
జ్యోతిక (Jyothika).. చంద్రముఖి, మాస్, షాక్, నువ్వు నేను ప్రేమ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసులను ఆకట్టుకున్న నటి. తమిళంలో పెద్ద కథానాయికగా పేరు తెచ్చుకున్న జ్యోతిక తెలుగులో కొన్ని చిత్రాల్లోనే నటించినా.. ప్రేక్షకుల మనసులను ఆకట్టుకుంది. సూర్య, జ్యోతిక జంటను ఇష్టపడని వ్యక్తులు ఉండరంటే అతిశయోక్తి కాదు.. 2015లో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎక్కువగా కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటిస్తూ వస్తోంది జ్యోతిక. అలా ఈ ఏడాది ఆమె నటించిన సినిమా ‘రాక్షసి’ (raatchasi)
ఓ గ్రామానికి కొత్త హెడ్ మిస్ట్రెస్‌గా వచ్చిన గీతా రాణి (జ్యోతిక) అక్కడి పరిస్థితులను చూసి ఆశ్చర్యపోతుంది. అక్కడి విద్యార్థులు టీచర్ల మాట వినకపోవడం, ఖాళీగా కూర్చోవడం చూసిన ఆమె.. ఆ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలనుకుంటుంది. ముందు తల్లిదండ్రుల్లో మార్పు తీసుకొచ్చి.. ఆపై విద్యార్థుల్లో మార్పు తెస్తుంది. ఈ క్రమంలో ప్రైవేట్ స్కూళ్లకు పోటీగా తన స్కూల్‌ని నిలిపిన ఆమెకు కొందరు శత్రువులు కూడా తయారవుతారు. మరి, గీత వారిని ఎలా గెలిచి తాను అనుకున్న మార్పులను స్కూల్లో తీసుకొచ్చిందన్నదే ఈ రాక్షసి సినిమా కథ. గౌతమ్ రాజ్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రం జులైలో విడుదలై అందరినీ ఆకట్టుకుంది.
తాజాగా ఈ చిత్రం మరోసారి వార్తల్లోకెక్కింది. దీనికి ఓ పెద్ద కారణమే ఉంది. మలేషియన్ విద్యాశాఖ మంత్రి మాజ్లీ బిన్ మాలిక్ చేసిన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ దీనికి కారణం. తాను రాక్షసి సినిమా చూశానని.. ఆ సినిమా కథ తనను ఎంతో ఆకట్టుకుందని చెప్పిన ఆయన.. ఈ సినిమాను అందరూ తప్పక చూడాలని కూడా చెప్పారు. ఆయన తన పోస్ట్‌లో భాగంగా..
“రెండు నెలల క్రితం ఈ సినిమా విడుదలైంది. గత రాత్రి నేను ఈ సినిమాను మా ఆఫీసర్లతో కలిసి చూశాను. అది చూడగానే దాని గురించి నా అభిప్రాయాన్ని వెల్లడించాలని అనిపించింది. ఈ సినిమా కథ చాలా బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగుంది. ఈ సినిమా అందరూ చూడదగినది.
ఓ విద్యాశాఖ మంత్రిగా ఈ సినిమాను చూడడం విభిన్నమైన అనుభూతిని కలిగించింది. ఈ సినిమాలోని ప్రతి సీన్ మా దేశంలోని పరిస్థితులను చూపినట్లుగానే అనిపించింది. గీతారాణి ఓ సూపర్ హీరోలా ఆ పరిస్థితులన్నింటినీ మార్చింది. వ్యవస్థలో పెద్ద పెద్ద మార్పులు చేయడం అంత కష్టమేమీ కాదని ఈ సినిమా చాటిచెబుతుంది.
మేం సాధించాలని భావిస్తున్న ఎన్నో మార్పులను ఈ సినిమా చేసి చూపించింది. ఉదాహరణకు పీఎస్‌పీ ఇనిషియేటివ్ (ఉచిత బ్రేక్ ఫాస్ట్). ఈ సినిమా కేవలం ఆహారం విషయంలోనే కాదు.. చాలా విషయాల్లో నా ఆశలకు, ఆశయాలకు అద్దం పట్టింది. నేను కూడా టీచర్లు పిల్లలతో పాటు కూర్చొని తినే పద్ధతిని సపోర్ట్ చేస్తాను. స్టూడెంట్ల డ్రాపవుట్లను తగ్గించడానికి.. గీత పోలీసుల సాయం కూడా తీసుకుంటుంది. మేం కూడా దాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నాం.
