ఇటీవల కాలంలో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న సమస్యల్లో బరువు పెరిగిపోవడం(Weight Gain) కూడా ఒకటి. దీనికి ఎన్నోరకాల కారణాలు ఉండొచ్చు. అయితే అన్నింటికంటే ప్రధాన కారణం మాత్రం హార్మోన్ల అసమతౌల్యత(Harmonal Imbalance). రోజువారీ ఆహారంలో భాగంగా ఫాస్ట్‌ఫుడ్, జన్యుపరంగా మార్పులు చేసిన ఆహారం వంటివి తీసుకోవడం వల్ల హార్మోన్ల అసమతౌల్యత ఎదురవుతుంటుంది. సాధారణంగా ఇబ్బంది ఎదురవనంతకాలం చాలామంది ఈ సమస్యను పెద్దగా పట్టించుకోరు. కానీ ఓసారి ఇబ్బంది ఎదురయ్యాక దాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి చాలా సమయమే పడుతుంది. అందుకే సమస్య మొదట్లో ఉన్నప్పుడే దాన్ని తగ్గించుకోవడం మంచిది.
వాటివల్లే బరువు పెరుగుతాం..
హార్మోన్ల అసమతౌల్యత బరువు పెరిగేలా చేయడం మాత్రమే కాదు.. తిరిగి తగ్గడాన్ని చాలా కష్టతరంగా మారుస్తుంది కూడా. అయితే ఇదంతా కేవలం రెండు రకాల హార్మోన్ల వల్లే ఎదురవుతుందంటే మీరు నమ్మగలరా? మన శరీరంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు విడుదలవుతాయన్న సంగతి మనలో చాలామందికి తెలిసిందే. మన రుతుక్రమం(periods) సరిగ్గా కొనసాగేందుకు ఇవి తోడ్పడతాయి. అయితే ఈ రెండు హార్మోన్లు సరైన మోతాదులో విడుదలవ్వాల్సి ఉంటుంది. రెండిట్లో ఏ ఒకటి ఎక్కువగా విడుదలైనా ఇబ్బందులు ఎదురవుతాయి. సాధారణంగా చాలామందిలో ప్రొజెస్టిరాన్ తక్కువగా విడుదలవుతూ… ఈస్ట్రోజన్ స్థాయులు పెరుగుతుంటాయి. దీనివల్ల బరువు అపరిమితంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు జుట్టు రాలిపోవడం, రుతుచక్రం క్రమం తప్పడం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.
ఈస్ట్రోజన్ ఏం చేస్తుంది?
ఈస్ట్రోజన్ ఎక్కువవడం వల్ల కేవలం బరువు పెరగడమే కాదు.. చాలా సమస్యలే ఎదురవుతాయి. అందులో ముఖ్యమైనవి డిప్రెషన్, ఎక్కువగా ఆందోళన చెందడం, నిద్రలేమి వంటివి. ఈ సమస్యలు మనలో ఒత్తిడిని పెంచి.. ఎక్కువగా తినాలనే కోరికను పెంచుతాయి. దీంతో పాటు ఈస్ట్రోజన్ మనం తినే ఆహారంలో ఎక్కువ భాగాన్నిశరీరంపై కొవ్వు Layer గా పరుచుకునేలా చేస్తుంది. ఇలా కొవ్వు పెరగడం వల్ల మరింత ఈస్ట్రోజన్ ఉత్పత్తవుతుంది. ఇలా ఈ విషవలయం కొనసాగుతూనే ఉంటుంది. కొవ్వు ఎక్కువగా పెరగడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు కూడా దెబ్బతింటుంది. థైరాక్సిన్ హార్మోన్లు తక్కువగా విడుదలవడంతో పాటు శరీరానికి అవసరమైన ప్రొటీన్ల విడుదలను కూడా ఆపుతుంది.
అసమతౌల్యత కారణాలివే..
చాలామందిలో హార్మోన్ల అసమతౌల్యత వారు చేసే పనుల వల్లే ఎదురవుతూ ఉంటుంది. శారీరక శ్రమ లేకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, రుతుస్రావంలో తేడాలు, కుటుంబ నియంత్రణ మందులు వాడడం, సింథటిక్ ప్రొజెస్టిరాన్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ప్రొజెస్టిరాన్ తక్కువగా విడుదల కావడం వంటివి హార్మోన్ల అసమతౌల్యతకు దారితీస్తాయి.
సమతుల్యత ఇలా సాధించవచ్చు..
హార్మోన్ల అసమతౌల్యత అంటే ఎక్కువ మోతాదులో ఈస్ట్రోజన్ విడుదల కావడం.. అవసరమైనంత మోతాదులో ప్రొజెస్టిరాన్ విడుదల కాకపోవడం. ఈ పరిస్థితిని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మార్చుకోవచ్చు. దీనికోసం సంబంధిత నిపుణుల సలహా తీసుకోవడంతో పాటు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే..
– వైద్యుల సలహా లేకుండా కుటుంబ నియంత్రణ కోసం మందులు వాడుతుంటే.. వెంటనే వాటిని మానేసి వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
– ఫాస్ట్‌ఫుడ్ తినడం తగ్గించాలి. వీలైనంత మేరకు ఆర్గానిక్ ఫుడ్, అదీ జన్యు మార్పులు చెందని ఆహారం తీసుకోవాలి.
– రోజూ తీసుకోవాల్సిన మోతాదులో పోషకాలను ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
– రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. కనీసం ఓ అరగంటపాటు నడవడం అయినా అలవాటు చేసుకోవాలి.
ఇవన్నీ చేసినా హార్మోన్లలో మార్పు వచ్చేందుకు కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. అందుకే ఇవన్నీ చేస్తున్నా వెంటనే ఫలితాలు రాకపోతే నిరాశపడకుండా.. పద్ధతులు మార్చేందుకు ప్రయత్నించకండి.
ఇవి కూడా చదవండి
పెళ్లి తర్వాత బరువు పెరగకుండా కాపాడుకోవడం ఎలాగో ఆంగ్లంలో చదవండి.
బరువు పెరిగేందుకు ఉన్న ఆరోగ్యకరమైన మార్గాల గురించి ఆంగ్లంలో చదవండి.
మీ బరువు పెరిగేందుకు కారణమయ్యే పొరపాట్ల గురించి ఆంగ్లంలో చదవండి.
Image Source: Shutterstock
Featured Image Source: YouTube