Lifestyle

ప్రసవం తర్వాత బరువు తగ్గడానికి చేయాల్సిన సులభమైన వ్యాయామాలివే..

Lakshmi Sudha  |  Feb 12, 2019
ప్రసవం తర్వాత బరువు తగ్గడానికి చేయాల్సిన సులభమైన వ్యాయామాలివే..

మాతృత్వం ఓ అందమైన వరం. నవమాసాలు మోసి కన్న బిడ్డను చేతుల్లోకి తీసుకొన్న మరుక్షణం అప్పటి వరకు ఆమె పడిన కష్టాన్ని మరచిపోతుంది స్త్రీ. అప్పటి నుంచి ఆమె జీవితంలో, జీవనశైలిలో ఎన్నో మార్పులు చోటు చేసుకొంటాయి. తాను జన్మనిచ్చిన బిడ్డ సంరక్షణలోనే సమయం గడుపుతుంది. ఈ క్రమంలో తన గురించి, తన శరీరం గురించి పెద్దగా శ్రద్ధ తీసుకోదు. దీంతో గర్భం దాల్చిన సమయంలో పెరిగిన బరువు.. ఆ తర్వాత కూడా పెరుగుతూనే ఉంటుంది. సాధారణంగా గర్భం దాల్చినప్పుడు మహిళ 11.5 నుంచి 12 కేజీల వరకు పెరుగుతుంది. ఇది అందరిలోనూ సాధారణమే. ప్రసవం తర్వాత సరైన శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల మరింతగా బరువు పెరుగుతారు. అయితే బరువు పెరుగుతున్నాం కదా అని ప్రసవం అయిన వెంటనే బరువు తగ్గే ప్రయత్నాలు చేయకూడదు. కనీసం నలభై రోజులైనా విశ్రాంతి తీసుకొని ఆ తర్వాతే వ్యాయామాలు చేయడం ప్రారంభించాలి.

అంతకంటే ముందు.. పోస్ట్ ప్రెగ్నెన్సీ(post pregnancy) తర్వాత ఆరోగ్యకరమైన రీతిలో బరువు ఎలా తగ్గాలో తెలుసుకోవడం ముఖ్యం. ఈ కథనం ద్వారా మీరు ప్రసవం తర్వాత బరువు తగ్గించుకొనే టిప్స్ తెలుసుకొని వాటిని ఆచరించే ప్రయత్నం చేయండి. కచ్చితంగా మంచి ఫలితం సాధిస్తారు.

ప్రసవం తర్వాత బరువు తగ్గే విషయంలో తొందర వద్దు..

ప్రసవం తర్వాత ఒకేసారి బరువు తగ్గే ప్రయత్నం చేయకూడదని చెబుతున్నారు యోగా నిపుణురాలు సీమా సోంధి. గర్భం దాల్చిన సమయంలో తొమ్మిది నెలల పాటు మన శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడానికి ప్రసవం తర్వాత మరో 9-12 నెలలు పడుతుంది. మరికొందరిలో ఇంకా ఎక్కువ సమయమే పడుతుంది. కాబట్టి మీ శరీరం తిరిగి వ్యాయామం చేయడానికి అనుకూలంగా మారిన తర్వాతే బరువు తగ్గించుకొనే ప్రయత్నం చేయాలి.

ప్రసవం తర్వాత బరువు తగ్గించుకొనేందుకు అవసరమైన మానసిక, శారీరక సామర్థ్యాన్ని తెచ్చుకొనే ప్రయత్నం చేయాలి. అందుకే ప్రసవించిన 40 రోజుల తర్వాత గానీ వ్యాయామం ప్రారంభించకూడదు. ఈ నలభై రోజుల్లో వర్కవుట్లు చేసే విధంగా మీ శరీరాన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గాలనుకోవడం కూడా మంచిది కాదు. ఇలా చేయడం వల్ల కొన్ని విపరీతమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి ప్రసవం తర్వాత నెమ్మదిగా బరువు తగ్గడానికి ప్రాధాన్యమివ్వాల్సి ఉంటుంది.

ముప్పై రోజుల పాటు షుగర్ కి దూరంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా?

