DIY Life Hacks

ఉదయాన్నే మొబైల్ ఫోన్ చూసే అలవాటు మీకుందా? అయితే ఇది చదవాల్సిందే..

Soujanya Gangam  |  Nov 1, 2019
ఉదయాన్నే మొబైల్ ఫోన్ చూసే అలవాటు మీకుందా? అయితే ఇది చదవాల్సిందే..

గతంలో ఉదయం (morning) లేవగానే ముందుగా దేవుడి చిత్ర పటాన్నో.. లేక తల్లిదండ్రులు, పిల్లలు ఇలా ఇష్టమైన వారి ముఖాలనో చూసేవారు. దానివల్ల రోజంతా ఆనందంగా సాగుతుందని వారు నమ్మేవారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ నిద్ర లేచిన తర్వాత చూసేది మొబైల్ ఫోన్ (mobile phone)నే. మొబైల్ లేకుండా మన రోజు గడవదు. ఉదయం కళ్లు తెరిచిన వెంటనే మొబైల్ చూస్తాం, రాత్రి పడుకునే ముందు కూడా మొబైల్ తోనే సావాసం.. ఇలా లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ మొబైల్ ఫోన్ మనకు సమస్తం అయిపోతుంది. అయితే ఇలా లేవగానే మొబైల్ చూసే అలవాటు మీకుంటే దాన్ని మార్చుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఎలాగైనా ఈ అలవాటును మానుకునే ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. మొబైల్ చూడడం వల్ల దుష్ప్రభావాలేంటో మనలో చాలామందికి తెలీదు. అవేంటో తెలుసుకుంటే మీరే ఈ అలవాటును మానుకోవడానికి ప్రయత్నిస్తారు. మరి, అవేంటో తెలుసుకుందాం రండి..

1. రోజంతా ఒత్తిడి

ఉదయం కళ్లు తెరవగానే మొబైల్ ని పట్టుకొని చూడడం వల్ల మొబైల్ తాలూకు లైట్ కిరణాలు మన కళ్లపై పడి లోపలికి చొచ్చుకుపోతాయి. ఇది మన కళ్లకు అంత మంచిది కాదు. అలాగే మొబైల్ వాడకం వల్ల మన రోజంతా ఒత్తిడి ఎక్కువగా ఉంటుందట. తల చాలా బరువుగా అనిపిస్తుంది. రోజంతా తలనొప్పిగా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ లక్షణాలు కనిపిస్తుంటే ఉదయాన్నే లేచి ఫోన్ చూసుకునే అలవాటు మీకుందేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఉంటే దాన్ని మార్చుకుంటే రోజంతా ఫ్రెష్ గా ఫీలయ్యే అవకాశం ఉంటుంది.

2. పనితీరుపై ప్రభావం

ఉదయం లేవగానే మొబైల్ ఫోన్ చేతిలోకి తీసుకుంటాం. అలా చూసి పక్కన పెట్టేస్తామా? అంటే కాదు.. రాత్రంతా మనం నిద్రపోయి ఉంటాం. ఆ సమయంలో వచ్చిన మెసేజెస్.. నోటిఫికేషన్స్ అన్నీ చెక్ చేయాలనిపిస్తుంది. అందులో మంచివి ఉండొచ్చు. చెడువి లేక మీ మనసును ఇబ్బంది పెట్టేవి కూడా ఉండవచ్చు. ఒకవేళ ఏదైనా చెడు విషయాన్ని ఉదయాన్నే చూస్తే అది మన మెదడుపై ప్రభావం చూపుతుంది. దాని గురించే మనం రోజంతా ఆలోచిస్తూ ఉంటాం. అలా ఆలోచించడం వల్ల ఆరోజు పనితీరు దెబ్బతింటుంది. ఒకవేళ ఉదయాన్నే మీకిష్టమైన పాటలు వింటూ లేదా సూర్యోదయం చూస్తూ.. మొక్కలకు నీళ్లు పోస్తూ ఇలా గడిపితే మీ మెదడు ఫ్రెష్ గా మారుతుంది. దాని ప్రభావం రోజంతా ఉంటుంది. ఈ పనులన్నీ చేసిన తర్వాత మీరు కాస్త ఇబ్బంది పెట్టే మెసేజెస్ చదివినా వాటి ప్రభావం మరీ ఎక్కువ సమయం ఉండదు.

3. రక్త పోటు పెరుగుతుంది.

మనం ఉదయాన్నే లేవగానే మంచి ఆలోచనలతో రోజును ప్రారంభించాలని పెద్దలు చెబుతుంటారు. కానీ ఉదయాన్నే మనం లేవగానే మొబైల్ పట్టుకుంటే అందులో మన కోసం ఏం వేచి చూస్తుందో మనం పక్కాగా చెప్పలేం. ఒకవేళ మంచి వార్తలైతే ఫర్వాలేదు. కానీ మన మనసుని ఇబ్బంది పెట్టే అంశాలు ఉంటే మాత్రం రక్తపోటు పెరుగుతుంది. ఉదయాన్నే ఇలా రక్తపోటు పెరగడం వల్ల రోజంతా వివిధ రకాల ఒత్తిళ్ల వల్ల రక్తపోటు పెరిగిన దానికంటే ఎక్కువ ప్రమాదం అంటారు నిపుణులు. ఉదయాన్నే ఇలాంటివి చూసినప్పుడు రక్త పోటు మొదలైతే అది రాత్రి వరకూ అలాగే ఉంటుందట.

4. కంటి సమస్యలు

ఉదయం లేవగానే ఫోన్ చూడడం వల్ల ఆ వెలుగు పూర్తిగా కళ్ల పై పడుతుంది. అప్పటి వరకూ మూసుకొని ఉన్న కళ్లపై ఎక్కువ కాంతి పడడం వల్ల కళ్లు పాడయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రోజంతా కళ్లు అంత ప్రభావవంతంగా పనిచేయలేవు. ఈ అలవాటు మానేస్తే తప్ప ఈ ప్రమాదం నుంచి తప్పించుకోలేం. ఉదయాన్నే మొబైల్ చూడడం అలవాటు ఉంటే ఆ తర్వాత యోగా, మెడిటేషన్ చేయడం.. ముఖం కడుక్కోవడం వంటివేవి చేసినా కంటి నొప్పి తగ్గదు. అందుకే కళ్లను జాగ్రత్తగా చూసుకోవడానికి ఈ అలవాటును దూరం చేసుకోవాల్సిందే.

5. గతం గురించే ఆలోచన

మొబైల్ చూస్తూ అందులో ఏదైనా మెసేజ్ చూసినప్పుడు మీకు గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తుకు రావచ్చు. చాలామంది మెసేజెస్ చదువుతూ లేదా ఫోటోలు చూస్తూ గతాన్ని గుర్తుచేసుకుంటారు. దీనికి తోడు ఫేస్ బుక్, గూగుల్ వంటి సంస్థలు గతంలో మనం ఈ రోజు చేసిన పనులు అంటూ మెమోరీస్ ని మనకు చూపిస్తుంటాయి. అవి మంచివైతే ఫర్వాలేదు కానీ ఒకవేళ చెడు జ్ఞాపకాలైతే మాత్రం మీకు ఉదయాన్నే మనసుకు ఇబ్బందిగా అనిపిస్తుంది. పాత జ్ఞాపకాలు మర్చిపోయి మనసును వర్తమానంలోకి తీసుకురావడానికి ఉదయాన్నే మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

Read More From DIY Life Hacks