Lifestyle

ప్రేమలో గాయపడ్డ మనసులకు… సాంత్వన కలిగించే సినిమాలివే..!

Soujanya Gangam  |  Feb 18, 2019
ప్రేమలో గాయపడ్డ మనసులకు… సాంత్వన కలిగించే సినిమాలివే..!

మీరు తాజాగా మీ ప్రేయసి లేదా ప్రేమికుడితో బ్రేక‌ప్ (Breakup) అయితే ఆ బాధ‌ను మ‌ర్చిపోవ‌డం ఎంత ఇబ్బందో మీకు తెలియంది కాదు. మ‌న మ‌న‌సును ముక్క‌లు చేసిన ఆ వ్యక్తి గురించి పూర్తిగా మ‌ర్చిపోవాల‌నుకుంటాం. కానీ ప్ర‌తి విష‌యం వారినే గుర్తుచేస్తుంది. ఇలాంటి స‌మ‌యంలో సోఫాలో కూర్చొని టీవీలో మ‌న‌కు న‌చ్చిన సినిమాలు(Movies) చూస్తూ కాసేపు వేరే ప్ర‌పంచంలోకి వెళ్లిపోవ‌డం, మనసుకు సాంత్వన కలిగిలే చేసుకోవడం.. ఈ ప‌రిస్థితికి చాలామంది మందులా ప‌నిచేస్తుంది. ఇవి మ‌న‌ల్ని అస‌లు విష‌యం నుంచి వేరే వైపుకి మ‌ర‌ల్చ‌డంతో.. పాటు బ్రేక‌ప్ అయినా స‌రే.. జీవితం మ‌ళ్లీ ఆనందంగా మారుతుంద‌న్న ఆశ‌ను మ‌న‌లో నింపుతాయి.

ఇప్పుడు మ‌న జీవితంలో బాధ ఉన్నా.. కొన్నాళ్ల‌కు అంతా బాగైపోతుంద‌న్న న‌మ్మ‌కాన్ని మ‌న‌లో నిండేలా చేస్తాయి చిత్రాలు. అదేదో సినిమాలో చెప్పిన‌ట్లు ఆఖ‌రికి అంతా బాగైపోతుంది. ఒక‌వేళ ఇంకా బాగైపోలేదంటే ఇంకా మ‌న క‌థ ఆఖ‌రికి రాలేదు అని అర్థం. మ‌రికెందుకాల‌స్యం? పాప్‌కార్న్ కొనుక్కొని, సినిమాల డీవీడీల‌ను తెచ్చుకొని.. సోఫాలో సౌక‌ర్యంగా కూర్చొని ఈ సినిమాల‌ను చూసేయండి.

మీ క‌న్నీళ్ల‌ను తుడుచుకొని న‌వ్వేందుకు సిద్ధం కండి. ప్ర‌త్యేకంగా మీ ప‌గిలిన హృద‌యాన్ని బాగుచేసేందుకు వీల‌య్యే సినిమాల లిస్టుని మీకోసం అందిస్తున్నాం. ఇవి చూసి ఇలాంటి ప‌రిస్థితిలో ఉన్న‌వారు మీరొక్క‌రే కాద‌ని గుర్తుచేసుకోండి. మీ జీవితం కూడా కొన్నాళ్ల‌కు తిరిగి బాగైపోతుంద‌ని న‌మ్మండి.

రాజా రాణి

మ‌నం ప్రేమించిన వారు మ‌న‌ల్ని వ‌దిలిపోయార‌ని మ‌న‌మూ పోన‌క్క‌ర్లేదు. ఎప్ప‌టికైనా మ‌న జీవితం మ‌నం అనుకున్న‌ట్లుగా మారుతుంది. ఇదే ట్యాగ్‌లైన్‌లోనే క‌థ‌నంతా మూట‌గ‌ట్టి చెప్పిన చిత్రం ఇది. అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఆర్య‌, న‌య‌న తార‌, నాజ్రియాప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌నిపించారు. చ‌నిపోయిన త‌న ప్రేయ‌సిని మ‌ర్చిపోలేని అబ్బాయి.. త‌న‌ని వ‌దిలివెళ్లిపోయిన త‌న ప్రియుడి జ్ఞాప‌కాల్లో ఉన్న అమ్మాయి పెళ్లి చేసుకొని.. తమ మధ్య ఏర్పడిన అగాధాన్ని సైతం అధిగమించి.. జీవితాన్ని ఎలా కొన‌సాగించార‌న్న‌ది ఈ చిత్ర కథ. హృద‌యాన్ని క‌దిలించే సినిమా ఇది.

ఆర్ ఎక్స్ 100

వాస్త‌వానికి చాలా దగ్గ‌ర‌గా ఉండే చిత్రం ఇది. ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్‌లో నిజంగా ప్రేమించేవారు ఎక్కువ‌గా మోస‌పోతుంటారు. ఇలాంటి క‌థే ఈ ఆర్ ఎక్స్ 100. ప‌ల్లెటూరి అబ్బాయి శివ‌ను.. సిటీ నుంచి వ‌చ్చిన అమ్మాయి ఇందు ప్రేమించి.. త‌నని కూడా ప్రేమించేలా చేస్తుంది. కానీ ఆ త‌ర్వాత వ‌దిలేసి వెళ్తుంది. ఈ క్రమంలో అస‌లు ఇందుది ప్రేమే కాద‌ని తెలుసుకుంటాడు శివ‌. జీవితంలో నిజ‌మైన ప్రేమ‌కు అర్థం తెలుసుకోవాల‌ని చెప్పే ఈ సినిమా మొద‌టి భాగం ఎంతో రొమాంటిక్‌గా ఉంటే.. రెండో భాగం మాత్రం గుండెను మెలిపెట్టేలా ఉంటుంది.