బ్రెస్ట్ ఫీడింగ్, వెయిట్ లాస్

పాపాయికి చనుబాలిస్తున్నప్పుడు మీరు అధికంగా మరో 300 క్యాలరీలను అదనంగా తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీ చిన్నారితో పాటు మీకూ తగిన పోషణ అందుతుంది. కాబట్టి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ డైటింగ్ చేద్దామని ప్రయత్నించకండి. ఆశ్చర్యపడే మరో విషయం ఏంటంటే.. పాపాయికి చనుబాలివ్వడం ద్వారా రోజూ 500 క్యాలరీలను ఖర్చు చేయచ్చు. కాబట్టి బరువు పెరుగుతున్నామనే ఆలోచన పక్కన పెట్టి.. అవసరమైనంత ఆహారం తీసుకోండి.

బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు డైటింగ్ చేయడం వల్ల ఎదురయ్యే పరిణామాలు..

మీ చిన్నారికి పాలు ఇస్తుంటే మీరు ఇద్దరికి సరిపడినంత ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం తప్పనిసరి. ఇలాంటి సమయంలో మీరు డైటింగ్ చేయడం ప్రారంభిస్తే.. చిన్నారికి సరిపడినంత పాలు రావు. పైగా వాటిలో పోషకాలు కూడా ఉండవు. అలాగే ఈ సమయంలో బరువు తగ్గించే మాత్రలు(weight-loss pills) సైతం వేసుకోకూడదు. ఎందుకంటే ఇవి చిన్నారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.

ఈ విషయంలో గైనకాలజిస్ట్ డా. రింకూ సేన్ గుప్తా పాలిచ్చే తల్లులు తాము తీసుకొనే ఆహారం పై ప్రత్యేక శ్రద్ద వహించాలని చెబుతున్నారు. అధిక పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవడంతో పాటు కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలంటున్నారు.

ప్రసవం అయిన తర్వాత మహిళలు కాల్షియం, ప్రొటీన్లు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే ద్రవపదార్థాలను అధికంగా తీసుకోవాల్సి ఉంటుంది. యోగా గురు సీమా సోంధి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ప్రసవం అయిన వెంటనే బరువు తగ్గాలనుకొనే వారి సంఖ్య పెరుగుతోందని ఆమె చెబుతున్నారు. సరైన ఆహారం తీసుకోకపోవడం, ప్రసవం జరిగిన తర్వాత తక్కువ సమయంలో వ్యాయామాలు చేయడం ప్రారంభించండం చేస్తున్నారు. మీకూ ఇలాంటి ఆలోచన ఉంటే దాన్ని పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు స్లిమ్ గా తయారవడం కంటే.. బలంగా ఉండటం ముఖ్యం.

బరువు తగ్గడం ఎప్పుడు మొదలు పెట్టొచ్చు?

వైద్యులు సూచించిన విశ్రాంతి సమయం పూర్తయిన తర్వాత వ్యాయామం చేయడం ప్రారంభించవచ్చు. తేలిగ్గా పురుడు వచ్చిన వారు మూడు నుంచి నాలుగు వారాల తర్వాత బ్రిస్క్ వాక్ వంటివి చేయచ్చు. ఆపరేషన్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చినవారు.. డాక్టర్ ను సంప్రదించి.. మీ శరీరం వ్యాయామం చేయడానికి సిద్ధంగా ఉందంటేనే ఈ విషయంలో ముందడుగు వేయడం మంచిది. అంతేకాదు.. ముందుగానే మీరెంత బరువు తగ్గాలనుకొంటున్నారో కూడా నిర్ణయించుకోవాలి. ఎప్పుడు, ఎంత మేర వ్యాయామం చేయాలో మీ శరీరం కూడా మీకు సిగ్నల్ ఇస్తుంది. కాబట్టి అప్పుడప్పుడూ శరీరం మాట కూడా వింటూ ఉండండి.

ప్రసవం తర్వాత బరువు తగ్గడం ఎందుకంత ముఖ్యం?

మీరు ఇంకో చిన్నారికి జన్మనివ్వాలని కోరుకొంటే మీరు బరువు తగ్గాల్సిన అవసరం ఉంది. అధిక బరువుతో మరోసారి గర్భం దాలిస్తే అది ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ముఖ్యంగా ప్రసవ సమయంలో సిజేరియన్ చేయాల్సిన అవసరం ఏర్పడచ్చు. అంతేకాదు.. బిడ్డను మోస్తున్న సమయంలో అధికరక్తపోటు, ప్రీఎక్లాంప్సియా(గుర్రపువాతం), జెస్టేషనల్ డయాబెటిస్ వంటి సమస్యలు రావచ్చు. వీటి వల్ల మీతో పాటు.. మీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు ప్రమాదకరంగా మారొచ్చు.

