Beauty

ఈ ఉత్పత్తులు ఎప్పుడూ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. మీ చర్మానికే ప్రమాదం..

Soujanya Gangam  |  Nov 7, 2019
ఈ ఉత్పత్తులు ఎప్పుడూ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. మీ చర్మానికే ప్రమాదం..

సాధారణంగా పంచుకోవడం వల్ల ప్రేమ పెరుగుతుందని చెబుతుంటారు. షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటూ ఇంగ్లిష్ లోనూ మంచి నానుడి ఉంది. చిన్నతనం నుంచి మన వస్తువులు ఇతరులతో షేర్ (share) చేసుకోవాలని అమ్మానాన్నలు మనకు నేర్పించారు. కానీ కొన్ని రకాల ఉత్పత్తులను మాత్రం ఎవరితోనూ అస్సలు షేర్ చేసుకోకూడదట. ఇవి కేవలం మనకు మాత్రమే సొంతం. మన పర్సనల్ గా ఉండాలి. మనకు ఎంత సన్నిహితులైనా సరే.. దీన్ని షేర్ చేసుకోవడం సరికాదట. బ్యూటీ ఉత్పత్తులు మాత్రమే కాదు.. మనం రోజూ వాడే వస్తువులు కూడా ఇందులో చాలా ఉన్నాయి. మరి అవేంటో.. ఆ ఉత్పత్తులు ఎందుకు ఇతరులతో షేర్ చేసుకోకూడదో తెలుసుకుందాం రండి.

1. టవల్

మన టవల్ కేవలం మనం మాత్రమే ఉపయోగించాలట. ఇతరులు దాన్ని ముట్టుకోకూడదని చర్మ నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఇద్దరు వ్యక్తులుంటే రెండు టవల్స్ వాడాలే కానీ ఇద్దరూ ఒకేదాన్ని షేర్ చేసుకోకూడదు. ముఖ్యంగా హాస్టళ్లో ఉన్నవారు ఇలా షేర్ చేసుకోవడం కనిపిస్తుంది. కానీ దీని వల్ల మన చర్మానికి ఎంతో హాని జరుగుతుంది. ప్రతి ఒక్కరి చర్మ తత్వం వేరుగా ఉంటుంది. ప్రతి ఒక్కరి చర్మంపై సమస్యలు వేరుగా ఉంటాయి. ఒకవేళ మీ చర్మం సెన్సిటివ్ అయితే ఇలా టవల్ షేర్ చేసుకోవడం వల్ల ఇతరుల చర్మ సమస్యలు కూడా మీకు వచ్చే ప్రమాదం ఉంటుంది.

2. దువ్వెన

చర్మం లాగే ప్రతి ఒక్కరి తలలో చర్మం జుట్టు సమస్యలు కూడా వేరుగా ఉంటాయి. ప్రతి ఒక్కరి తల సమస్యలు వేరు. మీరు వాడిన దువ్వెన మరొకరు వాడడం లేదా వారు వాడినది మీరు షేర్ చేసుకోవడం వల్ల దువ్వెన ద్వారా హెయిర్ సమస్యలు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉంటుంది. చాలాసార్లు మన తలలో ఉన్న స్కాల్ప్ సమస్యలకు ఇతరుల దువ్వెన ఉపయోగించడం మాత్రమే కారణం కావచ్చు. అందుకే ప్రతి ఒక్కరికీ ఒక దువ్వెన ఉంచుకోవడంతో పాటు దాన్ని తరచూ శుభ్రం చేయడం వల్ల కూడా జుట్టు సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