ఆర్య‌

ఒక వ్య‌క్తిని ప్రేమిస్తే వారి సంతోషాన్ని కోరుకోవాలి. అలాంటి వ్య‌క్తే ఆర్య‌. తాను ప్రేమించిన అమ్మాయి వేరే వాళ్ల‌ను ఇష్ట‌పడుతుంద‌ని తెలిసి.. వారికే తనని ఇచ్చి పెళ్లి చేయాల‌నుకునే వ్య‌క్తి ఆర్య‌. నిజ‌మైన ప్రేమలో స్వార్థం ఉండ‌ద‌ని చెబుతుందీ సినిమా. అల్లు అర్జున్ హీరోగా న‌టించిన ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన ఈ సినిమా బ్రేక‌ప్ బాధ‌ను త‌గ్గించి నిజ‌మైన ప్రేమ‌పై నమ్మ‌కాన్ని పెంచుతుంది.

నిన్ను కోరి

నిజ‌మైన ప్రేమంటే ప్రేమించిన వాళ్లు మ‌న జీవితంలో ఉన్నా.. లేక‌పోయినా వారిని ప్రేమించడం.. వారి మంచిని కోరుకోవ‌డం. ఎదుటివాళ్లు మ‌న‌ల్ని మ‌ర్చిపోయి మ‌రో కొత్త జీవితాన్ని ప్రారంభించిన‌ప్పుడు.. వారిని ఇబ్బంది పెట్ట‌కుండా మ‌నం కూడా జీవితంలో ఆనందాన్ని వెతుక్కునే ప్ర‌య‌త్నం చేయాలి అని చెబుతుందీ క‌థ‌.

తాను ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకున్నా.. ఆమెను మ‌ర్చిపోలేని ఓ అబ్బాయి త‌న జీవితంలోకి తిరిగి వెళ్లాలని భావిస్తాడు. కానీ చివరకు తానే కన్విన్స్ అయ్యి.. ఆమెకు త‌న భ‌ర్తే స‌రైనవాడ‌ని చెప్పి కొత్త జీవితాన్ని ప్రారంభించ‌డం ఈ సినిమా క‌థ‌. బ్రేక‌ప్‌కి సంబంధించిన బాధ‌ను మ‌ర్చిపోయేందుకు ఈ చిత్రం బాగా తోడ్పడుతుంది.

ప్రేమ‌మ్‌

జీవితంలో ఒక‌సారి మ‌నం ప్రేమించిన వాళ్లు.. మ‌న‌ల్ని వ‌దిలి వెళ్లిపోయినంత మాత్రాన జీవితం అక్క‌డితో ఆగిపోద‌ని చెప్పే మ‌రో చ‌క్క‌టి సినిమా ఇది. మ‌ల‌యాళ సినిమా ప్రేమ‌మ్‌కి రీమేక్‌గా విడుద‌లైన ఈ సినిమాలో నాగ‌చైత‌న్య‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, శృతీ హాస‌న్‌, మ‌డోన్నా సెబాస్టియ‌న్‌లు ప్ర‌ధాన పాత్ర‌లలో కనిపిస్తారు. చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన ఈ సినిమా ఒక అబ్బాయి జీవితంలోని మూడు ప్రేమ‌ల‌ను చూపుతుంది. ఒక‌సారి బ్రేక‌ప్ అయినా.. కొన్నాళ్ల‌కు తిరిగి అంతా మామూలైపోతుంద‌ని.. మ‌ళ్లీ వేరే మ‌నిషితో ప్రేమ‌లో ప‌డే అవ‌కాశం కూడా ఉంటుంద‌ని చూపుతుందీ సినిమా.

ఏం మాయ చేశావే

ఒకరిని ప్రాణంగా ప్రేమించాక.. వారు దూర‌మ‌వుతున్నారంటే ఎంతో బాధ క‌లుగుతుంది. కానీ జీవితంలో ఏది ఎప్పుడు జ‌రుగుతుందో ఎవ‌రికీ తెలీదు. మ‌న ప్రేమ‌లో నిజాయ‌తీ ఉంటే అది ఎప్ప‌టికైనా గెలుస్తుంద‌నే న‌మ్మ‌కాన్ని క‌లిగిస్తుందీ సినిమా. పెద్ద‌లు ఒప్పుకోక‌పోవ‌డం వ‌ల్ల కార్తీక్, జెస్సీలు విడిపోయినా.. తిరిగి కొన్నేళ్ల త‌ర్వాత వాళ్లు మ‌ళ్లీ కలిసి పెళ్లి చేస‌కుంటారు. బ్రేక‌ప్ కెరీర్‌లో ఎదిగేందుకు అడ్డంకి కాద‌ని కూడా కార్తీక్‌, జెస్సీల క‌థ తెలియ‌జేస్తుంది. మ‌న‌సును మైమ‌రిపించే ఈ ల‌వ్‌స్టోరీ మిమ్మ‌ల్ని మ‌రో ప్ర‌పంచంలోకి తీసుకెళ్తుంది.

మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌

తానే ప్ర‌పంచం అనుకొని త‌న‌కోసం అన్నీ వదులుకున్న అమ్మాయిని కాద‌నుకొని వెళ్లిపోతాడో అబ్బాయి. అయినా గుండె నిబ్బ‌రంతో ఆ బ్రేక‌ప్‌ని కూడా త‌ట్టుకుంటుందా అమ్మాయి. కానీ త‌న ఎంపిక స‌రికాద‌ని.. త‌న‌కు ఆ అమ్మాయే స‌రైన‌ద‌ని తెలుసుకొని తిరిగొస్తాడా అబ్బాయి. మ‌నం మ‌న‌స్ఫూర్తిగా ప్రేమిస్తే చాలు.. ఎదుటివారు మ‌న‌ల్ని కాద‌న్నందుకు ఏదో ఒక స‌మ‌యంలో త‌ప్ప‌క బాధ‌ప‌డ‌తార‌ని ఈ సినిమా నిరూపిస్తుంది. ద‌శ‌ర‌థ్ ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన ఈ సినిమాలో ప్ర‌భాస్‌, కాజ‌ల్‌, తాప్సీలు ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించారు.

