Family Trips

దుర్గ గుడితో పాటు.. విజయవాడలో సందర్శించదగిన ఇతర పర్యటక ప్రదేశాలివే..!

Lakshmi Sudha  |  Aug 12, 2019
దుర్గ గుడితో పాటు.. విజయవాడలో సందర్శించదగిన ఇతర పర్యటక ప్రదేశాలివే..!

విజయవాడ (Vijayawada) అనగానే గుర్తొచ్చేది ఇంద్రకీలాద్రి మీద వెలసిన కనకదుర్గ అమ్మవారే. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి ప్రతి నిత్యం దుర్గ గుడికి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. వచ్చీ రాగానే కృష్ణా నదిలో స్నానం చేయడం, అమ్మవారి దర్శనం చేసుకోవడం.. తీర్థప్రసాదాలు స్వీకరించి.. ఆ వెంటనే ఇంటికి తిరిగి ప్రయాణమవడం.. ఇదే చేస్తుంటారు.

అయితే బెజవాడ సందర్శన అనగానే.. కేవలం అమ్మవారి దర్శనం మాత్రమే అని చాలామంది అనుకుంటారు. దానికి ప్రధాన కారణం.. విజయవాడ చుట్టుపక్కల ఉన్న పర్యటక ప్రదేశాలు (tourist spots) గురించి వారికి తెలియకపోవడమే. కానీ.. ఓ రెండ్రోజులు విజయవాడలో ఉండగలిగితే.. దుర్గ గుడితో పాటు… ఎన్నో అందమైన మధురానుభూతులను మిగిల్చే ప్రాంతాలను సందర్శించవచ్చు. 

1. భవానీ ఐలాండ్

కృష్ణా నదిలో ఉన్న అతి  పెద్ద ద్వీపం భవానీ ఐలాండ్. దాదాపు 120 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. వీకెండ్ సరదాగా గడపాలనుకునేవారికి, వాటర్ స్పోర్ట్స్, ఎడ్వెంచర్స్ ఇష్టపడేవారికి భవానీ ఐల్యాండ్ మంచి వీకెండ్ స్పాట్. కృష్ణా నది ఒడ్డు నుంచి ఈ ద్వీపానికి పడవ ద్వారా చేరుకోవచ్చు. చుట్టూ నీరు.. మధ్యలో పచ్చదనం నిండిన ద్వీపం వెరసి.. ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. భవానీ ఐలాండ్ నుంచి సూర్యోదయాన్ని వీక్షించడం చాలా బాగుంటుంది.

ఈ ఐలాండ్‌లో ఎర్రటి సూర్యకిరణాలు.. కృష్ణా నది అలలపై తేలియాడుతున్నట్టు మనకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి. ఇక్కడ ఉండే పక్షులు సైతం మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. వర్షాకాలం, శీతాకాలం సమయాల్లో కొల్లేరుకు వలస వచ్చే పక్షులు ఇక్కడ కూడా కనువిందు చేస్తాయి. వాటర్ స్కీయింగ్, కయాకింగ్, పారా సెయిలింగ్‌తో పాటు.. ఫిషింగ్ కూడా చేయచ్చు. కుటుంబంతో కలసి గడపడానికి ఇంత కంటే మంచి స్పాట్ మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదేమో. ఈ ఐలాండ్‌లో ఉన్న చిన్న రిసార్ట్‌లో మీరు కూడా స్టే చేయచ్చు.

