Lifestyle

అమెరికాలో అద్భుత యాత్ర : మన హైదరాబాదీ లేడీ బైకర్ ‘జయభారతి’ సాధించిన వినూత్న రికార్డ్

Sandeep Thatla  |  Nov 20, 2019
అమెరికాలో అద్భుత యాత్ర : మన హైదరాబాదీ లేడీ బైకర్ ‘జయభారతి’ సాధించిన వినూత్న రికార్డ్

(Hyderabad based Bikerni Jaya Bharathi’s amazing Motor Cycle adventure in America)

హైదరాబాద్ నగరానికి చెందిన 37 ఏళ్ళ బైకర్ని జయభారతి..  అమెరికాలో మోటార్ సైకిల్ పై చేసిన వినూత్న సాహసం ఎందరిలోనో స్పూర్తిని నింపిందంటే అతిశయోక్తి కాదు.  అమెరికాలో యునెస్కో వారు గుర్తించిన 23 వారసత్వ సంపదలైన ప్రాంతాలను సందర్శించేందుకు.. తన మోటార్ సైకిల్ పై బయలుదేరి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారామె. 

ఆకాశ మేఘాల్లో విందు ఆరగించాలని ఉందా..? అయితే హైదరాబాద్‌లో ‘క్లౌడ్ డైనింగ్’ ట్రై చేసేయండి

మన దేశంలోని ట్రాఫిక్ నిబంధనలతో పోల్చుకుంటే.. అమెరికాలో  నిబంధనలు కాస్త కఠినంగానే ఉంటాయని చెప్పాలి. అయినా సరే.. ఆ సవాళ్ళను ఏమాత్రం  భయపడకుండా ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగారు జయభారతి. ఈ ప్రయాణంలో సుమారు 10,000 మైళ్ళు ప్రయాణించి 19 ప్రాంతాలను కవర్ చేశారామె. మిగిలిన నాలుగు ప్రదేశాలను మాత్రం.. అక్కడి విపత్కర వాతావరణ పరిస్థితుల వల్ల సందర్శించడం కుదరలేదు. 

ఆమె సందర్శించిన ప్రదేశాలలో – యూనివర్సిటీ అఫ్ వర్జీనియా, గ్రాండ్ కాన్యన్, ఎవర్ గ్లెడ్స్ నేషనల్ పార్క్, స్టాట్యూ అఫ్ లిబర్టీ, గ్రేట్ స్మోకీ మౌంటెయిన్స్, మామొత్ కేప్స్… ఇలా విశేష ప్రాధాన్యం కలిగిన ప్రదేశాలెన్నో ఉన్నాయి. తన రాయల్ ఎన్ ఫీల్డ్ 650 CC మోటార్ సైకిల్ పై.. సెప్టెంబర్ 15 తేదిన ఈ సాహసయాత్రకు ఆమె శ్రీకారం చుట్టారు. 

ఇక ఈ  సాహస యాత్ర చేయడానికి జయభారతి అమెరికాకి వచ్చినప్పుడు..   TANA సంఘం తన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అలాగే ఆమె ప్రయాణించే మార్గాల్లో.. ప్రవాసాంధ్రులతో ప్రత్యేకంగా ముఖాముఖి కార్యక్రమాలను కూడా నిర్వహించింది. 

ఈమె సాహసయాత్రకి ‘వీల్స్ అఫ్ విల్స్’ అనే పేరు పెట్టడం విశేషం. ఈ యాత్రకు స్పాన్సర్ షిప్ ద్వారా వచ్చే డబ్బుతో..  మన దేశంలో మోటార్ సైకిల్ నడపడానికి ఉత్సాహం చూపే అమ్మాయిలకు డ్రైవింగ్ నేర్పించాలన్నదే తన లక్ష్యమని జయభారతి తెలిపారు. అందుకోసమే ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 

హైదరాబాద్ నగరానికి యునెస్కో గుర్తింపు రావడానికి కారణాలివే…

ఇక ఈ సాహస యాత్రలో జయభారతికి సహాయం చేసేందుకు.. అలాగే మొత్తం యాత్రను వీడియోలో డాక్యుమెంట్ చేసేందుకు.. ఆమెతో పాటు మరో బైకర్ దీపక్ కూడా అమెరికాకి వచ్చారు.  జయ భారతి చేస్తున్న పని ఎందరో మహిళలకు స్ఫూర్తిని కలిగిస్తుందని.. రేపటి తరానికి ఆమెను గురించి తెలియజేయడం కోసం  ఈ యాత్రని డాక్యుమెంట్ చేయడానికి ముందుకు వచ్చానని తెలిపారు. దీపక్ పేరిట కూడా పలు రికార్డులు ఉండడం గమనార్హం. మోటర్ సైకిల్ నడుపుతూ ఏడు ఖండాలు ప్రయాణించిన బైకర్‌గా తన పేరిట ఓ రికార్డు కూడా ఉంది. 

ఇక ఇంత గొప్ప సాహస యాత్ర చేసిన జయ భారతిను.. తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. జయ భారతి చేసిన సాహస యాత్ర మరెందరో మహిళలకు ప్రేరణగా నిలుస్తుందని.. ఇటువంటి మరెన్నో మంచి కార్యక్రమాలు ఆమె భవిష్యత్తులో చేయాలని కోరుకుంటున్నామని తెలంగాణ టూరిజం శాఖ ఓ ప్రకటనలో తెలిపింది . ప్రస్తుతం తనలాగే మోటార్ సైకిల్ రైడింగ్ చేసే మహిళలతో  కలిసి.. హైదరాబాద్ నగరంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు జయ భారతి. స్వతహాగా ఆర్కిటెక్ట్ అయిన ఆమె.. తన ప్రవృత్తి మాత్రం కచ్చితంగా డ్రైవింగ్ మాత్రమేనని బల్లగుద్ది మరి చెబుతారు. భవిష్యత్తులో కూడా ఆమె ఇలాంటి సాహసాలెన్నో చేయాలని ఆశిద్దాం. 

చివరగా చెప్పేదేమిటంటే.. “మోటార్ సైకిల్ నడపడం కేవలం అబ్బాయిలకు మాత్రమే కాదు.. మనకూ సాధ్యమే” అంటూ మహిళలకు ఒకవైపు ప్రేరణను అందిస్తూ.. మరోవైపు తన సాహసయాత్రలతో రాష్ట్రానికి కూడా పేరు తీసుకొస్తున్న డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ జయ భారతి. అందుకని ఆమెకి మనం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే మరి. 

హైదరాబాద్ కి షాన్.. “ఉస్మానియా బిస్కెట్స్” చరిత్ర మీకోసం…!

Read More From Lifestyle