Bollywood

ముగింపు లేకుండా ‘సాగే’ కథ (మహేష్ బాబు ‘మహర్షి’ మూవీ రివ్యూ)

Sandeep Thatla  |  May 9, 2019
ముగింపు లేకుండా ‘సాగే’ కథ (మహేష్ బాబు ‘మహర్షి’ మూవీ రివ్యూ)

మహర్షి (Maharshi).. సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu) కెరీర్‌లో 25వ చిత్రం. టీజర్ విడుదలైన దగ్గర్నుంచి ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు ప్రీ- రిలీజ్ వేడుకల్లో మహేష్ బాబు మరియు దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) చెప్పిన మాటలతో ఈ అంచనాలు మరింత పెరిగిపోయాయి. మరి, ప్రేక్షకుల అంచనాలను ఈ చిత్రం చేరుకోగలిగిందా? మహేష్‌బాబు కెరీర్‌లో మరో మైలు రాయిగా నిలిచిందా?? తెలియాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే..

ఈ సినిమా కథలోకి వెళ్తే- రిషి కుమార్ (మహేష్ బాబు) చిన్నతనం నుండీ తన తండ్రి ఆర్థిక కష్టాలను చూస్తూ పెరుగుతాడు. ఆ కష్టాలని ఎదుర్కోలేని నిస్సహాయుడైన తండ్రిని చూసి.. తాను మాత్రం జీవితంలో అలా కాకూడదని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో వైఫల్యం అన్నదే లేకుండా విజయాన్ని చూడాలని భావిస్తాడు. ఆ స్థాయిలో కష్టపడతాడు. ఆఖరికి అమెరికాలోని ఓ బహుళజాతి సంస్థకు చిన్న వయసులోనే సీఈఓ అవుతాడు. దాంతో అందరి చూపు రిషిపైనే పడుతుంది. కథ ఇలా సాగుతుండగానే.. రిషి జీవితంలో జరిగిన ఒక సంఘటన కథను మలుపు తిప్పుతుంది. తను తిరిగి ఇండియాకు రావాల్సిన పరిస్థితిని కల్పిస్తుంది.

మరి, అమెరికాలో ఉన్న రిషి ఇండియా రావడానికి గల ఆ కారణం ఏంటి? ఇండియాకు వచ్చిన తర్వాత రిషి తన ముందున్న లక్ష్యాలను ఏ విధంగా చేరుకున్నాడు? అసలు తన జీవితాన్ని మలుపు తిప్పిన కథ ఏంటి?? మొదలైన ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మాత్రం వెండితెరపై ఈ సినిమాను చూడాల్సిందే..

ఈ చిత్రంలో మహేష్ బాబు పాత్ర మూడు కోణాల్లో మనకు కనిపిస్తుంది. ఒక కాలేజ్ కుర్రాడిగా, ఓ బహుళజాతి సంస్థ సీఈఓగా కనిపిస్తూనే.. ద్వితీయార్థంలో మరో కొత్త పంథాలో ఆ పాత్ర తీరుతెన్నులు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఆయన విజయం సాధించారు. ఈ మూడు పాత్రల్లోనూ.. మహేష్ బాబు తన మార్క్ నటనను కనబరిచినప్పటికీ.. సినిమాలో రిషి కాలేజీ లైఫ్‌కి సంబంధించిన ఎపిసోడ్‌కి మంచి స్పందన వచ్చింది. వెండితెరపై మోస్ట్ గ్లామరస్ నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రిన్స్ మహేష్ బాబు.. కాలేజ్ విద్యార్థిగా మరోసారి వెండితెరపై తనదైన శైలిలో నటించి ఆకట్టుకున్నాడు.

 

అలాగే ఈ చిత్రంలో మహేష్ బాబుకి స్నేహితులుగా నటించిన పూజాహెగ్డే (Pooja Hegde) & అల్లరి నరేష్ (Allari Naresh) పాత్రలు కూడా కథకు కీలకమనే చెప్పాలి. అల్లరి నరేష్ ఈ చిత్రంలో రవి అనే పాత్ర పోషించారు. అలాగే ప్రకాష్ రాజ్ పాత్ర కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. నిడివి తక్కువే అయినప్పటికీ రిషి పాత్రపై ఎక్కువగా ప్రభావం చూపే పాత్ర అది. వీరితో పాటు జయసుధ, జగపతిబాబు, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, రావు రమేష్, కమల్ కామరాజు.. తదితరులు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. తమ పాత్రల పరిధి మేరకు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

ఈ సినిమాకు కథ, కథనం, మాటలు అందించడంతో పాటు.. దర్శకత్వ బాధ్యతలు వహించిన వంశీ పైడిపల్లి చాలా వరకు సఫలమయ్యారనే చెప్పచ్చు. ఈ చిత్రం ద్వారా మన దేశంలో రైతులు పడే కష్టాలను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అంతేకాదు.. ఆ జఠిలమైన సమస్యకు.. ఓ మంచి పరిష్కారాన్ని చూపేందుకు కూడా యత్నించారు.