2. ఉండవల్లి గుహలు

వాస్తవానికి ఇవి గుహాలయాలు. ఇవి గుంటూరులో ఉంటాయి. అయితే విజయవాడలో మాత్రం  సున్నపు రాతి కొండలను మూడంతస్థుల గుహాలయాలుగా చెక్కారు. నాలుగైదు శతాబ్ధాలకు చెందిన ఈ గుహాలయాలు చెక్కింది జైనులే అయినా.. ఆ తర్వాత ఇవి హిందూ దేవాలయాలుగా రూపాంతరం చెందాయి. మొదటి అంతస్థులో జైన తీర్థంకరుల శిల్పాలుంటాయి. రెండో అంతస్థులో గుర్తు తెలియని దేవుడి విగ్రహం ఉంటుంది. స్థానికులు మాత్రం ఈ విగ్రహం విష్ణుమూర్తిదేనని భావించి పూజలు చేస్తుంటారు. మూడో అంతస్థు నుంచి పచ్చదనం నిండిన కొండలను, కృష్ణమ్మ పరవళ్లను ఆస్వాదించవచ్చు. ఇక్కడ కృష్ణా నదిలో బోటింగ్ కూడా చేయచ్చు.

Facebook

3. కొండపల్లి కోట

పద్నాలుగో శతాబ్ధానికి చెందిన ఈ కొండపల్లి కోట కూడా.. గుంటూరు జిల్లాలోనే ఉంది. కానీ విజయవాడకు 23 కి.మీ. దూరంలో ఉంది. ఈ కోట నిర్మాణం, చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం మిమ్మల్ని కట్టిపడేస్తుంది. చారిత్రక ప్రాధాన్యమున్న ఈ కోటను పద్నాలుగో శతాబ్ధంలో ముసునూరి నాయకులు కట్టించారు. బ్రిటిష్ కాలంలో దీన్ని సైనిక స్థావరంగా ఉపయోగించేవారట. లోపలికి ప్రవేశించే ముఖ ద్వారం దగ్గర నుంచి శిల్ప, వాస్తు కళ ఉట్టిపడుతుంది. 

కోట ముఖ ద్వారాన్ని దర్గా దర్వాజాగా పిలుస్తారు. ఇది పన్నెండు అడుగులు, పదహారు అడుగుల ఎత్తుంటుంది. దీన్ని ఏకరాతి శిలతో తయారుచేశారట. కోటలో ఉన్న దర్బారు హాలు, గదులు, ఛాంబర్స్ అన్నీ చాలా ఆకర్షణీయంగా ఉంటాయట. ఈ కొండపల్లికున్న మరో ప్రత్యేకత కొయ్యబొమ్మలు. కొండపల్లి కొయ్య బొమ్మలుగా ఇవి ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. ఇక్కడ మీరు వాటిని కొనుగోలు చేయవచ్చు.

4. మొగల్రాజపురం గుహలు

వీటికి కూడా చాలా చారిత్రక ప్రాధాన్యం ఉంది. సుమారుగా ఐదో శతబ్ధానికి చెందిన గుహాలయాలు ఇవి. కాలక్రమంలో ఈ గుహాలయాలు చాలా వరకు శిథిలమైపోయాయి. కానీ ఆధ్యాత్మికంగా మాత్రం వాటి ప్రాధాన్యం ఏ మాత్రం తగ్గలేదు. మొగల్రాజపురం గుహల ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇక్కడ అర్థనారీశ్వర దేవాలయం ఉంది. దక్షిణ భారత దేశంలో ఉన్నఏకైక అర్థనారీశ్వర దేవాలయం ఇది. అర్థనారీశ్వర దేవాలయంతో పాటు నటరాజ, వినాయక, దుర్గాలయాలు ఈ గుహాలయాల్లో భాగంగా ఉన్నాయి.

5. ప్రకాశం బ్యారేజి

160  పిల్లర్లతో కృష్ణా నదిపై నిర్మించిన ప్రకాశం బ్యారేజి కొన్ని వేల ఎకరాలకు నీరందిస్తోంది. ఇది కృష్ణా, గుంటూరు జిల్లాలను, కోల్కతా- చెన్నై జాతీయ రహదారిని కలుపుతుంది. దీనిపై నుంచి కృష్ణానది చాలా అందంగా కనిపిస్తుంది. సాయంత్రం సమయంలో అయితే రంగురంగుల బల్బుల వెలుగులతో అందంగా మెరిసిపోతుంది.

