జస్టిస్ ఫర్ ట్వింకిల్ (Justice for Twinkle). ప్రస్తుతం ఉత్తరాదిలో నెటిజన్ల ఆగ్రహావేశాలను, వారి గళాన్ని బలంగా ప్రభుత్వానికి వినిపిస్తున్న ఉద్యమం ఇది. అలీఘడ్‌లో 2 ఏళ్ల పసికందును.. ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఆ పాప తల్లిదండ్రులు తన నుండి తీసుకున్న అప్పును చెల్లించకపోవడాన్ని దీనికి కారణంగా చూపాడు.
సగటు మనిషిలో రోజు రోజుకూ ఇలా పెరిగిపోతున్న హింసాత్మక ధోరణిని, రాక్షసత్వాన్ని ప్రశ్నిస్తూ.. ఇలాంటి దారుణాలు జరగకుండా ప్రభుత్వం కొత్త చట్టాలు చేయాలని కోరుతూ.. ఇప్పటికే ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం ఈ ఉద్యమంలో బాలీవుడ్ ప్రముఖలు అందరూ పాల్గొంటున్నారు. తమ గొంతును కూడా బలంగా వినిపిస్తున్నారు.
అభిషేక్ బచ్చన్, ట్వింకిల్ ఖన్నా, ఆయుష్మాన్ ఖురానా మొదలైన వారంతా తమ ట్విట్టర్ ఖాతాల్లో పోస్టులు పెడుతూ.. ఈ సంఘటనపై తమ వ్యతిరేకతను తెలియజేస్తున్నారు.
జహీద్ అనే ఓ వ్యక్తి.. ట్వింకిల్ అనే ఒక అమాయక పసికందుపై తన పగను తీర్చుకొని.. సభ్యసమాజం తలదించుకొనేలా ప్రవర్తించాడని.. ఇలాంటి నరరూప రాక్షసులను కఠినంగా శిక్షించే చట్టాలు రావాలని బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తెలిపారు. తాను ఈ ఘటన గురించి విన్నాక చాలా ఆగ్రహావేశాలకు లోనయ్యానని.. ఒక క్షణం మౌనంగా ఉండిపోయానని అన్నారు.
ఇలాంటి ఘటనలు చాలా అనాగరికమని, మానవత్వపు విలువలు రోజు రోజుకూ ఎలా దిగజారిపోతున్నాయన్న దానికి ఇలాంటి సంఘటనలు నిదర్శనమని ఆయుష్మాన్ ఖురానా అన్నారు. కేవలం రూ.10,000 అప్పు తీర్చలేనందుకు.. రుణగ్రస్తుల బిడ్డను అపహరించి హత్య చేసిన ఈ ఘటన గురించిన వార్తలు ఇప్పుడు నేషనల్ మీడియాలో ప్రధానంగా వస్తున్నాయి.
ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా ఈ ఘటనపై స్పందించారు. “కొంచెం సేపు నా శరీరం కంపించినట్లయింది. ఎంతో ఆగ్రహానికి గురై అప్‌సెట్ అయ్యాను. ఇలాంటి ప్రపంచంలో మన పిల్లలు నివసించాలని నేను ఎప్పుడూ అనుకోను. ఈ నేరానికి సంబంధించి తక్షణమే కఠినమైన శిక్షను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను” అని తెలిపారాయన.
సోనమ్ కపూర్ కూడా ట్విట్టర్ వేదికగా ఈ ఘటనపై స్పందించారు. “ఆ పాపకు జరిగిన అన్యాయం నా గుండెను కలచివేసింది. తన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ ఘటనను దయచేసి మీ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోవద్దని ప్రజలను కోరుతున్నాను. మీ ద్వేషాన్ని ప్రకటించుకోవడానికి.. ఓ చిన్నారి హత్యను దయచేసి కారణంగా చూపొద్దు” అని ఆమె తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఈ బిడ్డ మా ప్రేమకు ప్రతిరూపం.. కులాలకు అతీతం: అమృత ప్రణయ్
ఆడపిల్లలు స్వేచ్ఛగా ఎదగాలంటే.. మూసధోరణులను వదిలేయాల్సిందే..!