నా ఆటోగ్రాఫ్‌

ఒక అబ్బాయి జీవితంలో బ్రేక‌ప్ అయిన ప్రేమల గురించి చెప్పే సినిమా ఇది. ప్రేమ మ‌న మ‌న‌సులో ఉంటే చాలు.. ఎదుటివారు మ‌న జీవితంలో లేక‌పోయినా.. వారికంటే మంచి వ్య‌క్తులు మ‌న జీవితంలోకి ప్ర‌వేశిస్తార‌ని చెప్పే క‌థ ఇది. చాలామంది జీవితానికి ద‌గ్గ‌ర‌గా ఉండే ఈ క‌థ‌ను చూస్తే.. జీవితం ప‌ట్ల మ‌రింత ఆస‌క్తితో పాటు భ‌విష్య‌త్తు ప‌ట్ల న‌మ్మ‌కం కూడా పెరుగుతుంది. ఈ బ్రేక‌ప్ ఇప్పుడు ఇబ్బందిపెడుతోందే కానీ.. కొన్నాళ్లు పోతే ఏమాత్రం బాధ‌నిపించ‌ద‌ని ఈ సినిమా ద్వారా తెలుసుకోవ‌చ్చు.

ఆరెంజ్‌

స‌ముద్ర‌మంత ప్రేమ కావాల‌నుకుంటే.. ఒక్క‌రినే జీవితాంతం ప్రేమించాలి. కానీ న‌లుగురైదుగురిని కాద‌ని చెబుతుందీ చిత్రం. ప్రేమ‌లో బ్రేక‌ప్ అయినా జీవితం ముందుకు సాగుతుంద‌ని.. మ‌ళ్లీ వేరే వ్య‌క్తులు మ‌న జీవితంలోకి ప్ర‌వేశించి తిరిగి దాన్ని ఆనంద‌మ‌యం చేస్తార‌ని చెప్పే ఈ చిత్రానికి భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రామ్‌చ‌ర‌ణ్‌, జెనీలియా, షాజాన్ ప‌ద‌మ్‌సీల న‌ట‌న మీకు కాసేపు న‌వ్వు తెప్పిస్తే మ‌రికాసేపు ఏడుపు తెప్పిస్తుంది.

వాన‌

ప్రేమించిన వ్య‌క్తిని వ‌ద‌ల‌డం అంటే అది ఎంతో బాధ‌తో కూడుకున్న పని. అది వారి త‌ల్లిదండ్రుల కోసం వ‌దిలేయడం మ‌రింత బాధ‌. తాను ప్రేమించిన అమ్మాయి పెళ్లికే వెళ్లిన అబ్బాయికి ఆ అమ్మాయి కూడా త‌న‌ని ప్రేమిస్తుంద‌ని తెలిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో చెప్ప‌లేం. కానీ త‌న త‌ల్లిదండ్రుల కోరిక మేర‌కు ఆ అమ్మాయిని వ‌దిలేయాల్సి వ‌స్తే ఎంత బాధ‌గా ఉంటుందో మాటల్లో చెప్ప‌లేం. అలాంటి ఆనందాన్ని, బాధ‌ను నింపుకున్న సినిమా ఇది. బ్రేక‌ప్ బాధ నుంచి మీరు బ‌య‌ట‌ప‌డేందుకు గుండెనిండా ఏడ్చి.. ఆ మ‌నిషిని మ‌ర్చిపోయేందుకు ఈ చిత్రం త‌గిన ఎంపిక‌.

సుస్వాగ‌తం

ఈ కాలంలో ఒక‌టీ రెండు నెల‌లు ప్ర‌య‌త్నించిన అమ్మాయి ప్రేమించక‌పోతేనే వాళ్ల‌ను వ‌దిలి వేరేవాళ్ల కోసం తిరిగే అబ్బాయిలున్న రోజులివి. అలాంటిది నాలుగు సంవ‌త్స‌రాలు తిరిగినా అమ్మాయి ప్రేమించక‌పోతే ఆ అబ్బాయి బాధ ఎలా ఉంటుందో చెప్ప‌న‌వ‌స‌రం లేదు. గుండెను పిండే స‌న్నివేశాలున్న ఈ సినిమాని బ్రేక‌ప్ త‌ర్వాత చూస్తే.. మన మనసు చాలా తేలికపడుతుంది. 

ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే

మ‌నం ప్రేమించిన వాళ్లు మ‌న క‌ళ్ల‌ముందు లేకుండా ఉంటే వారిని మ‌ర్చిపోవ‌డం కాస్త సులువే కావ‌చ్చు. కానీ క‌ళ్ల‌ముందే క‌ద‌లాడుతున్న వ్య‌క్తిని మ‌ర్చిపోవాలంటే కాస్త క‌ష్ట‌మే.. అంత క‌ష్టాన్ని భ‌రించి మ‌ర్చిపోతే.. తిరిగి ఆ అమ్మాయి త‌న‌ని ప్రేమిస్తుంద‌ని తెలిసి కుటుంబం కోసం మ‌రోసారి వ‌దులుకుంటాడు ఈ సినిమాలో హీరో. అయితేనేం.. త‌న క‌ష్టం ఏమాత్రం వృథా కాదు. ఆ త‌ర్వాత ఆ అందాల రాశితోనే త‌న పెళ్ల‌వుతుంది. జీవితంలో కాస్త ఓపిక‌తో ఉంటే చాలు.. ఆఖ‌రికి అంతా బాగైపోతుంద‌ని చెబుతుందీ చిత్రం.

మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు

ప్రేమంటే కేవ‌లం ఒక‌టీ రెండు నెల‌లో.. సంవ‌త్స‌రాలో ఉండేది కాదు. ఒక‌రిని మ‌నస్ఫూర్తిగా ప్రేమిస్తే జీవితాంతం ఆ వ్య‌క్తి మ‌న‌కు గుర్తుంటాడ‌ని చాటే ఈ సినిమా.. మ‌న‌సు నిర్మ‌ల‌మైన‌దైతే అనుకున్న‌ది ఏ రోజుకైనా సాధ్య‌మ‌వుతుందనే విషయాన్ని తెలుపుతుంది. క‌ల‌వాల‌ని రాసి ఉంటే ఏ రోజుకైనా ఇద్ద‌రు క‌లుస్తారనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా తెలుసుకోవ‌చ్చు. నిజ‌మైన ప్రేమ‌కు అర్థం చెప్పే ఈ సినిమా చూస్తే మీ భ‌విష్య‌త్తుపై మీకో అవ‌గాహ‌న కూడా ఏర్ప‌డుతుంది.

ఫ‌ర్‌గెట్టింగ్ సారా మార్ష‌ల్‌

నైబ‌ర్స్ ఫ్రాంఛైస్ వంటి సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన నికొల‌స్ స్టోల‌ర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా విభిన్న‌మైన ఎమోష‌న్స్‌ని పండిస్తుంది. త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ సారా మార్ష‌ల్ (క్రిస్టెన్ బెల్‌) త‌న‌ను వ‌దిలేసిన త‌ర్వాత పీట‌ర్ (జేస‌న్ సేగ‌ల్‌) జీవితంలో ముందుకెళ్లాల‌నే కోరిక‌తో హ‌వాయికి వెళ్తాడు. కానీ త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ కూడా కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో పాటు అదే హోట‌ల్లో దిగింద‌ని తెలిసి ఆశ్చ‌ర్య‌పోతాడు. క‌డుపుబ్బా న‌వ్వించే కామెడీతో నిండిన ఈ సినిమా మిమ్మ‌ల్ని బ్రేక‌ప్ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డేసేందుకు సాయం చేస్తుంది.

ఎ వాక్ టు రిమెంబ‌ర్

“దిస్ ఈజ్ అజ్” సినిమా తార మాండీ మూరే త‌న జీవితంలోనే అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చిన చిత్రం ఇది. ప్రేమ‌లో ప‌డి దానిలోని ఆనందాన్ని అనుభ‌వించాల‌నుకునే ఓ టీనేజ‌ర్ ప్రేమ‌లో ప‌డే స‌మ‌యానికి జీవితం మరో ర‌కంగా మ‌లుపు తిరుగుతుంది. పాపుల‌ర్ ర‌చ‌యిత నికోల‌స్ స్పార్క్స్ రాసిన “ఎ వాక్ టు రిమెంబ‌ర్” అనే న‌వ‌ల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం మ‌న‌సు మెలితిప్పి.. క‌న్నీళ్లు వ‌చ్చేలా చేస్తుంది. ఇలా ఒక‌సారి మీరు మన‌సులో ఉన్న బాధ‌నంతా క‌న్నీళ్ల రూపంలో బ‌య‌ట‌కు పంపించేస్తే మీ బ‌రువు కూడా తీరిన‌ట్లు అనిపిస్తుంది.

జ‌బ్ వీ మెట్‌

ఇంతియాజ్ అలీ ద‌ర్శ‌క‌త్వంలో షాహిద్‌, క‌రీనాలు న‌టించిన ఈ చిత్రం వారి చ‌రిత్ర‌లో టాప్ చిత్రంగా నిలిచింది. ఇద్ద‌రు అప‌రిచితులు ట్రైన్‌లో మొద‌టిసారి క‌లుసుకుంటారు. వారిలో ఒక‌రు బ్రేక‌ప్‌ బాధ‌లో మునిగిపోయి ఉంటే.. మ‌రొక‌రు ప్రేమ‌లో నిండా మునిగిపోయి ఉంటారు. ఆ త‌ర్వాత వారే పాత ఇబ్బందుల‌న్నింటినీ దూరం చేసుకొని జీవితాన్ని కొత్త‌గా జీవించ‌డం ప్రారంభిస్తారు. ఇందులో మీ బాయ్‌ఫ్రెండ్‌ని మ‌ర్చిపోవాలంటే ఏం చేయాలో బెబో చాలా చ‌క్క‌టి స‌ల‌హాలు కూడా ఇస్తుంది తెలుసా?

ల‌వ్ ఆక్చువ‌ల్లీ

లండ‌న్‌లోని క్రిస్మ‌స్ స‌మ‌యాన్ని ఆధారంగా చేసుకొని తీసిన చిత్రం ఇది. రిచ‌ర్డ్ క‌ర్టిస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మ‌ల్టీ స్టార‌ర్ ఈ చిత్రం. ప్రేమ‌లో ఉన్న ఎనిమిది జంటల గురించి చెప్పిన సినిమా ఇది. ప్రేమ ఎప్ప‌టికైనా మ‌న సొంత‌మ‌వుతుంద‌ని.. ఎన్ని ప్ర‌యత్నాలైనా చేసి ప్రేమ‌ను ద‌క్కించుకోవాల‌ని చెబుతుందీ చిత్రం. ఈ ఫీల్‌గుడ్ సినిమా చూస్తే.. మీకు ప్రేమ‌పై పోయిన న‌మ్మ‌కం కూడా తిరిగి వస్తుంది.

ఫైండింగ్ నీమో

ఒక కొడుకును తండ్రి ఎంత‌గా ప్రేమిస్తాడో.. నిష్క‌ల్మ‌షమైన తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో చెప్పే చిత్రం ఇది. ఈ ఒక్క సినిమానే కాదు.. పిక్సార్ వారు రూపొందించిన ఏ సినిమా అయినా మ‌న మ‌న‌సుకు ఆహ్లాదాన్ని పంచుతుంది. ప్రేమ ప్ర‌పంచంలోని అన్ని క‌ష్టాల‌ను ఎదుర్కోగ‌ల‌ద‌ని చెప్పే చిత్రం ఇది.