Facebook

6. గుణదల మేరీ మాత కొండ

ఇది క్రైస్తవులకు చాలా పవిత్రమైన ప్రాంతం. తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రైస్తవులు ఈ ప్రాంతాన్ని కచ్చితంగా సందర్శిస్తారు. ఈ కొండపై సెయింట్ మేరీస్ చర్చి ఉంటుంది. కొండ గుహలో ఉన్న మేరీ మాత విగ్రహం ముందు మోకరిల్లి ప్రార్థిస్తారు. అలాగే ఇక్కడ ఇనుప సిలువ ప్రధాన ఆకర్షణ. వీటితో పాటుగా ఓ మ్యూజియం ఉంటుంది. ఏడాదికోసారి ఫిబ్రవరి నెలలో నిర్వహించే ఫెస్ట్‌‌లో క్రైస్తవులంతా చాలా ఉత్సాహంగా పాల్గొంటారు.

7. మంగళగిరి

కృష్ణానదీ తీరాన వెలసిన పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటి ఇది. ఇక్కడ మూడు నరసింహ దేవాలయాలున్నాయి. కొండ దిగువన లక్ష్మీనరసింహ స్వామి, కొండ మధ్య భాగంలో పానకాల స్వామి, కొండ శిఖర భాగంలో గండాల నరసింహస్వామి ఆలయాలున్నాయి. మంగళాద్రిపై వెలసిన పానకాల స్వామికి భక్తులు పానకాన్ని సమర్పిస్తారు. పానకాల స్వామి ఆలయంలో.. లోహంతో తయారు చేసిన స్వామి వారి ముఖం మాత్రమే కనిపిస్తుంది. మనం తీసుకెళ్లిన పానకాన్ని పూజారులు స్వామి నోట్లో పోస్తారు. సగం పోసిన తర్వాత గుటక వేసిన శబ్ధం వస్తుంది.

అప్పుడు పానకం పోయడం ఆపేసి మిగిలిన దాన్ని ప్రసాదంగా ఇస్తారు. గండాల నరసింహస్వామి ఆలయంలో విగ్రహం ఏమీ ఉండదు. తమకెదురైన ఆపదలు తొలగిపోతే ఇక్కడ దీపం పెడతామని మొక్కుకుంటారు. కొండ దిగువన ఉన్న నరసింహస్వామి గుడికి ఉన్న గాలిగోపురం చాలా ఎత్తుగా ఉంటుంది. ఈ ప్రాంతానికి వెళితే.. మంగళగిరి చేనేత చీరలు కూడా కొనుక్కోవచ్చు.

Facebook

8. హజరత్ బల్ మసీదు

కులమతాలతో సంబంధం లేకుండా నిత్యం కొన్ని వందల మంది.. ఈ మసీదును దర్శించుకుంటూ ఉంటారు. ఈ మసీదులో మహ్మద్ ప్రవక్తకు సంబంధించిన పవిత్రమైన అవశిష్టాలు ఇక్కడున్నాయి. ఏడాదికోసారి వాటిని భక్తుల సందర్శనార్థం ఉంచుతారు. వాటి దర్శనం కోసం ఎదురు చూస్తుంటారు.

9. విక్టోరియా మ్యూజియం

పురావస్తు శాఖ నిర్వహణలో ఉన్న మ్యూజియం ఇది. ఇందులో పురాతన కాలం నాటి ఆయుధాలు, విగ్రహాలు, శిల్పాలు, పెయింటింగ్స్, వస్తుసామగ్రి, శిలాఫలకాలు ఇక్కడ మనం చూడొచ్చు. ఈ మ్యూజియంలో పెద్ద పాలరాతి బుద్ధ విగ్రహం ఉంటుంది.

Feature Image: Facebook, Go Andhrapardesh

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది

Read More From Family Trips