ఇలాంటి ఓ కథాంశానికి మహేష్ బాబు లాంటి ఓ స్టార్ హీరోని ఎంచుకోవాలనుకోవడం సినిమాకు ప్లస్ పాయింట్.  అయితే దర్శకుడు తనదైన శైలిలో కథను తెరపై చెప్పే క్రమంలో కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. అందుకే కొన్ని సీన్లు సాగతీతగా అనిపించవచ్చు. ఈ కారణంగానే ప్రథమార్థంలో వచ్చే కాలేజ్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగానే అలరించినా.. ద్వితీయార్థంలో వచ్చే ప్రధాన సన్నివేశాలలో ఏదో తెలియని వెలితి కనిపిస్తుంది.

దీంతో పాటు ఈ సినిమా నిడివి కూడా కాస్త ఎక్కువగానే ఉంది. దాదాపు మూడు గంటల చిత్రం కావడంతో సహజంగానే సగటు ప్రేక్షకుడు సినిమా చూసే క్రమంలో కాస్త బోర్ ఫీలయ్యే అవకాశం ఉంటుంది. కథపరంగా కాస్త కుదించుకునే అవకాశం ఉన్నప్పటికీ చిత్ర యూనిట్ ఆ దిశగా అసలు ప్రయత్నించలేదు. ఫలితంగా ఇది కూడా ఈ చిత్ర ఫలితాన్ని ప్రభావితం చేసే అంశంగా మారింది.

 

అలాగే ఈ సినిమా సాంకేతికవర్గం పనితీరు గురించి మాట్లాడుకుంటే- ఛాయాగ్రాహకుడిగా మోహనన్ (Mohanan) వర్క్ అద్భుతమనే చెప్పాలి. ఆయన అందించిన విజువల్స్ ఈ చిత్రానికి గ్రాండ్ లుక్‌ని తీసుకొచ్చాయి. అలాగే దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) అందించిన పాటల్లో “ఇదే కదా.. ఇదే కదా.. నీ కథ” అంటూ సాగే పాట ఇప్పటికే హిట్ అవ్వగా.. మిగిలిన పాటలు కూడా ఫర్వాలేదనిపించాయి. ఇక నేపధ్య సంగీతం కూడా సినిమాకి తగ్గట్లుగా ఉంది.

నిర్మాణ విలువల పరంగా కూడా ఈ సినిమా భారీ స్థాయిలోనే ఉందని చెప్పచ్చు. తెలుగు సినీ పరిశ్రమలోనే మూడు పెద్ద నిర్మాణ సంస్థలైన వైజయంతి మూవీస్ (Vyjayanthi Movies), శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (Sri Venkateswara Creations), పీవీపీ సినిమాస్(PVP Cinemas) సంయుక్తంగా ‘మహర్షి’ చిత్రాన్ని నిర్మించాయి.

ఈ సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే- ‘రైతుపై చూపించాల్సింది సానుభూతి కాదు.. ఇవ్వాల్సింది మర్యాద’ అనే పాయింట్‌ని ఈ చిత్రం ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు.

‘మహర్షి’ ట్రైలర్‌లో చెప్పిన్నట్లు.. ఈ చిత్రాన్ని చూస్తుంటే.. ఫుల్ స్టాప్ లేకుండా కామాలతో సాగిపోయే సినిమా అన్న భావన కలిగింది.

ఇవి కూడా చదవండి

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మహర్షి’.. ట్రైలర్ టాక్ ప్రత్యేకతలివే..!

మహేష్ బాబు vs అక్కినేని అఖిల్.. ఈ ఇద్దరిలో రష్మిక ఓటు ఎవరికి?

‘జెర్సీ’ తో నానీ సిక్స్ (సక్సెస్) కొట్టాడా లేదా? – మూవీ రివ్యూ

Read More From Bollywood