మెయిడ్ ఇన్ మాన్‌హాట్ట‌న్‌

మోడ్ర‌న్ డే న్యూయార్క్‌లో జ‌రిగిన నేటి త‌రం సిండ్రెల్లా స్టోరీ ఇది. వాయ్నే వాంగ్ ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన ఈ రొమాంటిక్ కామెడీ సినిమాలో జెన్నిఫ‌ర్ లోపెజ్ క‌థానాయిక‌. ప‌నిమ‌నిషి అయిన ఆమెను హీరో ధ‌నికురాలిగా భావిస్తాడు.ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌న్న‌దే సినిమా క‌థ‌. ఈ చిత్రం ఏం జ‌రిగినా స‌రే.. మ‌న‌పై మ‌న‌కు న‌మ్మ‌కం ఉంటే చాలు.. జీవితంలో ముందుకెళ్లే వీలుంటుంద‌ని వెల్ల‌డిస్తుంది.

దిల్ చాహ్‌తా హే

ఈ బాలీవుడ్ చిత్రం పూర్తిగా స్నేహం, ప్రేమ‌, బ్రేక‌ప్ ఇలా అన్నింటి గురించి చెబుతుంది. జీవితంలో అన్నీ హ్యాపీ ఎండింగ్స్ ఉంటాయ‌ని ఈ చిత్రం చాటిచెబుతుంది. అమిర్ ఖాన్‌, సైఫ్ అలీ ఖాన్, అక్ష‌య్ ఖ‌న్నా, ప్రీతి జింతాలు ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లలో క‌నిపిస్తారు. మీ పెద‌వుల‌పై చిరున‌వ్వును తీసుకురావ‌డానికి ఈ సినిమా స‌రైన‌ది.

జింద‌గీ నా మిలేగీ దొబారా

మిమ్మ‌ల్ని ఎవ‌రైనా మోసం చేసి వ‌దిలేసి ఉంటే.. మీరు జీవించ‌డం వ్య‌ర్థ‌మ‌ని భావిస్తుంటే ఈ సినిమా చూసేందుకు ప్ర‌య‌త్నించండి. ఇది మీలో జీవితం ప‌ట్ల ఆశ‌ను పెంచి.. ఆనందంగా జీవించ‌డం ప‌ట్ల ఆస‌క్తిని పెంచుతుంది. జోయా అక్త‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాలో హృతిక్ రోష‌న్‌, అభ‌య్ డియోల్‌, ఫ‌ర్హాన్ అక్త‌ర్ న‌టించారు. మీరు తిరిగి మీ జీవితాన్ని ఆనందంగా ప్రారంభించేందుకు ఈ సినిమా చ‌క్క‌గా తోడ్పడుతుంది.

సిల్వ‌ర్ లైనింగ్స్ ప్లేబుక్‌

రెండు వ్య‌తిరేక‌ ఆలోచ‌న‌లున్న వ్య‌క్తులు క‌లిస్తే ఏమ‌వుతుంది? అలాగే మీకు ఇష్టం లేకుండానే మీ గ‌త జీవితాన్ని మ‌ర్చిపోవాల్సి వ‌స్తే ఎలా ఉంటుంది. అదే ఈ సినిమా కూడా. ఈ చిత్రాన్ని ఒక్కసారి చూడండి. మేము ఈ సినిమాని ఎంపిక చేయడానికిి వెనుకున్న కార‌ణం మీకు కచ్చితంగా తెలుస్తుంది. బ్రాడ్లే కూప‌ర్‌, జెన్నిఫ‌ర్ లారెన్స్‌, రాబ‌ర్ట్ డె నీరోలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా మీకు మంచి అనుభూతిని అందిస్తుంది.

లీగ‌ల్లీ బ్లాండ్‌

మీరు బ్రేక‌ప్ అయిన బాధ‌లో మునిగిపోయి ఉంటే.. మీ జీవితంలోని ఆనందాన్ని తిరిగి మీకు అందించేందుకు ఈ చిత్రం చ‌క్క‌టి ఎంపిక‌. రీస్ విథ‌ర్‌స్పూన్ ఎల్లే వుడ్స్ అనే పాత్ర‌లో ఈ చిత్రంలో న‌టించింది. బ్రేక‌ప్ ద్వారా త‌న‌కు త‌గిలిన గాయాన్ని మాన్పేందుకు లా స్కూల్‌లో అడ్మిష‌న్ సాధిస్తుంది ఎల్లే వుడ్స్‌. ఈ చిత్రం ఒక‌టే కాదు.. దీనికి సీక్వెల్ కూడా రూపొందింది. త‌న‌తో బ్రేక‌ప్ చెప్పిన వ్య‌క్తి తిరిగొచ్చిన‌ప్పుడు.. “నిన్ను మ‌ర్చిపోవ‌డానికి నేను చాలా క‌న్నీళ్లు కార్చి స‌మ‌యం వృథా చేసేశా.. తిరిగి క‌లుస్తాన‌ని అస్స‌లు అనుకోవద్దు” అని చెప్ప‌డం అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తుంది.

ప్రెట్టీ వుమ‌న్‌

ఇది చెప్పుకోవ‌డానికి పెద్ద ప్రేమ‌క‌థ ఏమీ కాదు.జూలియా రాబ‌ర్డ్స్ ఈ సినిమాలో చ‌క్క‌టి వ‌ర్కింగ్ వుమ‌న్‌గా క‌నిపించింది. రిచ‌ర్డ్ గెరే మ‌నసును దోచుకుంటుంది. ఈ సినిమా ద్వారా కొన్నిసార్లు మ‌నం అనుకున్న‌వ‌న్నీ.. మ‌న నుంచి దూర‌మైతే ..అనుకోనివి మ‌న జీవితంలోకి ప్ర‌వేశిస్తాయ‌ని తెలుసుకోవ‌చ్చు. ప్ర‌తి మ‌హిళా త‌ను ప్రేమించిన మ‌గ‌వాడు తోడున్నా లేక‌పోయినా.. ప్ర‌పంచంలోని ఆనందాన్నంతా సొంతం చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌తో ఈ చిత్రం రూపొందింది.

