Entertainment

కమల్ “భారతీయుడు” చిత్రానికి.. వెంకటేష్, రాజశేఖర్‌కి సంబంధమేమిటి..?

Sandeep Thatla  |  Jan 18, 2019
కమల్ “భారతీయుడు” చిత్రానికి.. వెంకటేష్, రాజశేఖర్‌కి సంబంధమేమిటి..?

లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోయే ముందు ఆఖరి చిత్రంగా “ఇండియన్ 2” (Indian 2) ని ఎంపిక చేసుకున్న సంగతి విదితమే. అవినీతిపరుడైన కొడుకుని ఏమాత్రం సహించకుండా హతమార్చే కథతో రూపొందిన “ఇండియన్” (తెలుగులో “భారతీయుడు”)  చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న కథ ఇది. ఆయన రాజకీయాల్లోకి ఎటువంటి దృక్పధంతో వస్తున్నాడు అన్న భావన ప్రజలలో కల్పించే విధంగా.. సరిగ్గా ఈ సమయానికి “ఇండియన్ 2” చిత్రానికి కమల్ పచ్చ జెండా ఊపాడు.

అయితే సినిమాని ఆరాధించి ప్రేమించే ప్రేక్షకులకి  ఈ చిత్రం పై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే – ఒకటి కమల్ హాసన్, రెండవది – దర్శకుడు శంకర్ (Shankar). అలాగే మూడవది ఒకప్పుడు ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందిన “ఇండియన్” సినిమాకి సీక్వెల్ అవ్వడం. ఈ మూడు కారణాలు ఈ చిత్రం పై అంచనాలను పెంచుతుండగా.. మరో రెండు కారణాలు ఈ సీక్వెల్ పైన అదే స్థాయిలో అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. అవేమనగా – మన దగ్గర సీక్వెల్స్ అంతగా విజయం సాధించిన దాఖలాలు లేవు. అలాగే ఇండియన్‌తో పోల్చినప్పుడు “ఇండియన్ 2” కథ మునుపటి స్థాయిలో ఉంటుందా అన్న దానిపై కూడా సంశయాలు ఉన్నాయి. 

ఈ అనుమానాలకు బలం చేకూరుస్తూ, మొన్ననే విడుదలైన రోబో 2.0 చిత్రం వసూళ్ళ పరంగా బాగానే సంతృప్తినిచ్చినా.. కథ పరంగా మాత్రం శంకర్ స్థాయిలో లేదు అన్న టాక్ వినపడింది. ఒకరకంగా ఇది శంకర్ ఆలోచించాల్సిన విషయమే అని కూడా అన్నవాళ్ళు లేకపోలేదు. ఎందుకంటే, శంకర్ దర్శకుడిగా కన్నా కూడా రచయితగా మంచి పట్టు ఉన్నవాడు. ఆయన సినిమాలు ఏవి చూసినా సరే, కథలు చాలా ధృడంగా ఉంటాయి. 

ఇలా ఎవరికి వారు “ఇండియన్ 2” చిత్రం ప్రేక్షకుల అంచనాలని అందుకుంటుందా.. లేదా? అనే మీమాంసలో ఉండగా..

ఒక సాధారణ సినీ అభిమాని ఈ చిత్రాన్ని ఎందుకు చూడాలనుకుంటాడో అన్న దాని పై మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ..

* ఇది శంకర్ – కమల్ హాసన్ కలయికలో వస్తున్న రెండవ చిత్రం

* ఇది దర్శకుడు శంకర్ తన కెరీర్‌లో తీస్తున్న రెండవ సీక్వెల్

* అలాగే కమల్ హాసన్ – అనిరుధ్ (Anirudh Ravichander)- శంకర్ కలిసి చేస్తున్న తొలి చిత్రం

* అదేవిధంగా కమల్ హాసన్ – కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)లు తొలిసారిగా కలిసి నటిస్తున్న చిత్రం ఇది.

* 23 ఏళ్ళ తరువాత కమల్ హాసన్ – శంకర్ కలిసి చేస్తున్న చిత్రం ఇది.

* లైకా ప్రొడక్షన్స్ తొలిసారిగా కమల్ హాసన్‌తో నిర్మిస్తున్న చిత్రం ఇది.

 

కమల్ హాసన్ 1996లో నటించిన “భారతీయుడు” చిత్రం గురించి ఇటీవలే ఆ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేసిన వసంత బాలన్ పలు ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తొలుత రజనీకాంత్ వద్దకు ఈ సినిమా స్క్రిప్ట్ వచ్చిందని.. కానీ కథ నచ్చినప్పటికీ డేట్స్ కుదరలేదని తెలిపారు. కథా చర్చల్లో భాగంగా “భారతీయుడు” సినిమాలో తొలుత తండ్రి పాత్రకు హీరో రాజశేఖర్ పేరు కూడా పరిశీలనకు వచ్చిందని.. అలాగే కొడుకు పాత్రలకు నాగార్జున, వెంకటేష్ పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చాయని తెలిపారు. అయితే ఆఖరికి కమల్ సినిమా ఒకే చేశాక.. ఆ రెండు పాత్రలను ఆయనే చేశారన్నారు. ఆ రెండూ పాత్రలకూ సమాన న్యాయం చేసిన కమల్.. సీక్వెల్ వైపు కూడా మొగ్గుచూపడం మంచి పరిణామం అని పేర్కొన్నారు. 

 

ఇన్ని విశేషాలు ఉన్న భారతీయడు 2 లేదా ఇండియన్ 2 చిత్ర షూటింగ్ జనవరి 18 నుండి మొదలుకానుంది. దీనిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని దర్శకుడు శంకర్ ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో కమల్ హాసన్‌కి ఈ చిత్రంలో సేనాపతి పాత్ర కోసం మేకప్  టెస్టులు చేయడం.. అలాగే వాటితో కొన్ని స్టిల్స్ కూడా దిగడం జరిగిపోయాయి. వాటినే ఇప్పుడు “ఇండియన్ 2” పోస్టర్స్ లో మనం చూడొచ్చు. అయితే ఈ సారి పోస్టర్‌కి ఓల్డర్, వైజర్ & డెడ్లియర్ అంటూ ట్యాగ్ లైన్ కూడా జతచేయడం విశేషం.

చూద్దాం.. కమల్ హాసన్ – శంకర్‌ల రెండో కలయిక వారి మొదటి కలయిక స్థాయిలో ఉంటుందా.. లేక అంతకు మించి ఉంటుందా అని..

ఇవి కూడా చదవండి

అభిమానులకు పైసా వసూల్.. ఎన్టీఆర్ “కథానాయకుడు” (సినిమా రివ్యూ)

తెలుగు వారి మనసును దోచిన “గీత గోవిందం”.. బాలీవుడ్‌ని కూడా అలరిస్తుందా..?

రజినీకాంత్ స్టామినాని.. మరోసారి రుచి చూపించిన “పేట” (సినిమా రివ్యూ)

Read More From Entertainment