Lifestyle

గాంధీ జయంతి స్పెషల్: అందరికీ స్ఫూర్తిదాయకం.. మహాత్ముడు చెప్పిన సూక్తులు

Sridevi  |  Aug 20, 2019
గాంధీ జయంతి స్పెషల్: అందరికీ స్ఫూర్తిదాయకం.. మహాత్ముడు చెప్పిన సూక్తులు

అక్టోబర్ 2.. ఈ రోజున మన దేశంలో గాంధీ జయంతి (Gandhi Jayanti) వేడుకలు జరుపుకోవడం ఆనవాయతీగా వస్తోంది. జాతిపిత మహాత్మా గాంధీ (Mahatma Gandhi,) జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలను నిర్వహిస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. సత్యం, అహింస ఉన్న మార్గాలను ఎంచుకుంటూ లక్ష్యం చేరుకోవడానికి.. శాంతియుతంగా ప్రయత్నించాలని, కోపాన్ని విడిచిపెట్టేయాలని అందరికీ బోధించిన వ్యక్తి మహాత్ముడు.

కేవలం బోధించడం మాత్రమే కాదు.. ఆయన కూడా అదే మార్గంలో పయనించి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ‘జాతిపిత’, ‘గాంధీజీ’ అని మనమంతా పిలుచుకునే ఆయన అసలు పేరు ‘మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ’. ఈయన గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో 1869 సంవత్సరంలో అక్టోబర్ 2వ తేదీన జన్మించారు. వీరిది సంప్రదాయబద్ధమైన సామాన్య కుటుంబం. తండ్రి పేరు కరంచంద్ గాంధీ. తల్లి పేరు పుతలీ బాయి.

మహాత్మా గాంధీ 13 ఏళ్ల వయసులోనే.. అప్పటి ఆచారం ప్రకారం కస్తూరి బాయిని వివాహమాడారు. వీరికి నలుగురు సంతానం. 19 ఏళ్ల వయసులో న్యాయవాద విద్య అభ్యసించేందుకు ఇంగ్లండుకు వెళ్లారు. అక్కడే ఆయనకు బెర్నార్డ్ షా వంటి ప్రముఖ నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి. అలాగే వివిధ మతాలకు చెందిన పవిత్ర గ్రంథాలను గాంధీ చదివారు. అలా 1891లో పట్టభద్రుడై తిరిగి భారతదేశానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు.. ఆయనను నాయకుడిగా తీర్చిదిద్దాయి. అప్పుడప్పుడే ఊపందుకుంటున్న స్వాతంత్ర ఉద్యమానికి గాంధీజీ తన నాయకత్వంతో కొత్త ఊపిరి ఇచ్చారు.

అలా ఉప్పు సత్యాగ్రహం, దండి మార్చ్, విదేశీ వస్తువుల బహిష్కరణ, సహాయ నిరాకరణోద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం.. వంటి వాటి ద్వారా మన దేశ స్వాతంత్రం కోసం గాంధీ శాంతియుతంగా పోరాడారు. మిగతా దేశనాయకులు, స్వాతంత్ర సమరయోధుల సహాయంతో.. బ్రిటిష్ వారిని మన దేశం నుంచి తరిమికొట్టి 1947, ఆగస్టు 15న మనం స్వాతంత్య్రం పొందడానికి మార్గాన్ని సుగమం చేశారు.

అనంతరం దేశంలో కుల, మత బేధాలేవీ లేకుండా శాంతియుతంగా జీవించాలని, సత్యాన్నే పలకాలని అందరికీ హితవు పలికారు. 1948, జనవరి 30న దిల్లీలోని బిర్లా నివాసం వద్ద ప్రార్థనా మందిరానికి గాంధీ వెళ్తున్న క్రమంలో.. నాథూరామ్ గాడ్సే అనే వ్యక్తి ఆయనను కాల్చి చంపాడు.

