Health

ప్రయాణాల్లో వాంతులవుతున్నాయా? అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే..!

Soujanya Gangam  |  May 6, 2019
ప్రయాణాల్లో వాంతులవుతున్నాయా? అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే..!

సాధారణంగా ప్రయాణాలు చేసే వేళ (Travelling) చాలామందికి ఒంట్లో నలతగా ఉన్నట్లు అనిపిస్తుంది. శరీరానికి ఎంతో ఇబ్బందిగా ఉండడంతో కళ్లు తిరిగినట్లుగా, వాంతి వస్తున్నట్లుగా అనిపిస్తుంది. అప్పుడప్పుడూ మనం బస్సు జర్నీల్లో.. కొందరకి వాంతులవడం కూడా చూస్తుంటాం. ఈ ఆరోగ్య రుగ్మతనే  మోషన్ సిక్ నెస్ (Motion sickness) అంటారు.

ఈ సమస్య సాధారణంగా జన్యుపరంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తుంది. అందుకే మీ తల్లిదండ్రులకు ఈ సమస్య ఉంటే.. మీకు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రుగ్మతకు కారణాలు అనేకం. సాధారణంగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు.. అనగా బస్సు లేదా కారు గుండా బయటకు చూస్తున్నప్పుడు.. మన కళ్లకు కనిపించే చిత్రాలు, వినిపించే శబ్ధాలకు సంబంధించి మెదడుకు సంకేతాలు వేగంగా అందే విషయంలో అడ్డంకి ఏర్పడుతుంది. దీని ప్రభావం మెదడు పైనే కాకుండా శరీరం పై కూడా పడుతుంది.

దీని వల్ల కాస్త గాభరాగా అనిపించడం, కళ్లు తిరగడం, వాంతులవడం వంటి లక్షణాలు సదరు వ్యక్తిలో మనకు కనిపిస్తాయి. ఇక బస్సు లేదా కారు గుంతల్లో ప్రయాణిస్తున్నప్పుడు.. శరీరం అటు ఇటూ తూలే సమయంలో ఈ లక్షణాలు మరింత పెరుగుతాయి. అంతేకాదు.. ప్రయాణిస్తున్న సమయంలో ఏదైనా తాగినా.. తిన్నా.. పెట్రోల్, డీజిల్ వంటి వాసనలు ఎక్కువగా వచ్చినా.. ఈ రుగ్మతతో బాధపడేవారు చాలా ఇబ్బంది పడతారు.

మీకు లేదా మీ సన్నిహితులకు ప్రయాణాల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. పలు రకాల టిప్స్ పాటించి ఆ సమస్య‌ను కచ్చితంగా దూరం చేసుకోవచ్చు. 

1. ఖాళీ కడుపుతో ప్రయాణం వద్దు.

చాలామందికి ఏదైనా తిని ప్రయాణం చేస్తే వాంతులు అయిపోతాయనే అపోహ ఉంది. అందుకే ఖాళీ కడుపుతోనే ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఇది తప్పు. ఎందుకంటే ఖాళీ కడుపుతో ప్రయాణించడం వల్ల.. నీరసం వంద రెట్లు పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటు మోషన్ సిక్ నెస్ కూడా పెరుగుతుంది.

అందుకే ప్రయాణ సమయానికి ముందు కొద్దిగా ఏదైనా తినడం మంచిది.అయితే  అరగడానికి ఇబ్బందిగా ఉండే నూనె వస్తువులు కాకుండా.. కాస్త లైట్‌గా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. తాజా పండ్లు తీసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితం ఉంటుంది. పండ్లు లేదా పండ్ల రసాలు కడుపును ప్రశాంతంగా ఉంచేందుకు తోడ్పడతాయి.

2. వెనుక సీట్లో కూర్చోవద్దు.

ప్రయాణ సమయంలో చాలామంది వెనుక సీట్లో కూర్చుంటూ ఉంటారు. కానీ మోషన్ సిక్‌నెస్‌తో బాధపడేవారికి ఇది శ్రేయస్కరం కాదు. అంతేకాదు.. కొన్ని స్పెషల్ బస్సులు లేదా రైళ్లలో ప్రయాణం చేసే సమయంలో..  వ్యతిరేక దిశలో కూర్చోవాల్సి వస్తుంది. అలా కూర్చున్నప్పుడు సమస్య మరింత ఎక్కువవుతుంది. అందుకే బస్సుల్లో వెళ్తున్నప్పుడు కేవలం బస్సు వెళ్లే దిశలో కూర్చోవడమే మేలు.  కార్లు మొదలైన వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు.. వెనుక సీట్లో కాకుండా ముందు వైపు కూర్చోవడం వల్ల సమస్య తగ్గుతుంది. అంతేకాదు.. కిటికీ పక్కనే కూర్చొని తాజా గాలిని పీల్చుకుంటూ సంగీతం వింటూ వెళ్లడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. పైగా సమస్యను కూడా తగ్గిస్తుంది.

