అనుభవించే హక్కు ఉంది. దాన్ని అడ్డుకోవాలని చూస్తే అమ్మాయిల ప్రాథమిక హక్కులను హరించినట్లే. ఇలాంటి నిబంధనలు విధించడం, విధించకపోవడం అనేది యాజమాన్యం నైతికతకు సంబంధించిన విషయం. విద్యార్థులు బయటకు వెళ్లాలా వద్దా అనేది యాజమాన్యానికి సంబంధించిన విషయం కాదు. అది విద్యార్థులు తీసుకోవాల్సిన నిర్ణయం.’ అని వ్యాఖ్యానించారు.


అంతేకాదు విద్యార్థులు ఫలానా సమయానికి హాస్టల్లో ఉండాలనే నిబంధన విధించే అధికారం యాజమాన్యానికి ఉన్నప్పటికీ ఆ నిబంధనలు.. వాస్తవానికి దగ్గరగా ఉండాలన్నారు. దానికి తగినట్లుగా నిబంధనల్లో మార్పు చేయమని కళాశాల ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు.


ఈ వార్త చదివిన తర్వాత స్నిగ్ఢ ప్రశ్నలకు సమాధానం దొరికింది. తాను కూడా చాలాసార్లు కాలేజీ పూర్తయిన తర్వాత లైబ్రరీకి వెళ్లాలనుకొన్నా.. హాస్టల్ టైమింగ్స్ వల్ల వెళ్లలేకపోయేది. దానివల్ల తానేం కోల్పోయిందో తనకే తెలుసు. ఇక అలా జరగడానికి తాను అంగీకరించదు. తమపై బలవంతంగా రుద్దుతున్న హాస్టల్ నిబంధనలకు వ్యతిరేకంగా ఏం చేయాలో ఓ స్పష్టత వచ్చింది స్నిగ్థకు. దానికి తగినట్టుగా ప్రణాళికలు రచించడానికి ఉద్యుక్తురాలైంది.


Must Read: రాజ్యాంగం కల్పించిన హక్కులు.. మహిళ స్వేచ్ఛగా అనుభవించేదెన్నడు?


#POPxoWomenWantMore మ‌హిళా శ‌క్తిని గుర్తించండి.. సాధికార‌త దిశ‌గా వారిని ప్రోత్స‌హించండి..!


#POPxoWomenWantMore మ‌హిళా సాధికార‌త‌కు.. అద్దం ప‌ట్టే ఈ పుస్తకాలు కచ్చితంగా చదవాల్సిందే..!