మై బెస్ట్ ఫ్రెండ్స్ వెడ్డింగ్‌

ఈ చిత్రంలో జూలియా రాబ‌ర్ట్స్‌కి తాను కోరుకున్న అబ్బాయి ద‌క్క‌డు. కానీ దానికోసం తాను త‌న ప్ర‌య‌త్నాల‌ను మాత్రం ఆప‌దు. ప్రేమ కోసం పోరాడినా ఆమెకు ప‌రాజ‌య‌మే ద‌క్కుతుంది. దాంతో త‌ను జీవితంలో ముందుకు సాగుతుంది. ఈ సినిమా మిమ్మ‌ల్ని ఎంత‌గానో ఏడిపిస్తుంది. అయితేనేం.. ఆఖ‌రికి జీవితంలో ముందుకు సాగేందుకు మీకు స్ఫూర్తిని అందిస్తుంది. ఇందులోని ఎ లిటిల్ ప్రేయ‌ర్ ఫ‌ర్ యూ అనే పాపుల‌ర్ పాట కోస‌మైనా ఈ సినిమా చూడాల్సిందే.

కుచ్ కుచ్ హోతా హే

మ‌న జీవితంలో అన్నీ ఒక‌సారి జ‌రిగినా.. ప్రేమించడం మాత్రం ఒకేసారి జరగదని చెబుతుందీ సినిమా. తాను ప్రేమించిన వ్య‌క్తి ఆనందం కోసం త‌న ప్రేమ‌ను త్యాగం చేసిన కాజోల్‌కి.. తిరిగి త‌న ప్రేమ దక్క‌డం చూసి.. జీవితంలో మ‌నం ప‌డిన బాధ‌కు మించిన ఆనందం మ‌న సొంత‌మ‌వుతుంద‌ని తెలుసుకోగ‌లుగుతాం. క‌ర‌ణ్ జోహ‌ర్ సినిమాల్లో అత్యుత్త‌మమైన ఈ చిత్రంలో షారూఖ్ ఖాన్‌, కాజోల్‌, రాణి ముఖ‌ర్జీలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌నిపించారు.

దిల్‌తో పాగ‌ల్ హే

మ‌నం ఏం అనుకున్నా.. ఎన్ని భావించినా.. ప్రేమ ఎవ‌రిపై పుట్టాల‌న్న‌ది మ‌న చేతుల్లో ఉండ‌దు. అన్నేళ్లూ మ‌నం స్నేహం చేసిన వ్య‌క్తే కావ‌చ్చు. లేదా ద్వేషించిన వ్య‌క్తి కావ‌చ్చు. వారిపై ప్రేమ పుట్ట‌డం క్ష‌ణాల్లో జ‌రిగిపోతుంది. క‌రిష్మా క‌పూర్‌, మాధురీ దీక్షిత్‌, షారూఖ్ ఖాన్‌లు న‌టించిన ఈ చిత్రం మీకు ప్రేమ‌పై న‌మ్మ‌కాన్ని తిరిగి పెంపొందించ‌డంలో త‌న వంతు పాత్రను పోషిస్తుంది.

క్వీన్‌

బ్రేక‌ప్ చిత్రాల‌న్నీ ఒకెత్తైతే కంగ‌నా ర‌నౌత్ నటించిన క్వీన్ మ‌రో ఎత్తు. ప్రేమించి పెళ్లి చేసుకుంటాన‌న్న వ్య‌క్తి పెళ్లి దాకా వ‌చ్చాక నో చెబితే ఎవ‌రైనా కుంగిపోతారు. కానీ సింపుల్ ప‌ల్లెటూరి అమ్మాయైన రాణి ఆ బాధ‌ను త‌ట్టుకొని తాను సింగిల్‌గా హ‌నీమూన్‌కి వెళ్తుంది. త‌న జీవితంలో ఓ అబ్బాయి అవ‌స‌రం లేకుండానే అన్నీ సాధిస్తుంది. ఈ సినిమా చూస్తే “మీ జీవితం అగాధంలో కూరుకుపోయింది అనుకోకుండా.. దేవుడు కొన్ని విష‌యాల‌ను మ‌న జీవితం నుంచి తొల‌గించి మ‌న‌కు మంచే చేస్తాడు” అనే భావన వస్తుంది.

ద‌

ల‌వ్ ఆజ్ క‌ల్‌

అన్ని విష‌యాల్లో ప్రాక్టిక‌ల్‌గా ఆలోచించ‌గ‌ల‌మేమో గానీ.. ప్రేమ విష‌యంలో మాత్రం అది సాధ్యం కాదు. అలా ప్రాక్టిక‌ల్‌గా ఆలోచిద్దాం అనుకునే ఒక అబ్బాయి, అమ్మాయి ప్రేమ‌లో ప‌డి.. ఆ త‌ర్వాత జీవితంలో ఉన్న‌త‌స్థానాల‌కు చేరేందుకు బ్రేక‌ప్ చెప్పుకొని వెళ్లిపోతారు. కానీ ఒక‌రి మ‌న‌సులో మాత్రం మ‌రొక‌రు ఉన్నార‌ని.. ప్రేమ అన్న‌ది మ‌నం అనుకున్న‌ప్పుడు పుట్టి వ‌ద్ద‌నుకున్న‌ప్పుడు మ‌ర్చిపోగ‌లిగే విష‌యం కాద‌ని తెలుసుకుంటారు. జీవితంలో ఏది ముఖ్య‌మో.. ఏది కాదో చూపించే ఈ చిత్రంలో క‌న్నీరు కార్చే స‌న్నివేశాలు.. మీ మ‌న‌సులోని బాధ‌ను త‌గ్గించి జీవితం ప‌ట్ల మీ దృక్ప‌థాన్ని కూడా మారుస్తాయి.

