Entertainment

అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకొని.. అవార్డులు సొంతం చేసుకున్నారు..!

Sandeep Thatla  |  Jan 7, 2019
అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకొని.. అవార్డులు సొంతం చేసుకున్నారు..!

సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన ప్ర‌తి ఒక్క‌రూ ప్రేక్షకుల అండ‌దండ‌ల‌తో పాటు.. అవార్డులు కూడా త‌మ సొంతం కావాల‌ని ఆశిస్తూ ఉంటారు. అయితే ఇది అంత సులువైన ప‌నేమీ కాదు. ఎంతో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చూపితే త‌ప్ప పుర‌స్కారాలు ద‌క్క‌వు. అయితే ప్ర‌తిభ‌కు ప్రోత్సాహం తోడైతే మ‌రింత క‌ష్ట‌ప‌డాల‌ని.. ఇంకాస్త రాణించాల‌ని ఆశించ‌డం స‌హ‌జం. అందుకే చాలామంది న‌టీన‌టులు అవార్డులకు చాలా ప్రాధాన్యం ఇస్తుంటారు.

ఇక విషయానికి వస్తే, తాజాగా హైదరాబాద్ వేదికగా జరిగిన జీ సినీ తెలుగు అవార్డ్స్ 2018 (Zee Cine Awards Telugu) వేడుకలో.. గ‌తేడాది తమ ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్న కొందరు నటీనటులు అవార్డులు అందుకున్నారు. ఇందులో భాగంగా వ్యాఖ్యాత, నటి అనసూయ (Anasuya), రంగస్థలం (Rangasthalam) చిత్రంలో తాను చేసిన రంగమ్మత్త‌ పాత్రకి గాను ఉత్త‌మ స‌హాయ‌న‌టి అవార్డు అందుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితోనూ పంచుకుంటూ గుర్తింపు రావడానికి తోడ్పడిన రంగస్థలం దర్శకుడు, హీరో, నిర్మాతలకి వారితో పాటు రంగ‌స్థ‌లం సినిమా యూనిట్ కి కూడా ధన్యవాదాలు తెలియ‌జేసింది.

 

అలాగే బాలీవుడ్ నుంచి ఈ ఏడాదే తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి న‌టించిన రెండు చిత్రాల్లోనూ తన అభినయంతో అందరిని ఆకర్షించింది నటి అదితీ రావు హైదరి.. ముందుగా విడుద‌లైన సమ్మోహనం  సమ్మోహనం చిత్రంలో తాను చేసిన పాత్రకి స్వయంగా డబ్బింగ్ చెప్పుకొని ఆ పాత్రకి నూటికి నూరుశాతం న్యాయం చేసింది. ఆ త‌ర్వాత తాజాగా విడుదలైన అంతరిక్షం (Antariksham) చిత్రంలో వ్యోమ‌గామిగా అదితి న‌ట‌న అంద‌రినీ ఆక‌ర్షించింది. ఈ సినిమాలో త‌న న‌ట‌న‌కుగాను ఉత్తమ డెబ్యూ న‌టి అవార్డుని అందుకుంది. అలాగే స‌మ్మోహ‌నం చిత్రానికి గాను.. సుధీర్‌బాబుతో క‌లిసి బెస్ట్ రొమాంటిక్ పెయిర్ పుర‌స్కారాన్ని సాధించింది.

 

ఇక మ‌నంద‌రి అందాల వసుమతి.. అదేనండీ భరత్ అనే నేను చిత్రంలో వసుమతి పాత్రతో ఆక‌ట్టుకున్న కియారా అద్వాని (Kiara Advani) ఈ సంవత్సరం బెస్ట్ ఫైండ్ అఫ్ ది ఇయర్ అవార్డును అందుకుంది. బాలీవుడ్ నుండి గ‌తేడాది తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama) చిత్రంలో నటించగా.. ఆ సినిమా ఈ సంక్రాంతికి విడుదలకానుంది. అంతేకాదు.. అగ్ర‌హీరోలంద‌రి స‌ర‌స‌న సినిమాలు చేసే అవ‌కాశాలు కూడా అందుకుంటోంది. ఇక విన‌య విధేయ రామ చిత్రం కూడా హిట్ అయిందంటే ఇక ఆమెకి తెలుగులో తిరుగుండదు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 

త‌న అద్భుత న‌ట‌న‌తో అల‌నాటి మ‌హాన‌టి సావిత్రి)ని గుర్తుచేసిన కీర్తి సురేష్‌ని (Keerthy Suresh) ఆ పాత్ర‌కు గాను ఉత్తమ నటి పురస్కారం వ‌రించింది. మ‌హాన‌టి చిత్రంలో ఆమె అభినయం అటు ప్రేక్షకుల ప్ర‌శంస‌ల‌ను సాధించ‌డంతో పాటు.. ఇటు విమర్శకులని సైతం మెప్పించగలిగింది. కేవ‌లం జీ సినిమా అవార్డ్స్ మాత్ర‌మే కాదు.. ఈ ఏడాది అన్ని ప్ర‌ధాన అవార్డులు కూడా కీర్తి న‌ట‌న‌కు మెచ్చి ఆమెనే వ‌రిస్తాయ‌నేది నిర్వివాదాంశం.

ఇక ఈ ఏడాది జీ ఫేవ‌రెట్ న‌టిగా గీత గోవిందం సినిమాతో ఆక‌ట్టుకున్న ర‌ష్మిక మంధ‌న అవార్డు దక్కించుకోగా.. తొలి ప్రేమ చిత్రంలో చ‌క్క‌టి న‌ట‌న క‌న‌బ‌ర్చిన రాశీ ఖ‌న్నా ఎంట‌ర్‌టైన‌ర్ ఆఫ్ ద ఇయ‌ర్ ఫీమేల్ (Entertainer of the year- female) అవార్డును కైవసం చేసుకుంది. 

 

వీటితో పాటుగా అందించిన అవార్డులలో రంగస్థలం చిత్రానికి గాను ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నాడు రామ్‌చ‌ర‌ణ్‌. ఇక ఎంట‌ర్‌టైన‌ర్ ఆఫ్ ద ఇయర్ మేల్  అవార్డు గెలుపొందాడు హీరో సుధీర్ బాబు. అలాగే ఉత్తమ కథనం విభాగంలో గూఢచారి చిత్రానికి అవార్డు ద‌క్కింది. నీది నాది ఒకే కథ చిత్రాన్ని స్పెషల్ జ్యూరీ అవార్డు వరించింది.

మొత్తానికి గతేడాది విడుద‌లైన చిత్రాల్లో బలమైన స్త్రీ పాత్రలకి, వాటిని తెరపై చూపిన చిత్రాల‌కు ఈ అవార్డుల ద్వారా గుర్తింపు దక్కుతుండడం నిజంగా అభినందనీయం.

ఇవి కూడా చదవండి

రజనీకాంత్ “పేట” చిత్రం సినిమా రివ్యూ

అభిమానులకు పైసా వసూల్.. ఎన్టీఆర్ “కథానాయకుడు” (సినిమా రివ్యూ)

2019లో బాలీవుడ్‌కి పరిచయం అయ్యే కొత్త కథానాయికలు వీరే

Read More From Entertainment