3. క్రీమ్

సాధారణంగా ఒక ఇంట్లో ఒకరు ఒక రకమైన క్రీమ్ వాడుతున్నారంటే కుటుంబం అంతా అదే క్రీమ్ ని వాడడం మనం చూస్తుంటాం. క్రీమ్ ని షేర్ చేసుకునే కుటుంబాలు మన దగ్గర చాలా కనిపిస్తాయి. మీరు ఉపయోగించే క్రీమ్ ని ఇతరులు షేర్ చేసుకోవడం వల్ల వారి చర్మ సమస్యలు కూడా మీకు వచ్చే ప్రమాదం ఉంటుంది. క్రీమ్ ని కాస్త చర్మానికి రుద్ది.. అదే చేతులతో మళ్లీ క్రీమ్ తీసుకోవడం వల్ల చర్మం మీద నుంచి క్రీమ్ లోకి సూక్ష్మ క్రిములు చేరతాయి. అక్కడి నుంచి దాన్ని షేర్ చేసుకున్న వారి చర్మం పైకి చేరి వారికి కూడా చర్మ సమస్యలు కలిగిస్తాయి. వీటితో పాటు ప్రతి ఒక్కరి చర్మ తత్వం వేరుగా ఉంటుంది కాబట్టి మీ చర్మ తత్వానికి తగినది మీరు వాడడం.. ఇతరులు కూడా అలాగే ఉపయోగించేలా చేయడం మంచిది. అయితే షేర్ చేసుకోవడం తప్పదు అనుకున్నప్పుడు మాత్రం ట్యూబ్స్, పౌచెస్ వాడడం మంచిది.

4. లిప్ గ్లాస్

లిప్ గ్లాస్ ని కూడా ఎవరూ ఇతరులతో షేర్ చేసుకోకూడదు. మన చర్మం పై అత్యంత సున్నితమైన ప్రాంతం మన పెదాలు. ప్రతి ఒక్కరి చర్మ సమస్యల్లాగే పెదాల సమస్యలు కూడా వేరుగా ఉంటాయి. అందులో చాలా వరకూ సమస్యలు మనకు కంటితో చూస్తే కనిపించవు కూడా. ఇలాంటప్పుడు దాన్ని షేర్ చేసుకోవడం వల్ల సమస్యలు కూడా షేర్ అవుతాయి. అంతేకాదు.. ఇతరులు పెదాలతో టచ్ చేసిన వస్తువు మీరు టచ్ చేయడం కూడా అంత బాగుండదు. ఓసారి ఆలోచించి చూడండి..

5. మస్కారా

ఆరోగ్యకరమైన, అందమైన కళ్లు చూసేందుకు ఎంతో అందంగా ఉండడం మాత్రమే కాదు.. మీకు ప్రపంచాన్ని అందంగా చూపుతాయి. కళ్లు చాలా సున్నితమైన భాగాలు. వాటి వెంట్రుకలకే మనం మస్కారా రాస్తాం. ఈ మస్కారా వల్ల మన కళ్లకు ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే మనం దాన్ని షేర్ చేసుకోకుండా ఉండాలి.

6. మేకప్ స్పాంజ్

మేకప్ స్పాంజ్ వల్ల కూడా ఒకరి చర్మం నుంచి మరొకరి చర్మం పైకి చర్మ సమస్యలు వ్యాపించే అవకాశం ఉంటుంది. మొటిమలు, ఎలర్జీ, ఇన్ఫెక్షన్ వంటివి ఇతరులకు రాకుండా ఉండాలంటే మేకప్ స్పాంజ్ ని షేర్ చేసుకోకపోవడం మంచిది.

7. ప్లక్కర్

త్రెడింగ్ వంటివి చేసినా.. ఎక్కువగా ఉన్న వెంట్రుకలను తొలగించేందుకు మనం ప్లక్కర్ ని ఉపయోగిస్తాం. చాలామంది కేవలం కనుబొమ్మలు మాత్రమే కాదు.. చంకలు, బికినీ లైన్ వంటి ప్రాంతాల్లో కూడా వెంట్రుకలను తొలగించేందుకు దీన్ని ఉపయోగిస్తారు. ఇలా వెంట్రుకలను లాగేటప్పుడు కొన్ని సార్లు రక్తం కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. అది ప్లక్కర్ కి కూడా అంటుకొని ఆ రక్తం నుంచి ఏవైనా ఇన్ఫెక్షన్లు మీకు సోకే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్లక్కర్ ని షేర్ చేసుకోవడం మంచిది కాదు.

ఇవే కాదు.. ఏ రకమైన బ్యూటీ ఉత్పత్తులను కూడా ఇతరులతో షేర్ చేసుకోకుండా ఉండడం వల్ల చర్మ సమస్యల నుంచి దూరంగా ఉండే వీలుంటుంది. అయితే ఇతరులు మీ ఉత్పత్తులు కావాలని అడిగినప్పుడు కారణం సున్నితంగా చెప్పి వద్దనడం మంచిది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

Read More From Beauty