అలా స్వర్గస్తులైన గాంధీజీ తన జీవితకాలంలో సత్యం, సమయపాలన, ఆధ్యాత్మికత.. వంటి ఎన్నో విషయాల గురించి ఎన్నో మంచి మాటలు చెప్పారు. ఇవి భవిష్యత్తు తరాలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి, గాంధీ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని.. ఆ మహాత్ముడు పలికిన వాక్యాల్లో కొన్ని మంచి వాక్యాలనూ (Quotes) మనమూ ఓసారి స్మరించుకుందాం రండి..!

జీవితం గురించి గాంధీజీ చెప్పిన సూక్తులు

shutterstock

గాంధీ మహాత్ముడు మన జీవితానికి సంబంధించిన కొన్ని మంచి విషయాలతో పాటు, సేవాగుణాన్ని అలవరుచుకొని.. సత్యమార్గం దిశగా పయనించేందుకు దిశా నిర్దేశం చేస్తూ పలు సూక్తులు చెప్పారు. వాటిలో కొన్ని.

  1. నిరక్షరాస్యురాలైన తల్లి తన పిల్లల్ని నిండు హృదయంతో ప్రేమిస్తుంది
  2. జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడే.. మనం కొత్త విషయాలను నేర్చుకోగలుగుతాం
  3. ఎవరైనా మనకు ఇచ్చేది తాత్కాలికమైంది.. కష్టపడి మనం సంపాదించుకోనేది మాత్రమే శాశ్వతంగా మిగిలిపోతుంది
  4. ప్రపంచంలో ఏ మార్పునైతే నువ్వు కోరుకుంటావో.. దానికి నువ్వే నాంది పలకాలి
  5. పశుబలమే శక్తికి చిహ్నమయితే మగవాడే బలవంతుడు. అలాకాకుండా బలమన్నది నైతికము, మానసికమూ అయితే.. నిస్సందేహంగా మహిళలే శక్తిమంతులు
  6. అవమానాన్ని, క్రోధాన్ని ఎదుర్కోగల.. ఒకే ఒక ఆయుధం చిరునవ్వు
  7. మనం మన కోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి ఉంటుంది
  8. చదువులో ఆనందాన్ని పొందితే.. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటావు
  9. మరణానికి భయపడడం అంటే.. చిరిగిపోయిన వస్త్రాన్ని వదిలేందుకు భయపడడం
  10. నువ్వు ఎంత గొప్పగా జీవించావో నీ చేతలు చెప్పాలి.. ఎంత గొప్పగా మరణించావో పరులు చెప్పాలి
  11. ఒప్పుకున్న తప్పు చీపురులాజజ దుమ్మును చిమ్మి మనసును శుభ్రం చేస్తుంది
  12. ఈ ప్రపంచం మనిషి అవసరాలను తీర్చగలదు. కానీ కోర్కెలను తీర్చలేదు
  13. మానవత్వాన్ని మించింది ఈ లోకంలో లేదు. మానవత్వం ఒక సముద్రం వంటిది. అందులో రెండు చుక్కల మలినం కలిసినంత మాత్రాన.. సముద్రమంతా చెడిపోదు

పని గురించి గాంధీజీ చెప్పిన సూక్తులు

shutterstock

కేవలం జీవితం గురించి మాత్రమే కాదు.. గాంధీ మహాత్ముడు మనం చేసే పని ఎలాంటిదై ఉండాలి.. దానిని ఏ విధంగా చేయాలి.. వంటి విషయాల గురించి కూడా కొన్ని సూక్తులు చెప్పారు. వాటిలో కొన్ని..

15. ఇతరులు చేసిన ఏనుగంత తప్పును ఆవగింజంత చిన్నదిగా చూడు. నువ్వు చేసిన చిన్న తప్పును కూడా కొండంత తప్పుగా భావించు

16. డబ్బు ఉన్నప్పుడు ఎడాపెడా ఖర్చు చేయడం.. లేనప్పుడు ఇతరుల వద్ద చేతులు చాచడం వల్ల మన వ్యక్తిత్వం దెబ్బ తింటుంది

17. కష్టపడి పని చేయని వ్యక్తికి తిండి తినే హక్కు లేదు

18. మీరు రేపే చనిపోతారు అన్నట్లుగా బ్రతకండి.. శాశ్వతంగా జీవిస్తున్నట్లు తెలుసుకోండి