అందుకే ప్రసవం తర్వాత బరువు తగ్గడానికి కొన్ని సులభతరమైన వ్యాయామాలు, చిట్కాలు తెలుసుకోవడం మంచిది. ఇవన్నీ బరువుతో పాటు మీ పొట్టను కూడా తగ్గిస్తాయి. అయితే మీరు ఏ ఫిట్నెస్ రొటీన్ ఎంచుకోవాలన్నా.. ముందు వైద్యురాలిని సంప్రదించి.. ఆమె ఓకే అని చెప్పిన తర్వాతే ప్రారంభించడం మీ ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా మీకు సిజేరియన్ జరిగినట్లయితే.. మీరు వ్యాయామం చేసేందుకు మీ వైద్యుని అంగీకారం తప్పనిసరి.

వాకింగ్

వాకింగ్ చేయమన్నారు కదా అని వేగంగా వాకింగ్ చేయద్దు. నెమ్మదిగా లేదా మధ్యస్థమైన వేగంతో వాకింగ్ చేయండి. అలాగే పొట్ట తగ్గించుకోవడమే ధ్యేయంగా కాకుండా.. అధిక బరువుని తగ్గించుకొనే ప్రయత్నం చేయండి.

ఏరోబిక్స్

కొన్నాళ్లపాటు వాకింగ్ చేసిన తర్వాత మీ శరీరం వ్యాయామం చేయడానికి అనుకూలంగా మారుతుంది. కాబట్టి ఏరోబిక్స్ లాంటి సులభమైనవి ప్రయత్నించవచ్చు. తద్వారా మీ శరీర బరువుతో పాటు.. పొట్ట కూడా తగ్గుతుంది.

లెగ్ లిఫ్ట్స్

స్టెప్ 1: నేలపై వెల్లకిలా పడుకొవాలి. అరచేతులు నేలపై ఆనేలా పెట్టాలి.

స్టెప్ 2: ఇప్పుడు నెమ్మదిగా రెండు కాళ్లు పైకి పెట్టాలి. ఇలా పెట్టేటప్పుడు మీ నడుము నేలపై సమానంగా ఆన్చి ఉండేలా జాగ్రత్త పడాలి.

స్టెప్ 3: మీ కాళ్లను నెమ్మదిగా కిందికి దించాలి. ఇలా చేసేటప్పుడు పాదాలను నేలపై ఆనకుండా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ కాలి కండరాలకు చక్కటి వ్యాయామం దొరుకుతుంది.

స్టెప్ 4: ఇలా ఎనిమిది సార్లు పాదాలను పైకి కిందకు కదపాలి. ఇప్పుడు కాళ్లకు కొన్ని సెకన్ల పాటు విశ్రాంతినిచ్చి.. మరోసారి ఇలాగే చేయాలి.

ఈ లెగ్ లిఫ్ట్స్ చేయడం వల్ల మీ కాలి కండరాలతో పాటు.. పొట్ట కండరాలు సైతం దృఢంగా త‌యార‌వుతాయి.

ది బ్రిడ్జ్

స్టెప్ 1: నేలపై వెల్లకిలా పడుకొని మోకాళ్లను పైకి ముడవాలి.

స్టెప్ 2: అరచేతులు నేలపై ఆనించి.. గాలి పీల్చుకోవాలి.

స్టెప్ 3: కటిభాగాన్ని కాస్త పైకి లేపి గాలి వదిలేయాలి. ఈ పొజిషన్ లో ఐదు సెకన్ల పాటు ఉండి మరోసారి గాలి పీల్చుకోవాలి.

స్టెప్ 4: గాలి వదిలి యధాస్థానికి తిరిగి రావాలి. ఇలా 8 సార్లు చేయాలి. కొన్ని సెకన్ల పాటు విశ్రాంతి తీసుకొన్న అనంతరం మరోసారి చేయాలి.

బేసిక్ క్రంచెస్

 స్టెప్ 1: నేలపై వెల్లకిలా పడుకొని మోకాళ్లను పైకి ముడవాలి.

స్టెప్ 2: రెండు చేతులను తలకింద పెట్టాలి.