ఎక్ మే ఔర్ ఎక్ తూ

అందరూ అనుకుంటున్న‌ట్లు ఇది “వాట్ హాపెన్స్ ఇన్ వేగ‌స్” చిత్రం నుంచి కాపీ చేసింది కాదు. క‌రీనా, ఇమ్రాన్ ఖాన్ వేగ‌స్‌లో మ‌ద్యం మ‌త్తులో పెళ్లి చేసుకుంటారు. మ‌రి ప్రేమ లేకుండా త‌మ పెళ్లిని వారు కొన‌సాగిస్తారా? ఆ త‌ర్వాత వాళ్లేం చేస్తారు అన్న‌ది.. అటు గుండెను మెలిపెడుతూనే ఇటు న‌వ్విస్తుంది. 

వీరే ది వెడ్డింగ్‌

మీరు క‌ష్ట‌కాలంలో ఉంటే మీకు ముందుగా గుర్తొచ్చేది మీ స్నేహితులే. అలాంటి స్నేహాల గురించి తీసిన చిత్రం ఇది. క‌రీనా, సోన‌మ్‌, స్వ‌రా, శిఖా త‌ల్సానియాలు నటించిన ఈ చిత్రం ప్ర‌తి సంద‌ర్భంలోనూ ఒకరికొక‌రు తోడుగా నిలిచే చిన్న‌నాటి స్నేహితుల గురించి రూపొందించింది. దీన్ని మీ స్నేహితుల‌తో పాటు చూడ‌డం వ‌ల్ల మీ మ‌న‌సు తేలిక‌వుతుంది.

త‌మాషా

దీపికా, ర‌ణ్‌బీర్‌లు విడిపోయిన త‌ర్వాత వారు క‌లిసి నటించిన చిత్రం ఇది. ఇంతియాజ్ అలీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రంలో వేద్‌, తార‌లిద్ద‌రూ కోర్సికాలో క‌లుసుకుంటారు. ఇద్ద‌రూ ప్రేమించుకుంటారు. కానీ వారు ముందు పెట్టుకున్న నియ‌మం ప్ర‌కారం.. పేరుతో స‌హా అన్నీ అబ‌ద్ధాలే చెప్పుకుంటారు. తామిద్ద‌రం ఎప్ప‌టికీ క‌ల‌వం అనుకున్న వారిద్ద‌రూ మ‌న‌సు చెప్పిన మాట విని.. ఒక‌రిని మ‌రొక‌రు వెతికే ప్ర‌య‌త్నంలో ప‌డ‌తారు. ఆ త‌ర్వాత ఏమైంద‌ని మీరు సినిమా చూసి తెలుసుకోండి.

లాలా ల్యాండ్

ఐదు ఆస్కార్ అవార్డులు పొందిన మ్యూజిక‌ల్ చిత్రం ఇది. త‌మ జీవితంలో సాధించాల‌నుకున్న ఆశ‌యాల కోసం ప్రేమ‌ను త్యాగం చేసిన అబ్బాయి, అమ్మాయి క‌థ ఇది. ర్యాన్ గోస్లింగ్, ఎమ్మా స్టోన్‌లు ఈ చిత్రంలో అద్బుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చారు. వారి న‌ట‌నను చూసేందుకైనా ఈ చిత్రం త‌ప్ప‌క చూడాల్సిందే.

ఆయేషా

బాలీవుడ్‌లో అమ్మాయిల స్నేహాల గురించి తీసిన మొద‌టి చిత్రం ఇది. త‌న స్నేహితుల కోసం అబ్బాయిల‌ను వెత‌క‌డంలో సంతోషాన్ని పొందే ఆయేషా అనే అమ్మాయి క‌థ ఇది. కానీ కొన్నిసార్లు ఆమె వూహాజ‌నిత‌మైన విష‌యాలు ఆలోచించి తీసుకునే నిర్ణ‌యాలు త‌ప్పుగా అనిపిస్తాయి. చ‌క్క‌టి స్టోరీలైన్‌తో పాటు.. ఎంతో మంచి సంగీతం ఉన్న ఈ సినిమాని చేతిలో ఓ పెద్ద ఐస్‌క్రీం ట‌బ్ లేదా పాప‌కార్న్ డ‌బ్బా పెట్టుకొని చూడాల్సిందే.

యే జ‌వానీ హే దివానీ

జీవితంలో ఏదైనా మీకు ద‌క్కాల‌నుకుంటే అది మీకు త‌ప్ప‌కుండా ద‌క్కుతుంద‌ని ఈ చిత్రం చూపుతుంది. న‌లుగురు స్నేహితులు (దీపిక‌, ర‌ణ్‌బీర్‌, ఆదిత్య రాయ్ క‌పూర్‌, క‌ల్కి కొచ్లిన్‌) కాలేజీలో అంద‌రూ క‌లిసే ఉంటారు. కానీ ఆ త‌ర్వాతే న‌లుగురు నాలుగు విభిన్న‌మైన దారులు ఎంచుకుంటారు. కేవ‌లం స్నేహ‌మే కాదు.. బ‌న్నీ, నైనాల మ‌ధ్య కెమిస్ట్రీ కోసం కూడా ఈ సినిమా త‌ప్ప‌కుండా చూడాల్సిందే. ఇందులోని సంఘ‌ట‌న‌లు అచ్చం మన జీవితంలో జ‌రిగాయా అన్న‌ట్లుంటాయి. అంతేకాదు.. చ‌క్క‌టి మెలోడియ‌స్ పాట‌లు మ‌న‌సును హ‌త్తుకుంటాయి.