పిల్లల తల్లిదండ్రులందరినీ కలిసి పేరెంట్స్ కమ్యూనిటీ అసోసియేషన్ ఏర్పాటు చేసేలా చేస్తుంది గీత. వారిని కూడా చదువులో భాగస్వాములను చేస్తుంది. పిల్లల చదువు అందరి సమష్టి బాధ్యతగా ఉండాలనేది ఎప్పటినుంచో నాకున్న కోరిక. ఇలాంటి లోకల్ కమ్యునిటీల వల్లనే చదువులు బాగుపడతాయనేది నా భావన కూడా. మన జీవితాలను మెరుగుపర్చేందుకు ఎన్నో సలహాలు ఇందులో ఉన్నాయి. అందుకే తల్లిదండ్రులు, పిల్లలు, టీచర్లు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను వీలైనంత తొందరగా చూడండి..” అంటూ ఆయన పోస్ట్ చేశారు.
ఈ సినిమా వసూళ్ల పరంగా పెద్దగా ప్రభావం చూపించకపోయినా, విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో యావరేజ్‌గా నిలిచింది. సినిమా మొత్తం సమస్యలను చూపిస్తూ.. వాటిని కేవలం మాటలతోనే పరిష్కరించే విధానం నచ్చలేదని చాలామంది రివ్యూల్లో వెల్లడించడం విశేషం. అంతేకాదు.. సినిమాలో విలన్ పాత్ర కూడా బలంగా లేదని రివ్యూలు వెళ్లడించాయి. కానీ ఓ విద్యాశాఖా మంత్రే ఈ సినిమాని.. అందులోని పద్ధతులను మెచ్చుకొని.. వాటిని తాము పాటించే ప్రయత్నం చేస్తాము అన్నారంటే.. ఈ సినిమా వ్యవస్థలో ఎన్ని మార్పులు తీసుకొస్తుందో ఆలోచించాల్సిందే.
1998లో జ్యోతిక “డోలీ సజా కే రఖ్ నా” అనే హిందీ చిత్రంలో అక్షయ్ ఖన్నా సరసన నటించింది. 1999లో వాలి చిత్రంతో తమిళ తెరకు పరిచయమైంది. ఈ సినిమాకు ఆమె బెస్ట్ డెబ్యూగా ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా సాధించడం విశేషం. అప్పటి నుంచి 2009 వరకూ సినిమాల్లో నటించింది జ్యోతిక. ఏడు సినిమాల్లో సూర్య సరసన నటించిన జ్యోతిక 2006లో అతడినే పెళ్లాడింది. కూతురు దియా పుట్టిన తర్వాత.. అప్పుడప్పుడూ సినిమాల్లో కనిపించినా.. దేవ్ పుట్టిన తర్వాత తన కెరీర్‌కి బ్రేక్ ఇచ్చింది జ్యోతిక.
2009లో తన కెరీర్‌లో గ్యాప్ తీసుకున్న ఆమె.. తిరిగి 2015లో 36 వయదినిలే.. చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ఆపై మరో రెండు సంవత్సరాల గ్యాప్ ఇచ్చినా.. 2018 నుంచి వరుస సినిమాల్లో నటిస్తూ వస్తోందీ అందాల రాశి. తాజాగా ఈ ఏడాది ఆమె నటించిన రాక్షసి, జాక్ పాట్ చిత్రాలు విడుదలై మంచి పేరు సాధించాయి. ప్రస్తుతం మరో రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది జ్యోతిక.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.
Read More From Celebrity gossip
మనసు లోతుల్లో మర్చిపోలేని ప్రేమకు నిదర్శనం ‘జాను’.. ఫస్ట్ లుక్ ఎలా ఉందంటే..
Soujanya Gangam
15 ఏళ్లుగా అదే సొగసు.. అదే పొగరు : ‘లేడీ సూపర్ స్టార్’ విజయశాంతిపై ‘మెగాస్టార్’ ప్రశంసలు
Babu Koilada