స్టెప్ 3: చేతులను అలాగే ఉంచి తల, భుజాలను పైకి లేపాలి.

స్టెప్ 4: ఇలా ఎనిమిది సార్లు చేయాలి. ఇలా చేయడం పూర్తయిన తర్వాతో మరోసారి ఇదే పద్ధతి ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

ఇట్స్ బోనస్ టైమ్..!

 ఈ ఎనిమిది నిమిషాల ఆబ్ వర్కవుట్ వీడియో మీ పొట్టను తగ్గించడంతో పాటు.. పొట్ట కండరాలను గట్టిపడేలా చేస్తుంది.

గుర్తుంచుకోండి.. వర్కవుట్లు చేసేటప్పుడు మీకు తోడ్పాటు అవసరం..

పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత మీరు బరువు తగ్గాలనుకొంటే.. మీ భర్త లేదా కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవాల్సి ఉంటుంది. మీ చిన్నారి యోగక్షేమాలను చూసుకొనే బాధ్యతను మీరు వారికి అప్పగించండి. అప్పుడే మీరు మీ అధిక బరువుని తగ్గించుకోవడంలో శ్రద్ధ పెట్టగలుగుతారు. డా. సేన్ గుప్తా సైతం ఈ విషయంలో  ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ప్రసవం తర్వాత మహిళ తగినంత విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. పాపాయి బాధ్యతలను పూర్తిగా ఆమే తీసుకోవడం వల్ల అధిక బరువుని తగ్గించుకోవడానికి అసలు సమయమే చిక్కదు. అందుకే భర్త లేదా కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవాల్సి ఉంటుందని డా.సేన్ గుప్తా చెబుతున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం ప్రసవం తర్వాత అధిక బరువు తగ్గించుకోని మహిళల్లో అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బులు  వస్తున్నట్లు గుర్తించారు.

బరువు తగ్గే క్రమంలో చేయాల్సినవి.. చేయకూడనివి..

డైట్ కి దూరంగా..

మనం ముందుగా చెప్పుకొన్నట్టుగానే.. ప్రసవం అయిన వెంటనే డైటింగ్ చేయడం మొదలుపెట్టకూడదు. ఇలా చేయడం వల్ల మీరు కోలుకోవడం ఆలస్యమవుతుంది. పైగా ఆ ప్రభావం మీ చిన్నారిపై కూడా పడుతుంది.

క్రమం తప్పకుండా వ్యాయామం

డా. సేన్ గుప్తా ప్రకారం.. ప్రసవం అయిన ఆరు వారాల తర్వాత నుంచి తేలికపాటి వ్యాయామాలు చేయడం మొదలుపెట్టవచ్చు. బ్రిస్క్ వాకింగ్ తో బరువు తగ్గే ప్రయాణం ప్రారంభించాల్సి ఉంటుంది. అలాగే మీ శక్తి తగ్గిపోకుండా ఉండటానికి పోషక విలువలున్న ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. రోజూ 30 నుంచి 40 నిమిషాల పాటు తేలికపాటి వ్యాయామం చేయడం ద్వారా అధిక బరువుని తగ్గించుకోవచ్చు.

మీ చిన్నారి ఘనాహారం తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత మీరు పాలివ్వాల్సిన అవసరం చాలావరకు తగ్గిపోతుంది. కాబట్టి అప్పుడు మీరు తీసుకొనే ఆహారం కొద్దిగా తగ్గించి కాస్త ఎక్సర్సైజ్ పెంచుకోవచ్చు. అలాగని అతిగా వ్యాయామం చేయడమూ మంచిది కాదు. స్ట్రోలర్ లో మీ పాపాయిని ఉంచి పార్క్ కి తీసుకెళ్లి.. తనకు పార్క్ లో అన్నీచూపించండి.. మీకూ చక్కటి వ్యాయామం అవుతుంది.

ఆహారం తినడం మానేయద్దు

తల్లిగా మీ పాపాయి క్షేమం చూసుకోవడం మీుకు చాలా ముఖ్యమైన విషయం. అయితే పాపాయితో పాటు మీ ఆరోగ్యం విషయంలోనూ మీరు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీరు చనుబాలిస్తున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం తీసుకోవడం మానేయద్దు. ఇలా చేయడం వల్ల మీరు నీరసపడిపోతారు. అంతేకాదు.. మీ ఆరోగ్యమూ దెబ్బ తింటుంది. ఇలా ఉంటే మీరు బరువు తగ్గలేరు. రోజుకి ఆరుసార్లు తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు.