19. ఒక మనిషి గొప్పతనం అతని మెదడులో కాదు.. హృదయంలో ఉంటుంది

20. అసత్యంతో సాధించిన విజయం కంటే, సత్యంతో సాధించిన పరాజయమే మేలు

21. మొదట పట్టించుకోరు.. ఆ తర్వాత చూసి నవ్వుతారు. ఆపై యుద్ధానికి దిగుతారు. అంతిమంగా మీరే విజయం సాధిస్తారు

22. విశ్వాసం అనేది కొద్దిపాటి గాలికి వాలిపోయేది కాదు. అది అచంచలమైంది. హిమాలయాలంత స్థిరమైనది

23. సాధ్యమని తలిస్తే.. ఎంతటి పనైనా సులువుగా పూర్తవుతుంది

24. దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగు గోడలు కాదు.. పౌరుల నైతికాభివృద్ధి మాత్రమే నిజమైన అభివృద్ధి

25. గర్వం మనిషిని ఓటమి వైపు నడిపిస్తుంది

26. సత్యం ఒక్కటే జీవితాన్ని సన్మార్గంలో నడిపిస్తుంది

గాంధీజీ చెప్పిన ఆధ్యాత్మిక సూక్తులు

shutterstock

ఆధ్యాత్మికత అంటే ఏంటి? అది మనుషుల్లో ఎలా ఉండాలి.. అనే విషయాలను తన సూక్తుల ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు గాంధీ. అలాంటి కొన్ని సూక్తులు మీకోసం

27 సత్యం భగవంతుడి కన్నా గొప్పది

28. మనిషి గొప్పవాడు ఎప్పుడు అవుతాడండే.. సాటివారి సంక్షేమానికి తోడ్పడినప్పుడు మాత్రమే

29· ఇతరులకు సేవ చేసే మార్గమే.. నిన్ను నువ్వు కనుగొనడానికి ఉత్తమమైన మార్గం

30· బలహీనులు క్షమించలేరు. అది కేవలం బలవంతులకు మాత్రమే ఉండే లక్షణం

31· సహాయం చేస్తే మరచిపో.. సహాయం పొందితే గుర్తుంచుకో

32· మితిమీరిన ఓర్పు పిరికితనం అవుతుంది

33· బుద్ధి వికాసానికి అనువైన ప్రదేశం పల్లెసీమలే.. పట్టణాలు, నగరాలు కానే కావు

34· మనిషి శీల ప్రవర్తనను తీర్చిదిద్దలేని విద్య.. విలువ లేనిది

35· మహాత్మా గాంధీ కన్నా గొప్ప నాయకుడు పుట్టచ్చు. కానీ అహింస కన్నా గొప్ప సిద్ధాంతం పుట్టదు

36· మంచి పుస్తకం దగ్గరుంటే.. మనకు మంచి మిత్రులు లేని లోటు కనిపించదు

37· విద్యను దాచుకోవడం కన్నా.. అందరికీ పంచితే అది మరింత పెరుగుతుంది

38· ఎక్కువ తక్కువలు, కులమత భేదాలు ఉండడం మానవజాతికి అవమానకరం

39· మహా వృక్షం కూడా మౌనంగానే ఎదుగుతుంది. అలాగే మహానుభావులుగా మిగలాలంటే మాటలకంటే చేతలకు ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి

40· ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుంచి ఆశించడం.. ఈ రెండూ వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు పోయినట్లే

గాంధీ చెప్పిన ప్రేరణాత్మకమైన సూక్తులు

shutterstock

గాంధీజీ సత్యం, అహింస.. వంటి వాటి గురించి మాత్రమే కాదు.. భవిష్యత్తు తరాల్లో ప్రేరణను కలిగించే సూక్తులు కూడా కొన్ని చెప్పారు. వాటిలో కొన్నింటిని గురించి ఒకసారి మనం అవలోకనం చేసుకుందాం

41· పుస్తకం గొప్పతనం.. అందులో ఉండే విషయం మీద ఆధారపడదు. అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది

42· అందం అనేది నడవడికలో ఉంటుంది. ఆడంబరాలలో కాదు

43· వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోయినట్లే

44· మన ఆత్మగౌరవాన్ని మనమే కోల్పోవాలి తప్ప.. దాన్ని దిగజార్చే శక్తి ఎవరికీ ఉండదు

45· చదువుకోవడం వల్ల ప్రయోజనమేమిటంటే.. కేవలం  విజ్ఞానాన్ని పొందడం మాత్రమే కాదు.. వివేకాన్ని కూడా పొందవచ్చు

46· మేధావులు మాట్లాడతారు.. మూర్ఖులు వాదిస్తారు

47· స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ ఉంటుందో.. అందమైన జీవితం అక్కడే ఉంటుంది

48· సాధన లేకుండా విజయాన్ని కోరుకోవడం అంటే.. ఎండమావిలో నీటికై ఆశించడమే

49· అన్నదానం ఆకలిని తీర్చగలిగితే.. అక్షరదానం అజ్ఞానాన్ని తొలిగిస్తుంది

50· సంతృప్తి సాధనలో ఉండదు. ప్రయత్నంలో ఉంటుంది. అలాగే పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తే.. విజయం కూడా పూర్తి స్థాయిలోనే అందుతుంది

51· విద్యను దాచుకోవడం కన్నా.. పదిమందికి పంచితేనే అది మరింత పెరుగుతుంది

52· మనిషి బ్రతకడానికి పెద్ద ఖర్చులు అవసరం లేదు. కానీ ఎప్పుడైతే ఎదుటివారిలా బ్రతకాలని అనుకుంటాడో.. అప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. 

శాంతి గురించి.. గాంధీ చెప్పిన సూక్తులు

shutterstock

గాంధీజీ తన జీవితకాలంలో సత్యం, అహింసతో పాటు.. శాంతి గురించి కూడా ఎక్కువగా ప్రచారం చేశారు. స్వాతంత్య్ర పోరాటం నిమిత్తం.. ఆయన ఎంపిక చేసుకున్న మార్గం కూడా శాంతియుతమైందేనని మనందరికీ తెలుసు. అందుకే శాంతి గురించి కూడా గాంధీజీ చాలా సూక్తులు చెప్పారు. వాటిలో కొన్నింటిని చూద్దాం ..!

53· అహింస సర్వప్రాణులకు మాతృమూర్తి

54· మార్పుకు మనం సిద్ధంగా ఉన్నప్పుడే.. కొత్త ప్రపంచాన్ని చూడగలం

55· అహింస ఎదుట హింస వలె.. సత్యం ఎదుట అసత్యం శాంతించాలి

56· మన ఆత్మాభిమానం, గౌరవాల్ని వేరెవరో పరిరక్షించరు. మనకు మనమే వాటిని కాపాడుకోవాలి

57· పిల్లలు దేవుళ్లతో సమానం. వారితో అబద్ధాలు ఆడించకూడదు. వారికి చెడు పనులు చెప్పకూడదు

58· విద్యార్థుల ఆలోచనలు, ఆచరణలు క్రమశిక్షణాసహితంగా లేకుంటే.. వారి చదువంతా వృథా

59· నీతి అనే మొక్కను మతం అనే నీటితో తడిపినప్పుడు.. అది వృద్ధి చెందుతుంది. అంటే.. ఎవరైనా నీతినే ఒక మతంగా అవలంబించాల్సి ఉంటుంది

60· మనిషి ఆలోచనలు తయారు చేసే ఒక వస్తువు. ఎవరు ఏమి ఆలోచిస్తారో దానినే సాధిస్తారు

61· పొగిడినప్పుడు చిరునవ్వుతో స్వీకరించేవారు.. తిట్టినప్పుడు మౌనం వహించేవారు ఉత్తములు

62· వినడానికి కష్టంగా అనిపించినా.. నీ గురించి వాస్తవాలు చెప్పేవారి సలహానే తీసుకో. కేవలం నిన్ను స్తుతించేవారి మాటలు వినడం వల్ల నీలో ఎలాంటి మార్పులు రావు

