
రంజాన్ (Ramzan) మాసంలో హైదరాబాద్ మహిళలు ఎక్కువగా షాపింగ్ చేయడానికి ఇష్టపడే చోటు చూడి బజార్ లేదా లాడ్ బజార్ (Laad Bazaar). ఈ లాడ్ బజార్‌లో ఆడవాళ్లు ఎంతగానో ఇష్టపడే గాజులు, పట్టీలు, ఇమిటేషన్ జ్యువెలరీ, ముత్యాలు (Pearls) లాంటి వస్తువులు చాలా తక్కువ ధరకు లభిస్తాయి. పైగా రంజాన్ మాసంలో ఇక్కడ పగలు, రాత్రి అనే తేడా లేకుండా షాపింగ్ జరుగుతూ ఉంటుంది.
చార్మినార్.. అలాగే చౌమహల్లా ప్యాలెస్‌కు చాలా దగ్గరలో ఉండే ఈ బజార్.. నిజాం రాజుల కాలం నుండీ ఉంది. సంవత్సరమంతా ఇక్కడ దుకాణాలు రద్దీగానే ఉంటున్నప్పటికి, రంజాన్ నెల రోజుల పాటు మాత్రం “ఇసుక వేస్తే రాలనంత” జనం ఇక్కడ కనిపిస్తారు.
ప్రతి యేడు ఇక్కడికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి చిరువ్యాపారులెందరో వస్తారు. ఎక్కువగా బీహార్ (Bihar), ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh), మధ్య ప్రదేశ్ (Madhya Pradesh) నుండి వచ్చి.. ఈ నెల రోజుల పాటు ఇక్కడ వ్యాపారాలు చేస్తారు.
ప్రతి సంవత్సరం ఏదో ఒక వస్తువు ఇక్కడ ఈ లాడ్ బజార్‌లో ఆదరణ పొందుతుంది. ఉదాహరణకి ఈ సంవత్సరం పట్టీలకి బాగా ఆదరణ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకనే విక్రయదారులు కూడా రకరకాలైన డిజైన్స్‌తో చేసిన పట్టీలని కస్టమర్స్‌కి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అలాగే వీటి తయారీకీ రాత్రింబవళ్లూ కష్టపడుతున్నారు.
ఇంతటి ప్రజాధారణ ఉన్న మార్కెట్‌కి ఇటీవలే మరింత శోభ చేకూర్చడంతో పాటుగా.. చార్మినార్ వంటి అపురూప కట్టడాన్ని పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం చార్మినార్ పెడిస్ట్రియనైజేషన్ ప్రాజెక్ట్‌కి (Charminar Pedestrianaisation Project) శ్రీకారం చుట్టింది. ఇందుకోసం చార్మినార్ వైపు వచ్చే వాహనాలని నియంత్రిస్తూ.. కాలుష్యం దరి చేరనీయకుండా చూడి బజార్‌కి వచ్చే వాళ్ళందరూ కూడా కాలినడకనే సందర్శనకు వెళ్లేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ పనులకి రంజాన్ నెల కావడంతో బ్రేక్ ఇవ్వడం జరిగింది.
ఇక ఆడవారికి ఫేవరెట్ ప్లేస్ అయిన ఈ చూడి బజార్‌కి సామాన్య మహిళల నుండి ప్రముఖ హీరోయిన్స్ వరకు ఎంతో మంది వస్తుంటారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం టెన్నిస్ క్రీడాకారిణి, హైదరబాదీ అయిన సానియా మీర్జా (Sania Mirza) ఇక్కడికి షాపింగ్‌కి వస్తుంటారు. పోయిన ఏడాది తన తల్లితో కలిసి, యువ నటి సారా అలీ ఖాన్ ఇక్కడకు షాపింగ్‌కు చేయడానికి రావడం గమనార్హం. అలాగే భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) కూడా లాడ్ బజార్‌లో తన భార్య కోసం గాజులు కొనడానికి వస్తుంటానని చెప్పడం గమనార్హం.
ఇన్ని ప్రత్యేకతలు ఉన్న లాడ్ బజార్‌ను మనమూ సందర్శించేద్దామా..!
ఇవి కూడా చదవండి
హైదరాబాద్ నగరవాసులను విశేషంగా అలరిస్తోన్న తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ 2019..
రంజాన్ స్పెషల్: భాగ్యనగరంలో బెస్ట్ బిర్యానీ.. లభించేది ఈ హోటల్స్‌లోనే..!
హైదరాబాదీ బిర్యానికి.. గట్టి పోటీ ఇస్తున్న మండి రైస్ ..!