Sankranti Special – Hyderabad International Kites Festival and Sweets Festival
సంక్రాంతి సీజన్ రాగానే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పతంగుల సందడి అంతాఇంతా కాదు. దీనిని దృష్టిలో ఉంచుకునే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరుస నాలుగేళ్లగా క్రమం తప్పకుండా.. ఇంటర్నేషనల్ కైట్స్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇక దానికి కొనసాగింపుగా ఈ సంవత్సరం కూడా.. ఇంటర్నేషనల్ కైట్స్ ఫెస్టివల్‌ని అంగరంగవైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తూ వస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.
హైదరాబాద్ కీర్తిని జగద్విఖ్యాతం చేసే.. పతంగుల పండగ & మిఠాయిల వేడుక..!
ఇక ఈ వివరాల్లోకి వెళితే.. జనవరి 13,14 & 15వ తేదీలలో హైదరాబాద్ నగరంలోని పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఈ కైట్స్ ఫెస్టివల్ జరగనుంది. అయితే గత నాలుగేళ్లుగా కూడా.. ఈ గ్రౌండ్స్‌లోనే ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నారు. ఇక్కడే ప్రతి ఏడాది ఈ ఫెస్టివల్‌ని చేయడానికి ముఖ్య కారణమేంటి అంటే – కైట్స్‌ని పైకి ఎగరవేయడానికి తగిన గాలితో పాటు.. అనుకూలమైన వాతావరణం ఉండడమే. అందుకు తగ్గట్టుగా ఈ గ్రౌండ్ ఉండడం చేత దీనిని ఎంపిక చేయడం జరిగింది.
గత ఏడాది మాదిరిగానే.. ఈ ఏడాది కూడా తెలంగాణ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ పేరిట ఈ ఈవెంట్ జరగనుంది. అలాగే పలు దేశాల నుండి ఈసారి కూడా.. ఎంతోమంది ప్రొఫెషనల్ కైట్ ఫ్లయిర్స్ ఈ ఫెస్టివల్‌కి విచ్చేయనున్నారు. ఈ సంవత్సరం ఈ ఫెస్టివల్‌లో హైలైట్‌గా నైట్ ఫ్లయింగ్ నిలవనుంది.
ఉదయం సమయంలోనే కాకుండా రాత్రి వేళలో కూడా.. ఇలా కైట్స్‌ని ఎగరేయడం ద్వారా.. ఈ ఈవెంట్‌కి వచ్చే వీక్షకులని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు నిర్వాహకులు. గత నాలుగేళ్లుగా ప్రభుత్వం ఈ ఈవెంట్‌కి ఇస్తున్న ప్రచారం వలన హైదరాబాద్ – సికింద్రాబాద్ వాసులకి కూడా ఈ ఫెస్టివల్ పట్ల క్రమక్రంగా ఆసక్తి పెరిగింది.
ఇక ఈ కైట్స్ ఫెస్టివల్‌తో పాటుగా స్వీట్ ఫెస్టివల్‌ని కూడా గత రెండేళ్ల క్రితం ప్రారంభించడం జరిగింది. ఈ స్వీట్ ఫెస్టివల్‌లో జాతీయ. అంతర్జాతీయ వంటకాలను ప్రదర్శనకు ఉంచడం విశేషం. గత ఏడాది కూడా దాదాపు 100 నుండి 200 రకాలకు పైగా తినుబండారాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచడం జరిగింది. ఈ ప్రదర్శనలోనే మన హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు విరివిగా లభించే అనోఖి ఖీర్ గురించి కూడా ప్రజలకి తెలిసింది.
ఇరానీ ఛాయ్ – కేర్ అఫ్ హైదరాబాద్ చరిత్ర మీకోసం
ఈ స్వీట్ ఫెస్టివల్‌లో రకరకాలైన స్వీట్స్ గురించి తెలియడమే కాకుండా.. వాటి వెనుక ఉన్న చరిత్ర గురించి కూడా విశేషమైన సమాచారం లభించడం విశేషం. అదే సమయంలో మన దేశంలోని వివిధ ప్రాంతాల గురించి మాత్రమే కాకుండా.. విదేశీ సంస్కృతిని కూడా ఈ స్వీట్స్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది.
ఇప్పటికే ఈ కైట్స్ ఫెస్టివల్ & స్వీట్ ఫెస్టివల్‌కి సంబందించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. మొన్నీమధ్యనే వీటికి సంబంధించి ఒక రివ్యూ కూడా ఏర్పాటు చేసి.. అందులో తేలిన లోటుపాట్ల గురించి తగిన సూచనలు చేశారు.
ఈ ఈవెంట్స్ ప్రతియేటా ప్రజాదరణ పొందుతున్న నేపథ్యంలో.. వచ్చే ఏడాది నుండి జిల్లా కేంద్రాల్లో కూడా వీటిని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ఇదే గనుక జరిగితే, వచ్చే ఏడాది నుండి ప్రతి జిల్లా కేంద్రంలో .ఇటువంటి వేడుకలను విరివిగా చూసే అవకాశం ప్రజలకి దక్కుతుంది.
చివరగా.. హైదరాబాద్, సికింద్రాబాద్ వాసులు జనవరి 13, 14, 15 తేదీలలో.. వీలు చేసుకుని ఈ ఫెస్టివల్‌కి వెళ్లి ఒకవైపు కైట్స్ చూస్తూ.. మరోవైపు స్వీట్స్ తింటూ సంక్రాంతి పండుగని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం.
హైదరాబాద్ కి షాన్.. “ఉస్మానియా బిస్కెట్స్” చరిత్ర మీకోసం…!
Images: Pixabay