63· క్రియాశూన్యమైన మాటలు వినసొంపుగా ఉన్నప్పటికీ.. అవి నిష్ప్రయోజనకరమనే తెలుసుకోండి

64· ఆత్మవంచన, పరనింద చేసేవారు.. తమ పతనాన్ని తాము కొనితెచ్చుకున్నట్లే

గాంధీ చెప్పిన పది మంచి సూత్రాలు

shutterstock

గాంధీజీ కేవలం సూక్తులు, కొటేషన్స్ మాత్రమే కాదు.. దేశభక్తితో చక్కని జీవితాన్ని కొనసాగించేందుకు మనం చేయకూడని కొన్ని పనులతో పాటు.. మనమంతా తప్పకుండా పాటించాల్సిన పది మంచి సూత్రాలను గురించి కూడా చెప్పారు. అవి..

1· విధి నిర్వహణకు మించిన దేశసేవ లేదు

2· వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోయినట్లే

3· దుర్బలులు ఎప్పటికీ క్షమించలేరు. క్షమ బలవంతుల సహజ లక్షణం

4· చెడుకు సహాయ నిరాకరణ చేయడం.. ప్రతి మనిషి పవిత్ర కర్తవ్యం.

5· నిరక్షరాస్యతను నిర్మూలించిన నాడే.. దేశం ప్రగతి పథంలో నడుస్తుంది.

6· నా దగ్గర ప్రేమ తప్ప మరో ఆయుధం లేదు. ప్రపంచంతో స్నేహం చేసుకోవడమే నా గమ్యం.

7· గెలవకపోవడం ఓటమి కాదు. మళ్లీ ప్రయత్నించకపోవడమే అసలైన ఓటమి.

8· దేశంలో మార్పు కోరుకుంటే మొదట అది నీ నుంచే ప్రారంభం కావాలి.

9· ఔన్నత్యం సంపద వల్ల రాదు.. సద్గుణాల వల్ల వస్తుంది.

10· సంపాదన ముఖ్యమే. కానీ డబ్బు ఒక్కటే మనకు సంతోషాన్ని ఇవ్వలేదు.

గాంధీజీ కొన్ని పనులు చేయకూడదని, వాటిని పాపాలుగా భావించాలని అందరికీ సూచించారు. ఇంతకీ ఆయన చెప్పిన ఆ భయంకరమైన పాపాలు ఏవంటే..

1· పని చేయకుండా లభించే ఆస్తులు

2· అంతరాత్మ ఒప్పుకోని విలాసాలు

3· వ్యక్తిత్వాన్ని ఇవ్వని జ్ఞానం

4· నైతిక విలువలు లోపించిన వ్యాపారం

5· మానవత్వానికి ప్రాముఖ్యత ఇవ్వని విజ్ఞానం

6· త్యాగం లేని మతం

7· సిద్ధాంతాలకు లోబడి ఉండలేని రాజకీయాలు

ఎన్ని మతాలున్నా అసలైన మతం మానవత్వం మాత్రమే.. అని చాటి చెప్పిన గాంధీజీ సూక్తులు  భవిష్యత్తు తరాలకు నిజంగానే స్ఫూర్తిదాయకం. వాటిని పాటిస్తూ.. అలాగే ముందు తరాల వారికి తెలియజేస్తూ.. ఆ జాతిపిత గొప్పదనాన్ని అందరికీ తెలియజేద్దాం. సత్యం, అహింసలతో కూడిన సన్మార్గంలో క్రమశిక్షణతో ముందుకు వెళ్దాం.

ఇవి కూడా చదవండి

“యువతా మేలుకో..” – అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా.. ఈ కొటేషన్లు మీకోసం..!

ఈ గుడ్ మార్నింగ్ మెసేజెస్‌తో.. రోజంతా మరింత ఉత్సాహంగా గడపండి..!

ఈ గుడ్ నైట్ మెసేజ్‌లతో.. మీ రోజును ఆనందంగా ముగించండి..!

Read More From Lifestyle