Entertainment

మాట కఠినం.. మనసు నవనీతం.. సూర్యకాంతం ది గ్రేట్

Babu Koilada  |  Jan 21, 2019
మాట కఠినం.. మనసు నవనీతం.. సూర్యకాంతం ది గ్రేట్

పాత సినిమాల్లో ఆమె హావభావాలు చూసి హడలిపోని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అమ్మ వేషం వేసినా.. అత్త వేషం వేసినా.. సూర్యకాంతమంటే గయ్యాళి పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పాల్సిందే. కుటుంబ కథా చిత్రాల్లో ఒక ఫైర్ బ్రాండ్ లాంటి గడసరి సూర్యకాంతం. తెలుగింటి ప్రేక్షకులకు సిసలైన హాస్యగుళికలను తన యాస ద్వారా అందించిన సూర్యకాంతం గురించి ఈ రోజు మనం కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా

తూర్పుగోదావరి జిల్లా వెంకటక్రిష్ణరాయపురంలో 1924లో అనంతరామయ్య, వెంకటరత్నమ్మ దంపతులకు 14వ సంతానంగా జన్మించిన సూర్యకాంతం (Suryakantham) సినీ రంగంలోకి వచ్చాక..తొలిసారిగా హీరోయిన్ వేషం కోసం ఎంపికయ్యారట. కానీ ఆమె ఆ అవకాశాన్ని త్రుటిలో కోల్పోయారు. 1950లో వచ్చిన “సంసారం” చిత్రంలో అత్తగారి పాత్రలో నటించిన సూర్యకాంతం.. ఆ తర్వాత వరుసగా అలాంటి పాత్రల్లోనే నటించారు.

ముఖ్యంగా గుండమ్మ కథ, తోడికోడళ్లు, ఇద్దరు అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి, తిక్క శంకరయ్య,పెంకి పెళ్లాం.. లాంటి చిత్రాలు సూర్యకాంతానికి మంచి పేరు తీసుకొచ్చిపెట్టాయి. సినిమా షూటింగ్‌కు వస్తే.. అందరితో కలిసిపోయి.. కన్నతల్లి మాదిరిగా ఆదరణ చూపేవారట సూర్యకాంతం. ముఖ్యంగా ఇంటి నుండి భోజనం వండి తీసుకొచ్చి ఆమె షూటింగ్‌లో తోటి ఆర్టిస్టులు అందరికీ కొసరి కొసరి వడ్డించేవారట. ఆమె మమకారాన్ని చూసి చాలామంది నిజంగానే ఆశ్చర్యపోయేవారు. ఆమెను ఆప్యాయంగా “దొడ్డమ్మ గారూ” అని పిలిచేవారు.

సూర్యకాంతం కోసం మాటల రచయితలు ప్రత్యేకంగా పలు డైలాగ్స్ రాసేవారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే.. ఆమె పాత్రలకు సినిమాలలో దక్కే మైలేజీ చాలా ఎక్కువ. సినిమాల్లో నటిస్తున్నప్పుడే.. అనేక రేడియో నాటికల్లో కూడా సూర్యకాంతం నటించేవారు. నెగటివ్ పాత్రలు పోషిస్తున్నప్పుడు అసహజత్వానికి దూరంగా.. కేవలం ముఖాభినయంతోనే ఆకట్టుకోవడం సూర్యకాంతం ప్రత్యేకత. రేలంగి, రమణారెడ్డి, గుమ్మడి, యస్వీ రంగారావు లాంటి హేమాహేమీలంతా సూర్యకాంతానికి భర్తలుగా
నటించి.. ఆమె పాత్రల నోటి దురుసుకి బలైపోయినవారే.

తన కెరీర్‌లో దాదాపు 750 చిత్రాల్లో నటించిన సూర్యకాంతం.. 1994లో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తరఫున డాక్టరేటు అందుకున్నారు. ఆ సంవత్సరమే ఆమె తీవ్ర అనారోగ్యానికి గురై తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

ప్రముఖ నటులు గుమ్మడి వెంకటేశ్వరావు ఓసారి సూర్యకాంతంతో మాట్లాడుతూ “ఎంతపని చేశావు తల్లీ.. సూర్యకాంతం లాంటి మంచి పేరు పెట్టుకొని… అదే పేరును తెలుగింటి ఆడపడుచులు పెట్టుకోకుండా చేశావు” అని అన్నారట. ఒక రకంగా అది ఆమెకు కాంప్లిమెంట్  అని చెప్పవచ్చు. ఎందుకంటే.. సూర్యకాంతం లాంటి నటీమణి మళ్లీ తెలుగు సినీ పరిశ్రమకు దొరికే అవకాశం లేదు కాబట్టి.

ఇవి కూడా చదవండి

దటీజ్ మహాలక్ష్మితో టాలీవుడ్ క్వీన్‌గా మారనున్న తమన్నా

తెెలుగు వారి మనసును దోచిన “గీత గోవిందం”.. బాలీవుడ్‌ని కూడా అలరిస్తుందా..?

రజినీకాంత్ స్టామినాని.. మరోసారి రుచి చూపించిన “పేట” (సినిమా రివ్యూ)

 

Read More From Entertainment