హెల్తీ బ్రేక్ఫాస్ట్ తినండి..

రోజూ మనం తీసుకొనే ఆహారంలో అత్యంత కీలకమైనది బ్రేక్ ఫాస్ట్. ఇది మీకు శక్తినివ్వడమే కాకుండా.. మీ చిన్నారి ఆహార అవసరాలను తీర్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

కంగారు లేకుండా తినండి

టిఫిన్ అయినా.. భోజనమైనా.. పాపాయి ఏడుస్తుందేమో.. తనకు మెలకువ వచ్చేస్తుందేమో అని చాలా త్వరత్వరగా కానిచ్చేస్తుంటారు. ఇలా ఎప్పుడూ చేయద్దు. మీరు భోజనం చేసేంత వరకు పాపాయి బాధ్యతను ఎవరికైనా అప్పచెప్పండి. ప్రశాంతంగా తినడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మీకు సరిపడినంత మాత్రమే మీరు ఆహారంగా తీసుకొంటారు. లేదంటే అవసరమైనదానికంటే ఎక్కువ తినేస్తారు. ఫలితంగా బరువు పెరిగిపోతారు.

ఏం తింటున్నారో చూసుకోండి

మీరు తీసుకొనే ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. యాపిల్, ఆరెంజ్, అరటి, పీనట్ బటర్, గుడ్లు వంటి వాటిని మీ బ్రేక్ఫాస్ట్ లో భాగంగా చేసుకోండి. అలాగే ఐరన్, క్యాల్షియం, ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించండి. ఫ్రైడ్ ఫుడ్ కి వీలైనంత దూరంగా ఉండండి.

తగినంత నీరు తాగండి.

పాపాయికి మీరు పాలు ఇస్తున్నంత సేపు మీరు ద్రవపదార్థాలను అధికంగా తీసుకోవాల్సి ఉంటుంది. రోజూ 10 నుంచి 12 గ్లాసుల నీటిని తాగడం ద్వారా పాపాయికి సరిపడినన్ని పాలు ఉత్పత్తి అవుతాయి. కాబట్టి మీ వెంట ఎప్పుడూ వాటర్ బాటిల్ ఉంచుకోండి. మీకు అవసరమైనప్పుడల్లా నీటిని తాగచ్చు. కార్భొనేటెడ్ డ్రింక్స్ కు దూరంగా ఉండండి.

ఓ బాటిల్ నీరు మీ ఆరోగ్యాన్ని మార్చేస్తుందంటే నమ్ముతారా?

పంచదారకు దూరంగా

మీరు బరువు తగ్గాలనుకొంటే.. ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ కి, సాచ్చురేటెడ్ ఫ్యాట్స్ కి దూరంగా ఉండాలి. అలాగే చక్కెర వినియోగాన్ని సైతం తగ్గించాలి.

సరైన నిద్ర

ఇంట్లో పసిపాప ఉన్నట్లైతే విరామం లేకుండా నిద్రపోవడం దాదాపుగా అసాధ్యం. రాత్రి వేళల్లో బిడ్డ నిద్ర లేవడం, ఏడవడం వంటి వాటి కారణంగా.. మీకు నిద్ర సరిగ్గా ఉండకపోవచ్చు. అందుకే రాత్రి వేళల్లో పాపాయి సంరక్షణను మరొకరికి అప్పగించి మీరు విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. సరిపడినంత నిద్ర మీకు అందినట్లయితే.. మీ శరీరం ఉత్సాహంగా ఉంటుంది. పైగా పగటి వేళల్లో చురుగ్గా పని చేసుకోగలుగుతారు. దీని వల్ల మీ శరీరం బరువు సైతం అదుపులోకి వస్తుంది.