కాక్‌టెయిల్‌

జీవితం మ‌న‌కు ఎన్నో క‌ష్టాల‌ను అందిస్తుంది. కానీ వాట‌న్నింటినీ న‌వ్వుతూ ఎదుర్కోవాల‌ని ఈ సినిమా చెబుతుంది. మ‌నం ఎన్ని క‌ష్టాల్లో ఉన్నా స‌రే.. కాస్త మ‌స్కారా పెట్టుకొని ప్ర‌పంచానికి మ‌న‌మేంటో చూపించాల‌ని ఇందులోని దీపికా ప‌దుకొణె పాత్ర మ‌న‌కు చెబుతుంది. దీపిక‌, సైఫ్‌, డ‌యానా ముగ్గురూ ప్రేమ‌లో విఫ‌ల‌మై ఆ త‌ర్వాత జీవితంలో గెలిచి చూపుతారు. ఇలా మ‌న‌కు భ‌విష్య‌త్తు గురించి ఓ అంచ‌నా వ‌చ్చేలా చేస్తుందీ చిత్రం.

డియ‌ర్ జింద‌గీ

అద్భుత‌మైన స్క్రిప్ట్‌, అంత‌కంటే భేషైన దర్శ‌క‌త్వంతో పాటు అలియా భ‌ట్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న ఈ సినిమాకే ప్ల‌స్ అని చెప్పుకోవ‌చ్చు. ఇందులో షారూఖ్ పాత్ర (థెర‌పిస్ట్‌) ద్వారా జీవితంలో ఎదురయ్యే క‌ష్టాల‌ను ఎలా స్వీక‌రించాలి.. బాధ క‌లిగిన‌ప్పుడు దాని నుంచి ఎలా బ‌య‌ట‌కు రావాలి.. మొదలైన ప్రశ్నలకు జవాబు చెబుతుందీ సినిమా. అంతేకాదు.. మీ బాధ మ‌రీ ఎక్కువ‌గా ఉండి డిప్రెష‌న్‌లా అనిపిస్తే.. వెంట‌నే ప్రొఫెష‌న‌ల్ సాయం తీసుకోవాల‌ని కూడా ఈ సినిమా చాటి చెబుతుంది.

అంజానా అంజానీ

జీవితం మ‌న‌వైపు స‌వాళ్ల‌ను విసిరితే బాధ‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఎంత చిమ్మ‌టి చీక‌టిగా ఉన్నా.. మ‌న‌కంటూ కాస్త వెలుగురేఖ‌ను వెతుక్కొని మ‌రీ ఆనందంగా జీవించాల‌ని ఈ సినిమా చాటుతుంది. బ్రేక‌ప్ అంటే జీవితానికే ది ఎండ్ కాద‌ని చెప్పే ఈ సినిమాలోని పాట‌లు కూడా చాలా అద్బుతంగా ఉంటాయి.

యాన్ అన్‌మ్యారీడ్ వుమన్

ఈ క‌థ పెళ్ల‌యి భ‌ర్త‌తో సంతోషంగా ఉన్న మ‌హిళ.. త‌న భ‌ర్త త‌న‌కు విడాకులు ఇచ్చిన త‌ర్వాత ఎదుర్కొన్న సంఘటనల గురించి చెబుతుంది. త‌న కంటే త‌క్కువ వ‌య‌సున్న అమ్మాయి కోసం.. త‌న భ‌ర్త త‌న‌ని వ‌దిలేసి వెళ్లిపోతే ఒక పెళ్ల‌యిన మ‌హిళ ప‌డే బాధ.. దాని నుంచి ఆమె బ‌య‌ట‌కు వ‌చ్చిన తీరు.. తిరిగి త‌న జీవితాన్ని ఆనంద‌మ‌యం చేసుకున్న తీరు ఈ సినిమాలో చూపించారు. ఇది పెళ్లయి విడాకులు తీసుకున్న‌వారికే కాదు.. ప్రేమ‌లో ఓడిపోయిన వారికి కూడా ఆద‌ర్శ‌మే.

బిగిన్ ఎగైన్‌

మీరు మార్క్ ర‌ఫ‌ల్లో ఫ్యాన్ అయితే ఈ చిత్రం మీకు త‌ప్ప‌నిస‌రిగా న‌చ్చుతుంది. ఒక‌వేళ ఫ్యాన్ కాక‌పోయినా బ్రేక‌ప్ త‌ర్వాత మీరు నిల‌దొక్కుకునేందుకు తోడ్ప‌డుతుంది. కియారా నైట్లీ త‌న బాయ్‌ఫ్రెండ్ నుంచి విడిపోయిన త‌ర్వాత త‌న జీవితాన్ని ..తిరిగి ఎలా ప్రారంభించిందో ఈ సినిమాలో చూడవచ్చు. త‌న కెరీర్‌ని తిరిగి ప్రారంభించి ఉన్న‌త స్థానాల‌కు కూడా చేరుకుంటుందామె. ఇలాగే మీరూ మీ బ్రేక‌ప్‌ని మ‌ర్చిపోయి జీవితంలో ముందుకువెళ్లి విజ‌యాలు సాధించాల‌ని ఈ చిత్రం చాటిచెబుతుంది.

ఇవి కూడా చ‌ద‌వండి

డియ‌ర్ ఎక్స్‌.. న‌న్ను మోసం చేసినందుకు ధ‌న్య‌వాదాలు..!

బ్రేక‌ప్ అయినా వాలెంటైన్స్ డే.. ఇలా సెల‌బ్రేట్ చేసుకోవ‌చ్చు..!

బ్రేక‌ప్ త‌ర్వాత.. ఇలాంటి ప్ర‌శ్న‌ల‌తో ఇబ్బందే మ‌రి!

Read More From Lifestyle