పిల్లలు వయసులో ఎంత పెద్దవాళ్లయిపోయినా సరే.. అమ్మకు మాత్రం చిన్నపిల్లల్లాగే కనిపిస్తారట! అందుకే వాళ్లకు పెళ్లయి, పిల్లలు పుట్టినా సరే.. వాళ్లను చిన్నపిల్లల్లాగే చూస్తుంది అమ్మ. అంతేకాదు.. తమ పిల్లలు మామూలు వారైనా.. సెలబ్రిటీలైనా అమ్మకు ఏమాత్రం తేడా ఉండదు. ప్రపంచానికి వారు ఇప్పుడు సెలబ్రిటీలు, గొప్పవాళ్లు కావచ్చు. కానీ ఎంత ఎత్తుకు ఎదిగినా అమ్మకు మాత్రం వాళ్లు చిన్నవాళ్లలా.. తన బిడ్డల్లాగే కనిపిస్తారు. ఎంత పెద్దవాళ్లయినా తప్పు చేస్తే అమ్మతో తిట్లు తినాల్సిందే. ఆస్ట్రేలియన్ ఓపెన్(australian open) గెలిచిన నయోమీ ఒసాకా (Naomi osaka) తల్లి చేసిన పనిని చూస్తే ఈ విషయం ఇట్టే అర్థం అయిపోతుంది.
నయోమీ ఒసాకా (Naomi osaka).. జపాన్‌కి చెందిన టెన్నిస్ క్రీడాకారిణి. జపాన్‌లో జన్మించిన ఆమె మూడేళ్ల వయసులోనే కుటుంబంతో పాటు అమెరికాకు వెళ్లిపోయింది. అప్పటి నుంచి అక్కడే పెరిగింది. టెన్నిస్‌లో కెరీర్ కొనసాగిస్తోన్న నయోమీ జపాన్ తరఫునే బరిలోకి దిగడం విశేషం. ఆమె తండ్రి హైతీకి చెందిన వ్యక్తి. తల్లి జపాన్ దేశస్థురాలు. పద్నాలుగేళ్ల వయసులోనే అంతర్జాతీయ టెన్నిస్ కెరీర్ ప్రారంభించిన నయోమి గతేడాది యూఎస్ ఓపెన్‌తో పాటు తాజాగా జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా గెలుచుకుంది.
సాధారణంగా జీవితంలో మనం ఏ సంతోషకరమైన విషయమైనా ముందుగా కుటుంబంతోనే పంచుకోవాలనుకుంటాం. నయోమీ కూడా అలాగే అనుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తర్వాత ప్రెస్ మీట్, మీడియా ఇంటర్వ్యూలతో ఆమె రాత్రి ఆలస్యమయ్యే వరకూ ఉండాల్సి వచ్చింది. ఇంటర్వ్యూలన్నీ అయిపోయిన తర్వాత తాను గెలిచిన వార్తను.. తన సంతోషాన్ని కుటుంబంతో పంచుకునేందుకు తన తల్లికి ఫోన్ చేసింది నయోమీ. టైటిల్ గెలిచినందుకు తన కుటుంబమంతా ఎంతో ఆనందంగా ఉండి ఉంటుందని.. తల్లి తనని ప్రశంసిస్తుందని భావించిందామె.
అయితే కనీసం గెలిచినందుకు శుభాకాంక్షలు కూడా చెప్పకుండా.. అంత రాత్రి వరకూ మేల్కొని ఉన్నందుకు ఆమెను తిట్టిందట వాళ్ల అమ్మ తమాకీ ఒసాకా. ఈ విషయాన్ని డబ్ల్యూటీఏ ఇన్‌సైడర్ పాడ్‌కాస్ట్ ద్వారా అందరితో పంచుకుంటూ తెగ సంతోషపడిపోయింది నయోమీ. తిడితే సంతోషపడడమేంటా? అనుకుంటున్నారా? తన తల్లి తనని తిట్టినా అందులో తాను నిద్రపోలేదని ఆమె పడే బాధ.. తన గురించి ఆమె తీసుకునే శ్రద్ధ అర్థమైంది కాబట్టే నయోమి అలా ఆనందపడిపోయిందట!
“నేను టైటిల్ గెలిచిన తర్వాత ఇంటర్వ్యూలన్నీ పూర్తి చేయడానికి చాలా సమయం పట్టింది. దీంతో రాత్రి చాలా ఆలస్యమైపోయింది. అయినా నా సంతోషాన్ని అమ్మతో పంచుకోవడానికి ఫోన్ చేశాను. ఫోన్‌లో అమ్మ కనీసం నాకు కంగ్రాట్స్ కూడా చెప్పలేదు. అంత రాత్రి వరకూ మెలుకువగా ఉన్నందుకు నన్ను తిట్టింది. వెంటనే వెళ్లి పడుకోమని మిగిలిన విషయాలు ఉదయాన్నే మాట్లాడుకుందామని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఇది నాకు చాలా సంతోషం కలిగించింది. నేను టైటిల్స్ సాధించడం కంటే నా ఆరోగ్యం గురించే మా అమ్మకు ఎక్కువ ఆలోచన ఉందని నాకు అప్పుడు అర్థమైంది.. ” అంటూ తన ఆనందాన్ని పంచుకుంది.
నాకు సంబంధించి ఏదైనా సంఘటన జరిగినప్పుడు.. మా అమ్మ నాకు ఫోన్ చేసి ఎక్సయిటింగ్‌గా ఫీలైతే అది నా జీవితంలో చాలా గొప్ప సంఘటన అని చెప్పుకోవచ్చు. మరీ అంత ముఖ్యమైనది కాకపోతే, అమ్మ అస్సలు స్పందించదు. ఇక నాన్నయితే అసలు దేనికీ ఎక్కువగా స్పందించరు. “వాళ్లు అలా ఉండడం వల్లే విజయాలు వచ్చినా.. ఏమాత్రం పొగరు లేకుండా అలాగే ఆడుతూ వెళ్లగలుగుతున్నా” అంటూ తన ఫీలింగ్‌ను వివరించిన నయోమీ తన పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ అని కూడా చెబుతుంది.
ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? పిల్లలు ఎంత పెద్దవాళ్లైనా.. ఎంత ఉన్నత స్థానాల్లో ఉన్నా వాళ్లు సమయానికి కడుపు నిండా తిన్నారా? వేళకు పడుకున్నారా? లేదా అన్నదే తల్లి ఆలోచన అనిపిస్తోంది కదూ.. అదీ అమ్మ ప్రేమంటే..!
ఇవి కూడా చదవండి.
అమ్మాయిలూ.. 2019లో ఈ మాటలు మీరు తప్పక చెప్పాల్సిందే..
ఆడపిల్లలంటే ఎప్పుడూ ప్రత్యేకమే..! ఎందుకో మీకు తెలుసా??
మీరూ లేట్ లలితలేనా? అయితే మీ జీవితంలోనూ ఇవి జరుగుతూ ఉంటాయి..