ఓపికగా ఉండండి

గర్భం దాల్చినప్పుడు మీ శరీరం నెమ్మదిగా బరువు పెరుగుతుంది. తగ్గేటప్పడు కూడా అంతే నెమ్మదిగా తగ్గుతుంది. కాబట్టి వ్యాయామం చేస్తున్నా బరువు తగ్గడం లేదే అని కంగారు పడొద్దు. గర్భం దాల్చినప్పుడు మీరున్న బరువు, గర్భధారణ సమయంలో పెరిగిన బరువు, ప్రసవం తర్వాత మీరెంత చురుగ్గా ఉన్నారనేదానిపై మీరు బరువు తగ్గడం ఆధారపడి ఉంటుంది. కాబట్టి కాస్త సహనంగా వ్యవహరించండి. మీరు తిరిగి పూర్వపు శక్తి సామర్థ్యాలు తెచ్చుకోవడానికి సులభమైన, తేలికపాటి వ్యాయామాలు చేయండి. మధ్యలోనే వదిలేయద్దు. మీరు వ్యాయామం చేస్తూ ఉంటే.. నెమ్మదిగా మీ బరువు దానంతంట అదే తగ్గుతుంది.

వ్యాయామం చేసినా బరువు తగ్గకపోవడానికి కారణమేంటి?

సరైన నిద్ర లేకపోవడం

మీరు సరిపడినంత సమయం నిద్రపోతున్నారా? రోజులో కనీసం ఆరు గంటల సమయం నిద్రపోవాలి. నిజమే.. పాపాయిని 24 గంటలూ కనిపెట్టుకొనే ఉండాలి. ఇలాంటప్పుడు తగినంత నిద్ర మీకుండకపోవచ్చు. ఇలా మీరే పాపాయి బాగోగులు చూసుకోవడం వల్ల మీకు తగినంత విశ్రాంతి లేకపోతే.. ఇక మీకు వ్యాయామం చేసే సత్తువ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి రోజూ కనీసం ఆరు గంటల సమయం నిద్రపోవడానికి ప్రయత్నించండి.

ఎక్కువ ఆహారం తీసుకోవడం

సిజేరియన్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన వారికి ప్రసవం తర్వాత ఆయిల్ ఫుడ్ కు దూరంగా ఉండమని గైనకాలజిస్ట్ లు సలహా ఇస్తారు. తద్వారా మీరు త్వరగా కోలుకోగలుగుతారు. కాబట్టి మీరు తీసుకొనే ఆహారంపై ఓ కన్నేసి ఉంచండి. పాపకు పాలిచ్చినప్పుడు ఆహారం కాస్త ఎక్కువగా తీసుకోవడం అవసరం. కానీ మీ పాపాయికి ఘనాహారం ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత మీరు క్రమంగా తీసుకొనే ఆహారం తగ్గించడం మంచిది. అందుకే పోస్ట్ ప్రెగ్నేన్సీ తర్వాత తగినంత ఆహారం తీసుకోవడంతో పాటు.. సరిపడినంత నిద్ర కూడా అవసరం.

ఇలా చేస్తే జిమ్ అవసరం లేకుండానే బరువు తగ్గుతారు

తొమ్మిది నెలలు అలా.. తొమ్మిది నెలలు ఇలా..

గర్భం దాల్చిన తర్వాత.. తొమ్మిది నెలల పాటు.. మీ కడుపులోని బిడ్డను రక్షించేందుకు నిరంతరం మార్పులు చెందుతూ ఉంటుంది. అప్పుడే బేబీ మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఆహారం, విశ్రాంతికే అధిక ప్రాధాన్యమిస్తారు.

ప్రసవం తర్వాత మీ శరీరం తిరిగి పూర్వపు స్థితికి రావడానికి మరో తొమ్మిది నెలలు సమయం పడుతుంది. అయితే బరువు తగ్గే క్రమంలో ఒక్కొక్కరి శరీరం ఒక్కోలా ఉంటుంది. కొందరు ప్రసవం జరిగిన కొద్ది రోజుల్లోనే బరువు తగ్గిపోతే.. మరికొందరికి బరువు తగ్గడానికి కాస్త ఎక్కువ సమయం పట్టొచ్చు. అలాగే ఈ వెయిట్ లాస్ జర్నీ వర్కింగ్ మదర్స్ విషయంలో ఒకలా… ఇంట్లోనే ఉండి బిడ్డ బాగోగులు చూసుకొనే వారికి మరోలా ఉంటుంది. కాబట్టి.. బరువు తగ్గే విషయంలో వాస్తవికమైన గోల్స్ ఏర్పాటు చేసుకొని వాటిని సాధించే ప్రయత్నం చేయండి.

Images: Shutterstock,  Instagram

Featured Image: Wikimedia Commons

Read More From Lifestyle