3. అల్లం ముక్క ఉంచుకోండి.

మీరు ప్రయాణం చేసే సమయంలో.. మీ వద్ద చిన్న అల్లం ముక్కను ఉంచుకోండి. వికారంగా అనిపించినప్పుడు ఈ ముక్కను కొద్దికొద్దిగా కొరుక్కు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీని వల్ల మోషన్ సిక్‌నెస్ తగ్గుతుంది. దీనిలోని యాంటీ ఎమెటిక్ గుణాల వల్ల వాంతులు, వికారం వంటి సమస్యల నుండి మనకు విరుగుడు లభిస్తుంది. లేదంటే ప్రయాణానికి బయల్దేరేముందు తేనీరులో కాస్త అల్లం వేసి మరిగించి.. దానిని తాగినా మంచి ఫలితం ఉంటుంది.

4. నిమ్మకాయతో వాంతులు దూరం..

కొంతమందికి ప్రయాణాల్లో పెట్రోల్, డీజిల్ లేదా వంటకాల నుండి వచ్చే వాసన వల్ల.. తలనొప్పి లేదా వాంతులు వంటి రుగ్మతలు తలెత్తే అవకాశం ఉంది.  ఇలాంటివారు నిమ్మకాయ తొక్కను తీసి.. దాని వాసనను పీల్చడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నిమ్మకాయలో లభించే సిట్రిక్ యాసిడ్ గ్యాస్, వికారం, వాంతులు వంటి సమస్యలను తగ్గిస్తుంది. మీకూ  ప్రయాణాల సమయంలో ఇలాంటి  రుగ్మతలు కలిగితే.. నిమ్మరసం లేదా నిమ్మ సోడా తాగడం వల్ల సమస్య అదుపులోకి వస్తుంది.

5. సంగీతం వినండి.

సంగీతంలో మంచి శక్తి ఉంటుంది. ఇది మిమ్మల్ని వేరే లోకంలోకి తీసుకువెళ్తుంది. అనేక ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ఒకవేళ మీకు సంగీతమంటే ఇష్టమైతే మీకు నచ్చిన పాటల కలెక్షన్‌ని మీ ఫోన్‌లో సేవ్ చేసుకోండి. ఈ పాటలను మీరు ప్రయాణం చేసేటప్పుడు వినండి. బయట ఏం జరుగుతుందో తెలియకుండా.. సీట్ పై వెనక్కి తలవాల్చి కళ్లు మూసుకోండి. మంచి సంగీతం వినడం వల్ల మరింత మంచి ప్రభావం ఉంటుంది. ఇలా సంగీతాన్ని వినడం వల్ల మీరు మోషన్ సిక్‌నెస్ బారి నుండి బయట పడే అవకాశం కూడా ఎక్కువే.

ఇవన్నీ మోషన్ సిక్ నెస్‌ను తగ్గించే చిన్న చిన్న చిట్కాలు మాత్రమే. అయితే మీకు ఈ సమస్య మరీ ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్‌ని సంప్రదించి మందులు వాడడం మంచిది. అప్పుడు ఈ సమస్య నుంచి తొందరగా ఉపశమనం లభించే వీలుంటుంది. అలాగే సమస్య తీవ్రతను బట్టి నిర్ణయం తీసుకోవడం మంచి పద్ధతి.

ఇవి కూడా చదవండి.

ప్రెగ్నెన్సీ సమయంలో అడిగేందుకు.. ఇబ్బందిపడే సందేహాలకు సమాధానాలివిగో..! 

పిరియడ్స్ సమయంలో నొప్పి తగ్గడానికి.. వివిధ దేశాల అమ్మాయిలు వాడే చిట్కాలివే

ఎంత ప్ర‌య‌త్నించినా బ‌రువు పెరుగుతూనే ఉన్నారా? పీసీఓఎస్ కావ‌చ్చు జాగ్ర‌త్త‌..!

Read More From Health